
వానపడి వెలిసాక నా చిన్నప్పుడు మా ఊళ్ళో మా ఇంటి చుట్టూ ఉండే వెదురుదడిమీంచి చిన్ని చిన్ని నీటిబిందువులు వేలాడుతుండేవి. అవి అప్పటిదాకా వాన అనుభవించిన ఉద్వేగాన్ని తీరిగ్గా నెమరేసుకుంటున్నట్టుగా ఉన్నంతసేపూ ఆ కంచెనట్లానే వేలాడుతూ ఉండి ఎప్పుడో నిశ్శబ్దంగా జారిపోయేవి. ఇన్నేళ్ళు పోయాక ఇప్పుడు నాకు తెలుస్తున్నదేమిటంటే ఆ వానబిందువులు నాకు అనుభవంలోకి తెచ్చిన నిశ్శబ్దం కూడా అక్కడే ఉండిపోయిందని.
ఆ నిశ్శబ్దాన్ని వెతుక్కోడం కోసమే ప్రపంచ మహాకవుల ముంగిట నా హృదయాన్నొక భిక్షాపాత్రగా చేసి నిలబడుతుంటాను. అలా వెతుక్కుంటూ ఉండగా ఎప్పుడో ఒక ఎమిలీ డికిన్ సన్ ఇలాంటి ఒక కవితని (1864, ed. Thomas H Johnson,862) నా భిక్షాపాత్రలో జారవిడుస్తుంది.
Light is sufficient to itself-
If others want to see
It can be had on Window Panes
Some Hours in the Day
But not for compensation-
it holds as large a Glow
To squirrel in the Himmaleh
Precisely, as to you
(కాంతి తనకోసమే వెలుగులీనుతుంది. అయినా ఎవరేనా చూడాలనుకుంటే అప్పుడప్పుడు ఏరోజేనా కొన్ని గంటలపాటు కిటికీ అద్దాలమీద నిలబడుతుంది.
అలాగని తనేమీ ప్రతిఫలం కోరుకోదు. అది నీకోసం ఎంత వెలుగుచిమ్ముతుందో హిమాలయాల్లో తిరుగాడే ఒక చిన్ని ఉడత కోసం కూడా అంత వైభవంతోటీ ప్రకాశిస్తుంది.)
అందుకనే మిత్రులొకరు అమెరికానుంచి వస్తున్నాను, మీకేమి పుస్తకాలు కావాలో చెప్పండి అనడిగితే ప్రలోభపడకుండా ఉండలేకపోయాను. ఆ మిత్రులు కిందటేడాది కూడా నాకోసం వంద డాలర్ల విలువ గల పుస్తకాలు తెచ్చారన్న సంతోషవార్త అప్పుడే మీతో పంచుకున్నాను కూడా. ఈసారి కూడా అలాగే మరో వంద డాలర్ల మేరకు పుస్తకాలు తెస్తానంటే కాదనలేకపోయాను. అందుకని, ఇదుగో, ఈ పుస్తకాలు తెప్పించుకున్నాను. పుస్తకాల కోసమైతే నా భిక్షాపాత్ర ఎత్తిపట్టుకోడానికి నాకెప్పటికీ సంతోషమే.
Emily Dickinson’s Gardening Life: The Plants and Places That Inspired the Iconic by Marta McDowell

The Gardens of Emily Dickinson by Judith Farr, Louise Carter

The Book of Flowers: Wordsworth’s Poetry on Flowers by William Wordsworth

Modern Greek Poetry by Kimon Friar

Lives of the Eminent Philosophers: Compact Edition, by Diogenes Laertius (Author), Pamela Mensch (Author), James Miller (Editor)

The Flowering of Modern Chinese Poetry: An Anthology of Verse from the Republican Period by Herbert Batt (Translator), Sheldon Zitner (Translator)

వారం రోజులకిందటనే నా భిక్షాపాత్ర నిండిందిగాని పుస్తకాలకు అట్టవెయ్యకుండా తెరవలేను కదా! నిన్నటికి అట్టలేసే పని పూర్తయ్యింది. ఒక్కోపుస్తకానికీ అట్టవేస్తూ కవితాప్రసాదునే తలుచుకున్నాను. ఇలానే సంక్షేమభవనులో కూచుని ఫ్లిఫ్ కార్టులో వచ్చిన కొత్త పుస్తకానికి అట్టవేసుకుంటూ ఉంటే నా ఎదురుగానే కూచుని ఉండేవాడు, ఓపిగ్గా. అట్టవెయ్యడం పూర్తవగానే ‘దొరవారూ, ముందు నేను చదివి మీకిస్తాను’ అని తీసుకుపోయేవాడు.
ఇంక రానున్నరోజుల్లో ఈ పుస్తకాల గురించి ఎలానూ మీతో పంచుకుంటానుకాబట్టి, ఇప్పటికి మాత్రం ఈ పుస్తకాల దాతకి ధన్యవాదాలు చెల్లించనివ్వండి.
10-8-2025


విజయ్ జీడిగుంట గారికి అభినందనలు !
ధన్యవాదాలు సార్
అది మీకు భిక్షాపాత్ర
మాకు అక్షయామృతపాత్ర
నిరంతరాక్షర శివాభిషేక ధారాపాత్ర
త్రికాలలో సాహిత్యాచమనంచేసే ఉద్ధరణీయుత పంచపాత్ర .నమస్సులు
హృదయపూర్వక ప్రణామాలు సార్!
“ఆ నిశ్శబ్దాన్ని వెతుక్కోడం కోసమే ప్రపంచ మహాకవుల ముంగిట నా హృదయాన్నొక భిక్షాపాత్రగా చేసి నిలబడుతుంటాను. “
నేను మీ ఎదుట 🙏🏽
ప్రణామాలు మాధవీ!
మేమూ ఇలాగే ప్రతిపుస్తకం అత్తా వేసుకుని కలిసి చదివే వాళ్ళం 74 ప్రాంతంలో ఏదైనా మానుకుని నెలకు 5 పుస్తకాలు కొనేవాళ్ళం చెదలు పెట్టలేక వితరణ చెయ్య వలసి వచ్చింది
అట్ట వెయ్యడం అంటూ గుర్తు చేసారు
కవితా ప్రసాద్ గారిని కూడా
భిక్షపాత్ర కింద మా చేతులే భిక్షపాత్ర
హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా!
ఒక జిజ్ఞాస నడిపిస్తోంది. ఏం చేసినా పంచడానికే. ఎంతయినా చదివి ఆకలింపు చేసుకునే శక్తి మీది. మీ మాటలు ఒక స్ఫూర్తి ఒక ప్రేరణ. అభినందనలు
హృదయపూర్వక ధన్యవాదాలు రాజుగారూ!
గ్రేట్ కలెక్షన్… వారెంతో సహృదయులు… మీరు ధన్యులు.. మున్ముందు ఆ పుస్తకాల గురించి మీరు రాస్తారు, మేము తెలుసుకుంటాము… మేమూ ధన్యులమే!
🙏❤️🌹
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
మీ ఈ వచనం చదివితే, అది కేవలం జ్ఞాపకాల పంచకం కాకుండా ఒక పుస్తకాల పట్ల ఉన్న ప్రేమ, వానబిందువుల్లాంటి నిశ్శబ్దాన్వేషణ, సాహిత్యాన్ని భిక్షగా స్వీకరించే వినయాన్ని కలిపిన జీవనచిత్రంలా అనిపిస్తుంది. వాన తరువాత వెదురుపై తులతూగిన నీటి బిందువుల నుంచి ఎమిలీ డికిన్సన్ కవిత దాకా మీరు వేసిన ప్రయాణం చాలా సహజంగా, కవితాత్మకంగా ఉంది. కాంతి తనకోసమే వెలుగుతుందనే ఆ భావాన్ని మీరు మీ పుస్తకాల పట్ల చూపిన నిస్వార్థ ఆనందంతో కలిపి చెప్పడం ఈ రచనలోని అందమైన ముడిపట్టు. మొత్తానికి, ఇది ఒక సున్నితమైన అనుభూతిని పుస్తకాలు, జ్ఞాపకాలు, కవిత్వం, స్నేహం అన్నింటినీ కలిపి నిదానంగా రాసిన ఒక చిన్న సాహిత్యరత్నంలా ఉంది.
హృదయపూర్వక ధన్యవాదాలు శైలజా! ఎంత సునీతమైన హృదయం మీది!