
ఫేసు బుక్కులో History of Literature అని ఒక పేజి ఉంది. మూడు రోజుల కిందట అందులో బాల్జా, చెహోవ్ ల మధ్య ఒక కల్పిత సంభాషణ పోస్టుచేసారు. కల్పితం ఎందుకంటే, వాళ్ళిద్దరూ సమకాలికులు కారు. కాబట్టి కలుసుకునే అవకాశం లేనేలేదు. కాని యూరపియను సాహిత్యంలో వారిద్దరూ రెండు బలమైన దృక్పథాలకీ, రచనాశైలులకీ ప్రతినిధులు.
Honoré de Balzac (1799-1850) ఫ్రెంచి మహారచయిత. ఆయన కాలంలో రొమాంటిసిజం ఒక ప్రభంజనంలాగా హోరెత్తుతున్నప్పటికీ, నెపోలియను అనంతర ఫ్రెంచి సామాజిక జీవితాన్ని అత్యంత వాస్తవిక ధోరణిలో చిత్రించేడు. తన మొత్తం రచనల్ని La Comédie Humaine పేరిట వెలువరించాడు. డాంటే క్రైస్తవ ఆధ్యాత్మిక స్ఫూర్తితో రాసిన కావ్యాన్ని Divine Comedy అని పిలిస్తే, బాల్జా తన మానవజీవన చిత్రణని Human Comedy అని అభివర్ణించుకున్నాడన్నమాట. తదనంతర వాస్తవిక ఉద్యమాల పైనా, ముఖ్యంగా ఫ్రెడరిక్ ఎంగెల్సు పైనా బాల్జా ప్రభావం అపారం.
ఆంటోన్ చెహోవ్ (1860-1904) రష్యన్ కథకుడు. ప్రపంచ కథకుల్లో అతడిది మొదటిస్థానం కావడమే కాదు, ఇన్నేళ్ళుగానూ, ఆ స్థానం చెక్కుచెదరకుండానే ఉంది. చెహోవ్ కూడా వాస్తవికతను చిత్రించినవాడేగాని, బాల్జాలాగా, దాన్నొక మహోద్యమంలానూ, బృహత్ప్రమాణాల్తోనూ చిత్రించడం మీద అతడికి ఆసక్తి లేదు. నిజానికి యూరోపులో వాస్తవికతావాదం సన్నగిల్లి, నాచురలిజం, ఇంప్రెషనిజం బలపడుతూ, చివరికి మాడర్నిజం తలెత్తే కాలందాకా చెహోవ్ కథలు రాస్తూ వచ్చాడు. అతడిది ఇంప్రెషనిస్టిక్ శైలి అని టాల్ స్టాయి ఏ ముహూర్తంలో అన్నాడోగాని, అతడి కథనం ఫ్రెంచి ఇంప్రెషనిస్టు చిత్రకారులకీ, సింబలిస్టు కవులకీ సన్నిహితంగా ఉంటుంది. జీవితాన్ని చూసింది చూసినట్టుగా, జీవితసన్నివేశాల్లో కనిపించే మనుషుల పట్ల ఎటువంటి తీర్పులూ తీర్చకుండా, రోజువారీ సంఘటనల్లోంచే మనిషి తన అంతరంగానికి సన్నిహితంగా జరిగే సాక్షాత్కార క్షణాల్ని ఆయన తన కథల్లో పట్టుకున్నాడు.
సాధారణంగా విమర్శకులు భిన్న ధ్రువాల్లాంటి ఇద్దరు రచయితలని పోల్చి చూడటానికి బాల్జానీ, కాఫ్కానీ కలిపి చూస్తారు. కానీ బాల్జానీ, చెహోవ్ నీ కలిపి ఇలా ఒక సంభాషణ అల్లడం కొత్తగానూ, ఆసక్తిగానూ అనిపించింది. మీ కోసం ఆ సంభాషణ తెలుగులో:
దుమ్మూ, బూడిదా
చెహోవ్ (సగం కాలి ఆరిపోయిన ఒక అగ్గిపుల్లని తన వేళ్ళమధ్య పెట్టుకుని పరిశీలనగా చూస్తూ): హోనోర్, మీరు కార్యకారణ సంబంధాన్ని నమ్ముతారు. కాలగతినీ, పర్యవసానాల్నీ నమ్ముతారు. కాని చెప్పండి, ఆ గడియారంలో స్ప్రింగు తెగిపోతే? దాన్ని వెన్నంటి నడిచేది నడవకపోతే?
బాల్జా (రచనావ్యాసంగంలోనే తనువు చాలించేవాళ్ళల్లో కనిపించేలాంటి జ్వరగ్రస్తమైన మెరుపు కళ్ళల్లో కదలాడుతుండగా) అలాంటప్పుడు ఆ స్ప్రింగుని మళ్ళీ వెనక్కి తిప్పుదాం. జీవితం విఫలమైనచోట ఆ తర్కాన్ని సాహిత్యం తిరిగి సమకూర్చుకోవలసి ఉంటుంది. లేకపోతే సాహిత్యం ఎందుకంట? నవల అంటేనే దానికొక ఆర్కిటెక్చరు ఉండాలి, అంటోన్, లేకపోతే, అది నాలిక మీద వట్టి బూడిదగా మిగిలిపోతుంది.
చెహోవ్: కానీ చాలా జీవితాలు పతాకకి చేరుకోకుండానే ముగిసిపోతాయి. మనుషులు మరణించేది, గొప్ప ఉద్రేకావస్థలో తీవ్ర స్థితికి చేరుకున్నాక కాదు, చాలా సార్లు, ఒక ఉత్తరం రాయడం మర్చిపోయి మరణిస్తారు. ఆర్కిటెక్చరంటూ ఏదీ లేదు. ఉన్నదంతా ఒక చిత్తుప్రతి, ఎన్నిసార్లు మూసినా సరిగ్గా మూసుకోని తలుపు.
బాల్జా (అపనమ్మకంగా) కాని అదే కదా విషాదం! చిన్న గడ్డిపోచనుంచి ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టి దాన్ని పారిసు అని పిలవడం. అదే మానవ తప్పిదం, అదే మానవ వైభవం కూడా! కానీ నువ్వేమో దాన్ని దగ్గుకీ, మాసిపోయిన పరదాలకీ పరిమితం చేసేస్తున్నావు.
చెహోవ్: ఎందుకంటే, మనకి సత్యం కనిపించేది అక్కడే. దాన్ని మనం అటకలో పట్టుకోవాలి, కెతడ్రళ్ళల్లో కాదు. మనుషులు పడిపోయేది మహోన్నత శిఖరాల మీంచి కాదు. వాళ్ళ పడగ్గదికీ, జీవితానికీ మధ్యనుండే మెట్లమీంచి జారిపడిపోతూంటారు.
బాల్జా: నువ్వు డ్రామాని సందేహిస్తున్నావు.
చెహోవ్: లేదు, నేను నమ్మలేకపోతున్నది కృత్రిమత్వాన్ని. జీవితంలో ముగింపులుండవు, అవశేషాలు మాత్రమే మిగుల్తాయి.
బాల్జా (ఇప్పుడు కొద్దిగా నెమ్మదించి): అలాగైతే రాయడమెందుకు?
చెహోవ్: సాక్ష్యం చెప్పడానికి. ఏమి జరిగిందో దాన్ని గుర్తించడానికి, అలా జరిగినప్పుడు ఏమీ సంభవించకపోయినా సరే. జీవితాన్ని వివరించడానికి కాదు, ఆ ప్రకంపనల్ని పరిరక్షించుకోడానికి.
బాల్జా: నేను విధిని సరిదిద్దడానికి రాస్తాను.
చెహోవ్: నేను దాన్ని క్షమించడానికి రాస్తాను.
బాల్జా (నిట్టూరుస్తూ) చిత్రం, కాని, మనమిద్దరం కథలు రాయడానికి పూనుకుంటున్నాం. నువ్వు నీ మౌనంతో, నేను నా ఉరుముగర్జనతో.
చెహోవ్ (ఆరిపోయిన అగ్గిపుల్లని తిరిగి పెట్టెలో పెడుతూ) కాని ఇద్దరిలోనూ జ్వలిస్తున్నది ఒకటే అగ్ని. నీలో ఆ నిప్పు ఇంకా ప్రజ్వరిల్లుతోంది. నాలో ఇప్పటికే మండిమండి చల్లారిపోయింది.
మరి నువ్వు, పాఠకుడా? ఒక పుస్తకం చదివి ముగించేక, దేన్నుంచో విడుదలయినట్టుగా భావిస్తావా లేక నేరారోపణకు గురయినట్టుగా భావిస్తావా?
15-7-2025


బాల్జా రచన జీవితాన్ని ఒక శిల్పంలా చూస్తుంది. అతడికి సమాజం ఓ నిర్మాణం – పునాది, గోడలు, పైకప్పు కలిగిన భవనం. ప్రతీ మనిషి ఆ భవనంలో ఒక విభాగం. అతడి రచనల్లో సామాజిక శ్రేణులు, రాజకీయాలు, ఆర్ధిక వ్యవస్థ – ఇవన్నీ పాత్రల్ని నడిపే శక్తులు. ఆయన సాహిత్యాన్ని ‘విధిని సరిదిద్దే ప్రయత్నంగా’ చూశాడు. అద్భుతమైన నిర్మాణశైలిలో, స్పష్టమైన కథా శ్రేణితో, బాల్జా నవల వాస్తవికతకు ఓ శిల్పంగా నిలుస్తుంది.
చెహోవ్ రచన జీవితాన్ని అర్థం కాని మసక వెలుతురులో గమనించినట్టుగా ఉంటుంది. అతడికి జీవితంలో కథా నిర్మాణం లేదు ఉన్నదంతా చిన్న సంభాషణలు, మూలుగులు, మౌనాలు, అపురూపమైన క్షణాలు. అతడి కథలు ఎటు పోతాయో మనకు తెలియదు – అలాగే జీవితమూ. అతడి రచన “సాక్ష్యం చెప్పడం కోసం, ఆ ప్రకంపనల్ని పరిరక్షించుకోవడం కోసం” రాసినవిగా ఉంటాయి. అతనికి జీవితం కటిష్ట ముగింపుల కంటే మధ్యలోని సందిగ్ధతలు ముఖ్యం.
ఈవిధంగా, బాల్జా వాస్తవికతను గణనాత్మకంగా పసిగట్టాడు – చెహోవ్ వాస్తవికతను సంభ్రమంతో గమనించాడు.
ఒకరు చట్టాల్ని చూడడానికే దృష్టి పెట్టాడు; మరొకరు చిట్కా ముక్కల మధ్య కదలే హృదయాన్ని పట్టుకున్నారు.
అయినా ఇద్దరిలోనూ ఒకటే అగ్ని – సాహిత్యమంటే జీవితం.
ఎంత అద్భుతంగా చెప్పారు శైలజా! ఈ వ్యాఖ్య దానికదే ఒక చక్కటి తులనాత్మక వ్యాసం!
మీ నుండి ప్రశంస .. ధన్యవాదాలు సర్