బసవన్న ముగ్ధభక్తి

బసవన్న వచనాలనుంచి మూడువందల వచనాలు ఎంపికచేసి నేను తెలుగులోకి అనువదించి పుస్తకంగా వెలువరించిన సంగతి మీకు తెలిసిందే. కిందటి డిసెంబరులో తీసుకువచ్చిన ఆ పుస్తకం మీద ఇన్నాళ్ళకు ఒక నిండైన సమీక్ష లభించింది. ఆత్మీయులు న్యాయపతి శ్రీనివాసరావు బసవన్న పట్ల అపారమైన గౌరవంతోనూ, నా పట్ల అపారమైన అభిమానంతోనూ రాసిన ఈ వ్యాసాన్నిక్కడ మీతో పంచుకుంటున్నాను.


బసవన్న ముగ్ధభక్తి

వాసు

బసవణ్ణ (1131–1167) లేదా బసవేశ్వరుడి గురించి ఇంకా పరిశోధనలూ అధ్యయనాలూ కొనసాగుతూనే ఉన్నాయి. ఈయన 12వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. సామాజిక, ధార్మిక, సాహితీ రంగాల్లో బసవన్న తెచ్చిన విప్లవం అనూహ్యమైనది (నిజానికి బసవణ్ణ అనే అనాలి, ఎందుకంటే కన్నడలో ‘అణ్ణ’ అంటే జ్యేష్ట సోద రుడనీ ‘అన్న’ అంటే అన్నమనీ అర్థాలున్నాయి. అయితే తెలుగు పాఠకుల కోసం బసవన్న అనే మార్చి రాస్తున్నాను). ఈ శివాద్వైతి త్రికరణశుద్ధిగా నమ్మిందే చెప్పాడు, చేశాడు, బోధించాడు. ఇటువంటి వ్యక్తులు ఎంత అరుదంటే, గాంధీ గురించి ఐన్ స్టీన్ అన్నట్టుగా, ఈయన కొన్ని శతాబ్దాల క్రితమే మన దేశంలోనే అదీనూ పొరుగు రాష్ట్రంలో పుట్టి, జీవించి ప్రపంచాన్ని గౌతమ బుద్ధుని తరువాత అంతగానూ ప్రభావితం చేసిన వ్యక్తి అంటే నమ్మడం కష్టం. బసవన్న చెప్పినవీ రాసినవీ వచనాలు. వచనం అంటే, thing said అని ఎ.కె. రామానుజన్ అనువాదం. తెలుగు పాఠకులకు వచనం అన్నమాటను వేరే అనువదించి చెప్పక్కర్లేదు, అయినా బసవన్న వచన సారళ్యత తెలియజేసేందుకు ఎ.కె. రామానుజన్ ప్రసక్తి తెచ్చాను. బసవన్న ఎన్ని వచనాలు రాశాడన్నదీ, ఇవాళ బసవన్న వచనాలని ప్రచారంలో ఉన్నవాటిల్లో ఏవి ప్రక్షిప్తాలన్న విషయమూ నేటికీ పరిశోధనాంశాలే. ఈ పరిచయంలో నేను పరిశోధనల వైపు పోను. బసవన్న వచనాలను చాలామంది అనువదించారు. తెలుగులోనూ ఇవి ఇంతకు ముందు లభ్యమే. చినవీరభద్రుడి అనువాదం సరళమైన ఆధునిక తెలుగు వాక్యాన్నే ఆధారం చేసుకున్నది. మూలంలో కనిపించే బసవన్న పొందిన ఆధ్యాత్మికానుభూతిని సామాజిక బాధ్యతనూ ఈ అనువాదకుడు తెలుగు పాఠకుల్లో కలిగించాడు.

చినవీరభద్రుడిని తను రచనలు చేస్తున్న తొలినాళ్ళ నుంచీ నేను ఎరుగుదును. చినవీరభద్రుడు ఏ కవిలో నైనా ప్రతిభ ఉంటే కవి ప్రతిభావంతుడనే అంటాడు. చాలా మందిలో ప్రతిభతో పాటుగా వ్యుత్పత్తి, అభ్యా సమూ కనిపిచడం కద్దు. త్రికరణ శుద్ధి ఉన్న నైతిక మనీషిని మాత్రమే చినవీరభద్రుడు ‘ఈయన కదా మానవుడంటే’ అని అబ్బురపడతాడు, హారతి పడతాడు. చినవీరభద్రుడు బసవన్న వచనాలను అనువదించడంలో నాకు ఒక న్యాయం కనిపించింది. న్యాయం అంటే, T.S. Eliot St. John Perse ని అనువాదం చెయ్య డంలో కనిపించే న్యాయం. న్యాయం అంటే, శ్రీశ్రీ మయకోవస్కీని అనువదించడం లాంటి న్యాయం. పరిణతజ్ఞానంతోనూ అనుకంపించే హృదయంతోనూ సమాజాన్నీ మనిషినీ ప్రేమించే కవి సామాజిక, నైతిక, ధార్మిక, సాహితీ దిగ్ధంతిని ‘ఇతను కదా మానవుడు’ అని ఆనందబాష్పాల మధ్య పెట్టిన కేక ఈ అనువాదం. చినవీరభద్రుడు అనువదించిన మూడువందల (299 + 1 అధికవచనం) బసవన్న వచనాలు చినవీరభద్రుడు మనసు పెట్టి రాసిన ఏ కవితైనా బాగున్నట్టే, ఇవీ బాగున్నాయి. అది చెప్పడం కాదు. ఈ పరిచయం ముఖ్యోద్దేశం, ఈ పుస్తకానికి చినవీరభద్రుడు రాసిన ఏబై పేజీల ముందుమాట ముఖ్యం. పాఠకులీ ముందు మాటను ముందే చదివినా సరే, లేక, నా లాగ, బసవన్న వచనాలు చదివిన తరువాత చదివినా సరే, ఈ ముందుమాటలో ఉంది అసలు రహస్యం.

‘ఎడమ చేతిలో పాలగిన్నె కుడి చేతిలో బెత్తం పట్టుకొని’ వస్తున్న బసవన్న చినవీరభద్రుడిని ఎలా ఆకట్టుకున్నదీ, మన దేశంలో వివిధ ధార్మికమథనాల అంతస్సూత్రం, ఏ ధర్మవీరుణైనా ఎలా అనుసరించాలో తెలిసీ తెలియని తనంతో తదనుయాయులు చేసే పనులూ, ధర్మసంస్థాపకుడి నిర్యాణానంతరం అను యాయుల్లో కనిపించే చీలికలూ, ప్రజలు ఏ మతాన్నైనా ఎవరు చెప్పినా ఎందుకు నమ్మాలన్న చింతనా, దాదాపుగా అసలు మనిషికి ఏం కావాలన్న తొలి ప్రశ్న- ఇన్ని వివరాలూ ఈ ముందుమాటలో ఉన్నాయి. ఇంతే కాక, బసవన్న ఉపనయ కర్మను తిరస్కరించి, పుష్కరకాలం గురుకులంలో చదువుకొని అన్ని వేదవేదాంగాలూ అభ్యసించి లింగధారియై శివాద్వైతిగా ఏకేశ్వరోపాసన చేస్తూ జంగమదేవరలను కొలుస్తూ ప్రజల భాషలో ప్రజల కోసమై చెప్పిన వచనాల origin and provenance కూడా ముందుమాటలో ఉన్నాయి. చినవీరభద్రుడికి ఈ పుస్తకానికి ముందుమాటరాయడానికే ఎక్కువ టైమ్ పట్టిందా లేక బసవన్నను. అనువదించడానికి ఎక్కువ టైమ్ పట్టిందా? ఏమో!

2

ఇవి బసవన్న రాసిన (చెప్పిన) షట్-స్థల వచనాలు. బసవన్న భక్తి జ్ఞానభక్తి అనీ శాంతభక్తి అనీ కొందరనగా చినవీరభద్రుడు బసవన్నది ముగ్ధభక్తి అని నమ్ముతున్నాడు. బసవన్న కాలపు వీరశైవం నిమ్నకులస్థులకు శివదీక్షనిచ్చినా వారిని తమతో కలుపుకోలేదు. ఇక్కడ బసవన్న క్రాంతదర్శిగా కనిపిస్తూ అందరినీ కలుపుకున్నాడు. అందరూ ఒక్కటే అని నమ్మిన శివాద్వైతి నుంచి అందరూ ఏమాశిస్తారో అదే చేశాడు బసవన్న. కనుకనే ప్రజ పెద్ద ఎత్తున స్పందించి బసవన్న అనుయాయులయారు. శంకరుడూ, రామానుజుడూ తాత్వికంగా సత్యమొకటే అని ప్రతిపాదించినా, వ్యవహారంలోకి వచ్చినప్పటికి వారికి ఉన్న అడ్డంకులను బసవన్న తోసిరాజని నమ్మిన సత్యాన్నే ఏకేశ్వరోపాసననే ఉద్ఘాటిస్తూ అట్టడుగున ఉన్న అణగారిన ప్రజల పక్షం వహించి positive discriminationని తొలిగా కనబర్చాడు. సహజం గానే బసవన్న ప్రభావం కొన్ని వర్గాలకు కంటగింపై అతని మీద ఫిర్యాదులు పుట్టాయి. అవి రాజు దాకా వెళ్ళినా, బసవన్న మారలేదు. చివరికి కూడల సంగమం చేరి బసవన్న అక్కడే శివైక్యం చెందాడు.

భారత దేశంలో భక్తికవులు చూపిన వెలుగులో తమ తమ రాజకీయ, సామాజిక మేనిఫెస్టోలను కార్యాచరణలనూ రూపొందించుకున్న గాంధీ, అంబేడ్కర్ వంటి వారు సాధించిన విజయాలను వామపక్ష రాజకీయాలు సాధించలేకపోవడానికి కారణం, విప్లవ పక్షాలకు భక్తికవి లేకపోవడమే అని చినవీరభద్రుడు అంటున్నాడు. ఇక్కడ చెరబండరాజు ఒక exception అని నేను నమ్ముతాను. ఏ మతానుయాయులైనా తమ మతం social ascendancy లో ఉండగా లభించిన privileges కు బానిసలై ఐహిక సుఖాల్లో ఓలలాడుతూంటే, క్రమేపీ వారి మతం అంతస్సంఘర్షణకు లోనై బలహీనపడుతుందనీ చినవీరభద్రుడు చారిత్రక ఆధారాలతో చెబుతున్నాడు. నిజానికిక్కడ సమాజంలో ఉన్నది బహుదేవతారాధనా లేక ఏకేశ్వరో పాసనా అన్నది కాదు, మత పెద్దల నైతిక నడవడి ఎటువంటిదనేదే ప్రశ్నగా నిలుస్తోంది.

3.

బసవన్న శివాద్వైతానికి ఉదాహరణ: (వచనం 139);

బసవన్న తరువాతి వారైన శ్రీనాథుడ్నీ ధూర్జటినీ మేల్కొలిపిన వచనం 161.

ఈ కింది వచనం 174 ఎన్నో భాషల్లో సామెత అయిపోయింది.

ఈ కింది వచనం 255 బసవన్న వ్యక్తుల పై పై మెరుగులకూ ధార్మికచిహ్నాలకూ విలువనివ్వడనీ, శివ శరణులనే ఎన్నుతాడనీనూ తన భక్తి గూర్చీనూ చెపుతోంది:

బసవన్న వినయశీలతనూ భక్తిగాంభీర్యతనూ చూపెట్టే వచనం:

దైవం మానుష రూపేణా:

చినవీరభద్రుడు ఈ అనువాదానికి జోడించిన అదనపు నవ్యత ప్రతి వచనానికీ దాని మొదటి పంక్తిలోని మాటల్నే శీర్షికగా పెట్టడం. చివరిగా ఒకే ప్రశ్న మిగిలి పోతుంది. బసవన్నలో ఇంత బహుముఖీనమైన ప్రజ్ఞతోపాటూ హిమాలయం అంతెత్తెదిగిన నైతికతకూ నమ్మిన విశ్వాసాలకు చూపిన నిబద్ధతకూ మూలమ నదగినవయిన బసవన్న బాల్యంలోని అనుభవాలేమిటి? ఇది బహుశా భవిష్యత్తరం కనుక్కోవాలి.


ఈ పుస్తకం డిజిటల్ కాపీ ఇక్కణ్ణుంచి డౌన్లోడు చేసుకోవచ్చు. https://chinaveerabhadrudu.in/wp-content/uploads/2024/11/muduvamdalavachanalu.pdf

13-9-2025

2 Replies to “బసవన్న ముగ్ధభక్తి”

  1. బసవన్న జీవితం, వచనాలు సమాజానికి ఆధ్యాత్మిక బోధ మాత్రమే కాక సామాజిక విప్లవం కూడా.ఆయన త్రికరణశుద్ధి, నిజాయితీ, సమానత్వం కోసం పోరాటం అరుదైనది. చినవీరభద్రుడు గారు చేసిన అనువాదం కేవలం పదాల మార్పు కాక, అనుభూతి పునర్నిర్మాణం. ప్రతి వచనానికి మొదటి పంక్తినే శీర్షికగా పెట్టడం అనువాదంలో వినూత్నత.
    బసవన్న భక్తి ముగ్ధభక్తి అనే వ్యాఖ్యానం ఆయన ప్రత్యేకతను గుర్తిస్తుంది.అణగారినవారిని సమాజంలో కలిపిన మొదటి ధార్మిక సంస్కర్తగా నిలిచారు. వచనాలు సాధారణ భాషలో, ప్రజలకు దగ్గరగా ఉండటం వాటి ప్రభావాన్ని పెంచింది. ఆయన భక్తి వినయం, దృఢ విశ్వాసం నేటికీ ఆదర్శంగా నిలుస్తాయి.సామాజిక, ధార్మిక నేతలకు నైతికతే ప్రధానమని ఆయన జీవితం చెబుతుంది. బసవన్న బాల్యానుభవాలపై మరింత పరిశోధన అవసరమని ఈ వ్యాసం గుర్తుచేస్తుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading