
రాధేయ గారు ప్రతి ఏటా ఇచ్చే ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారానికి తోడుగా ఈ ఏడాది నుంచీ ఉమ్మడిశెట్టి సతీష్ కుమార్ పేరుమీదుగా ఒక యువ జాతీయ పురస్కారం కూడా ఏర్పాటు చేసారు. ఈ ఏడాది ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారం బండి సత్యనారాయణ గారికి, యువ పురస్కారం మానస చామర్తికి అందించారు. వారితో పాటు ఒక ప్రత్యేక పురస్కారం లక్ష్మీ కందిమళ్ళ గారికి కూడా అందించారు. ఆ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకి వచ్చి తాను రాసిన ‘అజేయుడు’ దీర్ఘకావ్యాన్ని ఆవిష్కరించమని కూడా రాధేయ గారు అడిగారు. ఆ పుస్తకం నాకు పంపిస్తూ ‘రెండు మాటలు రాసినా చాలు, అట్టమీద వెనకపక్కనైనా వేసుకుంటాను’ అనడిగారు. కాని ఆ రెండుమాటలు రాయడం ఎంత కష్టమని! నెలరోజుల పాటు ఆ పుస్తకం పిడిఎఫ్ నా టాబ్ లో అలానే ఉంది. ఒకసారి ప్రయత్నించి కష్టమ్మీద ఇరవై పేజీల దాకా చదివాను. ఆ మీదట చదవగలగడం నాకు సాధ్యం కాలేదు. ఆయనే మళ్ళా నెలరోజులు పోయాక, సంకోచంతో, నెమ్మదిస్వరంతో ‘మీటింగ్ టైం దగ్గర పడుతోంది’ అన్నారు. ఇంక ఆలస్యం చేయలేక, రాసాను ఎలాగైతేనేం, ఇదుగో, ఈ ముందుమాట.
ఇది ఒక శోకగీతం. నిండుయవ్వనంలో ఉన్న తన కొడుకుని పోగొట్టుకున్న ఒక తండ్రి కన్నీటిపాట. ఆ యువకుడు అందగాడు, బుద్ధిమంతుడు, ఇతరులని నొప్పించనివాడు. నలుగురికీ స్నేహపాత్రుడు. ఒక్కమాటలో చెప్పాలంటే సాకేతరాముడే. అటువంటి రాముడికి దూరమైన ఒక దశరథుడి వ్యథ ఇది.
ఈ అశ్రుకావ్యం మీరు తెరవగానే ఇక్కడ నావి నాలుగు మాటలుండాలని రాధేయ కోరుకున్నారు. కాని ఏమని రాయగలను? మీకు ఏ మాటలు చెప్పి మిమ్మల్ని ఈ శూన్యగృహంలోకి పంపించగలను? కొన్ని నష్టాల్ని మనం ఓదార్చగలం. మరికొన్ని నష్టాల్ని బహుశా పూరించగలం. కాని ఓదార్చలేని, పూరించలేని ఈ మహాశోకం ఎదట మీరేనా, నేనేనా ఎట్లా నిలబడగలం? ఏ మాటలు చెప్పి మనం ఆయన్ని మభ్యపరచగలం లేదా మనల్ని మభ్యపెట్టుకోగలం?
ఇది ఒక శోకగీతం. ఆత్మీయులు తమని విడిచిపెట్టి శాశ్వతంగా దూరమైనప్పుడు కవులు చెయ్యగలిగే పని ఒక శోకగీతం కూర్చుకోవడమే. కాని శోకగీతాలు నిజంగా శోకాన్ని తీరుస్తాయా? అవి ఆ దుఃఖదగ్ధ హృదయాగ్ని ఎటువంటిదో మనకు చెప్పగలుగు తాయా? అసలు కనీసం మనం ఆ గుమ్మందాకానేనా పోగలమా? అయినా కూడా కవులు శోకగీతాలు రాయకుండా ఉండలేరు. ఎందుకని? ఒక శ్రీ శ్రీ ఒక కొంపెల్ల గురించి రాసినట్టు, ఒక నాయని ‘మాతృగీతాలు’ రాసినట్టు, ఒక విశ్వనాథ ‘వరలక్ష్మీ త్రిశతి’ రాసినట్టు, ఒక బసవరాజు ‘కాపురమొచ్చిన కన్నిపాపాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు’ అని విలపించినట్టు కవులు తమలో తాము కుమిలిపోతూ ఏదో ఒక రూపంలో తమ వేదన వెళ్ళగక్కుకుంటూనే ఉంటారెందుకని?
Edward Hirsch కవి, అనువాదకుడు, ఆ రెండిరటికన్నా మించి గొప్ప కవిత్వప్రేమికుడు. ఆయన ఒక పిల్లవాణ్ణి తెచ్చిపెంచుకున్నాడు. ఆ పిల్లవాడు గొప్ప క్రియేటివ్. ఈ లోకంతాలూకు నియమనిబంధనలు, ఈ స్కూళ్ళు, ఈ చట్టాలు ఆ పిల్లవాడికి ఊపిరాడనివ్వలేదు. అయినా ఆ బిడ్డ వాటిని ప్రతిఘటిస్తూనే ఉన్నాడు, ప్రతిఘటించినంత కాలం ప్రతిఘటిస్తూనే ఒక తుపాను రాత్రి అదృశ్యమైపోయాడు. ఆ తండ్రి నిశ్చేష్టుడై పోయాడు. రెండుమూడేళ్ళ పాటు మతిస్థిమితం తప్పినవాడిలాగా సంచరించాడు. నెమ్మదిగా ఓపిక కూడ గట్టుకుని తన పిల్లవాణ్ణి తలుచుకుంటూ Gabriel అని ఒక దీర్ఘకవిత రాసాడు.
ప్రపంచ కవిత్వాల్ని అవపోశన పట్టిన హర్ష్‌కి తన జీవితమహాదుఃఖాన్ని కవిత్వం చేసుకోవడమెట్లానో తెలియకుండా ఉంటుందా? కాని ఆయన తాను కవిత్వం రాయాలని అనుకోలేదు. కవిత్వం రాస్తున్నాననీ అనుకోలేదు. తన పిల్లవాణ్ణి తలుచుకుంటూ తాను రాస్తున్నవాటిని ఆయన కవితలు అనలేదు. Near Poems అన్నాడు. కవితలకు దగ్గరగా ఉండేలాంటి మాటలన్నమాట. అయినా ఎందుకు రాసుకున్నాడు? ఆ మాటలు తనని ఓదారుస్తాయనా? లేదా అవి చదివినవాళ్ళు తన దుఃఖం కొంతేనా పంచుకుని తన బరువు తగ్గిస్తారనా? అవి రెండూ సాధ్యమయ్యే పనులు కావని అతడికి తెలుసు. అయినా ఎందుకు రాసుకున్నాడు?
ఆ దీర్ఘకవితను ‘ద న్యూయార్కర్’ పత్రికలో (2014) పరిచయం చేస్తూ Alec Wilkinson అనే ఒక రచయిత ఒక గొప్ప మాటన్నాడు. ఆ కవిత రాసుకోవడం ద్వారా హర్ష్ తన పిల్లవాడు గాబ్రియేలు సన్నిధిని అనుభూతి చెందుతూ ఉన్నాడు అని. దానివల్లslowly I became stronger. I wasn’t healing, but I was stronger అని అన్నాడట హర్ష్.
కాబట్టి దీన్ని శోకగీతం అనకూడదు. ఇది సాన్నిధ్యగీతం.
ఈ వాక్యాలు చూడండి:
సతీషూ!
ఈ రోజు ఎందుకో మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నావ్
మరపురానంతగా, మర్చిపోలేనంతగా
ఎదురుగూ నవ్వుతూ నిలబడి
ఏం రాస్తున్నావ్ నాన్నా..
నన్ను గురించే రాస్తున్నావా..
ఈ గీతం మనతో మాట్లాడుతున్నట్టు ఉందిగాని, ఇది నిజానికి ఆ తండ్రి ఆ కొడుకుతో చేస్తున్న సంభాషణ. మనం చెయ్యవలసిందల్లా వినయంగా చేతులు కట్టుకుని మౌనంగా పక్కన నిలబడి ఆ సంభాషణని ఆలించడమే.
ఒద్దు, ఓదార్చడానికి ప్రయత్నించొద్దు. అది ఆ సంభాషణకి అడ్డుపడుతుంది. ఆ మహామౌనానికి అంతరాయం కలిగిస్తుంది. అందుకనే కవి మనతో ఇలా అంటున్నాడు:
దుఃఖం అనుభవించేవాడికే తెలుస్తుంది.
ఓదార్పులు దుఃఖాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయ్
ప్లీజ్ నన్ను నన్నుగా ఉండనీయండి.
ఎందుకంటే-
నా అంతర్లోకాల్ని పట్టించుకోకుండా
బహిర్లోకంలో నన్ను సాంత్వనపర్చడానికి
అందరూ ప్రయత్నిస్తున్నారు.
కాని ఆయనట్లా దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే చూడలేకపోతున్నాం అంటాం మనం. కానీ Stanley Kunitz గురించి విన్నారా? ఇరవయ్యవ శతాబ్దపు అమెరికన్ మహాకవుల్లో ఒకడు. తన తొంభై అయిదవ ఏట యు ఎస్ కి పొయెట్ లారేట్ అయ్యాడు. అతడు పుట్టకముందే అతడి తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న తన భర్త ఆనవాళ్ళు ఏవీ మిగలకుండా తన పిల్లలమీద ఆ నీడ పడకుండా చూడాలని అతడి భార్య, కునిజ్ తల్లి ఎంతో ప్రయాసపడిరది. కాని నూరేళ్ళపాటు జీవించిన కునిజ్ జీవితంలో అతడి తండ్రి నీడ అతణ్ణి ఒక్కరోజు కూడా వదల్లేదు. ఆ దుఃఖం ఆయన్ని కవిత్వం వైపు నడిపించింది. ఒకరోజు మార్టిన్ లూథర్‌కింగ్‌ని హత్య చేసిన వార్త విన్నాడతడు. తన శోకం సార్వత్రికశోకంతో కనెక్ట్ అయ్యింది. వెంటనే ఇలా రాసుకున్నాడు:
In a murderous time
the heart breaks and breaks
and lives by breaking.
మరి మనమేం చెయ్యాలి? తనని ఓదార్చవద్దంటున్నాడని దూరంగా ఉండిపోవాలా? కాదు, మరింత చేరువగా జరగాలి. ఇదుగో, ఈ మాటలు కూడా ఈ పుటల్లోనే ఉన్నాయి:
నన్ను ప్రేమించేవాళ్ళు
నా గాయాలనూ ప్రేమిస్తారు
జీవితమంటేనే
ఒకరికొకరు ఓదార్చుకుంటూ
బతకడమే కదా మిత్రమా!
కాని ఆ ఓదార్పు శుష్కపరామర్శ కాకూడదు. అది అతడి దుఃఖాన్ని మన దుఃఖంగా మార్చుకోగల మౌనం కావాలి.Poems that Make Grown Men Cry (2014) అనే పుస్తకాన్ని ఒక తండ్రీ, కొడుకూ కలిసి సంకలనం చేసారు. ఇద్దరూ కూడా రెండు ముందుమాటలు రాసారు. అందులో కొడుకు Ben Holden తన ముందుమాటలో సిసిల్ డె లువిస్ వాక్యమొకటి ఉల్లేఖించాడు. లువిస్ అన్నాడట. .. that he did not write poetry to be understood, but to understand అని. కవిత్వం అర్థం కావాలని కోరుకుంటాం మనం. కాదు, కవిత ముందు అర్థం చేసుకొమ్మని చెప్తుంది. నిన్నూ, నీ చుట్టూ ఉన్న లోకాన్నీ, నీ పరిచితుల్నీ, అపరిచితుల్నీ, కష్టాల్నీ, కన్నీళ్ళనీ. కవిత పుట్టిందే తోటిమనిషిని అర్థం చేసుకోవడంలోంచి. మనిషి అన్నానా, కాదు, తోటిప్రాణి కష్టాన్ని. ఒక క్రౌంచమిథునశోకంతో ఒక మనిషి హృదయం ఏకమయినందువల్ల కదా, మన ఆదికావ్యం పుట్టింది!
మరొకమాట కూడా చెప్పాలి. బెన్ జాన్సన్ తన మొదటి కొడుకు చనిపోయినప్పుడు ఆ పిల్లవాణ్ణి తలుచుకుంటూ ఒక కవిత రాసాడు. అందులో ఇలా అన్నాడు:
Rest in peace, and, asked, say, ‘Here doth lie
Ben Johnson, his best piece of poetry.
రాధేయ తన జీవితంలో వెలువరించిన సతీష్ అనే గొప్ప కావ్యాన్ని కూడా, మనం ఈ గీతం చదవడం ద్వారా, చదవకుండానే చదివినట్టవుతుంది!
23-12-2024


ఇది నేను చదివిన మంచి ముందుమాటల్లో ఒకటి. ❤️
ధన్యవాదాలు మానసా!
ఆ తండ్రికి ఎంత అభిమానం మీమీద!
ఆయన నిజంగా ప్రేమార్తుడు.
ఆత్మీయుల్ని పోగొట్టుకున్న మనుషుల మనసుల వేదనని ఇంత కన్న ఆర్ద్రంగా అనువదించి రచన నేను చదవలేదు. కన్నీళ్ళతో మసకబారిన కళ్ళతోనే చదివాను.
నమస్కారాలు సార్!