పేరుపేరునా నమస్సులు

పాణ్యం చెంచుకాలనీ అనుభవాలపట్ల శతాధికంగా మీరంతా ఎంతో ప్రేమనీ, ప్రశంసనీ వర్షించి నన్ను ఉక్కిరిబిక్కిరి చేసేసారు. మీకందరికీ పేరుపేరునా నా నమస్సులు, నా సుమనస్సులు. మిత్రురాలు రమాదేవి అన్నట్టుగా ఒక విజయగాథ వినగానే మనలో ఏదో సంభవిస్తుంది. బహుశా మనిషి జీవనిర్మాణం లోనే మంచితనం పట్ల ఉద్వేగం చెందే మహత్తరగుణముందనుకుంటాను,లేకపోతే అన్ని స్పందనలు, అంత ఉద్వేగం, అంత ఉత్కంఠ ఎక్కణ్ణుంచి వస్తాయి!

43 ఎకరాల జొన్నపంట

నిన్న పొద్దున్న పాణ్యం చెంచుకాలనీలో, కాలం ఆ జాతిలోనూ, కుటుంబాల్లోనూ తెచ్చిన మార్పులేవైవుంటాయా అని ఆలోచిస్తూ, ఒక ఇంట్లో అడుగుపెట్టాను.ఆ ఇల్లు, ఒకే ఒక్క గది,అక్కడొక మూల నాలుగైదు మూటలు కనిపిస్తే అవేమిటని అడిగాను. నాతో పాటు దగ్గరుండి అన్నీ వివరిస్తున్న సర్పంచ్ మేకల సుబ్బరాయుడు అవి బియ్యం మూటలని చెప్పాడు.