మహోన్నత కళా తపస్వి

చాలా ఏళ్ళ కిందట తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌-ఛాన్సలరుగారిని వారి ఛాంబరులో మొదటిసారి కలుసుకున్నప్పుడు, ఆ కలుసుకున్నదెవరినో, అప్పుడు ఎందుకు అక్కడికి వెళ్ళానో ఇప్పుడు గుర్తులేదుగాని, ఆ ఛాంబరులో గోడమీద చూసిన రెండు చిత్రలేఖనాలు మాత్రం నా మనసులో ఇప్పటికీ నాటుకుపోయి ఉన్నాయి. వాటిని ఎవరు చిత్రించారో, అవి ఒరిజినలు చిత్రాలో లేక ప్రింటులో అక్కడ వాళ్ళకి కూడా అప్పుడు తెలిసినట్టు లేదు. కాని వాటిని చూడగానే నా మనసు ఒక రాళ్ళదారిన, ఒక మట్టిదారిన అపురూమైన సంధ్యాసమయానికి వెళ్ళిపోయింది. అంత సున్నితమైన నీటిరంగుల్లో, అంత అకలంకమైన పూతల్తో, అంత మృదువైన రేఖావిన్యాసంతో గీసిన అటువంటి బొమ్మల్ని నేనప్పటిదాకా చూసి ఉండలేదు. చూడగానే వాటిల్లో ఉన్నది తెలుగు తావులేననీ, వాటిని బహుశా ఒక తెలుగు చిత్రకారుడే చిత్రించి ఉంటాడనీ నాకు తోచింది గాని, ఆ చిత్రకారుడెవరై ఉండవచ్చో నాకు తెలియలేదు. ఇన్నాళ్ళకు తెలిసింది నాకు వాటిని చిత్రించింది భగీరధిగారనీ, ఆ చిత్రాలు ‘మొగల్రాజపురం హిల్‌ సైడ్‌’ ‘మొగల్రాజపురం రోడ్‌ సైడ్‌’ అనీ. మొక్కపాటి కృష్ణమూర్తిగారి ద్వారా అవి తెలుగు విశ్వవిద్యాలయానికి చేరాయనీ.

వరాహగిరి వెంకట భగీరధి (1901-1949) ని కొందరు సుప్రసిద్ధ నీటిరంగుల చిత్రకారులు కాట్‌మన్‌తో, టర్నరుతో, నికొలాయి రోరిక్‌తో పోల్చారు. ఆ ముగ్గురి చిత్రలేఖనాలూ నాకు సుపరిచితమే. వారి గురించి క్షుణ్ణంగా చదివేను కూడా. మరీ ముఖ్యంతా టర్నరు నీటిరంగుల మెలకువల్ని స్వయంగా అభ్యాసం చేసాను కూడా. కానీ భగీరధిగారు ఆ ముగ్గురికన్నా భిన్నమైన, ప్రత్యేకమైన, ఇంకా చెప్పాలంటే మరింత సిద్ధహస్తుడైన నీటిరంగుల చిత్రకారుడు. తెలుగువాడు. ఇరవయ్యవశతాబ్దపు మహనీయ భారతీయ చిత్రకారుల్లో మొదటివరసకు చెందినవాడు. కానీ ఆయన గురించి మనకి ఏమి తెలియదు. మన చిత్రకళాచరిత్రలో, మన సంస్కృతి గురించిన విజ్ఞాన సర్వస్వాల్లో, మన వార్తాపత్రికల్లో ఆయన గురించి ఒక్క వాక్యం కూడా కనబడదు. చిత్రకళకు సంబంధించిన పుస్తకాల్లోనే కాదు, ఆర్టు కాటలాగుల్లో కూడా ఆయనది ఒక్క చిత్రలేఖనం కూడా కనబడదు. బెంగాలు స్కూలు ఆఫ్‌ ఆర్టుకి చెందిన అవనీంద్రుడికీ, గగనేంద్రుడికీ, తన సమకాలికులైన దామెర్ల రామారావు, వరదా వెంకట రత్నాలకు ఏ మాత్రం తీసిపోని ఈ మహోన్నత చిత్రకారుడు తన జీవితకాలంలో గీసిన చిత్రలేఖనాల్ని ఒకసారి కొనుక్కున్న వారు మరెవరికీ మళ్ళా అమ్మడానికి ఇష్టపడకపోవడమే అందుకు కారణమనుకుంటాను.

Timmaraju Cheruvu near Yeleswaram, Watercolor V.V.Bhagirathi

ఇప్పుడు వారి మనమరాలు ఆయన మీద ఒక పుస్తకం వెలువరిస్తున్నారు.  ‘వి.వి.భగీరధి, ప్రఖ్యాత భారతీయ చిత్రకారులు’ ఆ లోటును పూరించడమే కాదు, మనం ఆ మహనీయ చిత్రకారుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకున్నంత స్ఫూర్తిని కలిగిస్తుందని కూడా భావిస్తున్నాను. ఆమె అపారమైన కృషి వల్ల ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! ఒకసారి సీతానగరం సత్యాగ్రహ ఆశ్రమానికి వెళ్తూ గాంధీజీ రాజమండ్రిలో భగీరధిగారి చిత్రలేఖనప్రదర్శన ప్రారంభించారని తెలియడమే ఒక సంతోషం. అటువంటిది ఆయన భగీరధి గీసిన ఒక లాండ్‌స్కేప్‌ చూసి, ఆ చిత్రంలో కనిపిస్తున్న మంచుకి, తనకి చలి పుడుతున్నదని చెప్పారంటే, అంత సత్యసంధుడి నోటివెంట అంత ప్రశంస వెలువడిందంటేనే ఆ చిత్రకారుడి కౌశల్యమెటువంటిదో మనం ఊహించవచ్చు.

The Spiritural Powerhouse of Bezwada, Watercolor V.V.Bhagirathi

పద్మ గారు తీసుకొస్తున్న పుస్తకంలో భగీరధిగారి జీవితవిశేషాలతో పాటు, ఆయన రాసుకున్న డైరీలు, ఆ రోజుల్లోనే పాడేరు పర్యటన చేసిన వివరాలతో పాటు, ఆయన గురించి ప్రసిద్ధులైన మరికొందరు రాసిన వ్యాసాలూ, అప్పటి పత్రికల్లో వచ్చిన వార్తలు కూడా ఉన్నాయి. తన తాతగారి గురించి తనకి ఎక్కడ ఒక్క వాక్యం కనిపించినా కూడా లక్ష్మి గారు వదిలిపెట్టలేదని ఆ పుస్తకం మనకి సాక్ష్యమిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తూ, భగీరథిగారు గీసిన చిత్రాల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నవాటి నకళ్ళూ, ఫొటోలూ, ప్రింటులూ ఆ పుస్తకంలో పొందుపరచడం మరొక ఎత్తూ.

భగీరధి గారి చిత్రకళాకౌశల్యం గురించి ఆయన సమకాలికులూ, ఆయన తదనంతర చిత్రకారులూ రాసిన పది పన్నెండు వ్యాసాలు కూడా ఆ పుస్తకంలో ఉన్నాయి. తన జీవితకాలంలోనే తన సహచరులూ, సమకాలికులూ తన చిత్రకళని  అంత నిష్కపటం గానూ, నిస్సందేహంగానూ ప్రశంసల్తో ముంచెత్తడం భగీరధిగారి భాగ్యం. ఎందుకంటే కవులూ, కళాకారులూ తమ తోటికవులనుంచీ, కళాకారులనుంచీ ప్రశంసలు పొందడం చాలా అరుదు. వరదావెంకట రత్నంగారు, మొక్కపాటి కృష్ణమూర్తిగారు, పిలకా లక్ష్మీ నరసింహమూర్తిగారు, ఎం.ఎస్‌. రామస్వామిగారు, ఎస్‌.ఎన్‌.చామకూరగారు రాసిన వ్యాసాలవి. తమ సమకాలికుడైన ఒక చిత్రకారుడు అంతర్జాతీయ స్థాయి వర్ణరచనా సామర్థ్యాన్ని సముపార్జించాడని నమ్మినందువల్లనే వారు అటువంటి వ్యాసాలు రాయగలిగారు. వాటిలో ఆయన చిత్రకళ పట్ల ఎంత గౌరవాన్ని కనపరిచారో, వారు, ఆయన వ్యక్తిత్వం పట్ల కూడా అంతే గౌరవాన్ని కనపరిచారు.  ఉదాహరణకి వెంకటరత్నం గారు ఇలా రాసారు:

మొక్కపాటి కృష్ణమూర్తిగారు గారు ఇలా రాసారు:

ప్రాచ్య, పాశ్చాత్య చిత్రకళారీతుల పట్ల అపారమైన పాండిత్యం, రసానుశీలనకు పేరెన్నెక గన్న సంజీవదేవ్‌ గారు ‘ప్రకృతి శిల్పి భగీరధి’ అన్న వ్యాసంలోంచి ఒకటి రెండు వాక్యాలు కాదు, ఏకంగా  మొత్తం వ్యాసమే ఎత్తిరాయదగ్గది. అయినా ఒక్క వాక్యం ఎంచిరాయమంటే ఈ వాక్యం చూడండని చెప్తాను. సంజీవదేవ్‌ గారు ఇలా అంటున్నారు:

నిండా యాభై ఏళ్ళు కూడా ఆయుర్దాయం దక్కని ఆ కళాతపస్వి తన జీవితకాలంలో అంత విస్తృతమైన చిత్రకళా రచన ఎలా చేపట్టేరో, బొమ్మలు వేయడమేగాక, తన బొమ్మలకు స్ఫూర్తికోసం ఎలా పర్యటనలు చేసేరో,  ఒకవైపు పేదరికం, కుటుంబ సమస్యలు కిందకి దిగలాగుతుంటే, మరొక వైపు తన కళాసాధన ఎలా చేస్తూ వచ్చేరో ఈ పుస్తకం మనకు చాలానే చెప్తుంది. ముఖ్యంగా ఆయన డైరీలు.  ఆ డైరీలు చదువుతున్నంతసేపూ మనకి ఒక చిత్రకారుడికన్నా కూడా ఎంతో బలమైన భగవద్విశ్వాసి కనిపిస్తాడు. అనుష్ఠాన వేదాంతి కనిపిస్తాడు.

పద్మగారు రాసిన పుస్తకం జనవరిలో విడుదల కాబోతున్నది. కాని 2025 తో భగీరథిగారి 125 వ జయంతి సంవత్సరం మొదలవుతున్నది కాబట్టి ఈ నాలుగు వాక్యాలూ రాయకుండా ఉండలేకపోయాను.


మెహఫిల్ సాహిత్య పేజీ, 5-1-2026, విమల గారికి ధన్యవాదాలతో.


Featured image and images in the article: Paintings by V.V.Bagirathi, courtesy: V.P.S.S Lakshmi Nelakanty

5-1-2026

16 Replies to “మహోన్నత కళా తపస్వి”

  1. భగీరథ గారి గురించి తెలిపి నందుకు తమకు ధన్య వాదాలు.

  2. ఆహా.. మీ కుటీరం ద్వారా మరొక మహోన్నత కళాకారుడి గురించి.. ఆయన గురించి రాబోయే ఒక గొప్ప పుస్తకం గురించి తెలుసుకోగలిగాను. తప్పకుండా చదవాల్సిన పుస్తకం లా అనిపిస్తోంది. ఈ వి.వి. భగీరథి గారికీ, వి.వి. గిరి గారికి ఏమైనా చుట్టరికం ఉందా అనే సందేహం. పుస్తకం చదివితే నివృత్తి అవుతుందేమో..

  3. భాగీరథి గారి గురించి తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. మరుగున పడిన తెలుగు మాణిక్యాలు ఎన్ని వున్నాయో! మీలాటి వారివల్ల తెలుసుకోగలగటం సంతోషంగా వుంది. 🙏

  4. Amazing landscapes. Blessed to know about the Artist. Eagerly waiting to get the book & read.. Dhanyavaadalu.

  5. ఇంకొన్ని ఫోటోల కోసం వెతికాను సార్….
    అద్భుతం 🙏❤️🌹

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading