శీలావీ శిల్పరేఖలు

శీలావీర్రాజు గారు సాహిత్యంలోనూ, చిత్రకళలోనూ చేసిన కృషిని స్మరించుకోటానికి శీలా సుభద్రాదేవిగారూ, వారి కుటుంబసభ్యులూ కలిసి ‘శీలావీ సాహిత్య చిత్రకళావేదిక’ ని ప్రారంభించారు. ఆ వేదిక తరఫున నిన్న శనివారం సాయంకాలం శీలావీర్రాజు రెండవ వర్ధంతి సభ రవీంద్రభారతిలో నిర్వహించారు. చిత్రకళలోనూ, సాహిత్యంలోనూ కృషి చేస్తున్న యువతరాన్ని శీలావీ వేదిక తరఫున ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రెండు అవార్డులు కూడా నెలకొల్పారు. వాటిలో సాహిత్య పురస్కారాన్ని పుప్పాల శ్రీరాం కూ, చిత్రకళా పురస్కారాన్ని అన్వర్ కూ అందించారు. శివారెడ్డిగారు అధ్యక్షత వహించిన ఆ సభలో ఎన్.గోపిగారు, నాళేశ్వరం శంకరం గారూ, పురస్కార గ్రహీతలూ కూడా పాల్గొన్నారు.

శీలా వీర్రాజు గారు ప్రసిద్ధ శిల్పకళాక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడి శిల్పాల్ని స్కెచ్ లుగా గీసుకున్నవాటిని ‘శీలావీ శిల్పరేఖలు’ పేరిట శీలావీ వేదిక వారు ఇప్పుడు వెలువరించారు. నిన్నటి సభలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించే గౌరవం నాకు దక్కింది. అది నా సుకృతం. నిన్న సభలో ఆ పుస్తకాలు తెరిచి సభికులకి చూపిస్తున్నప్పుడు నాకు గతంలో శివరాజు సుబ్బలక్ష్మిగారు కూడా బుచ్చిబాబు గారి నీటిరంగుల చిత్రాలతో వెలువరించిన పుస్తకాన్ని నాతో ఆవిష్కరింపచేయడం గుర్తొచ్చింది. ప్రత్యేకంగా ఒక పుస్తకం అంటూ వెలువరించకపోయినా, సంజీవదేవ్ గారి శతజయంతి సభలో నన్ను ప్రధాన ప్రసంగం చేయమని సంజీవదేవ్ గారి సతీమణి సులోచనగారు ఆహ్వానించడం కూడా గుర్తొచ్చింది. సంజీవ దేవ్, బుచ్చిబాబు, ఇప్పుడు శీలావీర్రాజు- ఇలా ముగ్గురు సాహిత్య-చిత్రకళా తపస్వుల స్మరణలో పాలుపంచుకునే అవకాశం లభించడం నా సుకృతం కాక మరేమిటి?

వీర్రాజు గారి వర్ణచిత్రాలు నేనింతకుముందు చూసి ఉన్నాను. ఆయన వాటిని రాజమండ్రిలో దామెర్ల రామారావు చిత్రకళా గాలరీకి కానుక చేసినప్పుడు కూడా ఆ గాలరీ ప్రారంభోత్సవం కూడా నా చేతులమీదనే చేయించారు. కాని ఆయన గీసిన ఇన్ని ఇంకు స్కెచ్ లని ఒక్కచోట చూడటం ఇదే మొదటిసారి. అసలు ముందు ఆ ముఖచిత్రం దగ్గరే నేను చాలాసేపు ఆగిపోయాను. ఎంత రొమాంటిక్ గా ఉంది ఆ ఫొటో! లేపాక్షి శిల్పమంటపంలో కూచుని స్కెచ్ బుక్కు తెరిచిపెట్టుకుని ఒక బొమ్మ గియ్యడానికి ఉద్యుక్తుడవుతూ తన ఎదట ఉన్న శిల్పాన్ని పరికిస్తున్న్న ఆ చిత్రకారుణ్ణి చూసి ఏ కళాకారుడు మోహపడడు కనుక! నిజంగా అది అదృష్టం. అలా ఒక శిల్పక్షేత్రానికి పోయి మరేమీ పట్టకుండా అక్కడి శిల్పాన్ని స్కెచ్చులుగా గీసుకునే భాగ్యం కలిగిన చిత్రకారుడు ఆ అదృష్టం కోసం మళ్ళీ మళ్ళీ ఎన్ని జన్మలేనా ఎత్తడానికి సిద్ధపడతాడు.

రెంబ్రాంట్ చిత్రించిన The Jewish Bride చిత్రలేఖనాన్ని అమస్టర్ డామ్ మూజియంలో చూసినప్పుడు వాన్ గో రాసుకున్నాడు: ఎవరేనా తినడానికి ఇంత రొట్టె చేతుల్లో పెడితే, కేవలం ఆ చిత్రలేఖనాన్ని చూస్తూనే ఆరునెలలు గడపగలనని.

ఈ పుస్తకంలో ఒక్క లేపాక్షి మాత్రమే కాదు, అజంతా, ఎల్లోరా, రామప్ప, కోణార్క్ దేవాలయాల ప్రాంగణాల చిత్రలేఖనాలు కూడా వున్నాయి. వాటితో పాటు శ్రీశైలం, సోమేశ్వర ఆలయం, ఉండవల్లి గుహలు, భువనేశ్వరంలోని లింగరాజ మందిరం, శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణు ఆలయాలతో పాటు అమరావతి, గోల్కొండ చిత్రలేఖనాలు కూడా ఉన్నాయి. ఇన్ని శిల్పమంటపాల, దేవాలయాల స్కెచ్ లని ఇలా ఒక్కచోట అందించిన చిత్రకారుడు నాకు తెలిసి తెలుగువాళ్ళల్లో శీలావీర్రాజు ఒక్కరేనేమో!

ఈ స్కెచ్ లలో లేపాక్షి, రామప్ప శిల్పాల లేఖనాలు మరీ ప్రత్యేకంగా ఉన్నాయి. లేపాక్షిలో బొమ్మలు గీసుకోడానికి తనకి నాలుగు రోజులు మాత్రమే అవకాశం ఉండిందని వీర్రాజుగారు రాసుకున్నారుగాని, కనీసం నెలరోజుల పాటు దగ్గరగా పరికించి అధ్యయనం చేస్తే తప్ప కనిపించని సూక్ష్మవిశేషాల్ని కూడా ఆయన తన చిత్రలేఖనాల్లో పొందుపరచడం అబ్బురమనిపిస్తుంది. కెమేరా సహాయం లేకుండా, క్షేత్రస్థాయిలోనే, చూస్తున్నవాటిని చూస్తున్నట్టుగా అంత డిటెయిలింగ్ తో గియ్యడం మామూలు విషయం కాదు. ఏ ఒక్క శిల్పంలోనూ భంగిమపరంగాగాని, లేదా ప్రమాణాల ప్రకారంగాని నిర్దుష్టత కొరవడలేదు. ప్రతి ఒక్క శిల్పంలోనూ గాంభీర్యానికీ, రాజసానికీ ఆయన మరొక మారు ప్రాణం పోసారు.

కొన్ని చిత్రలేఖనాలు కేవలం ఇంకులో చిత్రించిన లైన్ అండ్ వాష్ స్కెచ్ లు మాత్రమే అయినప్పటికీ, ఆ కట్టడాల చుట్టూ ఉండే ఒక అలౌకిక వాతావరణాన్ని చిత్రకారుడు అద్భుతంగా పట్టుకోగలిగేడు. ముఖ్యంగా ఆ లేపాక్షి నంది. ‘లేపాక్షి బసవయ్య లేచిరావయ్యా’ అని ఆలపించిన బాపిరాజు గారు కూడా చిత్రకారుడే అయినప్పటికీ, ఆ నందీశ్వరుణ్ణి బొమ్మగా భద్రపరిచే అవకాశాన్ని వీర్రాజు గారికోసం వదిలిపెట్టేరేమో అనుకోవాలి.

తెలుగులో చిత్రకళకి సంబంధించిన ప్రశంసగాని, విమర్శగాని దాదాపుగా మృగ్యం. ఇప్పుడు రాస్తున్నవాళ్లల్లో గణేశ్వరరావుగారు, అన్వర్, ఎల్.ఆర్.వెంకటరమణ, మాకినీడి సూర్యభాస్కర్ లాంటి వాళ్ళు ఏ ముగ్గురు నలుగురో మాత్రమే ఉన్నారు. వారు కూడా సోషల్ మీడియాలో రాసే వ్యాసాలు తప్ప పుస్తకాలుగా వెలువరిస్తున్నది కూడా చాలా తక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో శీల్లావీర్రాజు గారు ఎప్పుడో యాభై ఏళ్ళకిందట 1968 లో గీసుకున్న స్కెచ్ ల్ని ఇలా పుస్తక రూపంలో వెలువరించడం శీలావీ వేదిక వారి ఔదార్యం అని చెప్పాలి. తెలుగువాళ్ళు ఒక జాతిగా ఇటువంటి ఔదార్యాన్ని స్వీకరించడానికి ఎంతవరకూ అర్హులో నాకైతే ఇంకా నమ్మకం కలగడం లేదు.

కాని నిన్న రవీంద్రభారతి సమావేశమందిరం కిక్కిరిసిపోవడం మాత్రం నాకు చాలా సంతోషం కలిగించింది. తెలుగు చిత్రకారుల్లో అగ్రశ్రేణికి చెందిన బి.ఏ.రెడ్డిగారు కూడా ఆ సభికుల్లో ఉండటం వీర్రాజు గారికి గొప్ప నివాళి అనిపించింది.

లేపాక్షి, రామప్ప శిల్పాల్ని తీర్చిదిద్దిన ఆ శిల్పులెవరో వాళ్ళ పేర్లేవీ మనకు తెలియదు. కానీ ఆ విస్మృత శిల్పులు తమ పేరుమిగుల్చుకోకుండా తమ కృషిని మాత్రం మనకు శాశ్వతంగా వదిలిపెట్టి వెళ్ళారు. ఇప్పుడు శీలావీర్రాజుగారి ఈ చిత్రలేఖనాలు చూస్తుంటే నాకు ఆ శిల్పులే మనసులో మెదిలారు. నిజమైన కళాకారులంటే వారు, కళా తపస్వులంటే వారు. ఆ శిల్పులు తమ శిల్పాల్ని కానుక చేసినట్లే శీలా వీర్రాజు గారు కూడా ఆ శిల్పాల చిత్రలేఖనాన్ని కూడా మనకి ఆస్తిగా వదిలిపెట్టి వెళ్లారు. ఇప్పుడు ఆ శిల్పాలతో పాటు ఆ చిత్రలేఖనాలకు కూడా మనం అయాచితులుగా వారసులం కాగలిగేం అని నాకు నేను మరో మారు చెప్పుకున్నాను.

2-6-2024

16 Replies to “శీలావీ శిల్పరేఖలు”

  1. మంచి పుస్తకాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్. సంజీవదేవ్ గారి శతజయంతి తెనాలిలో జరిగినప్పుడు మీరు చేసిన ఉపన్యాసం నాకు గుర్తుంది. నేనిప్పటివరకూ విన్న మంచి ఉపన్యాసాల్లో ఆనాటి మీ ఉపన్యాసం ఒకటని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను.

  2. అమేయ చిత్రకారుడు శీలా వీర్రాజు గారు 🙏💐

  3. శీలావీ శిల్పరేఖలు పుస్తక ఆవిష్కరణ సంగతులు, అందలి చిత్రాల గురించి బాగా వివరించారు. నేను కార్యక్రమానికి రాలేకపోయారు. థాంక్స్ సర్

  4. ఆ పుస్తకం కావాలి సార్ 🙏
    అడ్రస్ ప్లీజ్ sir

      1. ARKAL SHAIKSHAVALI
        H.No.4/2,Near sivalayam temple,New Peta, PATTIKONDA 518380
        KURNOOL DISTRICT
        AP
        9948678786

  5. ఆ రోజు మీ ఉపన్యాసం వినే భాగ్యం నాకు కలిగింది. మిమ్మల్ని చూడటానికి ,  మీ ఉపన్యాసం వింటానికే నేను ఆ రోజు వచ్చానంటే అతిశయోక్తి కాదు. మీరు ‘నా కుటీరం’లో మాతో పంచుకునే ‘అమృత గుళికలు ‘ చదువుతున్నా నాకు అవి మీరు చెబుతుంటే వినడం ఇంకా  ఆనందకరం. శిలా వీర్రాజు గారి చిత్రకారీయం, కుంచెముద్రలు పుస్తకాలలో శిల్ప రేఖాచిత్రాలు కొన్ని వున్నా , వాటి నన్నింటినీ యిలా ఒకచోట చేర్చి యివ్వడం నిజంగా చిత్రకారులకు ఒక మంచి ‘గైడ్ బుక్ ‘. నాకూ గుడులకు వెళ్ళినపుడు కూర్చొని స్కెచ్ చేయటం అలవాటు. అయితే కొన్ని రేఖలలోనే శిల్పాన్ని పట్టుకోవడంలో నాకు ఇంకా పట్టు దొరకలేదు. వీరి పుస్తకం కొని చూస్తున్నకొద్దీ ఆయనే దగ్గరుండి ఇలా వేయి అని చెబుతున్నట్లనిపించింది. ఆ రోజు రెండు  పుస్తకాలు   తీసుకున్నాను. నా మిత్రునికి ఇవ్వడానికి ఒకటి. నిజమే ఆ రోజు సభ నిండుగా రచయితలూ, చిత్రకారులు వున్నారు. నేను ఇంతకూ మునుపు చాలాసార్లు వెళ్లాను గాని సభ నిండుగా చూడటం ఇదే మొదటిసారి. అది నిస్సందేహంగా శిలావీర్రాజు గారి గొప్పదనం. ఒక కళాకారుడికి మనం ఇచ్ఛే గౌరవం.    

  6. సాహిత్య-చిత్రకళా తపస్వుల స్మరణలో పాలుపంచుకునే అవకాశం లభించడం నా సుకృతం కాక మరేమిటి?
    మీరు మాకు చెప్పడం మా సుకృతం కదా? లేకపోతే మీకు ఆసక్తి కరమైన ఒక సంగతి సున్నితంగా చెప్తుంటే నాలాంటి వారికి చిత్ర, శిల్ప కళల గురించి వినే అదృష్టం కలిగేదా? ధన్యోస్మి

  7. మనసును హత్తుకునే మాటలు శ్రీ శీలా వీర్రాజు గారి గురించి, వారి చిత్రలేఖనం గురించి. 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading