
నా చిన్నప్పుడు
మా కర్రావు నేడో రేపో
ఈనుతుందనగా
మా అమ్మ
మనసు మనసులో ఉండేది కాదు
ఇంటిపనులు చేస్తుండేది
వండేది, వడ్డించేది
ఇంటికొచ్చినవాళ్ళని
పలకరించేది
అయినా ప్రతి ఒక్కరికీ తెలుస్తుండేది
ఆమె మనసు మనసులో లేదని.
ఆమె హృదయం కంపిస్తున్నదని
పక్కింటివాళ్ళకి కూడా తెలిసేది
ఇళ్ళల్లో పొయ్యి వెలిగించుకుంటూ
వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకునేవారు
ఆ కర్రావు ఎంతబాగా
చూడు కట్టిందీ అని.
పొద్దున్నే పొలానికి వెళ్ళిన
రైతులు కూడా
పని మధ్యలో
ఉన్నట్టుండి ఎవరో తమని
పలకరించినట్టు
చూపులు ఊరివైపు తిప్పేవారు,
ఈ పాటికి వాళ్ళింట్లో
కర్రావు ఈని ఉంటుందనుకునేవారు.
పొద్దుణ్ణుంచి చూస్తున్నాను-
వాన పడుతుందంటే
అదేమిటో
కోయిలకి కూడా
మనసు మనసులో లేదు.
15-7-2024


Brilliant!!!
ధన్యవాదాలు మానసా!
తొలకరి వానలా ఆహ్లాదంగా జున్నుపాల రుచిలా మధురంగా..
ధన్యవాదాలు సార్
బావుంది సార్..ఊహించలా మీ ఊహ..
ధన్యవాదాలు శ్రీనివాస్!
Wah beautiful sir.
చిన్ననాటి visuals కనులముందు replayed.
కర్రావు ఎప్పుడు ఈనుతుందోనని పల్లెలో ప్రతి ఇంట్లో discussions.
“ మా అమ్మ
మనసు మనసులో ఉండేది కాదు” – ఈ మాట నిజంగా ఎంత నిజం!! That anticipation and excitement is still fresh in the mind.
ఏ తెల్లవారు జామునో కర్రావు ఈనగానే ఊరంతా ఆ మాటే. నిద్ర లేవగానే బుజ్జి తువ్వాయి ని చూడటానికి పరుగులు. జున్ను పాల రుచులు.
ధన్యవాదాలు మాధవీ!
నమస్తే . . సృజన కూడా మాతృత్వం లాంటిదే కదా సార్
అవును కదా!
పల్లెల్లో పెరగకపోయినా… మా మేనత్త వాళ్ళ ఊరుని, వాళ్ళ ఆలమందను, ఆ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసారు. ఎంత అందమైనవి పల్లెటూళ్ళు! ప్రతి ఆవుకి, ఎద్దుకి, దూడలకి పేర్లుండేవి. అత్త పిలిస్తే ఎంచక్కా అందమైన కళ్ళతో, వాటి భాషలో పలికేవి. చెప్పుకుంటూ పోతే ఓ అద్భుత అనుభూతుల సమ్మేళనం💚💐
అవును ప్రసూనా!
ఎంత సున్నితమైన హృదయాల్ని కదిలించే అంశం. మనసు మనసు లో లేదు.
అమ్మగారి అంతరంగం లో ఆ నాటి నుంచి ఉన్న జీవన జ్ఞాపకం
ఋతువు మారి వాన వస్తోందంటే కోయిల కి మనసులో మనసు లేదని అంటుంటే అవాక్కాయిన నాకు స్మృతి పథం లో మా అమ్మ ని గుర్తు చేస్తోంది.
మా అన్నయ్య లేనప్పుడు… ఆమె కి ఆ కబుర్లు బుర్రలోకి ఎక్కలేదు. ఇక్కడ ఎవర్ని పడుకోబెట్టాడు? . మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? అన్నారు.
అప్పటికే మా తండ్రి గారు వెళ్లి 3 నెలలు అయింది.
వారు లేరనే కబురు విన్న ఆమె శరీరం మాత్రమే ఈ లోకం లో ఉండి…. కొడుకు పోయిన విషయం చూస్తున్నా తెలియలేదు.
ఈ లోకం లో మన మనసు పాడే సంగీతానికి , రాగానికి మూర్చన ఉండదు. ఫోటొచ్చిన సముద్రం లా అల్లకల్లోలం..
మీ భావవ్యక్తీకరణ కు జోహార్లు. ఈ కవితకు ఎన్నెన్నో హృద్యమైన జ్ఞాపకాలు అందరూ వెలికి తీసుకు…ఎంత సుకుమారులై ఉంటారు.
సుమాంజలి
ధన్యవాదాలు మేడం
మాకు కూడా మనసు మనసులో లేదు సార్
ధన్యవాదాలు గోపాల్! మీరు సున్నిత మనస్కులని తెలుసు నాకు.
తొలకరి వానలా ఆహ్లాదంగా జున్ను పాల రుచిలా మధురంగా…
చాలా సహజంగా ఉంది సర్
ధన్యవాదాలు చంద్రశేఖర్!
చూచి వద్దమమ్మ సుదతులార -పోతన వాక్యం చదివినప్పుడు కలిగిన అనుభూతి మళ్ళీ ఈ కవిత చదువుతుంటే కలిగింది సార్
ధన్యవాదాలు సార్
జున్నుపాల రుచి జుంటితేనియ తీపి
ధన్యవాదాలు