టి.ఎల్. కాంతారావు స్మరణలో

అది 1978 లోనే అని గుర్తు. అప్పుడే పదో తరగతి పూర్తయి ఇంటర్మీడియేటు ఫస్టియరులో ఇంకా చేరానో లేదా ఇంకా వేసవి సెలవులల్లోనే ఉన్నానో గుర్తు లేదు. అప్పుడు కాకినాడలో అరసం సభలు జరిగాయి. ఆ సభలకు మా అక్కతో పాటు నేను కూడా వెళ్ళాను. ఆ రోజు పొద్దున్న మేం వెళ్ళేటప్పటికి వేదిక మీద ఒక వక్త నిప్పులు చెరుగుతున్నాడు. అంత భావోద్వేగంతో ఆయన మాట్లాడుతున్నదేమిటో అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాను. అది గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన కవిసేన మానిఫెస్టో మీద విమర్శ అని గుర్తుంది. అంతకన్నా కూడా ఆ వక్త తన ప్రసంగం ముగిస్తూ ‘తాంబూలాలిచ్చేసాను, తన్నుకు చావండి’ అని అనడం మరింత గుర్తుంది. ప్రసంగం పూర్తవుతూనే ఆ వక్త స్టేజి దిగి కిందకు రాగానే జగన్నాధరావు గారు ఆయన్ని మాకు పరిచయం చేసారు.

టి.ఎల్. కాంతారావుగారిని మొదటిసారి చూసిన క్షణం అది.

అప్పటిదాకా కాంతారావు కత్తియుద్ధాలు మాత్రమే నోరువెళ్ళబట్టి చూసే నేను ఆ రోజు ఈ సరికొత్త టి.ఎల్.కాంతారావుని కూడా నోరువెళ్ళబెట్టి చూసాను. ఆ మీటింగైపోగానే జగన్నాధరావుగారు ఆయన్ని మా అక్క ఇంటికి తీసుకొచ్చారు. ఆ మధ్యాహ్నం ఆయన మాతో కలిసి భోంచేసినట్టు గుర్తు. ఆ తర్వాత మాటలమధ్యలో, నేను కూడా కవితలు రాస్తున్నానని జగన్నాధరావుగారు ఆయనతో చెప్తే, ‘ఏవీ, మీ కవితలు వినిపించండి’ అని అడిగారాయన. నేను మొహమాటపడుతూనే అప్పుడప్పుడే రాస్తూ ఉన్న నాలుగైదు కవితలు వినిపించగానే, ఆయన ‘ఈ కవితలు నాకివ్వగలరా? నేను మరింత లోతుగా చదవాలి వీటిని’ అన్నారాయన. వాటినట్లానే ఆయన చేతుల్లో పెట్టేసాను.

అక్కడితో ఆ విషయం మర్చిపోయేను. కాని ఆయన ఆ కవితలు తీసుకునివెళ్ళి మోహన ప్రసాద్ కి ఇచ్చారనీ, మో, వాటిని చూసి ముచ్చటపడి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారికి చూపించమన్నారనీ, పురాణం వారు వాటిని ఎమ్వీయల్ కి ఇచ్చారనీ తెలిసింది. చివరకి ఒకనాడు వాటిల్లోంచి ఒక కవిత తీసుకుని, నా ఫొటోతో చిన్న పరిచయం ఒకటి, ఎమ్వీయల్ తన ‘యువజ్యోతి’ పేజీలో ప్రచురించారు. (ఆ మధ్య రమణమూర్తి ఆ కటింగు నాకు భద్రంగా పంపించారు. దాదాపు యాభై ఏళ్ళకిందటి ముచ్చట అది!)

ఆ తర్వాత ఇంటరు ఫస్టియరులో ఉండగా, ఒక సారి సెలవులకు వచ్చినప్పుడు, తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ పుస్తకం చదువుతూ, మా అక్కని ‘అమృతం కురిసిన రాత్రి’ అంటే ఏమిటని అడిగాను. మా అక్క ‘అదుగో, ఆ కాంతారావుగారి రాసిన పుస్తకంలో వివరంగా రాసారు చదువు’ అని తన పుస్తకాల అలమారులో ఓ పుస్తకం చూపించింది.

‘కవితావలోకనం'(1976).

ఆ తర్వాత రెండుమూడేళ్ళ పాటు ఆ పుస్తకం నాకొక పాఠ్యగ్రంథంలానూ, గైడులానూ కూడా, నిత్యపారాయణ గ్రంథంగా ఉండేది. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వాన్నీ, అభ్యుదయ కవిత్వాన్నీ అర్థం చేసుకోడానికి డా.నారాయణరెడ్డి రాసిన ‘ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగాలు’ పుస్తకం నాకెంత దారిచూపించిందో, అభ్యుదయానంతర తెలుగు వచనకవిత్వాన్ని అర్థం చేసుకోడానికి కాంతారావుగారి పుస్తకం అంతగా దారిచూపించిందని చెప్పడానికి నాకు సంకోచం లేదు.

డెబ్భైల చివరలో, ఇంకా చెప్పాలంటే, 1976 తర్వాత, తెలుగు కవిత్వంలో విప్లవసాహిత్యశిబిరం ఒకవైపూ, ఇస్మాయిల్, శేషేంద్ర, శ్రికాంతశర్మ వంటి వారు మరొక వైపూ ఉండేవారు. ఆ రోజుల్లో చెప్పుకోదగ్గ సాహిత్యవిమర్శకులు త్రిపురనేని మధుసూధన్రావు, కె.వి.రమణారెడ్డి వంటివారు వామపక్ష శిబిరంలో ఉండగా, ఆర్.ఎస్.సుదర్శనం, వెల్చేరు నారాయణరావు వంటివారు మరింత లోతైన సాహిత్యనిష్కర్ష చేస్తూండేవారు. ఆ రెండు కొనలవైపూ పూర్తిగా మొగ్గలేక, కానీ, సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనుకునే, నాబోటి సాహిత్యవిద్యార్థులకు, టి.ఎల్.కాంతారావు, కె.రామ్మోహన రాయిల వ్యాసాలు, సమీక్షలు చాలా ఊరటగా ఉండేవి.

అందులోనూ రామ్మోహనరాయ్ రచనలు చాలావరకూ సమీక్షల స్థాయిలోనే నిలబడిపోగా, కాంతారావుగారి వ్యాసాలు మరింతలోతుగా, మరింత భావోద్వేగభరితంగా, మరింత ఆకట్టుకునేవిగా ఉండేవి.

ఆ విధంగా కాంతారావుగార్ని నా సాహిత్యగురువుల్లో ఒకరిగా, ముఖ్యంగా ఆధునిక వచనకవిత్వానికి సంబంధించి, నా అవగాహనను బలోపేతం చేసిన గురువుగా గుర్తుపెట్టుకున్నాను. కాని, ఇరవయ్యవ శతాబ్దపు కీలకమైన ఒక దశలో తెలుగు కవిత్వమే శ్వాసగా జీవించిన, అటువంటి విమర్శకుడి గురించి ప్రస్తుత తరానికి తెలియవలసినంతగా తెలియలేదనీ, ఆయన రచనలు కూడా అందుబాటులో లేవనీ అనుకుంటూ ఉండేవాణ్ణి.

అందుకనే ఆ మధ్య మానస చామర్తి నాకు ఫోను చేసి కాంతారావుగారు తనకు వరసకు పెదనాన్నగారు అవుతారనీ, వారి పిల్లలు ఆయన రచనల్ని పునర్ముద్రిస్తున్నారనీ, అంతేకాక, ఆయన పేరుమీద లక్ష రూపాయల పురస్కారం కూడా ఒకటి నెలకొల్పుతున్నారనీ చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది.

అన్నట్టుగానే 2025 కు గాను టి.ఎల్.కాంతారావు పురస్కారాన్ని సాహిత్యవిమర్శకుగాను మృణాళినిగారికి, కొత్తగొంతుకల తరఫున నందకిశోర్ కీ ప్రకటించారు. రవీంద్రభారతి మినీ కాన్ఫరెన్సు హాల్లో, మొన్న శనివారం, జరిగిన ఆ సభను నిర్వహించే బాధ్యత నాకు అప్పగించారు. సభాప్రారంభంలోనే మానస టి.ఎల్.కాంతారావుగారి జీవితవిశేషాల్నీ, సాహిత్యవిమర్శలో ఆయన నెలకొల్పిన ప్రమాణాల్నీ వివరిస్తూ కీలక ప్రసంగం చేసారు. టి.ఎల్.కాంతారావుగారి సమగ్ర సాహిత్యం రెండు సంపుటాలు (మొత్తం 1120 పేజీలు) వి.రాజారామ్మోహన రావు ఆవిష్కరించేరు.

కాంతారావుగారికి ఎంతో ఆత్మీయులైన భమిడిపాటి జగన్నాథరావుగారికి ఎంతో ఆత్మీయుడైన రాజా చేతుల మీదుగా ఆ పుస్తకాలు ఆవిష్కారమైనందుకు కాంతారావుగారు చాలా సంతోషించి ఉంటారు. పురస్కార స్వీకర్తలైన మృణాళినిగారి సాహిత్యవిమర్శలోని బహుపార్శ్వాలను సీతారాం ఎంతో సమగ్రంగా పరిచయం చేయగా, నందకిశోర్ కవిత్వ ప్రయాణాన్ని కోడూరి విజయకుమార్ చాలా సున్నితంగా వివరించేరు. కాంతారావువారు నిడుమోలు హైస్కూల్లో పనిచేసినప్పుడు ఆయన దగ్గర చదువుకున్న డా.సమ్మెట నాగమల్లీశ్వరరావు కూడా తమ జ్ఞాపకాలు పంచుకున్నారు.

కాంతారావుగారి శ్రీమతి అమలగారూ, వారి పెద్దమ్మాయి తలగడదీవి శైలజగారూ పురస్కార స్వీకర్తల్నీ, వక్తల్నీ సన్మానించేరు. కాంతారావుగారి తరఫున వారి శ్రీమతి అమలగారిని అక్కడున్నవారంతా ఎంతో సంతోషంగా సన్మానించుకున్నారు.

సమగ్ర సంపుటాలు నా చేతుల్లోకి రాగానే నేను చేసిన మొదటి పని, కవితావలోకనం ఎక్కడుందా అని వెతుక్కుని, అందులో తిలక్ వ్యాసం గబగబా చదివేయడం. ఒకప్పుడు మనకు దారిచూపిన ఉపాధ్యాయులు, చిన్నప్పుడు మనల్ని విభ్రాంతపరిచినప్పటికీ, మనం కాలక్రమంలో చాలా దూరం ప్రయాణించి ఉంటాం కాబట్టి, ఈ రోజు మళ్ళా అప్పటిలాగా విభ్రాంతికి గురిచెయ్యకపోవచ్చు. కాని కవితావలోకనం వ్యాసాలకు అటువంటి కాలదోషం పట్టకపోవడం నన్ను ఆశ్చర్యపరించింది. వెంటనే ఆ పుస్తకంలో మరొక రెండు మూడు వ్యసాలు చదివాను. దిగంబర కవితపైనా, వచన కవిత్వం పైనా ఆయన రాసిన వ్యాసాలు చదివితే అర్ధమయిందేమంటే, ఆయన, ఒక విద్యార్థిలాగా కవిత్వం చదువుతూ, తన పఠనానుభవాన్ని మనతో పంచుకుంటున్నాడని, ఆ వ్యాసాల్లో ఆయన ఒక సునిశిత పాఠకుడిగానే తప్ప, విలువలు లెక్కగట్టే పీఠాధిపతిగా కనిపించలేదని.

మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు సాహిత్య విమర్శ గురించి రాసిన ఒక వాక్యం, ఈ మధ్య, రమణమూర్తిగారి వాల్ మీద చదివాను. గుణాన్నీ, దోషాన్నీ రెండింటినీ ఉన్నదున్నట్టుగా చెప్పేది ఉత్తమ సాహిత్య విమర్శ అనీ, దోషాన్ని కప్పిపుచ్చి కేవలం గుణాన్ని మాత్రమే ప్రస్తుతించేది మధ్యమవిమర్శ అనీ, గుణాన్ని కప్పిపుచ్చి, దోషాన్ని మాత్రమే ఎత్తి చూపేది అధమ విమర్శ అనీ, ఇక గుణాన్ని దోషంగానూ, దోషాన్ని గుణంగానూ చూపించేది అధమాధమ విమర్శ అనీ శాస్త్రి గారు అన్నారట.

ఆ వర్గీకరణ చూడగానే ఒక సాహిత్యవిమర్శకుడిగా నేను ఏ తరగతిలోకి వస్తానని ఆలోచించాను. నాది మధ్యమస్థాయి విమర్శ. కానీ ఆ ప్రమాణం ప్రకారం చూసినప్పుడు కాంతారావుగారిది ఉత్తమ సాహిత్యవిమర్శ. ఆయన గుణదోషాలు రెండింటినీ, ఒకే వ్యాసంలోనే, ఎత్తి చూపడం కనిపిస్తుంది. ఆయనకు సంకోచాలు లేవు, భేషజాలు లేవు, వర్గాలు లేవు, వర్గప్రయోజనాలు లేవు. తాను పుస్తకం చేత్తో పట్టుకుని చదువుకుంటూ, ‘ఆహా ఇక్కడ చాలా బావుంది’ అని అంటారు, మరు క్షణం ‘ ఇదస్సలు బావులేదు, ఇలా రాయకుండా ఉండాల్సింది ‘అని కూడా అనేస్తారు.

ఇటువంటి సాహిత్యరత్న పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైనవాడు అనే ఆ రోజు వక్తలంతా చెప్పారు. వారి మాటల్నే నేను కూడా పునరుక్తి చేస్తూ, అదనంగా చెప్పిందేమంటే, ఆయన ఇప్పటి తరాన్ని ఎంత చేరదీసుకుని ఉండేవాడో, ఇప్పటి తరం కూడా ఆయనకి అంతే చేరువగా జరిగి ఉందురనే.

ఈ ఉత్తమ సాహిత్యారాధకుడి స్మరణనని ఇలానే ప్రతి ఏడాదీ కొనసాగించాలనీ, ప్రతి ఏడాదీ, ఉత్తమ సాహిత్యవిమర్శకూ, బలమైన ఒక కొత్త గొంతుకకూ ఇలానే ఆయన పేరిట పురస్కారాలివ్వడం కొనసాగించాలనీ, అందరం కోరుకుందాం.

12-1-2026

12 Replies to “టి.ఎల్. కాంతారావు స్మరణలో”

  1. ఈ మీ వాక్యాలు “ఆయనకు సంకోచాలు లేవు, భేషజాలు లేవు, వర్గాలు లేవు, వర్గప్రయోజనాలు లేవు. తాను పుస్తకం చేత్తో పట్టుకుని చదువుకుంటూ, ‘ఆహా ఇక్కడ చాలా బావుంది’ అని అంటారు, మరు క్షణం ‘ఇదస్సలు బావులేదు, ఇలా రాయకుండా ఉండాల్సింది ‘అని కూడా అనేస్తారు. ఇటువంటి సాహిత్యరత్న పరీక్షకుడు ఇప్పటి కాలానికి ఎంతో అవసరమైనవాడు అనే ఆ రోజు వక్తలంతా చెప్పారు.” ఆయన పట్ల గౌరవాన్ని పెంచడంతో పాటు పుస్తకంలో వ్యాసాలను తప్పకుండా చదవాలన్న ఆసక్తిని కూడా కలిగిస్తున్నాయి.

  2. మీరు ఈ కార్యక్రమానికి రావడం, సభాధ్యక్షత వహించడం, కాంతారావు గారి జ్ఞాపకాలు పంచుకోవడం, నేను మీతో వేదిక పంచుకోవడం…. నాకెంత సంతోషమో చెప్పలేను సర్…

    On behalf of Talagadadeevi family, my sincere thanks to you for all the generous support you have extended to this event. Means a lot. 🙏

  3. ఈ బ్లాగూ, ఇందులో మీరు ప్రస్తావించిన సాహితీప్రముఖుల పేర్లూ నా సాహిత్యప్రస్థానాన్ని కూడా గుర్తుచేశాయి వీరభద్రుడు గారూ. చాలా సంతోషం కలిగింది. నా సాహిత్యయాత్రలో దీపస్తంభాలుగా నిలబడినవారిలో వీరూ ఉన్నారు. నాకన్నా మీరు వయసులో చిన్న అయినా వీరిని అందుకుంటూ ముందుకు సాగారంటే సాహిత్యయాత్రలో మీ గమనవేగం అలాంటిది.
    నా ‘మౌనం నా సందేశం’ పై కాంతారావుగారు భారతిలో సమీక్ష చేశారు. కాకినాడలో జరిగిన శ్రీశ్రీ సప్తతి సభలో ఆయన్ను చూశాను.

  4. చిన వీరభద్రుల వారూ, మీరు కాంతారావు గారి కత్తియుధ్ధాల ప్రసక్తిని ఈవ్యాసంలో చేసియుండని పక్షంలో చదువరుల్లో అనేకులు ఈయన ఎవరో వేరే టి యల్ కాంతారావు గారు అనుకొనేవారే. ఆ అనేకులలో నేనూ ఒకడినే నండి! నాఅభిమాన చలనచిత్రనటుడు ఒక గొప్ప సాహిత్యవిమర్శకుడు కూడా అన్న విషయం నాదృష్టికే రాకుండా డెబ్బదినాలుగువత్సరాలు గడిచిపోవటం ఆశ్ఛర్యం కలిగించింది నాకు.

    వీరభద్రులవారూ మీతో నాకు బాదరాయణబంధుత్వం ఉందండీ. మీదీ తూగోజీ – నాదీ తూగోజీ మరి.

    దయచేసి శ్రీ కాంతారావు గారి ఈ సమగ్రసాహిత్యం పుస్తకాలు ఎక్కడ లభ్యం అవుతాయో కూడా మీవ్యాసంలో అదనపుసమాచారంగా చేర్చగలరా? అది కూడా ముఖ్యసమాచారమే కదండీ‌ చదువరులకు.

    ఇంతమంచి వ్యాసం అందించినందుకు మీకు నా హృదయపూర్వకధన్యవాదా లండి.

    1. అయ్యో! నేను చెప్పాలనుకున్నది మీకు సరిగ్గా communicate అయినట్లు లేదు. ఆ కాంతారావు వేరు, ఈ కాంతారావు వేరు.

      1. వెలుగు( సంతోషం) చీకటిని ( దుఃఖాన్ని ) ఆశిస్తుంది… 🙆

        కుంతికి చరమాకంలో బోధపడిన సత్యాన్ని { దుఃఖ యోగన్ని } అంత పిన్న వయసులో ఇంత సరళంగా ఎలా సార్! చెప్పగలిగారు!?🙏

      2. అలాగా అండీ. పొరబడ్డాను. మా అట్టకత్తి కాంతారావు గురించి కాదన్నమాట!

  5. అభిమాన నటుడు అని ఒక సారి అట్ట కత్తి కాంతారావు అని తక్కువ చేసి మరొకసారి వ్రాయడం ఏమిటి శ్యామల రావు గారు.పుస్తకం మీద ఉన్న బొమ్మ చూస్తేనే నటుడు కాంతారావు కాదు అని తెలుస్తుంది కదా.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading