మేఘదూతం

గత నాలుగు నెలలుగా కాళిదాసు మేఘసందేశ కావ్యం పైన ప్రసంగిస్తూ ఉన్నాను. నిన్నటితో ఆ ప్రసంగాలు పూర్తయ్యాయి. మొత్తం పదహారు ప్రసంగాలు. నిన్నటి సమాపన ప్రసంగంలో, ఒక సారి ఆ కావ్యాన్ని పునశ్చరణ చేసుకున్నట్టుగా, టాగోరు రాసిన ఈ గీతాన్ని వినిపించాలనుకున్నాను. కాని సమయం లేకపోయింది. ఇంతకుముందు ‘ఆషాఢమేఘం’ వ్యాసపరంపరలో భాగంగా పంచుకున్న ఈ కవితను మరోమారు ఇక్కడ పంచుకుంటున్నాను. కొత్తమిత్రుల్తో పాటు పాత మిత్రులు కూడా మరోసారి చదువుతారని.


కవివరా! ఏ విస్మృత యుగంలోనో
ఏ ఆషాఢప్రథమదివసం నాడో
నువ్వు మేఘదూతం వినిపించావు
ప్రపంచంలోని వియోగదుఃఖాలన్నీ
పొరలుపొరలుగా గూడుకట్టుకుని
నీ మందాక్రాంత శ్లోకాల్లో ఒదిగిపోయాయి.

ఆ మేఘాచ్ఛన్న దివసాన
ఏ విద్యుదుత్సవం, ఏ పవనసంచలనం
ఉజ్జయిని సౌధాగ్రాల్ని కంపింపచేసింది?
యుగాలుగా అణిచిపెట్టుకున్న హృదయోద్వేగమంతా
ఆ ఒక్కరోజే కట్టలు తెంచుకుంది
దీర్ఘకాలం గుండెలో కుక్కుకున్న విరహతాపమంతా
కాలాన్ని బద్దలుగొట్టుకుని
నీ పద్యాల్లోంచి పొంగి ప్రవహించింది.

తమవాళ్లని ఎడబాసిన ప్రతి ఒక్క ప్రవాసీ
ఆ రోజు తల ఎత్తుకుని, చేతులు జోడిరచి
తన ప్రియగృహోన్ముఖుడై
మేఘాలద్వారా తన విరహగాథ వినిపిస్తున్నాడా?
అశ్రుపూరితమైన తన ప్రేమలేఖని
మేఘం తన రెక్కలమీద
తన సుదూరప్రియగృహగవాక్షం చెంతకు
తీసుకుపోవాలని ప్రార్థిస్తున్నాడా?
అక్కడ, ఆ శోకగృహంలో
ముడివెయ్యని జడతో, తడిసిన కళ్లతో
తనకోసం ఎదురుచూస్తున్న తన నెచ్చెలికి
తన ప్రేమసందేశం పంపించుకోగలుగుతాడా?

కవీ! చెప్పు, వాళ్లందరి విరహానికీ
నీ గీతంలో ఒక గొంతు దొరికిందా?
నీవెన్నో దినాలు, రాత్రులు,
దేశం వెనక దేశం పయనిస్తూ
నీ కావ్యం ద్వారా నీ ప్రేమగమ్యాన్ని చేరుకోగలిగేవా?
తనలోకి ప్రవహిస్తున్న ప్రతి ఒక్క ధారనూ కలుపుకుంటూ
పరవళ్ళు తొక్కుతున్న జాహ్నవిలాగా!
తమ శిలాశృంఖాలాల్లో తామే బంధితులైన
హిమాలయాలు తమ సహస్ర గిరికంధరాల్లోంచి
ఉచ్ఛ్వసిస్తున్న ఆవిరిపొగలు
బలమైన కాంక్షగా గిరిశిఖరాలమీద ఏకమై
ఆకాశాన్ని కప్పేస్తున్నవి.

ఆ ప్రథమదివసం తర్వాత
అసంఖ్యాక వర్షాకాలాలు గడిచిపోయాయి.
ప్రతి ఏడూ నీ కావ్యానికి కొత్తగా ప్రాణం పోస్తూనే ఉంది
దానిమీద తొలకరిచినుకులు కురిపిస్తూనే ఉంది.

చల్లని నీడలు పరుస్తూ, మేఘగర్జనలకు ప్రతిధ్వనిస్తూ
నీ వర్షోన్మత్త కవిత్వంలాగా
ఏరులై ప్రవహిస్తూనే ఉంది.
ఇన్ని యుగాలుగానూ, తారారహిత,
వర్షసిక్త, ఆషాఢ సాయంసాంధ్య వేళల్లో
విరహవ్యథితులు తమ
శూన్యగృహాల్లో ఎదురుచూస్తూనే ఉన్నారు
మసకకమ్మిన దీపపుకాంతిలో, వారు ఆ శ్లోకాలు
తమకై తాము నెమ్మదిగా, బిగ్గరగా పఠిస్తూ
తమ ఒంటరితనంలో కూరుకుపోయారు.
నీ కావ్యం ద్వారా, కవీ, వారి హృదయాలు నాకు వినబడుతున్నాయి
సముద్రకెరటాల్లాగా వారి కంఠాలు నా చెవుల్లో ఘోషిస్తున్నాయి.

ఇక్కడ భారతదేశానికి మరీ తూర్పుదిక్కున
శ్యామలవంగదేశంలో నేనున్నాను
ఇక్కడే ఒకప్పుడు జయదేవకవి
ఇటువంటి వర్షాకాల దినాన
దిగంతతమాలవృక్షాల నీలి-ఆకుపచ్చని చిక్కటినీడల్నీ
సంపూర్ణసాంద్రమేఘాచ్ఛన్న గగనాన్నీ చూసాడు.

ఈ రోజు మరీ మబ్బుపట్టి ఉంది, ఆగీ ఆగీ వాన జల్లు-
ప్రచండంగా వీస్తూన్న గాలి- యుద్ధంలో ఆయుధాలు
ఎక్కుపెట్టినట్టు పైకి లేస్తున్న చెట్లకొమ్మలు,
వాటిల్లోంచి గాలి ఒక విలాపంగా వినబడుతోంది
మేఘాల్ని చీల్చుకుంటూ మెరుపుతీగలు
ఆకాశమ్మీద వంకర నవ్వులు నవ్వుతున్నాయి.

తలుపులు మూసిన, దిగులు కమ్మిన గదిలో
మేఘదూతం చదువుకుంటూ నేనొక్కణ్ణే.
నా మనసు ఈ గది వదిలిపెట్టి రికామీ మేఘం వెంబడి
సుదూరదేశాలకు ప్రయాణం మొదలుపెట్టింది.
ఆ ఆమ్రకూటశిఖరమెక్కడ?
సన్నని, స్వచ్ఛమైన రేవానదీ ప్రవాహం ఎక్కడ?
ఆ వేత్రవతీనదీ తీరంలో
పక్వజంబూఫల నీలవనాలనీడలో
నిద్రిస్తున్న దశార్ణదేశగ్రామాలెక్కడ?
ఊరి తోటల చుట్టూ మొగలిపొదల కంచెల్తో
ఆ గ్రామరథ్యలకు ఇరుపక్కలా చెట్లతో
వాటిమీద గూడుకట్టుకోడం కోసం పుల్లాపుడకా పోగేసుకుంటున్న
పక్షుల కలకలంతో కదుల్తున్న ఆ కొమ్మలెక్కడ?
పేరు తెలియని కొండవాగుల పక్కన మల్లెపొదల్లో
పూలుకోసుకుంటున్న పడుచులు
వారి చెంపల్ని అలంకరించిన నీలికలువలు
ఎండవేడికి తాళలేక మబ్బునీడకోసం
తపిస్తున్న వారి కపోలాలు
తమ నల్లనీలికళ్ళమీద పడుతున్న మబ్బునీడను చూడటానికి
చూడు ఆ జనపదవధువులు ఆకాశం కేసి ఎట్లా చూస్తున్నారో
ముగ్ధలు- కల్మషం ఎరగరు వారు
మేఘం ఉరమగానే తమ గుహల్లోకి పరుగెడుతో
‘రక్షించండి, ఏదో కొండ విరుచుకుపడుతున్నట్టుంది’
అని చూడు ఆ సిద్ధాంగనలు ఎలా అరుస్తున్నారో
అవంతీపురి ఎక్కడ? నిర్వింధ్యానదీలలామ ఎక్కడ?
శిప్రానదీదర్పణంలో తన ప్రతిబింబాన్ని తిలకిస్తున్న
ఉజ్జయిని ఎక్కడ?
అర్థరాత్రి ఆ నగరవీథుల్లో తమ ప్రియుల్ని కలవడానికి
పోతున్న అభిసారికలకు వెలుగుచూపుతున్న మెరుపులు
అదిగో కురుక్షేత్రం, బ్రహ్మావర్తం
కనఖల శిఖరం అక్కడే, గంగ నురగలు చిమ్ముతూ
శివజటాజూటితో ఆడుకుంటూ
సవతి కోపాన్ని చూసి చిరునవ్వింది అక్కడే.

ప్రయాణిస్తున్నది నా హృదయమట్లా
ఒక మబ్బువలె, దేశం నుంచి దేశానికి
చివరకు అలకానగరానికి చేరుకునేదాకా-
ఆ స్వర్గనగరానికి, ఎన్నాళ్ళుగానో బెంగపెట్టుకున్న ఆ ఊరికి
ప్రేమైకహృదయుల ఆ తావుకి, ఆ సౌందర్యచరమసీమకి,
ఆ సదావసంతవనానికి, ఆ నిత్యజ్యోత్స్నానగరికి
ఆ స్వర్ణకమలాలసరస్సుకు, ఆ చంద్రకాంతశిలావేదికచెంతకి
నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి
నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు?
అక్కడ సకలసంపదలమధ్య
శోకిస్తున్న ఆ ప్రియసన్నిధికి?

మళ్ళా దూరమైంది మనస్సు. ఎడతెరిపిలేకుండా
అన్ని వేపులా కురుస్తున్నది వాన. రాత్రి చీకట్లని
మరింత చిక్కబరుస్తున్నది. ఒక తీవ్రఝుంఝానిలం
అవధి వెతుక్కుంటూ వీస్తున్నది.
ఆ నడిరాత్రి నిద్రావిహీన నేత్రాలతో
నేనిట్లా తలపోస్తున్నాను: ఎవరిచ్చారీ శాపం?
ఈ వ్యవధానమెందుకు? ఈ రుద్ధవాంఛితం ఎందుకు?
ఇలా విలపించడమెందుకు?

ఈ కొండకోనలకూ, నదీనదాలకూ ఆవల
ఆ సూర్యాతీత, సంధ్యాతీత, మణిద్వీపానికి
ఆ మానసరోవరతీరాన కాంక్షాపర్యంకిక చెంతకి
చేరుకోలేమా
మనమెప్పటికీ
ఈ దేహంతో ?

18-10-2025

7 Replies to “మేఘదూతం”

  1. సర్ .ఇన్నాళ్లకు టాగోరు కవితకు పరిపూర్ణానువాదం చదివిన అనుభూతి కలిగింది. మేఘదూతాన్ని విశ్వప్రేమికుల నిరంతర విరహగీతాప్రస్థానంగా భావించిన విశ్వకవికి జోహార్లు. అందంగా అనుభావ్యంగా అనువదించిన మీకు నమస్సులు. కవిత్వం నిండా ఊహార్ణవం మీద పరచుకున్న సాంధ్యవర్ణాంచిత వర్ణన మనసు మీద వర్షాభ్రంలా కమ్ముకున్నది.

  2. Sir,
    I could enjoy and appreciate this beautiful poem by Tagore only because of your wonderful talks on Meghasandesam.
    The places Tagore talks about and the emotion behind his words felt so familiar, thanks to the unforgettable journey with the megham you took us on.
    ‘నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు?’
    Had to borrow these lines to express my gratitude for this amazing experience!! 🙏🏽

  3. నువ్వు తప్ప, కవీ, ఆ లక్ష్మీధామానికి
    నన్ను మరెవ్వరు తీసుకుపోగలరు?
    నమోనమః

  4. కవికుల గురువు కాళిదాసు రచించిన మేఘసందేశ సారాన్ని మొత్తం కవితగా మలిపి, ఆ బాధ తమ ప్రియమైన వారికి దూరమైన విశ్వ వ్యాప్త ప్రవాసుల వ్యధగా తలిచి; తన ప్రియ సన్నిధికి సశరీరంతో వెళ్లాలన్న ఆకాంక్ష నెరవేరుతుందో లేదో కానీ; కవి తో ప్రయాణిస్తే తప్పనిసరిగా గమ్యాన్ని చేరుతామన్న విశ్వకవి సందేశం బాగుంది సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading