తీరనిదాహం

మా మాష్టార్ని ఉద్దేశిస్తూ 1985 లో సహృదయునికి ప్రేమలేఖ రాసినప్పటినుంచి ఇప్పటికి నలభయ్యేళ్లు. అప్పణ్ణుంచి 2019 మధ్యకాలంలో రాసిన సాహిత్యవ్యాసాల్ని ‘సహృదయునికి ప్రేమలేఖ’ (2001), ‘సాహిత్యమంటే ఏమిటి’ (2009), ‘సాహిత్య సంస్కారం’ (2017), ‘దశార్ణదేశపు హంసలు’ (2019) పేరిట నాలుగు సంపుటాలుగా తీసుకొచ్చేను. 2019 తర్వాతనుంచీ రాసిన వ్యాసాల్ని ఒక్క సంపుటంగా కాక, కవిత్వం, కథలు, నవలలు, తక్కిన సాహిత్యవ్యాసాలుగా మూడు సంపుటాలుగా తీసుకురావాలని అనుకున్నాను. అందులో భాగంగా 2019 నుంచి ఇప్పటిదాకా కవిత్వం మీద రాసిన వ్యాసాల్ని ఈ సంపుటిగా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కడ డౌనులోడు చేసుకోవచ్చు.

మొత్తం 54 వ్యాసాలు. మొదటి 31వ్యాసాలూ వివిధ కవిత్వసంపుటాలకి ముందు మాటలు లేదా పరిచయప్రసంగాలు. తర్వాత 8 వ్యాసాలు అనువాదాలకూ, అనువాద సంపుటాలకూ పరిచయాలు. ఆ పైన 7 వ్యాసాలు కవిత్వానుశీలన మీద అనుశీలన. చివరి 8 వ్యాసాలూ మనల్ని వీడివెళ్ళిన మహనీయ కవులకు నివాళి. మొత్తం మీద ఈ పుస్తకమంతా మహాకవి మాటల్లో చెప్పాలంటే ‘ఒక తీరనిదాహం’.

శిఖామణి నాకు దాదాపు నలభయ్యేళ్ళుగా మిత్రుడు. ఆయన తొలి కవితాసంపుటి ‘మువ్వల చేతికర్ర’ ఆవిష్కరణ సభలో నాతో కూడా మాట్లాడించేడు. ప్రతి ఏటా తన పేరిట ఇస్తున్న జీవనసాఫల్యపురస్కారం కిందటేడాది నాకు అందచేసాడు. మా స్నేహానికి గుర్తుగా ఈ సంపుటిని ఆయనకు కానుక చేస్తున్నాను.

ఇది నా 62 వ పుస్తకం.

11-5-2025

8 Replies to “తీరనిదాహం”

  1. మీది నిజంగా తీరని దాహమే!
    ఎంత చదివినా, ఎన్ని రాసినా!!

    మీనుండి వందో పుస్తకం కూడా రావాలని అభిలషిస్తున్నాను సార్ 🙏🙏❤️

  2. జోడియాక్ సైన్ మీన రాశి ముఖచిత్రంగా తీరని దాహం పేరు ఎంత అర్థవంతంగా ఉంది మీ కొత్త పుస్తకం.
    మువ్వల సంపుటి ఆవిష్కరణలోనే మొదటిసారిగా మిమ్మల్ని చూశాను. మిమ్మల్ని గురించి మీ గురు ప్రశంస అంతకుముందే విన్నాను.నాకు అప్పుడైతే జెలసీనే కలిగింది. ఇప్పుడైతే ఒక అపారమైన గురు భావం మీ ద్వారా ఇంకా మేము చాలా చాలా తెలుసుకోవాలి.
    మీకు మిత్రుడు శిఖామణికి అభినందనలు.
    డా. పి బి డి వి ప్రసాద్

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading