
అప్పుడు రోజూ అనుకునేవాణ్ణి
ఆ కొండవార, ఆ అడవిలో నును వెచ్చని
ఆకుపచ్చదనం
అల్లుకుంటూ ఉంటుందని.
ఇప్పుడు అవనినీ, ఆకాశాన్నీ
ఆక్రమించిన చల్లదనం.
మనుషుల్తోనూ, నగరంతోనూ
పనిలేకుండా చెట్లకీ, కోకిలకీ
మధ్య నడుస్తున్న సంభాషణ.
కొన్నాళ్ళు పక్షిగానూ, కొన్నేళ్ళు
సస్యంగానూ జీవించిన జ్ఞాపకాలతో
ఆ మాటల్ని గుర్తుపడుతున్నాను.
ఇన్నాళ్ళూ ఒక స్నేహంకోసం, ఒక స్పర్శకోసం
ఓదార్పుకోసం వెతుక్కుంటూ గడిపాను
ఇప్పుడు చాతకం నిద్రలేపి మరీ అడుగుతున్నది
ఆకాశవేదిక పైన సరికొత్త రూపకం మొదలయ్యింది
చూసావా అని.
మామూలు ప్రదర్శనల్లాగా
ఇది తెరతీసాక మొదలయ్యేది కాదు,
నల్లని మబ్బుతెర వెనక
ఆరని వెండివెలుగులో
ఏం నడుస్తుందో తెలియదు కానీ
మనసంతా ఒక పులకింత.
అర్థమయ్యింది:
నువ్వొక చాతకం కావాలేగానీ
ఏకంగా సముద్రమే
నిన్ను వెతుక్కుంటూ రాగలదు.
ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ఆరాధనీయులవుతారు
ఇప్పుడు చాతకం నా ఆదర్శం. ఏమి చేస్తే
నేనొక చాతకాన్నీ, చకోరాన్నీ కాగలనా
అన్నది ప్రస్తుతం నా తపస్సు.
9-6-2024


నా బాల్యం, కొంత యవ్వనం అడవుల్లో తిరుగాడుతూ గడవడం నా అదృష్టం. లేక పోతే అప్పటి వింత వెలుగుని ఇప్పుడు చూడడం సాధ్యం అయ్యేది కాదు. మీరెప్పుడూ మీ పాఠకుల్ని మీతో తీసుకుపోయే మహత్తు కలిగిన అక్షరాల్ని చాలా గమ్మత్తుగా రాసేస్తారు.
ధ్వని ప్రధానంగా ఉండే మీ మాటల వెనుక సవ్వడి అనూహ్యమైనది. ఇది పొగడ్త కాదు.
ప్రతి మనిషి తనకి కావాల్సినది వెతుక్కునే అన్వేషి. అదేదో అంతు చిక్కాక కళ్ళప్పగించి చూడడమే. ఆకాశం అందనిది.
అప్పుడు గ్రహిస్తాడు.
మనిషికి మనసు తోడు
మనసుకి ఊహ తోడు అని.
ఆనందం ప్రకటించేది కాదు అని తెలిసాక ఒక్కో మబ్బు ఎలా అయితే నీటిని ఒక్క చుక్క రాలకుండా ఎంత సమయం ఆపగలదో అది అనూహ్యం.
ఆ తరువాత కురిసేది వాన.
ఇంత చక్కని వాక్యాలు రాసిన మీ అంతరంగానికి జోహార్లు.
ధన్యవాదాలు మేడం
నువ్వొక చాతకం కావాలేగానీ
ఏకంగా సముద్రమే
నిన్ను వెతుక్కుంటూ రాగలదు.
ఎంత బాగా చెప్పారో. మీకు మరోలా కావచ్చు . మాలాంటి చాతకాలకు మీరే సాహిత్య సముద్రం
ధన్యవాదాలు సార్
చాలా బావుంది సార్
ధన్యవాదాలు గోపాల్!
ఈ ఉదయం మీ ఈ కవితే మిమ్మల్ని ప్రేమగా పలకరించిన చాతకం..
గొప్ప అనుభూతి కలిగిన కవితతో మీ ఈ ఉదయపు పలకరింపు బాగుంది సార్..
ధన్యవాదాలు
beautiful as usual, sir.
ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరు ఆరాధనీయులవుతారు.its true sir .
Thank you