
ఈ మధ్య తెలంగాణా సారస్వత పరిషత్తువారు బాలసాహిత్యం మీద రెండు రోజుల కార్యశిబిరాన్ని ఏర్పాటుచేసారు. బాల రచయితల్నీ, బాలసాహిత్య రచయితల్నీ ఒక్కచోట చేర్చిన ఆ గోష్ఠిలో పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాల గురించి నన్ను కూడా ప్రసంగించమని అడిగారు.
పిల్లల పుస్తకాల ఆవిష్కరణ
ఆ ప్రసంగానికి వెళ్ళిన రోజున పిల్లల పుస్తకాల ఆవిష్కరణ కూడా జరుగుతూ ఉంది. నూనె శ్రీనిధి అనే బాలిక రాసిన ‘అమ్మమ్మ ప్రేమ’అనే కథల పుస్తకం ఆవిష్కరించే అవకాశం నాకు దక్కింది. ఆమె నిజామాబాదు జిల్లా ఏర్గట్ల జిల్లా పరిషత్తు ఉన్నతపాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్నది. ఇది ఆమె మొదటి పుస్తకం. నేను ఎమ్మే పూర్తిచేసాకగానీ నా మొదటిపుస్తకం వెలువరించలేకపోయానని గుర్తొచ్చింది. ఆ మాటే ఆమెకి చెప్పాను. ఆ రోజు కొల్లి చంద్రిక అనే బాలిక రాసిన ‘కథా చంద్రిక’ కథలు, ఉండ్రాళ్ళ రాజేశం అనే బాలుడు రాసిన ‘బాల కథా చంద్రిక ‘ పెందోట బాలసాహిత్య పీఠం వారు వెలువరించిన ‘చిన్నారి స్నేహితులు’ పుస్తకాలు కూడా విడుదలయ్యాయి. వీటితో పాటు ఆవుల పోతురాజు అనే పదో తరగతి విద్యార్థి రాసిన ‘నాన్నే నా హీరో’ కథల పుస్తకం కూడా ఆవిష్కరించారు. పోతురాజు తల్లిదండ్రులు గంగిరెద్దులు ఆడించుకుంటూ పొట్టపోసుకునే సంచారకుటుంబం. వారిప్పుడు తమ పిల్లవాడి చదువుకోసం సత్తుపల్లిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
బాలలు సృష్టిస్తున్న సాహిత్యం
ఆ రోజు సభలో పాల్గొన్న ప్రసిద్ధ రచయిత, నేషనల్ బుక్ ట్రస్టు రీజనలు మానేజరు పత్తిపాక మోహన్ చెప్పినదాన్ని బట్టి పిల్లలు పిల్లల కోసం రాస్తున్న సాహిత్యం ఈ మధ్యకాలంలో ఒక ఉద్యమ స్థాయిని సంతరించుకుంటూ ఉంది. గత దశాబ్ద కాలంలో స్కూలు పిల్లలు దాదాపు 600 పుస్తకాలు వెలువరించారు. తమకి చదువు చెప్తున్న ఉపాధ్యాయుల ప్రేరణవల్ల పిల్లలు రచనలు చేస్తున్నారు. వాటిని ఆ ఉపాధ్యాయులుగానీ లేదా స్థానిక దాతలు గానీ ప్రచురిస్తూ ఉన్నారు. ప్రసిద్ధ బాలసాహిత్య రచయిత, స్వయంగా ఉపాధ్యాయుడూ అయిన గరిపెల్లి అశోక్ ఇటువంటి పుస్తకాల డాటాబేస్ నిర్మిస్తూ ఉన్నారు. బాలసాహిత్యప్రేమికులు సి.ఏ.ప్రసాద్, వి.ఆర్.శర్మ వంటివారు ఇటువంటి ప్రయత్నాల్ని ముందుకు తీసుకుపోతున్నారు. గుంటూరులో శ్రీవేంకటేశ్వర బాలకుటీర్ వ్యవస్థాపకులు, ప్రసిద్ధ విద్యావేత్త డా.నన్నపనేని మంగాదేవి ఇటువంటి కృషి చేసినవారికి ప్రతి ఏడాదీ బాలసాహిత్య పురస్కారాన్ని అందిస్తున్నారు. 2025 కు ఈ పురస్కారం వి.ఆర్.శర్మగారికి లభించింది.
నేషనలు బుక్ ట్రస్టు చేస్తున్న కృషి

Pattipaka Mohan
తెలుగులో బాలసాహిత్యాన్ని పెంపొందించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్న కొందరు ప్రచురణ కర్తలు, ‘బాలచెలిమి’, ‘మంచిపుస్తకం’ వంటివారు, ‘క్రియ’ వంటి కొన్ని సంస్థలు , లేకపోలేదు. కాని ఈ రంగంలో నేషనలు బుక్ ట్రస్టు చేస్తున్న కృషి అద్వితీయం అని చెప్పవచ్చు. గత పదేళ్ళల్లో నేషనలు బుక్ ట్రస్టు దాదాపు 300 పుస్తకాల్ని తెలుగులోకి అనువదింపచేసింది. అలాగే తెలుగునుంచి కూడా సుమారు 25 పుస్తకాలు వివిధ భారతీయ భాషల్లోకి అనువదింపచేసింది. ఉత్తమ బాలసాహిత్యం 16 పుస్తకాలు ఎంపికచేసి వాటిని గిరిజన భాషల్లోకి అనువదింపచేసే ప్రయత్నాలు కూడా నేషనలు బుక్ ట్రస్టు చేసింది. అటువంటి ఒక అనువాద కార్యశిబిరం అదిలాబాదుజిల్లా లో ఉట్నూరులో నిర్వహించినప్పుడు ఆ శిబిరంలో నేను కూడా పాల్గొన్నాను. బాలసాహిత్య శిబిరాలు 40 దాకా ఎన్. బి. టి తరఫునా, మరొక 160 దాకా తెలుగు బాలరచయితలూ నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 105 పాఠశాలల్లో ఒక వినూత్న కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ప్రతి ఒక్క పాఠశాలలోనూ 25 మంది విద్యార్థుల్ని ఎంపికచేసి వారితో వారి అవ్వా, తాతలకు ఉత్తరాలు రాయించేరు. ఇవి కాక, సాహిత్య అకాదెమీ వంటి సంస్థలతో సంయు క్తంగా మూడు రోజుల వ్యవధి కలిగిన కార్యశిబిరాలు 11 దాకా నిర్వహించారు.
కానీ ఈ కృషి చాలదు
చూడటానికి ఈ అంకెలు చాలా సంతోషకారకంగా కనిపించవచ్చుగానీ, ఈ కృషి చాలదనే చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య మా అక్క మనమడు రెండేళ్ల పిల్లవాడు మా ఇంటికొచ్చినప్పుడు చిన్నపిల్లల పుస్తకాలు కావాలని అడిగాడు. నా దగ్గరున్న వందలాది పుస్తకాల్లో ఆ పిల్లవాడి తృష్ణను తీర్చగల పుస్తకం ఒక్కటి కూడా కనిపించలేదు. బాలసాహిత్యాన్ని ప్రోత్సహించడం కోసం సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం ప్రవేశపెట్టిన విషయం మనకు తెలుసు. అది స్వాగతించదగ్గ విషయమే అయినప్పటికీ, ‘ప్రధాన స్రవంతి ‘ రచయితలు వేరూ, బాలసాహిత్య రచయితలు వేరూ అనే ఒక సంకేతం మనకి తెలియకుండానే సాహిత్యంలోకి చొరబడింది. పూర్వం ఇలా ఉండేది కాదు. గిడుగు రామ్మూర్తి సవరపిల్లలకోసం పాటలూ, కథలూ సేకరించి సవరభాషలోనే అచ్చువేయించారు. వారి కుమారుడు గిడుగుసీతాపతి తెలుగు బాలసాహిత్యానికి పితామహుడని చెప్పదగ్గ రచయిత. తొలి బాలగేయం ‘చిలుకమ్మ పెండ్లి ‘(1902) రాసింది ఆయనే. గురజాడ అప్పారావు, చింతాదీక్షితులు, కవికొండల వెంకటరావు, విశ్వనాథ సత్యనారాయణ, కొడవటిగంటి కుటుంబరావు వంటి రచయితలు బాలసాహిత్యంలో కూడా నిరుపమానమైన కృషి చేసారు. కాని 60 లతర్వాత ‘ప్రధాన స్రవంతి ‘ రచయితలు పెద్దవాళ్ళకోసం రచనలు చేయడం మీద దృష్టి పెట్టినట్టుగా పిల్లల కోసం రచనలు చేయలేదు. ఈ పరిస్థితి ఇప్పటికైనా మారాలి.
పిల్లల ప్రపంచం ఒక ప్రత్యేక ప్రపంచం
నిజానికి మామూలు పాఠకులకోసమో లేదా ఏదో ఒక భావజాల వ్యాప్తికో రచనలు చెయ్యడం కన్నా పిల్లలకోసం రచనలు చెయ్యడం చాలా కష్టం. అంటే ‘పిల్లల స్థాయికి దిగి ‘ రాయవలసి ఉంటుంది అనుకుంటారు. కాని ఒక విద్యావేత్త అన్నట్టుగా మనం ‘పిల్లల స్థాయికి దిగడం కాదు, వాళ్ళ స్థాయికి ఎక్కి వెళ్ళవలసి ఉంటుంది.’ పిల్లలది నిర్మల ప్రపంచం, అత్యంత సృజనాత్మక ప్రపంచం. వారి హృదయాల్తో ఆలోచిస్తే తప్ప, వారిలాగా జీవితాన్ని అనుభూతిస్తే తప్ప వారు చదివేలాంటి రచనలు చేయలేం.
పిల్లలకోసం రాయడమంటే, నీతి కథలు చెప్పడం, లేదా పురాణాలు తిరిగి చెప్పడం లేదా సైన్సు సూత్రాల్ని కథలుగా పరిచయం చెయ్యడం అనుకుంటారు. ఇవన్నీ కూడా అభినందించదగ్గ ప్రయత్నాలే అయినప్పటికీ, పిల్లలు కోరుకునేది వీటిని కాదు. వారు ఒక అద్భుత లోకాన్ని కోరుకుంటారు. సాధారణ ప్రాపంచిక శక్తులకీ, సామాజిక సూత్రాలకీ అక్కడ స్థానం లేదు. వేదాలు కూడా అనుమతించిన వడ్డీ వ్యాపారి పిల్లల కథల్లో మాత్రం ఎప్పటికీ దుష్టపాత్రనే అని రాసాడు కొడవటిగంటి ఎప్పుడో. అలాగని పిల్లలు కాశీమజిలీ కథలు మాత్రమే చదువుతారని కాదు. అసలు పిల్లలు ఫలానా కథలు చదువుతారని మనం నిర్దేశించలేం. పిల్లలకోసం కథలు చెప్పాలనుకున్న రచయిత పిల్లల్తో కలిసి మెలిసి వారి మానసిక ప్రపంచాన్ని పంచుకున్నప్పుడు మాత్రమే పిల్లలు మెచ్చే కథలు ప్రభవిస్తాయి.
‘అమ్మ, ఆకలి, ఆటలు’
‘ఎన్ని విషయాల గురించైనా మాట్లాడండి, పిల్లల ప్రపంచం అంతిమంగా మూడింటి చుట్టాతానే తిరుగుతుంది, అవి అమ్మ, ఆకలి, ఆటలు ‘అని అంటారు చంద్రలత. ఆమె గత పాతికేళ్ళుగా పిల్లల్తో కలిసిమెలిసి పనిచేస్తున్నారు. కరోనా కాలంలో ఆమె ‘ఇలువాసికథలు ‘ పేరిట పిల్లలకి రోజూ కథలు చెప్పారు. ఇప్పుడు పిల్లల నుంచి వారు కథలు చెప్పే వీడియోలు ఆహ్వానించేరు. ఆమె చెప్పేదాని ప్రకారం పిల్లల ప్రధానమైన వనరు వారి ఇన్నొసెన్సు. పాతికేళ్ళ కింద పిల్లల్లో కనిపించిన ఇన్నొసెన్సుని ఇప్పుడు అపారమైన సమాచారమూ, పట్టణ ప్రభావాలూ, ఇంగ్లిషు పదజాలమూ ఆక్రమించేసాయి. అయినా కూడా ‘పిల్లలు పిల్లలుగానే ఉన్నారు ‘ అని అంటారు ఆమె.

Chandralatha interacting with children
అంతిమంగా నేను చెప్పగలిగేదొకటే: మనం నిన్నటి గురించి ఆలోచిస్తే పురాణాలు చెప్పుకుంటాం. నేటి గురించి ఆలోచిస్తే ఇప్పుడు సృష్టిస్తున్న సాహిత్యం సృష్టించుకుంటాం. కాని రేపటి గురించి ఆలోచిస్తే మాత్రం పిల్లల సాహిత్యం గురించి ఆలోచించడం మొదలుపెడతాం.
1-1-2026


అవును సర్. పిల్లల సాహిత్యం గురించి ఆలోచించాలి. .నమస్సులు
అవును.
సర్…
ప్రణామాలు.
రేపటి గురించిన ఆలోచన అద్భుతం!
అభినందనలు,
రాం భాస్కర్ రాజు
వరంగల్
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
బాలసాహిత్య సృజనకారులకు మంచి సూచనలిచ్చారు. ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు అన్న నానుడిని గుర్తుకు తెచ్చేవిధంగా రేపటిని ఊహించి రచనలు చేయవలసిందిగా చెప్పడం బాగుంది. అంతర్జాలంలో అందుబాటులో లేని విషయాలను వాస్తవిక పునాదులపై , సృజనాత్మకంగా ఆచరణయోగ్యంగా చెప్పగలిగే విధంగా ఉండాలని అన్యాపదేశంగా చెప్పడం బాగుంది.
ధన్యవాదాలు సార్!
Good morning sir, today your article is very nice & good & informative.
About child literature &child stories
Now a days NBT is played key role in
Child literature thank u sir. From Srinidhi dept of heritage museum employee
ధన్యవాదాలు