సాహిత్య పాదయాత్ర

సాహిత్య పాదయాత్ర

ఈ రోజు తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన అపురూపమైన ప్రయోగం ఒకటి మొదలుకాబోతోంది. వెయ్యేళ్ళ కిందట గోదావరి వడ్డున నన్నయ మహాభారతాన్ని కావ్యశైలిలో తెలుగులో అనుసృజన కు పూనుకోవడం, ఆధునిక యుగారంభంలో కందుకూరి సమాజాన్ని మేల్కొల్పడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం మనకు తెలుసు. మరొకసారి గోదావరి తీరం తెలుగు సాహిత్యంలో మరొక కొత్త యుగాన్ని మేల్కొల్పుతున్నదివాళ.

సాహిత్యం ప్రజలకోసమనీ, ప్రజల భాషలోనే సాగాలనీ, తమది ప్రజల ఉద్యమం అనీ గురజాడ, గిడుగు తెలుగు సాహిత్యానికి ఒక దిశానిర్దేశం చేసారు. ఇరవయ్యవ శతాబ్దంలో సాహిత్యాన్ని ప్రజాయత్తం చేయడానికి గొప్ప ప్రయత్నాలెన్నో జరిగాయి. అభ్యుదయ సాహిత్యం, విప్లవసాహిత్యం, దళిత, ప్రాంతీయ, మైనారిటీ సామూహిక స్పృహలతో తలెత్తిన ఐడెంటిటీ ఉద్యమాలు సాహిత్యానికొక సామాజిక బాధ్యత ఉందని గుర్తు చేస్తూ, రచయితకీ, ప్రజలకీ మధ్య ఉన్న అంతరాన్ని దాటి వారిద్దరి మధ్యా ఒక సేతువు కట్టడానికే ప్రయత్నం చేసాయి.

ఈ రోజు మొదలవుతున్న ప్రయోగం ఆ మహత్తరమైన సాహిత్య ప్రయత్నాల స్ఫూర్తితో మొదలవుతున్నదేగాని, వాటన్నిటికన్నా భిన్నమైంది కూడా.

సాహిత్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకుపోవాలని ప్రయత్నించిన పూర్వసాహిత్యకారులు, సాహిత్య ఉద్యమాలు ప్రజల గురించి రాయడానికి ఉత్సాహం చూపించినట్టుగా, ప్రజలతో కలిసి మెలిసి రాయడానికి ప్రయత్నించినట్టు కనబడదు. గరిమెళ్ళనుంచి గద్దర్ దాకా, పాట ఒక వాహికగా ప్రభంజనంలాగా పోటెత్తిన ఉద్యమాలున్నాయి. కానీ అక్కడ రాజకీయ చైతన్యం కలిగించడం ప్రధాన లక్ష్యం. ఒకప్పుడు జాతీయోద్యమ కాలంలోనూ, కమ్యూనిస్టు ఉద్యమం తొలినాళ్ళలోనూ గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం, రాత్రిపూట గ్రామాల్లో గాంధీనో, గోర్కీనో రహస్యంగా చదువుకోవడం, చర్చించుకోవడం జరిగేవి.

కాని, ఆ మహోజ్జ్వల ప్రయత్నాలన్నీఇప్పుడు చరిత్ర గా మటుకే మిగిలిపోయేయి. ఇప్పుడు గ్రామాల్లో, ముఖ్యంగా తీరాంధ్రదేశంలో గ్రామాలంటే సినిమా, టెలివిజన్, సెల్ పోన్ మాత్రమే. మన గ్రామాల్లోని వేలాది పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకీ, ఆ గ్రామసీమల్లో నవజీవనంలోకి అడుగుపెడుతున్న లక్షలాది యువతీయువకులకీ, సాహిత్యమంటే సినిమా పాట మాత్రమే. భాష అంటే పార్టీ రాజకీయాల పరస్పర దూషణలు మాత్రమే. పడిపోతున్నపాతకాలపు భవనాల్లో,అరకొర సౌకర్యాలతో, కొన ఊపిరితో నడుస్తున్న గ్రామీణ గ్రంథాలయాల్లో పుస్తకాలంటే పోటీపరీక్షల గైడ్లు మాత్రమే. కానీ, ఆ ప్రజలకీ, ఆ బాలబాలికలకీ, ఆ యువతీ యువకులకీ కూడా సాహిత్యం కావాలి. కావాలి అని వాళ్ళకి తెలీదు. కాని వాళ్ళకెవరేనా సాహిత్యం గురించి, గొప్ప రచయితల గురించి, మానవజాతిని మహోన్నతపథంలోకి తీసుకువెళ్ళే మంచిపుస్తకాల గురించి చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళు విప్పారతాయి. అలా విప్పారకుండా ఉండలేవు ఎందుకంటే, అన్నిటికన్నా ముందు సాహిత్యం వాళ్ళ మానసిక-సామాజిక అవసరం కాబట్టి.

నిజమే. కాని, ఆ సంగతి వాళ్ళకి చెప్పేదెవరు? తల్లిదండ్రులు చెప్పాలి. కాని, తల్లిదండ్రుల్లో మంచి సాహిత్యం చదివేవాళ్ళూ, చదివినదాన్ని పిల్లలతో మాట్లాడేవాళ్ళూ ఎంతమంది ఉంటారు? అదీ ముఖ్యంగా గ్రామాల్లో?ఇంతదాకా అక్షరాస్యతకి దూరంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగారుతూ వస్తున్న వర్గాల్లో? బహుశా ఉపాధ్యాయులు చెప్పాలి అనుకుంటాం. సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం మొదలయ్యాక, పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి పిల్లలతో చదివించే, రాయించే ప్రయత్నాలు మొదలయినమాట నిజమే. కాని ఆ ప్రయత్నాలు ఉద్యమస్థాయికి చేరుకోనేలేదు. ఇక పత్రికలు. ఇప్పుడు గ్రామాల్లో తెలుగు భాష మాట్లాడే అతి పెద్ద మాధ్యమం పత్రికలు మాత్రమే. కాని, ఒక్క పత్రికాయాజమాన్యానికి కూడా ఆ సంగతి తెలిసినట్టులేదు. తెలిసి ఉంటే వాళ్ళు తమ పత్రికల్లో ప్రకటనల బదులు సాహిత్యమే నింపి ఉండేవారు. మరి ఇంకెవ్వరు? ప్రజల దగ్గరికి సాహిత్యాన్ని తీసుకుపోగలినవారు? రచయితలూ, కవులూ అనుకుంటాం. కాని తెలుగు రచయిత ఇప్పుడు పట్టణ రచయిత, ‘నాగరిక’ రచయిత. అతడికి గ్రామం ఒక జ్ఞాపకం మాత్రమే. నాకు తెలిసి గత ఇరవయ్యేళ్ళల్లో తమ కవిత్వమో, కథలో ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళి, వాళ్ళ మధ్య కూచుని, వాళ్ళకి వినిపించిన రచయితనెవ్వరినీ నేను చూడలేదు.

ప్రజలంటే, దుక్కి దున్నేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, కలుపు తీసేవాళ్ళు, కోతకోసేవాళ్ళు. రోడ్లు వేసేవాళ్ళు. బావులు తవ్వేవాళ్ళు. చెప్పులు కుట్టేవాళ్ళు, చేపలు పట్టేవాళ్ళు. అడవిలో కొండకొమ్ముకి ఎగబాకి తేనెతీసేవాళ్ళు, బంక తెచ్చేవాళ్ళు, పశువులు కాచుకునేవాళ్ళు, పాలు పిండేవాళ్ళు. భవనాలు కట్టేవాళ్ళు, బట్టీలు కాల్చేవాళ్ళు. కల్లు గీసేవాళ్ళు, సున్నం నూరేవాళ్ళు. ప్రజలంటే జీవనోపాధులు వెతుక్కునేవాళ్ళు, జీవనోపాధులు పోగొట్టుకుంటునవాళ్ళు, బతుకుతెరువు వెతుక్కుంటూ వలసపోయేవాళ్ళు, పీడన మరీ భరించలేని స్థితికి చేరుకున్నప్పుడు తిరగబడేవాళ్ళు. అటువంటి ప్రజలతో సమావేశమై వాళ్ళ కథలు తాము విని, తమ కథలు వాళ్ళకి వినిపించి వాళ్ళ గళాలు ప్రపంచానికి వినిపిస్తున్న రచయితలెవరేనా ఉన్నారా? అటువంటి సమావేశాలు జరుగుతూ ఉండవచ్చు, నాకు తెలియకపోయి ఉండవచ్చు. కాని, అవి ఒక ఉద్యమంలాగా, పండగలాగా, ఊరేగింపులాగా జరిగిన,జరుగుతున్న ఉదాహరణలేమైనా ఉన్నాయా?

సామాజిక న్యాయంకోసం, రాజకీయ చైతన్యం కోసం సాహిత్యాన్ని వాడుకోవడం గుర్రం ముందు బండిపెట్టడం లాంటిది. ముందు వాళ్ళకి చదువు నేర్పండి, సాహిత్యం మీద ఇష్టం పుట్టించండి. వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని శ్రోతలుగా, ఉపకరణాలుగా, కార్యకర్తలుగా భావించకుండా, స్నేహితులుగా, సమభావుకులుగా, సుమనస్కులుగా భావించండి, అప్పుడు ఆ సమాజమెలా మారాలో ఆ సాహిత్యమే నిర్ణయిస్తుంది.

కవులారా, రచయితలరా, విద్యావేత్తలారా! మనం చేపట్టవలసిన కర్తవ్యం ఇదే. మనం గ్రామాలకి తరలాలి. ప్రజలతో మాట్లాడాలి. మన సాహిత్యం వాళ్ళకి వినిపించాలి. వాళ్ళ సాహిత్యం మనం వినాలి. పాఠశాలల్లో ఉన్న చిన్నారి బాలబాలికలకి గొప్ప కవిత్వాలు వినిపించాలి. పాటలు పాడించాలి. రోడ్డుమీద, రచ్చబండదగ్గర, టీదుకాణాల దగ్గర, పొలాల్లో, పొగాకుబట్టీలదగ్గర యువతీయువకుల్ని కలవాలి. కొత్త జీవితంకోసం, సాధికారతతో కూడుకున్న జీవనంకోసం వాళ్ళల్లో వాళ్ళకే అస్పష్టంగా ఉన్న కలల్ని మేల్కొల్పాలి. వాళ్ళు తమంత తాము తమ దారి వెతుక్కునేలా, ఎంతచిన్నదైనా సరే, ఒక సాహిత్యదీపం వాళ్ళ చేతుల్లో పెట్టాలి.

ఇదుగో, ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాలో కొందరు సాహిత్యప్రేమికులు, సంస్కృతీ ప్రేమికులు, విద్యావంతులు అటువంటి ఒక ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నారు. శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తెలుగు కథని పెంచిపెద్దచేసిన ‘పొలమూరు’ నుంచి ఆధునిక తెలుగు స్వేచ్ఛాగాయకుడు దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు పుట్టిపెరిగిన ‘చంద్రం పాలెం’ గ్రామం దాకా సుమారు యాభై కిలోమీటర్లు సాహిత్య పాదయాత్ర చేపడుతున్నారు.

‘పదయాత్ర’ గా పిలుచుకుంటున్న ఈ పాదయాత్ర తెలుగు సాహిత్యానికి అక్షరపదార్చన కాబోతున్నది. ఆ నవదూతలు తాము నడుస్తున్న దారిపొడుగునా గ్రామీణులతో, యువతీయువకులతో, పిల్లలతో సాహిత్యాన్ని, సంగీతాన్ని పంచుకోబోతున్నారు. దారిపొడుగునా ప్రతి ఊరినీ తట్టిలేపబోతున్నారు, ప్రతి హృదయాన్నీ ప్రేమారా పలకరించబోతున్నారు.

నాకు తెలిసి సమకాలిక భారతదేశంలోగాని, ప్రపంచంలో గాని ఇటువంటి ప్రయోగం ఇటీవలి కాలంలో ఎక్కడా జరిగినట్టు లేదు. రచయితలు, కవులు, సాహిత్యప్రేమికులు, విద్యావంతులు ఏదో ఒక రాజకీయ పక్షానికో, ఏదో ఒక సామాజిక వర్గానికో కాకుండా, సమస్త సాహిత్యప్రతినిధులుగా గ్రామాలకు తరలివెళ్ళే ఈ శుభగడియ ఒక నవశకానికి నాకొక వేకువపిలుపులాగా వినిపిస్తున్నది.

నడవండి మిత్రులారా, సాహిత్యవార్తాహరులుగా, మానవప్రేమికులుగా, ముందుయుగం దూతలుగా నడవండి. మీ హృదయస్పందనంతో మీరు నడుస్తున్న దారిపొడుగునా సంగీతం వినిపించండి. పూలు పరిచినట్టుగా మీ మాటలతో ఆ నేలంతా విరాజిల్లాలి. మహనీయ పూర్వకవులంతా ఆకాశంలో నిలబడి మీరు నడిచేదారిపొడుగునా ఆశీసులు కురిపించాలి.

నడవండి, నడవండి.

కదం తొక్కుతూ
పదం పాడుతూ
హృదంతరాళం గర్జిస్తూ
పదండి ముందుకు!

బాటలు నడచీ, 
పేటలు కడచీ
కోటలన్నిటిని దాటండి!

మరో ప్రపంచం 
మహా ప్రపంచం
ధరిత్రినిండా నిండింది!

7-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో సవివరమైన చర్చ కోసం ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d