
కిందటేడాది సాయి పాపినేని గారి ఇంట్లో కలిసినప్పుడు బి. పి. పడాల గారు నన్ను నాలుగు బొమ్మలు వేసిమ్మని అడిగారు. నాలుగూ నాలుగు ఋతువులమీద చిత్రించమని అడిగారు. నన్నెవరూ అలా ఒక ఇతివృత్తం ఇచ్చి బొమ్మలు గియ్యమని అడగలేదు. ఎవరేనా కవి లేదా రచయిత తన పుస్తకం మీద మాట్లాడమనో లేదా సమీక్ష చెయ్యమనో అడిగిన తొలిరోజుల్లో ఎలాంటి ఆత్మ విశ్వాసం కలిగేదో, ఆయన నన్ను బొమ్మలు వేసిమ్మని అడిగినప్పుడు కూడా అటువంటి ఎక్సైట్ మెంట్ నే కలిగింది.
కాని ఏడాది పట్టింది. ఆ నాలుగు ఋతువులూ, వసంతం, వేసవి, వర్షాకాలం, శీతాకాలం- నేను చూసిన ఏ దృశ్యాల్లోంచి ఏరి తెచ్చుకోవాలో తేల్చుకోలేక కొంతకాలం గడిచిపోయింది. ఇక ఎవరేనా నిన్ను బొమ్మలు వేసిమ్మన్నారంటే దాని అర్థం నువ్వింక ఎమెచ్యూర్ వి కావన్నమాట. కాని అందుకు తగ్గట్టుగా నా కౌశల్యం కూడా మెరుగుపడాలి కదా. అందుకని సాధన చేస్తోనే ఉన్నాను, ఇన్నాళ్ళూ. తీరా ఈ ఒక్కొక్క బొమ్మా వెయ్యడానికి ఒక్కోరోజు కంటే ఎక్కువ పట్టలేదనుకోండి.
నాలుగు దృశ్యాలు, నాలుగు స్థలాలు. వసంత ఋతువు రాబోతున్న దృశ్యం చిట్వేలునుంచి రాపూరు వెళ్తున్నప్పుడు ఒక మార్చిమొదటివారంలో చూసిన దృశ్యం. వేసవి అంటే ఏ దృశ్యాన్ని ఎంచుకోవాలి? నాకైతే తురాయిపూలే వేసవి ప్రతినిధులు. నిండుగా పూసిన ఈ తురాయిచెట్టు పాడేరు నుంచి అరకు వెళ్ళే దారిలో చాపరాయి దగ్గర కనబడ్డది. ఇక వానాకాలం కొండమీంచి వానపడే దృశ్యం మా ఊళ్ళో కురిసిన వాన. శీతాకాలానికి సంబంధించి చాలా దృశ్యాలున్నాయి. కాని ఈ ఏడాది మాఘమాసంలో మహబూబ్ నగర్ అడవుల్లో చూసిన దృశ్యమే నాకు ఎక్కువ గంభీరంగా తోచింది.
ఫేస్ బుక్ లో Watercolor Impressionist అని ఒక గ్రూపు ఉంది. అంతర్జాతీయంగా చాలామంది చిత్రకారులు అక్కడ తమ బొమ్మలు పోస్టు చేస్తూ ఉంటారు. ఈ బొమ్మల్ని కూడా అక్కడ పోస్టు చేస్తే ఆ గ్రూపు అడ్మిట్ చేసుకున్నారు. కాబట్టి, ధైర్యంగా, ఈ బొమ్మలు పడాల గారికి అందిస్తున్నాను.

Spring, On the way from Chitwel to Rapur, 9″ X 12″, Arches, Cold pressed

Summer, On the way from Paderu to Araku, Arches, Cold pressed, 9″ x 12″

Rain in my village, Arches, Cold pressed, 9″ x 12″

Winter, In the forests of Palamur, Arches Cold pressed, 9″ x 12″
3-10-2023


పొద్దున్నే ఇంత అందమైన బొమ్మలు …
మనసుకు ఎంత ప్రశాంతంగా ఉందో
ధన్యవాదాలు మేడం
బావున్నాయి సార్
ధన్యవాదాలు గోపాల్
🙏నాలుగుకాలాల పాటు నిలిచే బొమ్మలు
ధన్యవాదాలు సార్
అద్భుతం గా ఉన్నాయన్నీ.! ఫ్రేమ్ కట్టించి ఆయా రుతువుల లో డ్రాయింగ్ రూమ్ లో పెట్టుకుంటే ఎంత బాగుంటుందో.
ధన్యవాదాలు మేడం
అయిదవది కూడా అంతే అందంగా వుంది. నీలం రంగు బాగుంది
ధన్యవాదాలు
Excellent sir. 💐
ధన్యవాదాలు
చాలా బాగా చిత్రీకరించారు. అభినందనలు.
ధన్యవాదాలు