
(నిన్న సాయంకాలం సుర్ మండల్ వారు ఏర్పాటు చేసిన ఉత్తర్-దక్షిణ్ సంగీతసమారోహంలో జయతీర్థ్ మేవుండి, శశాంక్ సుబ్రహ్మణ్యంల జుగల్ బందీ విన్నాక)
మొదట వారిద్దరూ
ఒక సరసు ఒడ్డున కనిపించారు
నీలి సరోవరంలో
అకుపచ్చనీడలమధ్య
లలితంగా అడుగులేస్తున్న
గాలిపాదాల చుట్టూ కాంతివలయాలు-
ఆ మెత్తని అడుగుల చప్పుడు
కన్నార్పకుండా చూస్తుండిపోయారు
వారిద్దరూ-
కొంతసేపు.
ఇంతలో తమనెవరో
పరిమళపు నెమలీకతో తాకగానే
ఏదో గుర్తొచ్చినట్టు లేచి
ఒక జలపాతం బాటపట్టారు.
ఆ జలపాతం కిందనిలబడ్డాక
వారి సంచలనం ఏమని చెప్పను!
తమమీంచి ప్రవహించిపోతున్న
నిర్విరామజలధారల్ని
ఒళ్ళంతా బాహువులై మరీ
బంధించాలని చూసారు
అక్కడ ఎవరుంటే వారిమీద
ఇన్ని నీళ్ళు చిలకరిస్తూనే ఉన్నారు.
ఇప్పుడు వారొక సముద్రం
ముంగిట నిలుచున్నారు.
జీవనవ్రత సాఫల్యసూచక శంఖధ్వనిలాగా
సంధ్యకాంతి.
అప్పుడు తమ పూర్వీకులు తమకి
ధారాదత్తం చేసిందంతా
ఇన్నేళ్ళుగా తాము కూడబెట్టుకున్నదంతా
అక్కడెవరుంటే వారికి పంచేశారు.
కచేరీ పూర్తయిందన్నారెవరో
కానీ వారిద్దరూ ఎక్కడ?
అంతదాకా అక్కడ ఉన్నవారెక్కడ!
15-2-2026


“నిజమే” ఇది జుగల్బందీ!
సంగీతం, సాహిత్యం రెండూ……
బందీలు!
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా!
ఎన్ని సార్లు చదివానో… అంత చక్కని మధుర గానం వింటూ మైమరపించే మనసు ఈ లోకం లో ఎక్కడుంటుంది? ఎంత బాగా చెప్పారు. నమోనమః
ధన్యవాదాలు మేడం!
సంగీత సాహిత్య జలపాతం
ప్రేక్షకాభిరుచి రసమయం
ధన్యవాదాలు ప్రసూనా!
ఆ జలపాతం కింద ఇప్పుడు నేనూ..
ధన్యవాదాలు మానసా!