
లేదు, పదాలట్లా ఎంతసేపని నిన్నే చూస్తుంటాయి
నువ్వు వెతుక్కుంటున్నదాన్ని
అవి ఒంటరిగా వెతకలేవు.
వాక్కుని వాక్యాలుగా చూడాలనుకోడం
పాతకాలపు చదువు.
అది సరిపోదు, నీ అనుభవాలు మరీ బరువు.
రాషిద్ ఖాన్ చూడు, ఆలపిస్తున్నాడొక కీర్తన
పదాల్ని వాక్యాలుగా కాదు
పరిమళంగా మార్చేస్తున్నాడు.
రాత్రి గడిచేకొద్దీ దీపకాంతి మందగించినట్టు
కోవిదారవృక్షం మీద
వెలిసి పోతున్న శరత్కాలం.
మొన్నటిదాకా ఆ నది ఒడ్డున రెల్లు పూస్తుంటే
నువ్విక్కడే ఉండిపోయేవనుకున్నావు
కొండ కింద పల్లెలో ఉండవలసినవాడివి
మార్కెట్ పక్క ఇంట్లో ఉంటున్నావు, నిజమే.
కాని ఒక్కసారి మ్యూట్ బటన్ నొక్కి చూడు
చిట్టచివరి పున్నాగపూల గాలి
గుసగుస వినబడుతుంది.
ఇప్పుడక్కడ పొలాల్లో పంటకోతలు మొదలవుతాయి
ఒకసారి గ్రామాల్లో హేమంతం అడుగుపెట్టాక
తూనీగల రెక్కలమీద పరుచుకునే బంగారపు దుమ్ము.
నువ్విక్కడ కీట్సుని తిరగేస్తూ
పాపం, ఎన్నాళ్ళని గడుపుతావు!
పగలు వెన్నెలగా మారిపోయే పొలిమేరల్లో
ఆ ఏటిమీద వంతెన కింద
నీ చిన్నప్పటి పాటల కోసమింకా
ఎన్నేళ్ళని వెతుక్కుంటావు?
నీకొక్కడికే కాదు, ప్రతి ఒక్క కవికీ అనిపిస్తుంది
ఒక తియ్యనిగొంతు వినాలనీ
ఒక వసంతం, ఒక వేసవి, ఎడతెరిపిలేని
వానల కాలం ఒకటి గడిచిపోయాక
ఆకులూ, కాయలూ కూడా పండటం మొదలుపెట్టాక
ఇంతకాలం జీవించామన్న తృప్తితో
కాలభూర్జపత్రం మీద నిండుగా ఒక సంతకం చేసి
నిష్క్రమించాలని ఉంటుంది.
కానీ చూడాలిప్పటికైనా నువ్వు
ఈ కార్తిక అపరాహ్ణాల
ఒక కొస పట్టుకుని
నువ్వొక ఊయెల ఊపుతున్నావనీ
నువ్వు పాడుకుంటున్న జోలపాట వింటూ
నగరం ఒక బిడ్డగా
నిశ్చింతగా నిద్రిస్తోందనీ.
24-11-2024


Wow! My goodness! Beautiful!
‘ కొండకింద పల్లెలో ఉండవలసిన వాడివి
మార్కెట్ పక్క ఇంట్లో ఉంటున్నావు’
అందుకే ‘ కోతలు’ మొదలయేదని
గుర్తు చేసుకోవటం,
ఆ ఊళ్ళోని కోయెల కూతలనీ,వంతెన కింద పాటల్నీ
వెతుక్కోవటం!
అవును సార్! ధన్యవాదాలు!
ధన్యవాదాలు మానసా!
“ పదాల్ని వాక్యాలుగా కాదు
పరిమళంగా మార్చేస్తున్నాడు.”
“ కోవిదారవృక్షం మీద
వెలిసి పోతున్న శరత్కాలం”
“ ఒక్కసారి మ్యూట్ బటన్ నొక్కి చూడు
చిట్టచివరి పున్నాగపూల గాలి
గుసగుస వినబడుతుంది.”
“ ఒకసారి గ్రామాల్లో హేమంతం అడుగుపెట్టాక
తూనీగల రెక్కలమీద పరుచుకునే బంగారపు దుమ్ము.”
“ ఆ ఏటిమీద వంతెన కింద
నీ చిన్నప్పటి పాటల కోసమింకా
ఎన్నేళ్ళని వెతుక్కుంటావు?”
“ కాలభూర్జపత్రం మీద నిండుగా ఒక సంతకం చేసి
నిష్క్రమించాలని ఉంటుంది.”
“ ఈ కార్తిక అపరాహ్ణాల
ఒక కొస పట్టుకుని
నువ్వొక ఊయెల ఊపుతున్నావనీ””
రాషిద్ ఖాన్ సంగతి తెలియదు కానీ మీ పదాల పరిమళం ఇక్కడిదాకా గుబాళిస్తోంది.
Very beautiful కార్తిక అపరాహ్ణం!!
ధన్యవాదాలు మాధవీ! ఈ కవితకి ఇంతకన్నా గొప్ప గమ్యస్థానం మరొకటి ఉండదనుకుంటాను.
పాడుకున్న జోల పాట వింటూ నగరం నిద్రించడం ..బాగుంది సర్..అలుపెరుగని నగరాన్ని పసి బిడ్డగా మార్చింది కార్తీక సంధ్య మోసుకొచ్చిన చల్ల గాలీ , ఇట్లాంటి తేనె పలుకులూ ..
ధన్యవాదాలు
కార్తీక అపరాహ్నం ఎప్పుడూ చల్లచల్లగా, అప్పుడప్పుడూ కొంచెం వెచ్చగా, హాయిగా… పనులు చేసుకున్నా, దుప్పటి కప్పుకొని బజ్జున్నా, పూల పరిమళాలు అలవోకగా తనువుని తాకి వెళుతుంటాయి. కాలమంతా శీతాకాలం ఐపోతే బావుండు…🪴🌦️
కాళహస్తి అమ్మాయికి కాక కార్తిక అపరాహ్ణాల గురించి మరి ఎవరికి తెలుస్తుంది!
నా 18 వ ఏట, ఉద్యోగానికి వెళ్లబోయేముందు, ఒక సంవత్సరం మా గ్రామంలో వ్యవసాయం చేశాను, మా 70 ఎకరాల భూముల్లో. కోతల సమయం నుండి, పంట నూర్పిడి వరకు వుండే ఆ వాతావరణాన్ని, పల్చని నునువెచ్చని ఎండను, రాత్రులు కురిసే మంచు తెరలను, రాత్రులు పొలంలో పడుకొని ఆకాశంలో నక్షత్రాలను, మంచు తెర వెనుక వుండే మసక చంద్రుణ్ణి చూస్తూ, మా జానపదులు పాడే పాటలు వింటూ ఉండటం గొప్ప అనుభూతి. అలాగే, ఆ సమయంలో-సంక్రాంతి సమయంలో భూస్వాముల వినోదానికి, వారిచ్చే బహుమతుల కోసం వారి కళలను ప్రదర్శించే కళాకారులు, కవులు, వాద్యకారులు-వీరితో గ్రామం కలకళలాడేది. వేదాంతం సత్యనారాయణ శర్మ గారి బృందం మా ఔట్ హౌస్ లో 10 రోజులు మకాం ఉండి, నిష్ఠగా వారి అనుష్టానం, వారు తయారు చేసుకున్న ప్రకృతిసిద్ధమైన రంగులతో అలంకరించుకొని, రోజుకొక అవతారం చొప్పున దశావతారాలు ప్రదర్శించడం అద్భుతంగా ఉండేది. వారు స్వహస్త పాకం చేసుకునేవారు. అలాగే దక్షిణాదినుంది గొప్ప నాగస్వర విద్వాంసులు వచ్చి కచేరీ ఇచ్చేవారు. తోలుబొమ్మలాటలు, హరికథలు, హరిదాసులు, గొబ్బెమ్మలు, బంతిపూలు, ఓహ్ ఇంకెన్నో…ఇవన్నీ మాయమైపోయాయి గ్రామాల్లో.
మీ కవిత చదువుతుంటే ఇవన్నీ గుర్తుకొచ్చాయి, 65 ఏళ్లనాటి సంగతులు. 🙏🏼
చాలా అద్భుతమైన జీవితం కదూ! ధన్యవాదాలు.
నీ చిన్నప్పటి పాటల కోసమింకా
ఎన్నేళ్ళని వెతుక్కుంటావు?
నీకొక్కడికే కాదు, ప్రతి ఒక్క కవికీ అనిపిస్తుంది
ఒక తియ్యనిగొంతు వినాలనీ
ఒక వసంతం, ఒక వేసవి, ఎడతెరిపిలేని
వానల కాలం ఒకటి గడిచిపోయాక
ఆకులూ, కాయలూ కూడా పండటం మొదలుపెట్టాక
ఇంతకాలం జీవించామన్న తృప్తితో
కాలభూర్జపత్రం మీద నిండుగా ఒక సంతకం చేసి
నిష్క్రమించాలని ఉంటుంది.
ధన్యవాదాలు