అక్కర్లేని చుట్టం

ఒక వానపడుతూనే నగరవీథులు మెత్తబడిపోతాయి
ఎంత మహానగరమూ ఇట్టే నిస్సహాయమైపోతుంది.

వానంటే పల్లెల్లో పొలాలు, పనులు, ఊడ్పులు
వానపడుతుంటే నగరానికేం చెయ్యాలో తెలియదు.

వానొస్తూనే పల్లెల్లో తలుపులన్నీ బార్లా తెరిచేస్తుంది
నగరంలో వానొస్తూనే కిటికీలన్నీ మూసేస్తుంది.

వానొచ్చిందంటే చాలు పల్లె కరిగి ప్రవహిస్తుంది.
నగరం ఉన్నచోటే ముడుచుకుపోతుంది.

గ్రామాల్లో వాన ఒక మెలకువ, వేకువ, ఒక వేడుక
నగరాల్లో వాన ఒక ఇబ్బంది, ఇరుకు, మురికి.

పల్లెల్లో వాన ఒక పాట, పిల్లలాడుకోడానికొక ఆట
నగరాల్లో వాన అక్కరకు రాని చుట్టం, అక్కర్లేని చుట్టం.

7-8-2025

14 Replies to “అక్కర్లేని చుట్టం”

  1. మహానగరంలో ఉంటూ కూడా మీలో పల్లె ఆత్మ ఎప్పడు శ్వాసిస్తూ ఉంటుంది మహాత్మా
    ఆ శ్వాసా సంగీతం ఇలా మీ కవితలో ధ్వనిస్తుంది 💐🙇🏻‍♂️

  2. చాలా విలువైన కవిత.
    నగరములో వాన నీరు ఇంకేందుకు తగిన నేల లేక, ప్రవహించేందుకు దారి లేక, సరిపడా కొలనులు లేక, కాలానుగుణముగా rain water harvesting practices పాటించక, obsolete drainage system etc ప్రధాన కారణాలు వర్షం కురిస్తే నగరం సంతోషించే అదృష్టం నుండి దూరం చేసాయి!

    కొత్త నగరాలను నిర్మించే పాలసీ మేకర్స్, ఆర్కిటెక్ట్స్, అర్బన్ ప్లానర్స్, మునిసిపల్ అడ్మినిస్ట్రేటర్లు, బ్యూరోక్రాట్స్ కు మీ contemporary poem ఒక reminder PRECAUTIONARY ALERT!

  3. బావుంది మంచి ఎండలో కురిసిన వానగా… నగరంలో వున్నా పల్లెను మరవలేము

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading