
ఇప్పుడు తెలుగులో కథలు రాయడం ఒక ఉద్యమం. కానీ ఇప్పుడు కథలు రాస్తున్నవాళ్ళూ, కొత్తగా కథలు రాయడం మొదలుపెట్టినవాళ్ళూ తమకు స్ఫూర్తిగా ఎవరి కథలు చదువుతున్నారో తెలియదు. అసలు వారు వేరే ఎవరివన్నా కథలు చదువుతారో లేదో కూడా తెలీదు. వేరే వాళ్ల రచనలు చదివితే మనలో క్రియేటివిటీ తగ్గిపోతుందని కూడా కొందరు యువతీయువకులూ భావిస్తూ ఉండవచ్చు. లేదా వారెవరివైనా కథలు చదువుతుంటే, అవి బహుశా, గత పాతికముప్ఫై ఏళ్ళుగా తెలుగులో వస్తున్న వార్షిక కథాసంకలనాల్లోని కథలు కావొచ్చు.
కానీ కథకుడు తన పూర్వకథకుల్ని ఎంత విస్తృతంగా చదివితే అంత మంచింది. దానివల్ల మన సృజనాత్మకత ఏమీ అడుగంటిపోదు సరికదా, కథారహస్యాలు మరింత పట్టుబడతాయి. ఇప్పటి కథకుల దగ్గర తమదే అయిన ప్రత్యక్ష జీవితానుభవం విస్తారంగా ఉంది. ఇంతదాకా ప్రాతినిధ్యానికి నోచుకోని జీవితానుభవాన్ని ఎవరేనా కథలుగా చెప్పినప్పుడు ఆ కథలు మనల్ని తక్షణం ఆకట్టుకుంటాయి. విభ్రాంతి పరుస్తాయి. కానీ ఆ ఒక్కసారికే. రెండోసారి ఆ కథలు చదవాలనిపించదు. ఎందుకంటే, అందులో జీవితానుభవమేమిటో మనకి అప్పటికే తెలిసిపోయి ఉంటుంది. రెండోసారి మళ్లా చదవాలనిపించే కొత్తదనమేదీ ఆ కథల్లో కనిపించదు.
అలాకాక, చలంగారి ‘సుశీల’, గురజాడ ‘మెటిల్డా’, శ్రీపాద ‘గులాబీ అత్తరు’, విశ్వనాథ ‘ఏమిసంబంధము’, చాసో ‘రథయాత్ర’, బుచ్చిబాబు ‘నిరంతర త్రయం’, కుటుంబరావు ‘నువ్వులూ, తెలకపిండీ’, రావిశాస్త్రి ‘మామిడి చెట్టు ‘ సుబ్బరామయ్య ‘పూర్ణాహుతి’ లాగా ఒక కథ మళ్ళీ మళ్ళీ మనల్ని చదివించేలా చెయ్యాలంటే, అందులో శిల్పమో, కథన నైపుణ్యమో, పాత్రచిత్రణనో లేదా తన జీవితానుభవం మీంచి కథకుడు సాగించే అంతర్మథనమో లేదా కథకుడి శైలినో- ఏదో ఒకటి ఉండాలి. లేదా అన్నిటికన్నా మించి ప్రేమ్ చంద్ కథల్లోలాగా, చింతాదీక్షితులు గారి కథల్లోలాగా చదివిన ప్రతిసారీ మన హృదయాన్ని తాకే కథకుడి నిర్మలాంతరంగమో ప్రధానంగా ఉండాలి.
నన్ను వెన్నాడే కథలు అనే ఈ శీర్షిక ద్వారా నేను నలభయ్యేళ్ళ కిందట చదివిన కథల్లో కొన్ని కథలు నాకు ఇప్పటికీ ఎందుకు గుర్తున్నాయో పరిశీలించుకుంటున్నాను. వాటిల్లో నేను పైన చెప్పిన లక్షణాల్లో ఏదో ఒకటి ఉండి ఉండవచ్చును. అదే ఈ గత పదేళ్ళుగా, ఇరవయ్యేళ్ళుగా ఎందరు తెలుగు కథకుల కథలు చదివి ఉంటాను! కాని వాటిల్లో నన్ను వెన్నాడుతున్న కథలేవో చెప్పమంటే వెంటనే గుర్తురాక తడుముకుంటాను.
నలభయ్యేళ్ళ కింద ఇన్ని వనరులు అందుబాటులో లేవు. ఇన్ని అనువాదాలూ అందుబాటులో లేవు. కాని లభ్యమైన ఆ కొన్ని సంకలనాలూ, ముఖ్యంగా నేషనలు బుక్ ట్రస్టువారు కథాభారతి సిరీసు కింద తీసుకువచ్చిన సంకలనాలు, మాకు గొప్ప స్ఫూర్తినిచ్చాయి. ఇప్పటికే వాటిల్లో హిందీ సంకలనం నుంచి ఒక కథ పరిచయం చేసాను. ఇప్పుడు పంజాబీ కథ ఒకటి పరిచయం చేయబోతున్నాను.
హర్ భజన్ సింగ్ సంకలనం చేసిన ఆ సంపుటాన్ని ఎన్.బి.టి కోసం అరిగపూడి రమేష్ చౌదరి ‘పంజాబీ కథలు’ (1971) పేరిట తెలుగు చేసారు. అందులో కర్తార్ సింగ్ దుగ్గల్ రాసిన ‘మహత్యం’ అనే చిన్న కథ ఈ రోజు అందిస్తున్నాను. చూడండి.
కర్తార్ సింగ్ దుగ్గల్ (1917-2012) ఆధునిక పంజాబీ సాహిత్యంలో అగ్రశ్రేణి రచయిత. దేశవిభజనని కళ్ళారా చూసినవాడు. ఆ వ్యథల్ని కథలుగా మలిచినవాడు. ఆయన ఏకకాలంలో శిఖ్ఖూ, భారతీయుడూ, ప్రపంచ పౌరుడూ కూడా. చిన్నప్పణ్ణుంచీ హిందువుల్తో కలిసిమెలిసి తిరిగాడు, క్రిస్టియను మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు. ముస్లిం యువతిని వివాహమాడాడు. నేషనలు బుక్ ట్రస్టుకి చాలాకాలం సెక్రటరీగా పనిచేసాడు. చిన్నప్పణ్ణుంచీ శిఖ్ఖుగురువుల బోధలు వంటపట్టించుకున్నాడు. అందుకని పెద్దయ్యాక గురుగ్రంథ సాహెబ్ ఇంగ్లిషులోకి అనువాదం చేసాడు. తన పిల్లలకోసం The Sikh Gurus Their Lives and Teachings (1980) అనే పుస్తకం కూడా రాసాడు.
ఆధునిక యూరోపు చరిత్రలో పోలాండుది ఎటువంటి స్థానమో తరతరాల భారతదేశ చరిత్రలో పంజాబుది అటువంటి స్థానం. ప్రకాశ్ టాండన్ రాసిన Punjabi Century, 1875-1947 (1961) చదివాక ఈ సంగతి నాకు మరింత బాగా అర్థమయింది. (ఆ పుస్తకం తెలుగు సంక్షిప్తానువాదం ‘పంజాబీ శతాబ్ది’ పేరిట దక్షిణ భారత పుస్తక సంస్థవారు ప్రచురించారు. ఇప్పుడది ఎక్కడ లభ్యమవుతుందో తెలియదు). యుద్ధాలమధ్య, నిరంతర అనిశ్చితి మధ్య జీవించడమంటే ఏమిటో నిజంగా మనకి తెలియదు. భారతదేశంలో అటువంటి జీవితం ఎలా ఉంటుందో పంజాబీలకన్నా బాగా తెలిసినవాళ్ళు మరొకరు ఉంటారనుకోను.
అటువంటి జీవితం మధ్య జీవించిన కథకుడు తమ జాతి అనుభవాల గురించి ఒక కథ రాస్తే ఎలా ఉంటుంది? ఇదుగో, ఈ ‘మహత్యం’ కథలాగా ఉంటుంది. విషాదం మధ్యలోనే విశ్వాసం నిలబడే కథలిలా ఉంటాయి.
మహత్యం
మూలకథ: కర్తార్ సింగ్ దుగ్గల్
తెలుగుసేత: అరిగపూడి రమేశ్ చౌదరి
ఆ తరువాత అలా పర్యటిస్తూ బాబా నానక్, హసన్ అబ్దుల్ ఫారెస్టు చేరాడు. ఎండ చాలా తీవ్రంగా వుంది. బాగా వుక్క పెడుతూంది. నలువైపుల నిర్మానుష్యం, అన్నీ రాళ్లు, అంతా ఇసుకమయం. ఎండిపోయిన పొదలూ చెట్లు. ఎటువైపుచూసినా మనిషి జాడే కన్పించటంలా.
‘తరువాత ఏం జరిగిందమ్మా?’ అన్నాను నేను.
‘బాబా నానక్ ధ్యానవిమగ్నుడై నడుస్తున్నాడు. అంతలో మర్దానాకి దాహంవేసింది. కాని అక్కడ నీరెక్కడ దొరుకుతుంది ? బాబా అన్నారు.”మర్దానా. కాస్త ఓపికపట్టు, వచ్చేవూరు చేరగానే దాహం తీర్చుకుందువుగాని.’ కాని మర్దానాకు భరించలేని దాహం వేసింది. ఇది విని బాబా చాలా బాధపడ్డారు.ఆ అడవిలో నీరు దొరకటం చాలా కష్టం. మర్దానా మొండికెత్తితే అందర్నీయిబ్బంది పెడతాడు. బాబా మరల చెప్పిచూశారు. ‘మర్దానా ఇక్కడ ఎక్కడా నీరుదొరకదు. నువ్వు కాస్త ఓపిక పట్టు. దైవేచ్ఛను నిరాకరించకు.’ కాని మర్దానాఅక్కడినుండి ఒక్క అడుగు ముందుకు వేయలేదు. అక్కడే కూలబడ్డాడు. బాబాచాలా చిక్కులో పడ్డారు. మర్దానా పట్టుదలచూపి గురునానక్ ముసిముసి నవ్వులునవ్వుకుంటూ ఆశ్చర్యపోయారు. ఎంతచెప్పినా మర్దానా వినకపోయేసరికి చేసేదిలేకబాబా నానక్ ధ్యానంలో మునిగిపోయారు. గురునానక్ కళ్లుతెరచి చూసేటప్పటికిబ్మర్దానా దాహంతో చేపలా కొట్టుకుంటున్నాడు. సద్గురు అతన్నిచూసి అన్నారు.మర్దానా ఆ కొండమీది కుటీరంలో వలీ కంఘారీ అనే సాధు వొకడున్నాడు.సువ్వతనిదగ్గరకు వెళ్ళితే నీరు దొరకవచ్చు. ఈ ప్రాంతంలో ఒక్క అతని బావిలోతప్ప మరెక్కడా వీరు దొరికే ఆశ లేదు.’
‘అప్పుడేమైందమ్మా ?’ మర్దానాకు పాపం వీరు దొరికిందో లేదో తెలుసుకోవాలనే ఆదుర్దా నా కెక్కువైంది.
మర్దానాకు విపరీతమైన దాహం వేసిందికదూ! అందుకనే ఈ మాట వినగానే ఆ కొండవైపు దౌడు తీశాడు. మండు టెండ, ఒకవైపు దాహం, రెండవదికొండల్లో నడవటం, అతను అలసిపోయాడు. ఒళ్లంతా చెమట పట్టింది. ఎంతోకష్టపడి కొండపై కెళ్ళాడు మర్దానా.
వలీ కంఘారీకి నమస్కరించి కాసిని మంచినీళ్లు యివ్వమని అర్థించాడు. వలీకంఘారీ బావి వైపు చూపించాడు. మర్దానా అ వైపు వెళ్ళేలోపు వలీ కంఘారీ ఏమనుకున్నాడో ఏమో మర్దానాని వెనక్కి పిలచి అడిగాడు. ‘అన్నట్లు నువ్వుఎక్కడనుంచి వచ్చావ్ ?’
మర్దానా జవాబిచ్చాడు. ‘నేను నానక్ బాబా శిష్యుడను. మేము పర్యటిస్తూ యిలా వచ్చాం. నాకు చాలా దాహం వేసింది. ఇక్కడెక్కడా నీరు దొరకలేదు.
‘బాబా నానక్ పేరు వినగానే వలీ కంఘారీకి చాలా కోపం వచ్చింది. వెంటనే మర్దానాని తన కుటీరంనుండి గెంటివేశాడు. అలసి సొలసి మర్దానా క్రిందకు దిగిబాబా నానక్ తో విన్నవించాడు. అతని గోడంతా విని బాబా నానక్ లోలోన నవ్వుకుని అన్నారు. ‘మర్దానా. మళ్లీ ఒకసారి వెళ్ళి అడిగిచూడు.’
‘ఈసారి చాలా వినయంగా వంగి నమస్కరించి బాబా శిష్యుడనని దీనంగా విన్నవించమని బాబా నానక్ సలహా యిచ్చారు.’ ఎంతో దాహం వేసినా మర్దానా. మరెక్కడా నీరు దొరకనందున విసుక్కుంటూ తనలో తానే తిట్టుకుంటూ మరలపైకెక్కాడు. అప్పుడుకూడా వలీ కంఘారీ నీళ్లు యివ్వనే లేదు. ‘కాఫిర్ అయిన అతని శిష్యునికి నేను గుక్కెడు నీరుగూడా యివ్వను’ అని వలీ కంఘారీ మర్దానాని తిరిగి తరిమేశాడు. ఈసారి క్రిందకు దిగేసరికి మర్దనాస్థితి దయనీయంగా వుంది.(హృదయవిదారకంగా వుంది.) పెదాలు ఎండిపోయాయి. ముఖంనుండి చెమటకారిపోతూంది. అతనాట్టే బ్రతకడేమో ననిపించింది. అంతా విని బాబా నానక్’ధన్యనిరంకార్’ అంటూ మళ్ళీ మర్దానాను వలీవద్దకు పంపాడు. అజ్ఞాబద్ధుడయి మర్దానా మరల బయల్దేరాడు. దారిలోనే ప్రాణం పోతుందని మర్దానాకు తెలుసు.మర్దనా మూడవసారి కొండశిఖరం మీదికెక్కి వలీ కంఘారీ పాదాలపై పడ్డాడు. క్రోధాగ్నితో మండుతున్న వలీ కంఘారీ ఈసారిగూడా అతని ప్రార్థనను పెడచెవిని బెట్టాడు. ‘నానక్ తానేదో గొప్ప సాధువునని చెప్పుకుంటాడే, తన శిష్యునికి ఒక్క గుక్క మంచినీళ్లు యివ్వలేకపోయాడా? ఇంకా ఎన్నోవిధాల పరిహసించాడు.
ఈసారి క్రిందకు దిగుతూనే దాహంతో విహ్వలుడై బాబా పాదాలపై మూర్ఛపోయాడు మర్దానా. గురుబాబా నానక్ మర్దానా వీపును ప్రేమగా నిమిరాడు. ధైర్యం చెప్పాడు. మర్దానా కళ్లు తెరిచాడు. ఎదురుగావున్న ఒక రాతినెత్తమనిచెప్పారు బాబా : మర్దానా రాతినెత్తాడో లేదో క్రిందనుండి ఒక నీటిజలం పైకుబికింది. చూస్తూండగానే నలువైపులా జలమయమైంది. అంతలో అక్కడ వలీకంఘారీకి ఎందుకో నీటితో అవసరమొచ్చింది. బావిలోకి చూస్తే ఒక్క చుక్కగూడా నీరులేదు. వలీ కంఘారీ చాలా ఆశ్చర్యపోయాడు. కాని కొండక్రింద నీరువరదకట్టి పోతూంది. చాలా దూరంగా ఒక తుమ్మచెట్టుక్రింద బాబా నానక్ తనశిష్యులతో కూర్చునివుండటం చూశాడు వలీ కంఘారీ. ఆగ్రహంతో వలీ కంఘారీ ఒక పెద్ద బండను, తన శక్తినంతా కూడగట్టుకుని క్రిందకు దొర్లించాడు. అంత పెద్దబండ తనవైపే రావడంచూసి మర్దానా గట్టిగా అరిచాడు. నెమ్మదిగా ‘ధన్యనిరంకార్’ అనుకో మర్దనా అని చెప్పి బాబా తన దగ్గరగా వచ్చిన ఆ బండను తన అరచేతితో ఆపారు. హసన్ అబ్దుల్లో, పంజా సాహెబ్ అనేచోట నేటికీ ఆ బండమీద బాబా నానక్ చేతిగుర్తు వుంది.
నా కీ మహత్యం చాలా బాగా నచ్చింది. కాని చేత్తో కొండని ఆపారనే మాటవినగానే ఏదో చప్పగా వున్నట్లనిపించింది. ఇది ఎలా సాధ్యం? ఒక మామూలుమనిషి కొండను ఎలా ఆపగలడు? పైగా కొండమీద యింకా బాబా నానక్ చేతిముద్రలుకూడా వున్నాయట. నాకు ఏమాత్రం నమ్మకం కుదర్లా. ‘తర్వాత యెవరయినా అలా చెక్కించి వుండవచ్చు’ నేను మా అమ్మతో చాలాసేపు దీన్నిగురించి వాదించాను.
రాతిక్రిందనుండి నీరు వచ్చిందంటే నమ్ముతాను. ఫలానాచోట నీరుంది అనికవిపెట్టే విధానాలు ప్రస్తుతపు సైన్సుద్వారా బహుశా తెలుసుకోవచ్చును. కాని సాధారణవ్యక్తి తనవైపు దొర్లివస్తూన్న ఒక కొండబండను ఒకచేత్తో ఆపాడనేదిమాత్రం నమ్మ శక్యంగాదు. నేనలా వాదిస్తూవుంటే అమ్మ నా మొఖం కేసి మౌనంగాచూస్తూ వుండిపోయింది.
‘ఎవరయినా దొర్లుతూన్న కొండను ఆపగలరా ?’ ఆ విషయం జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నాలో నేను నవ్వుకునేవాడిని. చాలాసార్లు ఈ కథ గురుద్వారాలో విన్నాను. కాని కొండను అరచేతితో ఆపాడు అనేది. విన్నప్పుడల్లా నేను తల ఆడిస్తూనే వుండేవాడిని.
కొన్నాళ్ళతర్వాత పంజా సాహెబ్ దగ్గర ఏదో పర్వదినం జరుగుతూందన్నారు.ఆ రోజుల్లో అలాటివి చాలా జరిగేవి. అలాటివి జరిగినప్పుడల్లా మా యింట్లో వంటచేసేవారు కాదు. మేమంతానేలమీదనే పడుకోవలసి వచ్చేది.
కాని అస లా పర్వదినం అంటే ఏమిటో నాకు తెలిసేది గాదు.
మా ఊరు పంజా సాహెబ్ కు ఎక్కువదూరం లేదు. ఈ పండుగమాట విని మా అమ్మ పంజా సాహెబ్ అనేచోటుకి వెళ్ళింది. ఆమె వెంట నేనూ, మా చిట్టిచెల్లెలుగూడా వున్నాం. దారిపొడుగునా అమ్మకళ్లు చెమ్మగిల్లుతూనే వున్నాయి.అసలు ఈ పండుగ విశేష మేమిటో తెలియక మేము ఆశ్చర్యంగా చూసే వాళ్ళం.
పంజా సాహెబ్ వెళ్లాక మేం ఒక వింతకథ విన్నాం.
అచటికి కొద్దిదూరంలోని ఒక పట్టణంలో నిరాయుధులైన భారతీయులను ఒకతెల్లవాడు కాల్చి చంపాడు. చనిపోయినవారిలో యువకులూ, వృద్ధులుకూడావున్నారు. ప్రాణాలతోనున్నవారిని రైళ్లలో కెక్కించి మరోపట్టణపు జైలుకు పంపుతున్నారు. ఆకలిదప్పులతో దహించిపోయే ఖైదీల భోజనంకోసం దారిలో బండిఎక్కడా ఆపగూడదని ఆర్డర్సు వచ్చాయి. ఈ వార్తవిని పంజాసాహెబ్ లోనివాళ్లందరూ కోపంతో మండిపడ్డారు. తనశిష్యుడికి తానే బాబావానానక్ దాహంతీర్చిన ఆ పంజాసాహెబ్ ప్రక్కగా ఆకలిదప్పులతో మాడుతూ కైదీలబండి పోవడమా ?ఏమైనాసరే బండిని ఆపివేయాలనే నిర్ణయానికొచ్చారు.
స్టేషన్ మాష్టారును అడిగారు. టెలిఫోన్లు గణగణమన్నాయి. తంతిగూడాయిచ్చారు. బండిని ఆపకూడదని ఇంగ్లీషువారి పటుతరమైన ఆజ్ఞ. బండిలోవున్నవారు స్వాతంత్ర్యంకోసం పాటుబడే భారతీయులు. ఆకలితో మ్రగ్గుతూ కూర్చుండిపోయారా బండిలో. కనీసం మంచినీళ్లుకూడా అందించే ఏర్పాట్లులేవు వాళ్ళకు. బండి పంజాసాహెబ్ లో ఆగదన్నారు. కాని ఎలాగైనా బండి నాపాలని పంజాసాహెబ్ వారు తీవ్రంగా పట్టుపట్టారు. పురవాసులంతా భోజనంపొట్లాలు, పూరీలపొట్లాలు స్టేషన్ వద్ద కుప్పగా పెట్టుకున్నారు. బండి ఏదో పెనుతుఫాన్ లా దూసుకుపోతుంది. దాన్ని ఆపడం ఎలా?
ఆ తర్వాత మా అమ్మ స్నేహితురాలు మాకుచెప్పింది. ‘ఆ పట్టాలమీద మావారు మొదట వెళ్ళి పడుకున్నారు. వారితోపాటు వారిస్నేహితులంతా పడుకున్నారు.
ఆతర్వాత ఆడవాళ్ళం అందరం కూర్చున్నాం. మాతోపాటే మా పిల్లలుకూడా. దూరంగా కూత వేసుకుంటూ, ఆరుస్తూ బండివచ్చేసింది. ఇంకా కొంచందూరంఉండగా దాని స్పీడు తగ్గింది. ఏమైనా రైలు ఒకసారే ఆగదుకదా! అలా ఆగుతూ ఆగుతూ ఆగింది. నేను చూస్తూండగానే రైలుచక్రాలు ఆయన గుండెపై కెక్కాయి. అలాగే వారి స్నేహితుల గుండెలపైకిగూడా. తీరా నేను కళ్లు తెరుద్దును కదా సరిగ్గాబండి నా నెత్తిమీదనే వుంది. నాతోపాటు వున్న స్త్రీల హృదయాలలో నుండి ‘ధన్యనిరంకార్’ ‘ధన్యనిరంకార్’ అనేనాదం విన్పిస్తూంది, అలా చూస్తూండగానే బండిఆగిపోయింది. దానిక్రింద పడ్డవారంతా ముక్కలు ముక్కలయ్యారు.
‘రక్తపునది దూరానున్న వంతెనవరకూ ప్రవహించటం నేను కళ్ళారాచూశాను.’
నేను వుక్కిరిబిక్కిరయ్యాను. నా నోటినుండి మాట రావడంలేదు. ఆ రోజంతాగ్రుక్కెడు మంచినీళ్లుకూడా త్రాగలేకపోయాను.
సాయంత్రం తిరిగివచ్చేటప్పుడు అమ్మ పంజాసాహెబ్ కథ విన్పించటం మొదలెట్టింది. మర్దానాతో బాబా ఎలా ఈ దారినవచ్చారు. మర్దానాకు దాహం ఎలా వేసిందీ, వలీ కంఘారీ మూడుసార్లు నీళ్ళివ్వకుండా త్రిప్పిపంపడం, బాబా మర్దానాని రాతినిఎత్తమనటం, నీటిజల పైకి ఉబకటం, వలీ కంఘారీ బావిలోని నీరంతా క్రిందకువచ్చేయటం, వలీ కంఘారీకి కోపంవచ్చి అప్పుడు ఒకబండను క్రిందకుత్రోయటం,అది చూసి మర్దానా భయపడిపోవటం, అప్పుడు బాబా నానక్ ‘ధన్యనిరంకార్’అంటూ ఆ బండను అరచేతితో ఆపి మర్దానాను రక్షించడం అంతా ఎలాజరిగిందో వివరించింది. అమ్మ మాకు దారిపొడుగునా.
“కొండబండను ఎలాగమ్మా ఆపుతారు?’ అని వెంటనే మాచెల్లి ప్రశ్నించింది.
‘ఎందుకు ఆపలేరు ?’ నేను మధ్యలోనే అందుకున్నాను. ‘పెనుతుఫానులావచ్చిన రైలుబండినే ఆపగలిగినప్పుడు, ఒక కొండబండను ఆపడం పెద్దలెఖ్ఖా?’
ప్రాణాలను సైతం లెక్కచెయ్యకుండా ఆగని బండిని ఆపి ఆకలిదప్పులతో మ్రగ్గుతూన్న దేశవాసులకు, తోటిసోదరులకు ఆహారం అందించినవారి సాహసకృత్యాన్ని తలచుకుంటూ నాకళ్లు ఆశృవులు రాల్చాయి.
Featured image: Guru Nanak stopping boulder, Courtesy: Wikipedia
22-9-2025


అనువాదకుడి పేరు:
ఆరిగెపూడి రమేశ్ చౌదరి.
వీరు హిందిలో ప్రసిద్ది చెందిన రచయిత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనుండి ఉత్తర ప్రదేశ్‌కి వెళ్ళి స్థిర పడ్డారు. హిందిలో వారి సాహిత్య సేవను గుర్తించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వారిని రాష్ట్ర బహుమతి, పురస్కారాలతో సన్మానించింది.
వీరి రెండు హింది నవలలు:
1 – పేకముక్కలు
2 – ప్రతిధ్వని
అట్లూరి పిచ్చేశ్వరరావు తెలుగులోకి అనువదించారు.
వాటిని EmEsCo, మద్రాసు ప్రచురణకర్తలు 1964 ప్రాంతలలో ప్రచురించారు.
ధన్యవాదాలు సార్!
Sir, నమస్తే. కొండ బండ ను అర చేత్తో ఎలా ఆపవచ్చో తెలుసుకోవడం ఇప్పటి మా తరం అత్యంత ఆవశ్యకత. ధన్యవాదాలు
ధన్యవాదాలు జగదీశ్!
సిద్ధులకు సాధ్యం కావచ్చు! ఈ వింతలు
తర్కానికి అందవు! ఇది పురాణాల్లో చెప్పిన కథల వంటిది.
ధన్యవాదాలు సార్!