వానపడ్డ రాత్రి

ఎప్పుడొచ్చాయో తెలీదు, ఒకరాత్రివేళ
బాల్కనీలో, పోర్టికోలో, పచ్చిగడ్డివాసనతో
ఆవుల మందలు.

కొమ్ములమీద, చెవులమీద వెలుగుతునకలు
చిన్ని చిన్ని దీపాల్లాంటి కళ్ళ చుట్టూ
ధారలుకట్టిన మెరుపులు.

వానపడ్డ రాత్రి చేలల్లో నీళ్ళతో
సహా నగరంలోకి గ్రామం కొట్టుకొచ్చింది.
నగరం కొట్టుకుపోయింది.

వానాకాలం మొదలయ్యింది, దారులు
చెరిగిపోయాయి, రథాలు కదలవు, మనో
రథాలే దిక్కన్నాడు పూర్వకవి.

పసులమందల చిత్తడిలో,
వానపడ్డ రాత్రి, పాతదారులు చెదిరిపోయి
కొత్తదారులు తెరుచుకున్నాయి.

28-8-2025

14 Replies to “వానపడ్డ రాత్రి”

  1. Wah!!

    “నగరంలోకి గ్రామం కొట్టుకొచ్చింది.
    నగరం కొట్టుకుపోయింది.”

    Beautiful కవిత, sir! 🙏🏽

  2. పచ్చి గడ్డివాసనతో …..గోమాత భూమాత రూపంలో వానతో వచ్చింది . నగరం కొట్టుకు పోయి కొత్తదారి తెరచుకుంది
    రవిగాంచని భావములను
    కవిగాంచును కనులతోడ కమ్మని కవితన్
    చవిజూపును చదువరులకు
    నవమార్గపు దిశను జూపు నాణ్యత యెసగన్
    అభినందనలు సర్ .

  3. అన్ని మాటలూ భలే వున్నాయండీ.

  4. వర్షాకాలపు రాత్రి నగరంలో జరిగే ఒక అద్భుత దృశ్యాన్ని కళ్లముందుంచారు. పచ్చిగడ్డి వాసనతో పాటు ఆవుల మందలు నగరంలోకి ప్రవేశించడం, వాటి కొమ్ములపై మెరుస్తున్న నీటి చుక్కలను చిన్న దీపాలతో పోల్చడం కవిత్వ సౌందర్యానికి నిదర్శనం. వర్షం కారణంగా పాత దారులు చెరిగిపోవడం, కొత్త దారులు తెరుచుకోవడం జీవనంలో అనివార్యమైన మార్పును సూచిస్తుంది. గ్రామం నగరంలో కలవడం కేవలం భౌతిక దృశ్యం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక కలయిక కూడా. మొత్తం మీద, ఈ కవిత ప్రకృతి, మనిషి, సమాజం మధ్య ఉన్న అనుబంధాన్ని సున్నితంగా ప్రతిబింబిస్తుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading