
వర్షఋతువు చివరిరోజులు. సాయంకాలం నగరం మీద ఒక గాజుపలక కప్పినట్టు ఉంది. ఆ పలక మీద ఆగకుండా పడుతున్న వానధారల కింద మసకమసగ్గా నగరం మరింత దగ్గరగా ముడుచుకుంది. మాసాబ్ టాంకు దగ్గర జె.ఎన్.యు కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్సు ఆడిటోరియంలో అడుగుపెడుతూ అనుకున్నాను, వర్షోత్సవానికి కాకపోతే, ముసురు పట్టిన ఆ సాయంకాలం అడుగుతీసి బయట పెట్టి ఉండేవాణ్ణే కానని.
ధ్రువపద గురుకులం ఫౌండేషను వారు నాలుగేళ్ళుగా నిర్వహిస్తున్న వర్షోత్సవంలో భాగంగా ఈసారి ధ్రుపద్ బంధు అనే ఇద్దరు గాయకులు సంజీవ్, మనీష్ కుమార్ ల ద్రుపద్ గానంతో పాటు విదుషి పద్మశ్రీ అశ్విని భిడే దేశ్ పాండే ఖయాల్ గానం కూడా ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం ఉందని నాకు విశాఖపట్టణం నుంచి కల్లూరి శ్యామలగారు మెసేజి పంపినవెంటనే వెళ్తానని చెప్పాను ఆమెతో. ఎందుకంటే, అశ్విని భిడే దేశ్ పాండే గానం యూట్యూబులో వినడమే తప్ప ఇప్పటిదాకా ఆమె పాడుతుంటే ప్రత్యక్షంగా వినే అవకాశానికి నోచుకోలేకపోయాను. కాబట్టి నిన్నటి సాయంకాల ఉత్సవసంతోషానికి ముందు శ్యామల గారికి ధన్యవాదాలు చెప్పుకోవాలి.
సాధారణంగా ఇటువంటి వర్షసంగీతం తొలివానాకాలంలో వింటూంటాం. కాని ఈ మలివానాకాలంలో, అది కూడా బయట ఎడతెరిపిలేకుండా వానపడుతూ ఉండగా, లోపల సంగీతవర్షధారలో తడిసిపోవడం నిజంగా కొత్త అనుభవం.
మనీష్ కుమార్, సంజీవ్ లు గుండేచా సోదరుల శిష్యులు. దాగర్ వాణీ శైలికి చెందిన గాయకులు. బీహార్ కి చెందిన మొదటి జుగల్ బందీ గాయకులని కూడా విన్నాను. వారికి పఖవాజ్ సహకారం అందించిన జ్ఞానేశ్వర్ దేశ్ ముఖ్ తండ్రి వర్కారీ సంప్రదాయానికి చెందిన సంగీతకారుడని కూడా విన్నాను. వర్షోత్సవంలో మొదటిభాగంగా ద్రుపద్ బంధు మిత్రుల జంటగానం నడిచింది. దాదాపు గంటన్నర పాటు నడిచిన తమ కచేరీని వారు ఎంతో పద్ధతిగా కూర్చుకుని, ఎంతో శ్రద్ధగా, తమ గానాన్ని శ్రోతలకు సమర్పించారు.

సాధారణంగా ద్రుపద్ గానంలో మొదట ఆలాప్ ఉంటుంది. వారు దేశ్ రాగంలో ఆలాప్ ఎత్తుకున్నారు. దేశ్ రాగం ఋతుపవన రాగాల్లో సుప్రసిద్ధం. శుద్ధ, కోమల నిషాదాలు రెండూ పలికే దేశ్ రాగం సాధారణంగా గృహాగమన సంతోషాన్నీ, చాన్నాళ్ళుగా గూడుకట్టుకున్న బెంగ కరిగిపోయే అనుతాపాన్నీ స్ఫురించే రాగం. ఆ రాగాన్ని వినిపించమని నిర్వాహకులు విజయలక్ష్మిరామంగారు ఆ గాయకుల్ని అడిగారట. ఆ గాయకులిద్దరూ నిర్వాహకుల్ని నిరాశపర్చలేదు. అసలు మొత్తం ఉత్సవం ప్రారంభంలోనే ఆ ఆలాప్ వినిపించడంతో, శ్రోతలు తమ రోజువారీ జీవితం నుంచి సున్నితమైన ఒక ప్రత్యేకలోకంలోకి నిచ్చెన ఎక్కినట్టుగా ఎక్కివెళ్ళగలిగారు. వానాకాలపు మట్టితోవల వెంబడి, పచ్చగా తలెత్తి గాలికి ఊగే పైర్ల మధ్యనుంచి, దూరంగా కొండల నీడల్లో కనిపించే నీ స్వగ్రామానికి నువ్వు నడిచిపోతున్నప్పటి ఒక ఉత్సాహం, ఊరట, ఇన్నాళ్ళూ అదిమిపెట్టికున్న దిగులు ఇప్పుడు కరిగిపోతూ తేలికపడుతున్న భావన అక్కడ కూచున్న ప్రతి ఒక్కరినీ ఆవహించిందనడంలో అతిశయోక్తి లేదు.
ఆ తర్వాత వారు ఒక ధమార్ వినిపించారు. ఆ తర్వాత ‘బోలక్ నందకిసోర్’ అనే ఒక సూరదాస్ కృతిని, ‘పియా తోరె బాలక్’ అనే ఒక విద్యాపతి కృతిని ఆలపించారు. బీహారు నుంచి వచ్చిన ఆ గాయకులు ఒక మైథిలీ గీతాన్ని ఆలపించడంలో ఎంతో ఔచిత్యం ఉందనిపించింది. చివరగా ‘తూ కర్ తార్, తూ ఆధార్’ అనే కృతితో వారు తమ కచేరీ ముగించారు.
వారు ఆలపించిన సూరదాస్ కృతిని ఇక్కడ వినండి:
ఆ తర్వాత అశ్విని భిడే దేశ్ పాండే కచేరీ. ఆమెది జైపూరు-అత్రౌలి ఘరానా సంప్రదాయం. ఆమెకు పండిట్ లేలే అనే ఆయన పఖ వాజ్ తోనూ, వినయ మిశ్రా అనే ఆయన హార్మోనియంతోనూ సహకరించారు. ఆ ఇద్దరూ కూడా సిద్ధహస్తులని ఆ కచేరీ ఆద్యంతం తెలుస్తూనే ఉంది. గాయికా, ఆ ఇద్దరు వాద్యకారులూ కలిసి ఆ కచేరీని నిజంగానే ఒక పండగలాగా మార్చేసారు.
గాయిక మొదటగా పూరియా ధనశ్రీ రాగంలో తన ఆలాప్ ఎత్తుకున్నారు. పూరియా ధనశ్రీ ఋతుపవన రాగం కాదు. కాని సాయంకాలీన రాగం. పూర్వీ థాట్ కి చెందిన రాగాల్లో ఒక గాంభీర్యం కనిపిస్తూ ఉంటుంది. (ఇటువంటి రాగాల్లో ఒకటైన పూర్వీకల్యాణి రాగాన్ని తీసుకుని నేనొకప్పుడు ‘అపరాహ్ణ రాగం’ అని ఒక కథ రాసాను.) నిషాదస్వరంతో మొదలయ్యే ఆ రాగంలో దినాంత వేళల్లో కనవచ్చే ఒక నిండుతనం, ఒక రోజు ఫలప్రదంగా ముగించిన తృప్తి, దైనంగిన జీవితపు గడబిడ అణగిపోయినవేళల్లో ఉండే నిర్మలమైన నిశ్చింత వినిపించడంలో ఆశ్చర్యం లేదు. దాదాపు అరగంట సేపు సాగిన ఆ రాగాలాపనలో గాయిక తన మనసుని పూర్తిగా ఆవిష్కరించింది. కొంతసేపటికి నాకు ఒక రాగాలాపన వింటున్నట్టుగాకాక, ఒక నర్తకి విరహవేదన అభినయిస్తూ ఉంటే, ఆ నాట్యప్రదర్శన చూస్తున్నట్టూ అనిపించింది. ‘కైసే దిన్ కఠిన్ ‘అనే పదబంధాన్ని ఆమె పదేపదే ఆలపిస్తున్నంతసేపూ ఒక విరహిణి, ఒక దుఃఖదగ్ధ, పొగలు పొగలుగా అల్లుకుంటున్న తన నిట్టూర్పుల ప్రపంచంలో మనల్ని ముంచేస్తున్నట్టుగా ఉండింది.

ఏదో ఒక మీడియా స్క్రోలు చెయ్యకుండానో లేదా ఏదో ఒక ఛానెలు సర్ఫు చెయ్యకుండానో ఉండలేని మనఃస్థితికి చేరుకుంటున్న ఈ కాలంలో ఇటువంటి గాయిక సమక్షంలో కొంతసేపేనా గడపడం అన్నిటికన్నా ముందు ఒక చికిత్స. వానపడుతున్న సాయంకాలం నీ చేతుల్లో మొబైలు లేకుండానో, లేదా మొబైలు కనెక్టివిటీ లేకుండానో ఏదో ఆర్టిసి బస్సులో కొండ దారిన ప్రయాణించినప్పుడు నీ మనసు ఆ కొండలమీదా, ఆ చెట్లమీదా, ఆ నీరవదినంతకాంతిలోనూ కరిగిపోకుండా ఉండలేని అనుభవంలాంటి అనుభవం అది. మన శ్రేష్ఠకళలన్నీ మనకి ఈ విద్యనేర్పడానికే విలసిల్లాయనిపిస్తున్నది. ఏ విద్య? నీ మనసుని లోపలకి తిప్పే విద్య. ‘అరూపసాగరంలో మునిగిపోయే విద్య.’ కనీసం రోజులో కొంతసేపేనా రూపారణ్యం నుంచి బయటపడేసే విద్య.
ఆ అలాప్ తోనే ఆమె మనల్ని ఏం చెయ్యాలో అదంతా చేసేసారు. ఆ తర్వాత రాగ జైజవంతిలో తాన్ సేన్ కృతిని ఒక ఖయాలుగా వినిపించారు. అందులో మొదటి రెండు భాగాలూ- స్థాయి, అంతర వరకు నేర్పారని, మిగిలిన రెండు భాగాలూ సంచారి, ఆభోగ్ తాను భత్కండే వంటి పెద్దల గ్రంథాల చదివి సాధన చేసాననీ చెప్పారు. జైజవంతితో ఆమె వాతావరణాన్ని మార్చేసారు. చెప్పలేని ఒక ఉల్లాసాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఋతుసంగీతధర్మాన్ని అనుసరించి ఒక వర్షాకాల మనోగతాన్ని వ్యక్తం చేసే ఒక టుమ్రీ తోనూ, తన కచేరీనీ భైరవి రాగంలో ఒక దాద్రాతోనూ నిజంగానే ఒక పండగవేడుకని పట్టుకొచ్చారు.
కచేరీ పూర్తయి బయటకి వచ్చేటప్పటికి వాన వెలిసింది. నగరం నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంటూ ఉంది. ఒకప్పుడు ఇటువంటి సంగీతం రాజాస్థానాల్లోనే కాదు, ఇళ్ళల్లోనూ, గ్రామాల్లోనూ కూడా వినిపించేది. అదిలాబాదులాంటి చిన్నచిన్నపట్టణాల్లో కూడా సంగీతవర్షధార వర్షిస్తూనే ఉండేదని సదాశివగారి యాది చదివితే తెలుస్తుంది. కాని ఇప్పుడు చెవులు బద్దలు గొట్టే ఫిల్ము సంగీతం మాత్రమే కాదు, పండగలంటే, పగలూ రాత్రీ వీథుల్ని మోతెక్కించే డిజె చప్పుళ్ళు మాత్రమే మన జీవితానుభవంగా మిగుల్తున్నాయి. ఇటువంటి కాలంలో ఇటువంటి సంగీతం జల్లులాగా కాదు, కుండపోత లాగా మన జీవితాల్లో కురవాలంటే మనమేం చెయ్యాలి?
14-9-2025


👏👏👏
ధన్యవాదాలు
సంగీత ధార ని మధురమైన పద జాలం తో వర్ణించి వర్షిత్సవానికే వన్నె తెచ్చిన తీరు ప్రశంస దగినది.
హృదయపూర్వక ధన్యవాదాలు!