ఆత్మ సంగీతం

ఆశ్చర్యమే! ప్రేమ్‌చంద్ ఇలాంటి కథ రాసాడంటే! కాని ఆశ్చర్యం లేదు. రావిశాస్త్రి ‘వెన్నెల’ కథ రాసినట్టు, ముళ్ళపూడి వెంకటరమణ ‘కానుక’ కథ రాసినట్టు, ప్రేమ్‌చంద్ ఈ కథ రాసాడనుకోవచ్చు. ఎంత కవితాత్మకంగా ఉంది! ఎంత భావగర్భితంగా ఉంది! అందుకని ఉండబట్టలేక, నేరుగా హిందీ నుంచి అనువాదం చేసి, ఈ ‘ఆత్మ గీతం’ (1927) కథని మీతో పంచుకుంటున్నాను.


అర్థరాత్రి. నది ఒడ్డు. ఆకాశంలో తారలు స్థిరంగా ఉన్నాయి. వాటి ప్రతిబింబాలు నది అలల్తో పాటు సంచలిస్తున్నాయి. హృదయంలో ఆశలనీడలు పరుచుకుని ఉన్నట్టుగా, లేదా ముఖమండలంపై శోకం పరుచుకుని ఉన్నట్టుగా ఒక స్వర్గ సంగీతం తాలూకు మనోహరమైన జీవనదాయక, ప్రాణపోషక ధ్వనులు ఈ నిస్తబ్ధ, తమోమయ దృశ్యంలో ఒక వెలుగుని ప్రసరిస్తున్నాయి. రాణీమనోరమ ఈ రోజు గురుదీక్ష స్వీకరించింది. రోజంతా దానధర్మాల్తో, వ్రతాల్తో గడిచిపోయేక ఒక తియ్యని నిద్ర ఒడిలో ఆమె సేద దీరుతున్నది. అకస్మాత్తుగా ఆమె కన్నులు తెరుచుకున్నాయి. మనోహరధ్వనులేవో ఆమె చెవుల్ని తాకుతున్నాయి. దీపాన్ని చూసిన రెక్కలపురుగులాగా ఆమెనొక  వ్యాకులత ఆవహించింది. చక్కెరవాసన తగిలిన చీమలాగా ఆమె ఉద్విగ్నురాలై మేల్కొంది. లేచి ద్వారపాలకుల, చౌకీదారుల కన్నుగప్పి రాజమహలునుంచి బయటకొచ్చింది. వేదనాపూర్వకమైన ఆ ఆక్రందన వినబడుతున్నకొద్దీ  ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్ళు ప్రవహించడం మొదలుపెట్టాయి.

నది ఒడ్డున ముళ్ళపొదలు. ఎత్తైన ఒడ్డు. భయానకమైన జంతువులు. భయం పుట్టిస్తున్న వాటి అరుపులు. అక్కడ శవాలున్నాయి, అంతకన్నా భయపెడుతున్నవి వాటి గురించిన ఊహలు. మనోరమ కోమలత, సుకుమారత మూర్తీభవించిన ఒక రూపు. కాని ఆమె వింటున్న మధుర సంగీతం తాలూకు ఆకర్షణ, దానిలో ఆమె తాదాత్మ్యత ఆమెని లాక్కుపోతూ ఉన్నవి. ఆమెకి ఆ సమయంలో ఆపదల గురించిన ధ్యాసలేనే లేదు.

అలా ఆమె గంటలకొద్దీ నడుచుకుంటూ పోతూనే ఉంది, నది ఆమె దారికి అడ్డుపడేదాకా.

2

వివశురాలై మనోరమ తన దృక్కుల్తో అటూ ఇటూ పరికిస్తూ ఉన్నది. నది ఒడ్డున ఒక నావ కనిపించింది. ఆమె ఆ పడవ దగ్గరకు పోయి ‘నావికుడా, ఈ మనోహర రాగం నన్ను వ్యాకులపరుస్తున్నది, నేను అవతలి ఒడ్డుకు వెళ్ళాలి’ అని అంది.

పడవవాడు: రాత్రిపూట పడవ విప్పడానికి కుదరదు. గాలి చాలా తీవ్రంగా ఉంది. అలలు భయపెడుతున్నాయి. ప్రాణాలకే ప్రామాదం.

మనోరమ: నేను రాణీ మనోరమను. పడవ తియ్యి, నీకెంత కావాలంటే అంతిస్తాను.

పడవవాడు: ఏమైనా చెప్పండి, పడవ నడపడం సాధ్యం కాదు. రాణులకి ఇది తగింది కాదు.

మనోరమ: నావికా, నీ కాళ్ళు పట్టుకుంటాను. తొందరగా పడవ తియ్యి. నా ప్రాణాలు కొట్టుకుపోతున్నాయి.

పడవాడు: అందుకు లభించే పారితోషికం?

మనోరమ: నువ్వు ఎంతంటే అంత.

పడవవాడు: మీరే చెప్పండి. రాణుల్ని ఏమడగాలో ఈ మొద్దుకేం తెలుస్తుంది? నేను మీతో బేరమాడితే అది మీకే తలవంపు కాదా?

మనోరమ: ఇదుగో, ఈ నా హారం చూడు. ఇది చాలా విలువైంది. దీన్ని నీకిచ్చేస్తాను అని అంటూ మనోరమ తన మెళ్ళోంచి ఆ హారాన్ని బయటకు  తీసింది. ఆ హారకాంతి ఆ నావికుడి ముఖం మీద మెరిసింది. ఆ మొరటు ముఖం మీద, ముడతలు పడ్డ అతడి  నల్లని ముఖం  మీద ఆ హారం మెరిసింది.

ఇంతలో ఆ సంగీత ధ్వని తనకు సమీపంగా వస్తున్నట్టుగా మనోరమకు తోచింది. ఎవరో ఒక పూర్ణ జ్ఞాని ఆత్మానంద సంతోషంలో ఆ సరిత్తటి మీద కూచుని ఆ నిస్తబ్ధ నిశీథిని సంగీతమయం చేస్తున్నట్టు తోచింది.  రాణి హృదయం ఎగిసిపడింది. ఆహా! మనసుని ఎంత ముగ్ధురాల్ని చేస్తున్నదీ రాగం! ఆమె తాళలేక, ‘నావికా, ఇంకా ఆలస్యం చేయకు, పడవ తియ్యి, ఇంకొక్క క్షణం కూడా నేను నిలవలేకపోతున్నాను’ అన్నది.

పడవవాడు: ఆ హారం తీసుకుని నేనేం చెయ్యాలి?

మనోరమ: అవి మేలిముత్యాలు.

పడవాడు: దీనిలో మరో ప్రమాదం కూడా ఉంది. మా ఆడమనిషిగాని ఈ హారం మెళ్ళో వేసుకుని కూచుంటే చుట్టుపక్కలవాళ్ళంతా అసూయతో రగిలిపోయి ఆమెని తిట్టడం మొదలుపెడతారు. దాన్నెక్కణ్ణుంచో దొంగిలించిందనుకుంటారు. చివరికది పాముని మెడకు చుట్టుకున్నట్టవుతుంది. నా గుడిసెమీద పడి పట్టపగలే దోచుకుపోతారు. లేదా దీన్ని నేనక్కణ్ణుంచో దొంగిలించానని చుట్టూ జనం నా మీద అభాండాలు వేస్తారు. వద్దమ్మా, నాకీ హారం వద్దు.

మనోరమ: అలా అయితే నీకేం కావాలో చెప్పు, అదే ఇస్తాను. ఇంకా ఆలస్యం చెయ్యకు. నాకు ఓపిక చాలడం లేదు. ఇంకొక్క క్షణమైనా వేచి ఉండటానికి శక్తి లేదు. ఈ రాగంలోని ఒక్కొక్క గమకం నా హృదయాన్ని చీల్చేస్తున్నది.

పడవవాడు: అయితే ఇంతకన్నా మంచిదేదైనా ఇవ్వండి.

మనోరమ: ఓరి క్రూరుడా! నువ్వు నన్నిట్లా మాటల్లో పెట్టి ఆపేస్తున్నావు. నేనేదిస్తానంటే అది వద్దంటున్నావు, అలాగని నీ అంతట నువ్వు నీకేంకావాలో చెప్పడం లేదు. ఈ సమయంలో నా హృదయంలో ఏమి సంభవిస్తున్నదో నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు నన్ను ఆత్మీయంగా పెనవేసుకుంటున్న దీనికోసం నేను నా సర్వస్వం  త్యాగం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాను.

పడవవాడు: మరేమిస్తారో చెప్పండి.

మనోరమ: నా దగ్గర ఇంతకన్నా విలువైన వస్తువు మరేదీ లేదు. కానీ ఇప్పుడు నువ్వు పడవతీసినట్టయితే, ఇదుగో, ఒట్టేసి చెబుతున్నాను, నీకు నా మహలునిచ్చేస్తాను. నువ్వది  ఎప్పుడో ఒకప్పుడు చూసే ఉంటావు. స్వచ్ఛమైన పాలరాతితో కట్టిన మేడ. మొత్తం దేశంలోనే దానికి సాటిలేదు.

పడవాడు (నవ్వుతూ): ఆ మహల్లో నివసిస్తే నాకేమి ఆనందం కలుగుతుంది చెప్పండి? పైగా నా అన్నదమ్ములు,చుట్టపక్కాలు నాకు శత్రువులైపోతారు. అర్థరాత్రిపూట ఈ నావలో పయనిస్తున్నప్పుడు కూడా నాకు భయం కలగదు. కాని ఆ మహల్లో నేను పట్టపగలే వణికి చస్తాను. నా పరివారమంతా కలిపినా కూడా ఆ మహల్లో ఒక మూలకి కూడా చాలరు. ఇంక మనుషుల్నెక్కణ్ణుంచి తేను? పనివాళ్ళనెక్కణ్ణుంచి తేను? దాన్లో పట్టేటంత సరుకూ సామగ్రీ ఎక్కణ్ణుంచే తెచ్చుకోను? దాన్ని శుభ్రంచేస్తూ ఉండటమెలాగా? మరమ్మత్తులెలాగ? బాగోగులు చూసుకోడమెలాగ? ఆ పువ్వులు వాడిపోతాయి, ఆ పక్కల మీదకి నక్కలు చేరతాయి, దాని అటకల్లో పావురాలూ, పిచికలూ గూళ్ళు కట్టుకుంటాయి.

మనోరమ అకస్మాత్తుగా ఒక తన్మయావస్థలో తుళ్ళిపడింది. ఆమెకి వినిపిస్తున్న ఆ సంగీతం మరింత దగ్గరగా వచ్చినట్టుగా తోచింది.  ఒత్తిని ఎగసనదోసినప్పుడు దీపం మరింత ప్రజ్వరిల్లినట్టుగా ఆ సంగీత సౌందర్యం, ఆనందం మరింత ఇనుమడిస్తున్నాయి. ఆ సంగీతం మొదట్లో మనసుని ఆకర్షించింది కాస్తా ఇప్పుడు హృదయాన్ని ఉద్వేగపరచడం మొదలుపెట్టింది. మనోరమ మరింత వ్యాకుల చిత్తంతో-ఆహా! మరి నీ అంతట నువ్వే నీకేం కావాలో చెప్పవెందుకు? ఆహా! ఎంత విరాగజనక రాగం. అది నన్నెంత విహ్వల పరుస్తూ ఉన్నది! నేనింక ఒక్క క్షణం కూడా ఓపిక పట్టలేను. ఈ నదిని దాటిపోవాలని ఎంత ఉద్వేగచిత్తురాలిగా ఉన్నాను! ప్రవహించడానికి నీళ్ళు త్వరితపడుతున్నట్టుగా, గాలికోసం ఊపిరి తపిస్తున్నట్టుగా, ప్రసరించడానికి సుగంధం ఆత్రుతపడ్డట్టుగా ఆ స్వర్గసంగీతం కోసం నేని ట్లా వ్యాకులపడుతున్నాను. ఆ సంగీతంలో కోకిలలో వినిపించే ఉల్లాసమేదో ఉంది. చకోరంలో వినిపించే వేదనలాంటిది ఉంది. సాయంసంధ్యలో కనిపించే విహ్వలత్వం ఉంది. ఇందులో జలపాతాల ఆవేగం ఉంది. తుపానులో కనిపించే ప్రచండత ఉంది. దీనిలో అవన్నీ కలిసి ఉన్నాయి. ఇది వింటున్నప్పుడు వివేకాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంది. దీని వల్ల ఆత్మకొక సాంత్వన చేకూరుతున్నది. అంతరంగం తేటపడుతున్నది. ఓ నావికా! నేనింక ఒక్క క్షణం ఆలస్యం చేసినా అది నాకు మృత్యుసమానమే. తొందరగా పడవ తియ్యి. ఇది ఏ సుమసుగంధమో, ఇది ఏ దీపదీప్తినో అక్కడికి నన్ను తొందరగా తీసుకుపో. ఈ సంగీతకర్త ఎవ్వరో ఇక్కడే ఎక్కడో దగ్గరలో, చాలా దగ్గరలో ఉన్నాడుగానీ నేను కనుగొనలేకపోతున్నాను.

పడవమనిషి: మీ మహల్తో నాకు పనిలేదు. నా గుడిసె దానికన్నా ఎన్నో రెట్లు అందమైంది.

మనోరమ: అయ్యో! అయితే నేన్నీకు ఏమివ్వాలి? ఇది సంగీతం కాదు. ఇది ఈ సువిశాల క్షేత్రం తాలూకు పవిత్రత. ఈ సమస్త సుమసమూహాల సౌరభం, సమ స్త మధుర్యాల మాధురి, సమస్త జీవితావస్థల సారాంశం. పడవ తియ్యి. నేనెంతకాలం బతికితే అంతకాలం నీకు సేవచేసుకుంటాను. నీకోసం నీళ్ళు తోడిపెడతాను. నీ గుడిసె ముంగిలి చిమ్మిపెడతాను. నువ్వు నడిచే దారి శుబ్రం చేస్తాను . నీ గుడిసెని పూలతో అలంకరిస్తాను, నీ ఆడమనిషి కాళ్ళు ఒత్తిపెడతాను. ప్రియ నావికా, నాకే గనక నూరు జన్మలు లభిస్తే అవన్నీ ఈ సంగీతంకోసం అర్పించుకుంటాను. దేవుడిముఖం చూసి నన్ను నిరాశ పర్చకు. నా ధైర్యంలో చివరి బొట్టుకూడా వట్టిపోతూ ఉంది. నా ఈ కోరికలో అగ్ని రగులుతున్నది. నేను నా శిరసుతో నీ పాదాలముందు ప్రణమిల్లుతున్నాను.

ఇలా మాట్లాడుతూనే మనోరమ ఒక విక్షిప్తావస్థలో ఆ పడవమనిషి దగ్గరకు పోయి అతడి చరణాలముందు కూలిపోయింది. ఆ క్షణాన ఆమెకి ఆ సంగీతం తన వైపు వస్తున్నట్లుగా,  ప్రజ్వలిస్తున్న దీపకాంతిలాగా అది తన మీద వర్షిస్తున్నట్టుగా అనిపించింది. ఆమెకి రోమాంచమైంది. ఉన్మత్తురాలై నర్తించడం మొదలుపెట్టింది. ఆమెకి గాల్లో తేలుతున్నట్లుగా ఉంది. ఆమెకి రెండుపక్కలా తారకలు మెరుస్తూ కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె ఒక  ఆత్మవిస్మృతికి లోనయ్యింది. ఆ ఉన్మత్త సంగీతం, ఆ మనోహర రాగం ఇప్పుడు ఆమె ముఖం నుంచే వెలువడుతున్నట్లుగా ఉంది. అవే అమృతబిందువులు ఆమె అధరాలమీంచి స్రవిస్తున్నాయి. ఆమెనే ఆ సంగీతస్రోతస్వినిగా కనిపిస్తున్నది. నదీతీరమ్మీంచి వినవస్తున్న ధ్వనులు, ప్రాణం పోస్తున్న ఆ ధ్వనులు ఇప్పుడు ఆమె నుంచే వినవస్తున్నవి. మనోరమ ముఖమండలం చంద్రసమానంగా ప్రకాశిస్తున్నది. ఇప్పుడామె నేత్రాలనుంచి పరిపూర్ణ ప్రేమకాంతి ప్రసరిస్తున్నది.

10-5-2025

4 Replies to “ఆత్మ సంగీతం”

  1. ఎంత గొప్ప కథ. రాణీ మనోరమ అంతరంగం లోకి పాఠకుడు పరకాయ ప్రవేశం చేస్తాడు.
    ఒక అలౌకికానందం ముందు భోగభాగ్యాలు సిరిసంపదలు అన్నీ దిగదుడుపే. ఆ ప్రహ్లాద పారవశ్యం , ఆ నిగ్రహాతీత ఉద్వేగం , ఆత్రుత
    రసైకలోకంలోకి తీసుకుని వెళ్తుంది.నమస్సులు.

  2. నిజమే సర్. ఈ కథ లో పరిపూర్ణ ప్రేమకాంతి నిండి ఉంది. గొప్ప అనువాదం.. ప్రేమచంద్ ప్రేమకాంతి నీ స్పష్టంగా దించేశారు మీరు.. శాస్త్రి గారి వెన్నెల, రమణ గారి కానుక కు సరిపోలుతుంది సర్.. గొప్ప ఎంపిక

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading