
మొన్న ఏడో తేదీనాడు టాగోర్ పరమపదించిన రోజు కదా, మీరాయన్ని తలుచుకుంటూ ఏమీ రాయలేదేం అనడిగారు బులుసు సరోజిని గారు. నాకు మే ఏడో తేదీనే గుర్తు తప్ప, ఆగస్టు ఏడో తేదీ టాగోర్ కి సంబంధించిన తేదీగా ఎప్పటికీ గుర్తుండదు. ఎందుకంటే అది మా ప్రమోద్ పుట్టినరోజు కాబట్టి. జోళదరాశి చంద్రశేఖరరెడ్డిగారు ఉన్నంతకాలం అది శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక దినోత్సవం అని పదే పదే గుర్తుచేసేవారు.ఆ రోజు ఏదో ఒక సభ పెట్టేవారు. కృష్ణరాయల్ని తలుచుకుంటూ నేనేమి మాట్లాడినా వినడానికి తాను సిద్ధమే అని అంటూండేవారు.
కాని ఇన్నాళ్ళకి ఒక మిత్రురాలు ఆగస్టు ఏడోతేదీన టాగోర్ ని కూడా తలుచుకోవలసిన అవసరముందని గుర్తుచేసారు. కాని ఏమని గుర్తుచేసుకోవాలి? టాగోర్ చివరి దినాలు, ఇంకా చెప్పాలంటే చివరి సంవత్సరాలు, ఏమంత సంతోషభరితమైనవి కావు. ఉల్లాసభరితమైనవి అసలే కావు. ఆయన గీతాంజలి గీతాల్లో మృత్యువు తన ఇంటితలుపు తట్టినప్పుడు ఎంతో హుందాగా, మర్యాదగా స్వాగతిస్తానని చెప్పుకున్నాడుగాని, ఆయన్ని మృత్యువు ఊహించని విధంగా సమీపించింది. ఒక కవి, ఒక గాయకుడు మృత్యువుకు ఎదురేగే పద్ధతి అది కాదు. బహుశా ఒక యోగిని, ఒక ఉపాసకుణ్ణి మృత్యువు ఒక్కసారిగా చంకనపెట్టుకుపోలేదేమో. ఈ ప్రపంచంతో పూర్తిగా ముడివడ్డ ఒక జీవితప్రేమికుడి బంధాలు తెంచడం మృత్యువుకి ఒకపట్టాన చాతకాలేదేమో!
టాగోర్ తన జీవితమంతా ఒక్కక్షణం కూడా విశ్రాంతిగా లేడు. నోబెల్ పురస్కారం ఆయనకి యాభై అయిదవ ఏట లభించింది. మరొకరెవరేనా తమ సాహిత్య సృజనని అక్కడితో ఆపేసి ఉండేవారు. కాని ఆయనలోని సృజనకారుడు సాహిత్య కృషితో తృప్తి చెందలేదు. సంగీతం, చిత్రలేఖనం, రంగస్థలం- ప్రతి ఒక్కరంగంలోనూ ఆయన మరింత నిర్విరామంగా కృషి సాగిస్తోనే ఉన్నాడు. ఒక టాగోర్ పండితురాలు లెక్కగట్టినదాని ప్రకారం ఆయన తన డెబ్భైల్లో, అంటే తన చివరి పదేళ్లల్లో, పదహారు కవితాసంపుటాలు, ఎనిమిది నాటకాలు, ఒక నవల, రెండు నవలికలు, ఏడు వ్యాససంపుటాలు, నాలుగు సంపుటాల ఉత్తరాలు, యాత్రా కథనాలు, రెండు కథాసంపుటాలు, రెండు సంపుటాల బాలసాహిత్యంతో పాటు తన ఆత్మకథకూడా వెలువరించాడు. ఎంతోమంది సాహిత్యవేత్తలు వారి జీవితకాలం మొత్తంలో కూడా ఇంత సాహిత్యకృషి చేపట్టి ఉండరని మనం చెప్పుకోవచ్చు.
ఆ కోకిలది నిత్యవసంతం. ఆ భృంగానికి పగలూ, రాత్రీ తేడా లేదు. ఆ ఇంద్రచాపం ఎప్పటికీ చెరిగిపోనిది.
అటువంటిది 1937 సెప్టెంబరు పదో తేదీన టాగోర్ శాంతినికేతన్ లో తన కుర్చీలో కూచుని ఉండగా హటాత్తుగా స్పృహతప్పిపోయాడు. టెలిఫోన్ సౌకర్యంలేని ఆ రోజుల్లో కలకత్తా నుంచి వైద్యులు వచ్చేదాకా ఆయన అపస్మారకంలోనే ఉన్నాడు. వైద్యులు వచ్చి ఆయనకు చికిత్స చేసి స్పృహలోకి తెప్పించిన వెంటనే ఆయనొక కాన్వాసూ, రంగులూ కావాలని అడిగాడు. వెంటనే లేచి కూర్చొని ఒక బొమ్మ గీసాడు. ఆ బొమ్మ ఆయన కవిత్వంలో కనవచ్చే కాంతిమయ లోకంకన్నా భిన్నమైంది. ముదురురంగుల్తోనూ, పొగలాంటి ఆకృతుల్తోనూ, అంధకారంతోనూ కూడుకున్న ఆ బొమ్మ ఆయన అస్వస్థతకు చిహ్నంగా ఉండింది. ఆ తర్వాత ఆయన కొన్ని కవితలు రాసాడు. మొత్తం పద్ధెనిమిది కవితలు. వాటిని ‘ప్రాంతిక్’ (1937) అనే పేరుతో ప్రచురించారు. ప్రాంతిక్ అంటే సీమాంతం. సరిహద్దుప్రాంతం అనవచ్చు. వ్యక్తావ్యక్తాల, జీవన్మరణాల సరిహద్దుని తాకి వచ్చిన అనుభవంలోంచి ఆయన ఆ కవితలు రాసాడు. అవి పూర్వంలాగా పాటలు కావు. పద్యగంధి వచనం లాంటివి. ఆ విధంగా కూడా అవి గీతానికీ, వచనానికీ మధ్య సరిహద్దులో తచ్చాడిన స్మరణలే.
ఆ తర్వాత మూడేళ్ళ పాటు ఆయన మామూలుగానే ఉన్నప్పటికీ పూర్వపు స్వస్థత ఆయనకి చేకూరలేదు. కాని ఆయనలోని కవీ, చిత్రకారుడూ, విద్యావేత్తా విశ్రమించింది లేదు. 1940 ఏప్రిల్లో మహాత్ముడు కస్తూర్బా తో కలిసి శాంతినికేతన్ కి వచ్చి ఒక వారం రోజులున్నారు. ఆ ఏడాది సెప్టెంబరులో కాలింపాంగ్ లో ఉండగా టాగోర్ మళ్ళా అపస్మారక స్థితిలోకి పోయాడు. అక్కడ తగిన వైద్య సదుపాయం లేకపోవడంతో కలకత్తా తీసుకొచ్చారు. చికిత్స అందాక శాంతినికేతన్ తీసుకొచ్చారు. దాదాపు ఎనిమిది నెలల తీవ్ర అస్వస్థతలో గడుపుతున్న కాలంలో కూడా ఆయన కవితలు రాయడం ఆపలేదు. వాటిని ‘రోగశయ్య’ (1940), ‘ఆరోగ్య’ (1941) అనే సంపుటాలుగా వెలువరించారు.
తన ఎనభయ్యవ జన్మదినోత్సవానికి కొద్దిగా ముందుగా ఆయన మళ్ళా జీవితంవైపు ఆశగా చూస్తో కొన్ని కవితలు రాసాడు. వాటిని ‘జన్మదినె’ (1941) అనే పేరుతో వెలువరించారు. ఆ ఏడాదే వసంతఋతువులో మళ్ళా ‘శేష్ లేఖ’ (1941) పేరిట మరికొన్ని కవితలు రాసాడు. ఆ ఏడాది జూలై 25 న మృతుముఖంలో మరొక కవితా, జూలై 29 న మృత్యుశయ్యమీద మరొక కవితా రాసాడు. ఆ రోజే ఆయనకు సర్జరీ జరిగింది. ఆయన మళ్లా అపస్మారకంలోకి పోయాడు. ఇక మళ్ళా స్పృహలోకి రాలేదు. ఆ తర్వాత పది రోజులకే అంటే ఆగస్టు ఏడున ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టివెళ్ళిపోయాడు.
టాగోర్ జీవితకాలం పాటు రాసిన కవిత్వం ఒక ఎత్తూ, ఈ చివరి నాలుగేళ్ళలో రాసిన ‘ప్రాంతిక్’, ‘రోగశయ్య’, ‘ఆరోగ్య’, ‘శేష్ లేఖ’ కవితా సంపుటులు ఒక ఎత్తూ. ఈ కవితల్లోనూ, చిత్రలేఖనాల్లోనూ కనిపించే టాగోర్ గీతాంజలి టాగోర్ కాడు. గీతాంజలి కవిత్వానికి లభించినన్ని అనువాదాలు ఈ కవితలకి లభించలేదు. వీటిలోంచి కొన్ని కవితల్ని మొదటిసారిగా ఇంగ్లిషులోకి అనువదించి అరవింద బోస్ అనే ఆయన The Wings of Death, The Last Poems of Tagore (1959) పేరిట వెలువరించాడు. సుప్రసిద్ధ గ్రీకు పండితుడు,అనువాదకుడు గిల్బర్ట్ ముర్రే ఆ సంపుటానికి ముందుమాట రాసాడు.
తిరిగి మళ్ళా దీపక్ మజుందార్ అనే ఆయన ఈ నాలుగు సంపుటాలనుంచీ 38 కవితల్ని ఇంగ్లిషులోకి అనువదించి A Poet’s Death, Late Poems of Rabindranath Tagore (2004) పేరిట వెలువరించాడు. టాగోర్ రచనలపైన పరిశోధన చేసిన Kathleen M O’Connell అనే కెనడియన్ పండితురాలు ఈ సంపుటానికి ముందుమాట రాసారు. అందులో ఆమె ఈ కవితల్లో టాగోర్ జ్ఞాతప్రపంచం సరిహద్దులుదాటి అజ్ఞాతప్రపంచంలోకి ప్రవేశిస్తున్న అనుభవం కనిపిస్తున్నదనీ, ఆ సమయంలో తాను దర్శిస్తున్నదాన్ని మనతో పంచుకోడానికి ఆయనకి భాష చాల్లేదనీ రాసారామె.
తన యవ్వనంలోనూ, నడివయసులోనూ కవిగా టాగోర్ చూసిన, మనకు చూపించిన కాంతిమయలోకానికీ, ఆయన వృద్ధాప్యంలోకి అడుగుపెట్టాక గీసిన బొమ్మల్లోనూ, ఈ చివరి కవితల్లోనూ కనిపించే అంధకారబంధుర జగత్తుకీ సంబంధం లేదనిపిస్తుంది, చూడటానికి. కానీ మొదటిది దృశ్యజగత్తు అనీ, రెండోది అదృశ్య జగత్తు అనీ మనం గమనించగలిగితే, ఆయన తన జీవితకాలంలో రెండు లోకాల్నీ కూడా అంతే సత్యనిష్టతో, అంతే తదేకంగా పరికించాడనీ, ఆ రెండు జగత్తుల్లోనూ కూడా తాను త్రికరణశుద్ధితో పాల్గొన్నాడనీ మనం గ్రహించగలుగుతాం. అంతేకాదు, 1939-45 మధ్యకాలంలో ప్రపంచాన్ని చుట్టబెట్టిన రెండవప్రపంచ యుద్ధకాలంలో ఆయన చివరి సంవత్సరాలు గడిచాయని మనం గుర్తుచేసుకుంటే ఆ కవితల్లోనూ, ఆ చిత్రాల్లోనూ ఆ భీకర పార్శ్వం ఎందుకు కనిపిస్తున్నదో మనకు అర్థమవుతుంది. అందుకన్ ముల్క్ రాజ్ ఆనంద్ అన్నాడట: టాగోర్ లోని కవి ప్రపంచంలోని సామరస్యాన్ని చిత్రిస్తే, ఆయనలోని చిత్రకారుడు ప్రపంచంలోని వైమనస్యాన్ని చిత్రించేడు అని.
A Poet’s Death పేరిట తన అనువాదాల్ని వెలువరించిన దీపక్ మజుందార్, Poet’s death అనే పదాన్ని కీట్స్ నుంచి తెచ్చుకున్నాడు. After Dark Vapors have Oppressed our Plains (1817) సానెట్ లో కీట్స్ వాడిన పదప్రయోగం అది. కవి మరణం కూడా ఒక నిద్రిస్తున్న శిశువుశ్వాసతో సమానమైందిగా కీట్స్ ఆ కవితలో రాసాడు.
రమణమహర్షిని ఒకరు అడిగారట. నాకు కలలో కనిపిస్తున్నవారితో నడుస్తున్న సంభాషణల్ని మెలకువలో కనిపిస్తున్నవారితో కొనసాగించాలంటే వీలు కావడం లేదు. కాబట్టి కల నిజమని ఎలా అనగలను అని. రమణులు చెప్పారట. కలలో కనిపిస్తున్నవారితో సంభాషణలు కలలోనే కొనసాగించు. అలాగని ఈ మెలకువ కూడా శాశ్వతమైన మెలకువ అనుకోకు. ఈ మెలకువని దాటిన స్థితి మరొకటి ఉంది. అందులోకి మేల్కొన్నప్పుడు ఈ మెలకువ కూడా కలలాంటిదే అని గ్రహిస్తావు అని.
టాగోర్ తన జీవితకాలంపాటు తన కలల్నీ, మెలకువల్నీ మనతో పంచుకున్నాడు. కాని తన చివరి నాలుగు సంపుటాల కవితల్లోనూ, మెలకువకీ, ఆ మెలకువను దాటిన మరొక మెలకువకీ మధ్య సీమాంతరేఖ దగ్గరి తన కలవరాన్ని మనతో పంచుకున్నాడు. కాని ఆయనలోని విశిష్టాద్వైతి అప్పుడు కూడా బలంగానే ఉన్నాడు. ఎందుకంటే, ‘రూపసాగరంలో దూకి అరూప రత్నాన్ని కనుగొన్నాను’ అంటాడు గీతాంజలిలో. తన చివరికవితల్లో కూడా మళ్ళా రూపనారాయణుడి గురించే ప్రస్తావిస్తాడు.
రూపనారాయణుడు ఎంత గొప్ప పేరు! ఎంత గొప్ప దర్శనం! వివేకానందుడు దరిద్రనారాయణుడి గురించి మాట్లాడేడు. మహాత్ముడు సత్యనారాయణుడి గురించి మాట్లాడేడు. టాగోర్ తన జీవితమంతా, చివరికి మృత్యుసన్నిధిలో కూడా రూప నారాయణుడిగురించే మాట్లాడేడు.
జీవితాన్ని ప్రేమించడమంటే అది. సత్యాన్ని సౌందర్యంగా చిత్రించడమంటే అది. సాహసమంటే అది. సాఫల్యమంటే అది.
శేష్ లేఖ-11
రూప నారాయణ తీరం దగ్గర మేల్కొన్నప్పుడు
ఈ జగత్తు ఒక కల కాదని గ్రహించాను.
వేదనాపరంపరమధ్య
దుఃఖం వెనక దుఃఖంలో
రక్తలిపిలో రాసిన అక్షరాల్లో
నా ప్రతిబింబాన్నే దర్శించాను.
సత్యం చాలా కటువు.
ఆ కాఠిన్యాన్ని ఇష్టపడటం నేర్చుకున్నాను.
ఆయన ఎప్పటికీ మోసకారి కాడు.
అంతమూ, మరణమూ లేని దుఃఖాన్ని
ఆరాధిస్తూండటమే ఈ జీవితం.
సత్యం నానుంచి దాచిపెట్టిన విలువల్ని
అందుకోడానికి చేయి చాపుతూ
వాటికి నా మరణంతో మూల్యం చెల్లించగలగని
ఆశపడుతున్నాను.
(ఉదయన్, శాతినికేతన్, 13 మే 1941, తెల్లవారు జాము 3.15)
Featured image: Rabindranath Tagore, Untitled (West Bengal Landscape)
14-8-2024


వీటి గురించి ఎప్పుడూ విన్నట్టైనా లేదు. పుస్తకాలకు సంబంధించి మీకున్న అదృష్టం ఈ లోకంలో ఎవరికీ లేదు. Thank you very much ❤️
ధన్యవాదాలు మానసా!
Thank you very much for revealing lot of unknown information. You have done a great favour to the younger generation. A brief about each of the Books will be of great help to “busy” readers like us.
Thank you
కవి ప్రయాణం …మీరు ఎంత మంది కవుల గమనాన్ని చూసి వచ్చి మాకు చూపిస్తారో ఆశ్చర్యం. మీరు పుస్తకాలు చదివి మాకు కొన్ని వాక్యాలను అనుగ్రహిస్తారు.గరిటెడు గంగిపోవు పాలను సేవించి నేనూ పునీతమౌతాను.కృతజ్ఞతలు.
ధన్యవాదాలు మేడం!
ముందుగా బులుసు సరోజినీ దేవి గారికి అభివందనములు మీ చేత ఒక చక్కని పోస్టు పెట్టించడానికి కారణమైనందుకు. గీతాంజలి దగ్గరనే టాగోర్ ని కట్టి పడేసి , చరమకాలాన్ని విన్మరించిన తెలుగు సాహిత్య లోకపు లోపం ఇవాళ పూరించారు.
“అంతమూ, మరణమూ లేని దుఃఖాన్ని
ఆరాధిస్తూండటమే ఈ జీవితం.”
శేషలేఖ లోని వాక్యం “బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్ – ఆ బ్రతుకే నిశ్చలానందమోయ్ “ అన్న చరణానికి భూమిక కాకుండా ఉంటుందా .
You are an eternal educator నా మట్టుకైతే . ఉదయకాల వందనం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మీరొక్కటే చాలు నాకు
ఇంకే సాహిత్యకారుడి పరిచయము అక్కర్లేదు
అలా అంటే ఎలా సోమభూపాల్!
మీరు రాసేది చదవమని ముందుగా నన్ను పిలిచేది – మీ భాష, ఈ బ్లాగులో మీరు వాడే ఫాంట్.
లోపలికి అడుగుపెట్టి ఆకళింపు చేసుకున్న ప్రతి పాఠకుడినీ మరింత ఙ్ఞానవంతునిగా చేయగల మీ కుటీర ప్రవేశం ఎపుడూ ఆహ్లాదకరమే! ధన్యవాదాలు!
ధన్యవాదాలు మేడం!
కందు రంగుల్లో కందుబారిన జీవితాన్ని చిత్రించినట్లు ఉంది. విశ్వకవి రెండో పార్శ్వాన్ని చదివే భాగ్యాన్ని ఇచ్చారు
ధన్యవాదాలు సార్!
ధన్యవాదాలు విశ్వకవి చరమ సందేశాలను పరిచయం చేసినందుకు.
ధన్యవాదాలు సార్
మృత్యు సౌందర్యపు టనుభూతిని మీ తేనె తెనుగులో రుచి చూపించారు! టాగోర్ చివరి కవితలన్నింటినీ మీరే ఎందుకు అనువదించ కూడదు! సర్
అవును. చేయవచ్చు సార్!
ఆహా! ఇదంతా చదువుతూ ఉంటే ఒక పాట నన్ను వెంటాడింది.
కవిత్వం పట్ల, లోకం పట్ల , మనిషి లోపలి మనిషి పట్ల కూడా మీ చూపు , మీ మాటా ఒక కొత్త ప్రాపంచికమైన భాష. ఆ భాషలో ఒక లాలిత్యం ఉంటుంది. ఒక నూతనం, ఎప్పుడూ విననిది ఏదో ఉంటుంది. ఆ ధ్వని ఆహా అనిపిస్తుంది. ఇది పొగడ్త కాదు.ఇటువంటి మహోన్నతమైన వ్యక్తిని నేను కలుసుకున్నానా? అనే ఆశ్చర్యం.
ఒక పాట నన్ను వెంటాడింది అన్నాను కదా..
అది… ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట?
ఎంత పరిమళ మోయి ఈ తోట పూలు… అని.
మీరొక గంధపు తోట
నాలాంటి వారు అక్కడ తిరుగాడే జీవులం.
ఇక్కడ ఇంకోటి వినిపిస్తోంది నాకు.
మా అబ్బాయి గొంతు.
అమ్మా! ఇదుగో మన ఇంట్లో రెండు గంధపు చెట్లు. తాకి చూడు.అనే తీయని గొంతు.
ఆ ఇంటి తోట పూనా లో ఉన్న మా అబ్బాయి ఇల్లు.
మీకు నమస్సులు.
ధన్యవాదాలు
ఇదంతా చదువుతూ ఉంటే నాకొక పాట వినిపిస్తూనే ఉంది. ఒక మనిషిలో ఇంత పరిశీలనా, అవగాహన , మళ్ళీ దాన్ని అందంగా వర్ణించి చెప్పే అమోఘమైన శక్తి కి నా ఆనందోత్సాహాల ప్రణామం. మీరొక గంధపు తోట.
ఇది పొగడ్త కాదని మనవి చేసుకుంటున్నాను.
ఒక పాట అన్నాను కదా…
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట.
ఎంత పరిమళ మోయి ఈ తోట పూలు….
ఇంకో మధుర జ్ఞాపకం.
పూనా లో మా అబ్బాయి సంతోషం తో-
అమ్మా! ఇదుగో చూడు . మన ఇంట్లో రెండు గంధపు చెట్లు. అవిగో చూడు నెమళ్ళ విహారం.
అన్నప్పుడు నేను అనుకున్నాను.
అవును … ఇదంతా చినవీరభద్రుడి ఆలోచనల సవ్వడి అని.
నమస్సులు.
ధన్యవాదాలు
ఎప్పటి లాగే నాకెన్నో తెలియని విషయాలు.
“ మెలకువకీ, ఆ మెలకువను దాటిన మరొక మెలకువకీ మధ్య సీమాంతరేఖ దగ్గరి తన కలవరాన్ని మనతో పంచుకున్నాడు. “
“ రూపనారాయణుడు ఎంత గొప్ప పేరు! ఎంత గొప్ప దర్శనం! ”
“ సత్యాన్ని సౌందర్యంగా చిత్రించడమంటే అది”
ఏదో అర్థమయినట్లుంది, ఎంతో అర్థం కావాల్సివుంది. Thank you for this post, sir.
🙏🏽🙏🏽🙏🏽
ధన్యవాదాలు మాధవీ!
అంతము, మరణము లేని మీ చిరంజీవిలని (అక్షరాలని) చూసి మురిసి తరించిపోవడమే ఈ జీవితం 🙏
ధన్యవాదాలు సార్