నన్ను వెన్నాడే కథలు-7

ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, కథకుడు వంశీ ఒకసారి నాతో మాటల మధ్య స్టాన్లీ కుబ్రిక్ గురించి ఒక మాట చెప్పారు. చాలామంది దర్శకులు ఇప్పటికీ తాము సినిమాలు తీయబోయేముందు స్ఫూర్తికోసం కుబ్రిక్  సినిమాలు వేసుకుని చూస్తూ ఉంటారట. నా విషయంలో కథారచన వరకూ నేను ఈ మాట టాల్ స్టాయి గురించి చెప్పగలను.

చిన్నపిల్లలకు రాసిన కథలతోనే కథకుడిగా టాల్ స్టాయి తొలిపరిచయం నాకు. God Knows the Truth, But Waits అనేది మా ఇంగ్లిషు నాన్-డిటెయిల్డులో ఉండేది. ఆ తర్వాత ఆయన బాలసాహిత్యం తెలుగు అనువాదాలు చదివాను. కాని ‘విషాదసంగీతం'(1985) కథాసంపుటి నా చేతుల్లోకి వచ్చిన రోజు నేనెన్నటికీ మరవలేను. అందులో ప్రతి ఒక్క కథా నాకు హృదయస్థమై పోవడమే కాదు, ఆ ప్రతి ఒక్క కథకీ నేను కూడా మరొక ప్రతికృతి రాయాలని బలంగా అనుకునేవాణ్ణి కూడా.

అలాగని అనుకరణ కాదు. వాటిని నమూనాలుగా నా కథాశిల్పాన్ని మెరుగుపెట్టుకోడానికి, జీవితానుభవాల పట్ల లోతైన దృక్పథం ఏర్పరచుకోడానికి ఆ కథల్ని నా ఎదట పెట్టుకున్నాను. వాటిల్లో ‘స్వామి సేర్గియ్'(1898) కథని బట్టే నా ‘గోధూళి ‘(1986) కథ రాసానని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తెలివైన తెలుగు పాఠకులు కొందరు ఆ విషయం తమంతటతామే పట్టుకున్నారు కూడా. కాని రెండేళ్ళ కిందట నేను ‘ఆ వెన్నెల రాత్రులు’ రాసినప్పుడు, ఆ కథనశిల్పం వెనక ‘సంసార సుఖం’ కథ ఉందని ఎందరు పోల్చుకున్నారో నాకు తెలీదు.

అయితే ‘ఇవాన్ ఇల్యిచ్ మరణం’ (1886) కథ చదవకపోయి ఉంటే నేను ‘ప్రశ్నభూమి’ (2002) కథ ఊహించగలిగేవాణ్ణి కూడా కాదు. ఇక పరిపూర్ణ కథాశిల్పానికి నమూనాగా చెప్పదగ్గ ‘విందునాట్యం తరువాత’ (1903) నన్నెంతగా వెంటాడిందంటే, 2023 లో ‘విందు తరువాత’ అని ఒక కథ రాసేకగానీ నేనా ఒత్తిడినుంచి బయటపడలేకపోయాను.

ఇతిహాసాల్లాంటి అనాకెరినినా, వార్ అండ్ పీస్ రాసేక టాల్ స్టాయి చాలాకాలం పాటు నీతికథల కథకుడిగా తనని తాను తీర్చిదిద్దుకుంటూ గడిపేడు. మళ్ళా పూర్వం రాసినట్టు కథలూ, నవలలూ రాయమని తుర్జెనీవుతో సహా ఎందరో ఆయన్ని బతిమాలుకున్నారు. కాని ఉన్నట్టుండి, తనకే, తన సృజనసామర్థ్యాలు సన్నగిల్లుతున్నాయేమో అని అనుమానం వచ్చినట్టుంది, టాల్ స్టాయి, మళ్ళా కథలు రాసేడు. ఈ కథలు ఆయన అంతదాకా రాసిన సాహిత్యాన్ని మించిపోయిన కథలు. వాటిల్లో ‘హాజీమురాద్’ (1904) అనే నవలికనైతే హెరాల్డ్ బ్లూము టాల్ స్టాయి రచనలన్నిటిలోనూ సర్వోత్కృష్టమైన రచన అని ప్రస్తుతించాడు కూడా. Master and Man (1895), The Forged Coupon (1904), Alyosha (1904), What For (1906) వంటివి నేనెన్నటికీ మరవలేని కథలు. ఈ కథలకు వచ్చేటప్పటికి, టాల్ స్టాయి, బొకాషియో, ఛాసరు, షేక్స్పియర్లతో సమానమైన కథకుడిగా మారాడు. The Forged Coupon  కథ అయితే జాతక కథలతో సమానమైన కథ.

నలభయ్యేళ్ళుగా నన్ను వెన్నాడుతున్న కథల్లో ‘విషాదసంగీతం’ పుస్తకం లోంచి ఏ ఒక్క కథనేనా ఎంచి పరిచయం చేయవచ్చుగానీ, వాటి నిడివి నన్ను ఆపేస్తున్నది. అందుకని ఆయన రాసిన చిన్నపిల్లల కథల్లోంచి ‘కోడిగుడ్డంత గోధుమ గింజ’ కథని ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ఈ కథ ఒక్కటే ఒక చిన్నపుస్తకంగా, (ఆ ప్రచురణకర్తలు ఎవ్వరో గుర్తులేదు) తెలుగులో వెలువరించగా 81 లో చదివినట్టు గుర్తు. ఆ అనువాదకులు ఎవరో నాకు గుర్తులేదు కానీ టాల్ స్టాయి రాసిన చిన్న పిల్లల కథలు భమిడిపాటి కామేశ్వరరావు గారు అనువదించి రెండు సంపుటాలుగా వెలువరించారు. ఇక్కడ  ఆయన చేసిన అనువాదాన్ని అందిస్తున్నాను.

నిజానికి దీన్ని చిన్నపిల్లల కథ అని చెప్పలేం. ఇది వయోవృద్ధుల కథ కూడా. ఇది మానవజాతి శైశవకాలానికి చెందిన ఒక కృతయుగం కథ. ఒక సత్యయుగం కథ. దీన్ని ఇలా చెప్పాలంటే టాల్ స్టాయిలాగా ఒక జీవితకాలం పాటు కథారచన అభ్యాసం చేసి ఉండాలి. ఇటువంటి ఒక్క కథతో టాల్ స్థాయి,  ఈసోపు, పంచతంత్రకారుల స్థాయికి చేరుకున్నాడని చెప్పగలను.

ఇటువంటి సత్యయుగాల గురించిన ఒక మెలకువ తక్కిన జాతుల్లోనూ, సంస్కృతుల్లోనూ కూడా కనిపిస్తుంది. వేదకాల మానవుడు ఉంఛవృత్తి అన్నిటికన్నా అత్యున్నత జీవనోపాధి అనుకున్నాడు. ప్రాచీనా చీనాలో పంటలు పండేక, తమ అవసరాలు తీరగా మిగిలినదాన్ని పట్టుకుపోయి పొలాల్లో పారబోసేవారనే ఒక ఐతిహ్యం చీనా కవుల్ని వెంటాడుతూనే ఉంది. ముఖ్యంగా చీనాకవుల్లో ఋషీశ్వరుడని చెప్పదగా తావో యువాన్ మింగ్ అటువంటి సత్యకాలం కోసమే జీవితమంతా పరితపిస్తూ ఉన్నాడని ఆయన కవిత్వం ఎలుగెత్తి చాటుతున్నది. చారిత్రక భౌతిక వాదులు కూడా ఇటువంటి ఒక కృతయుగాన్ని సంభావించారు. వారు దాన్ని ప్రిమిటివ్ కమ్యూనిజం అన్నారు.

ఈ కథని ఒక కల్పనగా కొట్టిపారెయ్యడం చాలా సులభం. కాని అలా కొట్టిపారేస్తున్నామంటే మనలోని శిశువు పూర్తిగా అదృశ్యమైపోయాడన్నమాట. చిన్నపిల్లలకి ఈ కథ వినిపించండి. వాళ్ళు దీన్ని కల్పన అనుకోరు. నిజంగానే మనుషులు తమ స్వీయకష్టం మీద తాము ఆధారపడ్డప్పుడు, తమ పంటలో మిగులుగింజల్ని సారాయిగా మార్చనప్పుడు గోధుమగింజలు కోడిగుడ్డంత ఉండేవనే నమ్ముతారు. అలా నువ్వూ నేనూ నమ్మగలిగితే, ఏదో ఒక మేరకు, ఆ సత్యకాలాన్ని తిరిగి తెచ్చుకోగలమనే టాల్ స్టాయి నమ్మాడని ఆయన జీవితప్రయాణం మనకు వివరిస్తుంది.


కోడిగుడ్డంత గోధుమ గింజ

మూలకథ: టాల్ స్టాయి

తెలుగుసేత: భమిడిపాటి కామేశ్వరరావు


ఒకనాడు కొందరు పిల్లలు ఒక లోయలో ధాన్యపుగింజవంటి రూపంలో ఒక వస్తువు చూశారు. దానికి మధ్య నిలువుగా ఒక గాడి ఉంది, కాని ఆ వస్తువు బాగా కోడిగుడ్డంత పెద్దదిగా ఉంది. దారిని పోతూండే బాటసారి ఒకడు అది వాళ్ళ దగ్గిర్నించి ఓ కానికి కొన్నాడు. అకడు పట్టణానికి వెళ్ళగానే విచిత్రవస్తువుగా దాన్ని రాజుగారికి అమ్మేశాడు. రాజుగారు తన పండితులకి కబురంపి అదేమిటో తేల్చవలసిందిగా వాళ్ళని కోరాడు.

వారు ఎంతేనా ఆలోచించారుగాని దాన్ని గురించి తలా తోకా తేల్చలేకపోయారు. ఒకనాడు అది ఒక కిటికీ కమ్మి మీద ఉంటూన్న స్థితిలో ఒక కోడిపెట్ట ఆక్కడికి ఎగిరి ముక్కుతో పొడవగా దానికి చిల్లుపడింది. దాంతో అది ధాన్యపుగింజ అనే పంగతి అందరికీ విశదమైంది. పండితులు వెళ్ళి ‘అది ధాన్యపుగింజేనండి’ అని రాజుతో విన్నవించారు. రాజు మిక్కిలి ఆశ్చర్యపడిపోయాడు. అటువంటి ధాన్యం ఎక్కడ ఎప్పుడు పండేదో కనుక్కోవలిసిందిగా ఆ పండితుల్ని కోరాడు. పండితులు మళ్ళీఆలోచనలోపడి గ్రంథాలు తిరగెయ్యడం మొదలెట్టారు. దాన్ని గురించిన సంగతి ఎక్కడా దొరకలేదు. అప్పుడు వాళ్ళు రాజుదగ్గిరకొచ్చి, ‘మీకు సమాధానం చెప్పడం మావల్లకాదు. పుస్త కాల్లో ఎక్కడా దీని ప్రమేయంలేదు. రయితు లెవర్నేనా పిల్చిఇంత పరిమాణంలో ఇటువంటి ధాన్యం ఎప్పుడుఎక్కడ పండేదో, ఆ రయితులు వాళ్ళ తండ్రులు చెప్పగా అడగండి, వినేనా ఉండవచ్చును.’ అన్నారు. ముసలి రైతు నెవర్నేనా తన ఎదటకి తీసుకు రావాలని రాజు ఆజ్ఞాపించాడు. అటువంటివాణ్ణి వెతిగి నౌఖర్లు తీసుగువచ్చారు. ఆ ముసలివాడు నడుం వంగిపోయి పాలిపోయి దండమాన్యంగా ఉంటూ, రెండు కర్రలమీద ఆనుకుంటూ రాజు సమక్షంలోకి తూలుకుంటూ వచ్చాడు. అతడికి రాజు ఆ ధాన్యపుగింజ చూపించాడు. దృష్టిలోపంవల్ల ఆ ముసిలాడు దాన్ని తిన్నగా చూడలేక పోయాడు. కాని, ఎల్లాగైతే అది పుచ్చుగుని ముట్టుగుని చూశాడు. రాజు, ‘ఓ వృద్ధూ, చెప్పగలవా ఇల్లాంటి ధాన్యం పూర్వం ఎక్కడపండేదో? ఇల్లాంటిదెప్పుడేనా కొన్నావా? ఇల్లాంటి విత్తులు నీ పొలంలో ఎప్పుడేనా చల్లి చూశావా?’ అని అతణ్ణి అడిగాడు.ముసలాడికి చెముడు కూడానూ, కర్మం: అందుచేత రాజు ప్రశ్నలు అతడికి అవగాహన అయేసరికి చచ్చినంతపని జరిగింది. సమాధానం బ్రహ్మాండంమీద, చెబుతూ ‘అబ్బెబ్బే! నా పొలాల్లో ఇల్లాంటిది ఎన్నడూ నేను చల్లలేదు. పండించ లేదు. ఇల్లాంటిది ఎన్నడూ నేను కొనాలేదు. మీరు మా నాన్నని కనుక్కోండి. ఇల్లాంటి ధాన్యం ఎక్కడ పండేదో అతడు వినుండవచ్చు’ అన్నాడు. ఆ మట్టున రాజు అతడి తండ్రికి కబురు చెయ్యగా అయన్ని రాజు ఎదట హాజరు పెట్టారు. ఆయన ఒక్క కర్రమీదే ఆనుకుంటూ వచ్చాడు. రాజు ఆ గింజ ఆయనకి చూపించాడు. ఆ ముసిలి రైతుకి దృష్టి సరిగ్గానే ఉండడంవల్ల ఆ గింజని ఆయన వరిశీలనగా చూశాడు.

రాజు. ‘ఓ వృద్ధూ ! చెప్పగలవా ఇల్లాంటి ధాన్యం పూర్వం ఎక్కడ పండేదో? ఇల్లాంటి దెప్పుడేనా కొన్నావా? ఇల్లాంటి విత్తులు నీ పొలంలో ఎప్పుడేనా చల్లి చూశావా?’ అని ఆయన్ని అడిగాడు. ఈయనికీ చెముడు లేకపో లేదుగాని, కొడుకుకి వినపడేకంటే ఈయనకే బాగా వినిపిస్తుంది. ఆయన, ‘ అబ్బెబ్బే ! నా పొలాల్లో ఇల్లాంటిది ఎన్నడూ నేను చల్లలేదు. పండించాలేదు. కొన్నావా అంటారా. ఇల్లాంటిది కొనాలేదు. ఏమంటే నా కాలంలో ధనం అనేది ఆట్టే వాడుకలోకి రాలేదు. ఎవడి ధాన్యం వాడే పండించుకునేవాడు. లోటొచ్చిన వాడికి అదనంగా పండించినవాడిచ్చేవాడు. ఇటువంటి ధాన్యం ఎక్కడ పండేదో నే నెరగను. మా నాటి ధాన్యం ఈ నాటి ధాన్యం కంటే పెద్దదిగా ఉంటూ ఎక్కువ పిండికూడా అయేదేకాని, ఇంత పెద్దగింజ మాత్రం నే చూడలేదు. కానైతే మా కాలంలో కంటే, తమరి కాలంలో గింజ పెద్దదనిన్నీ ఎక్కువపిండి అయేదనిన్నీ మా నాన్న చెబుతూండగా వింటూండే వాణ్ణి. ఆయన్ని పిలిపించి కనుక్కోండి,’ అన్నాడు. అందు మీదట రాజు ఈ ముసలాయన తండ్రిగారికి కబురు చెయ్యగా, వార్ని కూ డా ఎక్కడున్నారో వెతిగి పట్టుకుని రాజు సమక్షంలోకి రావించారు. వారు ఏ కర్రా గట్రా అక్కర్లేకుండా స్వంత కాళ్ళతో నడుస్తూ సుళువుగా చక్కావచ్చారు. వారిచూపు సుబ్బరంగా ఉంది. వినికిడి చక్కగా ఉంది, మాట స్పష్టంగా ఉంది. రాజు ధాన్యపుగింజ వారిచేతి కిచ్చారు. వారది పుచ్చుగుని దాన్ని చేతులో తిరగా బోర్లావేసి చూశారు.

వారు—ఇంత చక్కటి గింజ చూసి చాలాకాలం అయింది. (అని అది కొరికి రుచి చూస్తూ) అవునవును, ఆ జాతిదే :

రాజు — తాతగారూ ! ఎప్పుడు ఎక్కడ పండేదీ ఇటువంటి ధాన్యం? ఇల్లాంటి దెప్పుడేనా మీరు కొనుకున్నారా? లేక మీ పొలాల్లో చల్లి చూశారా ?

వారు — ఇల్లాంటి ధాన్యం నా కాలంలో ప్రతీచోటా పండేది, నా చిన్నతనంలో ఇల్లాంటి ధాన్యమే మేం తిని ఇంకోళ్ళకికూడా పెట్టేవాళ్ళం. మేం ఇల్లాంటిదే చల్లి, పండించి, నూర్చేవాళ్ళం.

రాజు—తాతగారూ ! చెప్పండి. ఎక్కడేనా మీరు ఇల్లాంటి ధాన్యం కొనుక్కునేవారా. అంతా మీరే పండించుగునేవారా?

వారు—— (కొంచెం నవ్వుతూ) నాకాలంలో ఎవడూ కూడా ఆహారం కొనుక్కోడమనే పాపమూ, ఆహారం అమ్మడమనే పాపమూ ఎరగడు. ధనం అంటే ఏమిటో మాకు తెలియదు. ఎవడిమట్టుకి సరిపడ ధాన్యం వాడికుండేది.

రాజు — అయితే, తాతగారూ, చెప్పండి చెప్పండి. మీ పొలం ఎక్కడ ఉండేదీ : మీరెక్కడ పండించేవా రిల్లాంటి ధాన్యం?

వారు— భగవంతుడిదైన ఈ భూమి నా పొలం. నేనెక్కడ దున్నితే, అదీ నా పొలం. నేల అప్పుడు స్వేచ్ఛగా ఉండేది. నేల తనదీ అని ఎవడూ అనుకునేవాడు కాడు. ఎవరేనా తమది అని చెప్పుకోతగ్గది ఒక్కటీ ఏమిటంటే, కాయకష్టం.

రాజు — మరి రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మొదటి ప్రశ్న- అప్పట్లో ఇంత పెద్ద ధాన్యం పండే భూమి ఇప్పుడు మానేసిందేం ? రెండో ప్రశ్న- మీ మనమడు రెండు కర్రలమీద ఆని కుంటుతూ రాగా, మీ కొడుకు ఒక్క కర్ర మీద aaని రాగా, మీకు ఏ ఆసరా లేకుండా ఖరాగా వచ్చేశారే! పైగా మీ కళ్ళు ప్రకాశవంతంగానూ, మీ పళ్ళు గట్టిగానూ, మీ మాట స్పష్టంగానూ చెవికింపుగానూ ఉన్నాయే: మార్పులు ఎల్లా వచ్చాయి ?

వారు — నా కొడుకు తరంలోనూ, నా మనమడి తరంలోనూ మార్పులు ఎందుకు వచ్చాయంటే, స్వకాయకష్టంవల్ల జీవించడం మానేసి, అన్యుల కాయకష్టం మీద ఆధారపడడం జనం మరిగారు గనక. పూర్వకాలంలో భగవంతుడి శాసనాల్ని అనుసరించి జనం జీవించేవారు. వారు తమ శ్రమఫలితమే తమ ఆస్తి అనుకుని, అన్య శ్రమవల్ల ఉద్భవించే వాటిని స్వంతానికి భుక్తం చేసుగోవాలని యెంచేవారు కారు.


Featured image: Tolstoy with his wife Sofya

Top image: Bhamidipati Kameswara Rao

15-9-2025

6 Replies to “నన్ను వెన్నాడే కథలు-7”

  1. ఈ కథ 90’ ల్లో ఇంగ్లీష్ మీడియం ఏదో తరగతి పాఠ్యాంశంగా మా పిల్లల పుస్తకాల్లో చదివిన గుర్తు మర్చి పోలేదు. అప్పట్లో మా మిత్రులతో ఈ విషయం పంచుకున్నాను కూడా. ఒక గొప్ప సామాజిక సత్యం చాటి చెప్పే కథగా మరచిపోయే కథకాదు చదివిన వారికెవరికైనా .
    మంచి సందేశాత్మకమైన ఈ కథ గురజాడ గేయాల్లా ( ఆమధ్య US నుండి గురజాడ స్థాపించిన పత్రికను అదే పేరుతో ప్రకాశిక గా వెలువరిస్తున్న కొనివ్వు గోపాలకృష్ణ గారు గురజాడ బాలసాహిత్యం మీద రాయమన్నప్పుడు ఇదే మాట చెప్పి వ్యాసం రాయడం జరిగింది) ఆబాలగోపాలానికి అవసరమైన చదువదగిన కథ. మరీ ఇటీవలి తరానికి శ్రమవిలువ అసలే తెలియడం లేదు . ఐదు గజాల దూరంలో షాపున్నా ఆన్లైన్లో పాలప్యాకెట్ తెప్పించుకునే ఆధునిక యువతీ యువకులకు అవశ్య బోధనీయం. 91 ఏళ్ల వయసులో లేచిన దగ్గర్నుండి పడుకునే దాకా అలసిపోక క్షణం కూడా నడుం వాల్చని మా తల్లి
    ఇందుకు సాక్ష్యంగా చెప్పవచ్చు. స్పందన పెద్దగా అయినందుకు మన్నించగలరు.

  2. “ ఒక సత్యయుగం కథ. దీన్ని ఇలా చెప్పాలంటే టాల్ స్టాయిలాగా ఒక జీవితకాలం పాటు కథారచన అభ్యాసం చేసి ఉండాలి. “ 🙏🏽

    ప్రపంచ సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాను.
    Thank you sir 🙏🏽

  3. విషాదసంగీతం. .. అది 1990వ దశకం పూర్వర్థంలో ఎలాగో నా చేతికొచ్చింది. తొలుస్తోయ్ (?)పేరే ఒక మేజిక్. కనుక వెంటనే దాన్ని చదవడం మొదలుపెట్టాను. ఏకబిగిన. .. ఏకదీక్షగా. . నింపాదిగా. . నా నిండా నింపుకుంటూ, నింపుకుంటూ చదివాను. నేను చదివేనాటికి 150 ఏళ్లక్రితం. .. అంటే. .1850-60 ప్రాంతాల్లో తొలొస్తోయ్ రాసిన కథలవి.
    పిచ్చెక్కిపోయాను, వెర్రిక్కిపోయాను అనేవి చాలా చిన్నమాటలు.
    మనషుల అంతరంగంలోకి చొచ్చుకుపోయి అందులోని ప్రతి చిన్న కదలిక నుంచి అతిపెద్ద స్పందన దాక. . ఏ ఒక్క ఆలోచనా, భావ, ఉద్వేగ శకలాన్నీ వొదలక. .. భూ ప్రకంపనలు ఏ ఒక్కదాన్నీ ఏమారక రికార్డ్ చేసే సీస్మోగ్రాఫ్ లా- రికార్డు చేసిన మహారచయిత. అది ఏ ఒక్క కథలో మాత్రమే కాదు. . విషాదసంగీతంలోని అన్నీ కథల్లోనూ.
    అసలలా ఎలా రాయగలరు. .. అదీ 150 ఏళ్ల క్రితం అనే ఆశ్చర్యం ఇప్పటికీ నన్ను వీడలేదు. ఏవో కొన్ని భావాల్ని, కూసిన్ని మనోవేదనా సంవేదనల్ని, మనసు పొరల్లో సుళ్ళు తిరిగే ఇంకేవో భావ సంచయాల్ని చేయి తిరిగిన ఏ రచయిత అయినా చేయగలడు. .. అదీ ఒక స్థాయి వరకే. భౌతికమైన జీవితాన్ని ఎంతయినా.. ఎంత లోతుకైనా వర్ణించగలరు, చిత్రించగలరు. . కానీ, కానీ అదే స్థాయిలో మనో ప్రపంచాన్ని, ఆ పొరల్లో ఇరుక్కుపోయి ఎంత వివేచించినా, తర్కించినా, శోధించినా ఏ గుప్పెడో మాత్రమే పట్టుకోగలడు ఎంతటి గొప్ప రచయితయినా.
    ఓహ్. . ప్రపంచస్థాయిలోనే. . సాహిత్యం అనేది పురుడు పోసుకున్న తొలి క్షణాల నుంచి, వేల వత్సరాలు గడచిన ఈనాటిదాకా మహా కథకుడు, విశిష్ట రచయిత ( ఇంతకు మించిన విశేషణాలు నాకు తట్టడం లేదు. మీకేమైనా తోస్తే చెప్పండి) ఎవరైనా ఉన్నారూ అంటే. . నా వరకూ నాకు. . ఎవరూ లేరనే చెబుతాను.
    ఒక మనిషి అంతరంగాన్ని అలా పరచడం ఎలా సాధ్యం అనే విభ్రమ నాన్నిప్పటికి వీడడం లేదు.
    మనసును శోధించడం, అందులోకి అంతగా చొరబడి చూడడం ఆధునిక శాస్త్ర వ్యవహారం కదా. అయినా దాన్ని పరిపూర్ణంగా. .. ఆ మాటెందుకులే. .. అందులో పావువంతైనా రికార్డు చేయలేకపోతోందీ శాస్త్రవ్యవహారం.
    మరి దాని దిమ్మతిరిగేలా సంపూర్ణంగా, సమగ్రంగా, ఆ సంక్లిష్టతల్ని ఏ ఒక్కదాన్నీ-చిరు చిరు స్థాయిల్లో సుమా – వదలకుండా ఒడిసిపట్టడం- నాకు తెలిసి- ఇంకేంటి రచయతా లేడు గాక లేడు.
    ఆ విషాదసంగీతం నన్నిప్పటికీ వదలిపెట్టడంలేదు.
    తొలొస్తోయ్ ఎవరినీ తన దారిదాపుల దాక రానీయని మహా మహా మహా భయంకర కథకుడు. .. మనోశాస్త్ర వీధుల్లో విచ్చలవిడిగా తిరిగి ఎవరూమనసుతిప్పుకోలేనంతగా కనికట్టు చేసిన అంతరంగ పాతాళభైరవుడు. . !!

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading