
రెండు వేల చదరపు కిలోమీటర్ల
నగరంలో రెండున్నర వీథులు:
ఒక మానవమహేతిహాసంలో
నేను పునః పునః పఠించేదింతే.
సూర్యరథచక్రపు అంచు ఈ వీథికి
రాచుకున్నప్పుడల్లా ఒక గలగల.
రాలిపడుతున్న ప్రతి ఒక్క ఎండుటాకూ
గతాన్నెలా వదిలి పెట్టాలో చెప్తుంది.
మొన్న పారిజాతాలు, నిన్న డిసెంబరాలు
నేడు ఫాల్గుణ మాసపు వెన్నెల-
సగం జీవితం మట్టిగా మారిపోతుండగా
మిగిలిన సగం పరిమళతుల్యం.
ఇన్నాళ్ళూ తలపులు సంకల్పాలుగా
మారే తావుల్లో నన్ను నేను
నిగ్రహించుకుంటూ, ఓడిపోతూ
స్వర్గనరకాల మధ్య ఊగిసలాడేను.
ఇప్పటికి తెలిసింది: తలపులు పుట్టే
తావుకన్నా ముందొక తావుంటుందని.
ఈ ఊరు వదిలి, ఈ వీథివదిలి
నెమ్మదిగా అటువైపు అడుగులేస్తున్నాను.
26-2-2026


“రాలిపడుతున్న ప్రతి ఒక్క ఎండుటాకూ
గతాన్నెలా వదిలి పెట్టాలో చెప్తుంది”. ఈ ఒక్క వాక్యంలో ఎంత లోతైన భావం దాగి ఉందో. The Art Of Unlearning లేదా తద్వారా మిగిలే ప్రజ్ఞానం బ్రహ్మ అనే గ్రంథాలు రాసేంత.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఆహా
ధన్యవాదాలు మేడం!
గురువుగారు.. ఈ త్రిశంకు స్వర్గంలో ఆ తావు? మాకు కూడా చెప్పండి 🙏🏻
హృదయపూర్వక నమస్కారాలు.
Excellent poem sir. It’s a great meaningful painting of words .
ధన్యవాదాలు సార్!