కవిత పూర్తవుతుంది

హేమంత ఋతుసంధ్యాసమయాన
ధూపం వేసినట్టు మామిడిపూత.

రోజూ నడిచే వీథుల్లోనే ఈసారి
కలలో నడిచినట్టు నడుస్తాను.

దినమల్లా పాటలు పాడిన గొబ్బిపూలు
దినాంతానికి మూగబోతాయి.

ఆదివారం పూట పార్కు చేసిన కార్లు
ఆకులు రాలిన చెట్లలాగా ఉంటాయి.

చప్పుడు చెయ్యకుండా ప్రవహించే
సంజకాంతిలో గాలం వేసి కూచుంటాను.

ఆ వేళప్పుడు నాతో పాటు నా పక్కనే
మరొకరు కూచున్నట్టు తెలుస్తుంటుంది.

నా శబ్దాన్ని అతనికిచ్చి అతని నిశ్శబ్దం
నేను తీసుకోడంతో కవిత పూర్తవుతుంది.

19-1-2026

10 Replies to “కవిత పూర్తవుతుంది”

  1. వహ్వా… ఆఖరి వాక్యాలు కళ్ళ ల్లో నిలిచిపోయి నిశ్శబ్దం గా చూస్తున్నాయి. కొంత ఆశ్చర్యం కూడా. నమోనమః

  2. చివరి చరణం ఆధునికతను సంతరించుకున్న టాగోరు కవిత్వమైంది . ఆయనది గీతాంజలి . మీది కవితాంజలి .

  3. అద్భుతం సార్… నన్ను నేను చాన్నా ళ్ల తరువాత మర్చిపోయాను 💐

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading