
చలంగారికి మండువ జగ్గారావుగారని ఒక మిత్రుడుండేవాడు. ఆయనకి ఇంగ్లిషు రాదు. అందుకని చలంగారు ఆయన కోసం ఉమర్ ఖయ్యాం రుబాయీల్ని తెలుగులోకి అనువదించారు. ఆ తర్వాత వాటిని అచ్చు వేస్తూ ‘తెలుగులోకంలో ఇంకో జగ్గరావుని యోచించుకోలేను, కానీ ఉన్నారేమోనని, ఈ అచ్చు’ అని రాసారు. ఆ పుస్తకం నా చేతులకి వచ్చేటప్పటికి చలంగారు ఈ లోకం విడిచిపెట్టేసారు. లేకపోతే నేనాయనకు ఉత్తరం రాసి ఉండేవాణ్ణి: చలంగారు, ఆ మరో జగ్గారావును నేనే అని.
ప్రతి కవికీ, రచయితకీ ఎవరో ఒక జగ్గారావు ఉండే ఉంటారు. చలంగారు అదృష్టవంతులు. ఆయనకు కనీసం ఆ జగ్గారావు మిత్రుడు కూడా. కానీ చాలాసార్లు ఎందరో రచయితలు తమ జగ్గారావు ఎవరో తెలుసుకోకుండానే, చూడకుండానే, ఆ జగ్గారావును కలుసుకోకుండానే ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు.
చలంగారు నిజంగానే అదృష్టవంతులు. ఆయనకి ఒక జగ్గారావు వ్యక్తిగతంగా తెలుసు. కాని మరో జగ్గరావు నారూపంలో లేదా ఆ ఉమర్ ఖయ్యాం రుబాయీలు చదివి సంతోషించిన ప్రతి ఒక్క పాఠకుడిరూపంలో ఆయనకు దొరుకుతూనే ఉన్నారు. మరో జగ్గారావు ఉండవచ్చునేమో అన్న ఆయన ఆశ వమ్ము కాలేదు.
నాకు ఉమర్ ఖయ్యాం తెలియకముందే రామిరెడ్డి ‘పానశాల’ చేతుల్లోకి వచ్చింది. తాడికొండ రోజుల్లోనే, అంటే నా హైస్కూలు దినాల్లోనే, ఆ పద్యాలు నాకొక రసభాండాన్ని పరిచయం చేసాయి. కాని ఆ పద్యాలు చదివిన ప్రతిసారీ వాటి అర్థం వేపుకు మనసు పోనీకుండా ఏదో సన్నని సితారు సంగీతం నా చెవుల్లో గీపెడుతున్నట్టే ఉండేది. ఆ తర్వాత చాలా ఏళ్ళకు ఫిడ్జెరాల్డ్ ని తెరిచాను. కానీ ఒక్క పద్యంలోకి కూడా ప్రవేశించలేకపోయాను. సూటువేసుకుని టై కట్టుకున్న ఒక విక్టోరియన్ యుగపు బ్రిటిష్ పెద్దమనిషి తనజాతివాళ్ళు మాట్లాడుకునే భాషలో ఆ సూఫీ కవిత్వాన్ని నాకు అర్థం కాకుండా చేసేసాడనిపించింది.
కానీ చలంగారి అనువాదం చదివినప్పుడు, అప్పుడు, నిజంగా ఉమర్ ఖయ్యాం నాకు ఎంతోకొంత అర్థమయ్యాడు. ఇదుగో, ముఖ్యంగా ఇలాంటి కవితలు చదివినప్పుడు, ఆ మాట్లాడుతున్నది ఖయ్యామో, చలమో తేడా తెలిసేది కాదు. చూడండి:
ఓ సాయంత్రం వీధి వెంట పోతున్నాను.
రూపభాండాల్ని తయారుచేసే కమ్మరి
నిర్దయగా తడిమన్నుని మర్దన చేస్తున్నాడు.
అంత అణగగొట్టినా, పాపం,
ఆ మన్ను జాలిగా అంటోంది-
‘అన్నా, నెమ్మది. అంత గట్టిగా కొట్టకు’ అని.
ఇది నిస్సందేహంగా చలంగారి భాష. కాని ఖయ్యాము కూడా ఈ భాషలోనే రాసాడని నమ్మవచ్చు. ఇది భాష సంగతి. ఇక tone చూడండి, ఈ కవితలో:
మనం ఆకాశమంటామే- ఆ బోర్లించిన మూకుడు,
దానికింద వొంగిపోయి పాక్కుంటో బతుకుతున్నామే, చస్తున్నామే
దానికేసి సహాయం చెయ్యమని చేతులెత్తి ఏం ప్రయోజనం లేదు.
నీకు మల్లేనే, నాకు మల్లేనే
అదీ అంత నిస్సహాయంగా దొర్లుకుంటో పోతోంది.
భూమి మీది మొదటిమట్టి తయారైనప్పుడే
భూమి మీదికి వొచ్చే చివరిమనిషి ఆకారాన్ని చెయ్యడం కోసం
మట్టిని మర్దన చేసి వుంచారు.
ఈలోకంలో పండబోయే చివరిపంటకి
ఆనాడే మొదట్లోనే విత్తులు నాటేశారు.
ఈ సృష్టి ప్రారంభిమించిన మొదటి ఉదయానే
చివరి ఉదయపు లెఖ్ఖలన్నీ వేసేశే వున్నాయి.
ఇది చలంగారి వాక్యనిర్మాణం మాత్రమే కాదు, ఆలోచనా పద్ధతి కూడా. మనిషిలో వచ్చే పరిణామమంతా అతడి అంతరంగంలోనూ, సంస్కారంలోనూ వచ్చేదికాదనీ, అతణ్ణి రూపొందించిన మట్టి సృష్ట్యాదినుంచి చివరిదాకా ఒక్కలానే ఉంటుందని ఇంతకన్నా బలంగా ఎవరు చెప్పగలరు?
కాని ఆ సౌందర్య సంతోషముందే, చలంగారికి తెలిసిన సంతోషం ఖయ్యాముకి కూడా తెలిసే ఉంటుందని, ఇదుగో, ఇలాంటి కవిత చదివితే మనకి బాగా తెలుస్తుంది:
వాళ్ళలో ఒకరు అన్నారు.
ప్రపంచ మధుశాలాధికారి మనుషులు ఆయన్ని సమర్థిస్తో
అంటారు- ఇదంతా ఆయన మనకి పెట్టే పరీక్షట.
ఆయన హృదయం మంచిదేట.
చివరికి అంతాసరిచేసి ఎక్కడో ఎప్పుడో సుఖపెడతాట్ట.
ఇట్లాంటి మాటలు చెప్పి
ఆయన మొహానికి నరకం పొగని నల్లగా పట్టిస్తారు.
ఓ పాత్ర దీర్ఘంగా నిట్టూర్చి అంది-
చాలాకాలం ఎవరూ చూసేవారు లేక నా మట్టి ఎండిపోయింది
ద్రాక్షరసంతో నించండి నన్ను. క్రమంగా కోలుకుంటానేమో.
ఇంతకీ ఎందుకు రాస్తున్నాను ఇప్పుడిదంతా! ఎందుకంటే నా చుట్టూ ఉన్న ప్రపం చంలో కవులకీ, కథకులకీ తమ రచనల గురించి లోకం ఏమనుకుంటోందో తెలుసుకోడం పట్ల ఎంత ఆసక్తి! ఆసక్తి చిన్నమాట. ఎంత దాహం! ఎంత ఆత్రుత!
కానీ మొన్న ఒక పుస్తకావిష్కరణ సభకి పిలిస్తే ఇదే చెప్పాను: మీరు నిజంగా మీ హృదయం ఏమి చెప్తోందో దాన్నే రాయదలుచుకుంటే, మీకు ఒక్క పబ్లిషరు కూడా దొరక్కూడదు, ఒక్క పాఠకుడు కూడా మీకు తన స్పందన చెప్పకూడదు అని. ఎందుకంటే పబ్లిషరు అంటూ ఒకడు దొరగ్గానే మీ రచన ఒక పెట్టుబడివస్తువుగా మారిపోతుంది. మీ హృదయం చెప్పేది వినడం మానేసి పబ్లిషరు చెప్పే లెక్కలు పట్టించుకోడం మొదలుపెడతారు. ఇక పాఠకుడంటారా! మీకు పాఠకులుండాలిగాని వాళ్ళెవరో మీకు తెలియకూడదు. తెలిస్తే మీరింకెంత మాత్రం మీ అంతరాత్మకు నచ్చినట్టు రాసుకోలేరు. ఏం రాస్తే, ఎలా రాస్తే మీ ప్రియపాఠకుడు please అవుతాడో తెలియక మీరెప్పుడూ ఒక గందరగోళంలోనే గడుపుతారు. ఒక్క పాఠకుడు కూడా ఒక మహారచయితని కూడా ఎంత కంగారు పెట్టగలడో తెలియాలంటే గురజాడ అప్పారావుగారికీ, ఒంగోలు మునిసుబ్రహ్మణ్యంకీ మధ్య నడిచిన ఉత్తరప్రత్యుత్తరాలు చూడండి.
చలంగారు కాబట్టి ఒక జగ్గారావు దొరికినా ఆయన తన భాషని , తన tone ని , తన సౌందర్య దర్శనాన్ని భద్రంగా నిలబెట్టుకోగలిగారు. నేనైతే సాహిత్యాధిదేవతను ప్రార్థించేది ఇదే: ‘అమ్మా, నా జీవితంలో నాకు ఒక్క జగ్గారావు కూడా తారసపడకూడదు’ అనే.
24-4-2025


అద్భుతమైన విశ్లేషణ.
బహుశా ఈ సందర్భానికి సరిపోదేమో కానీ నిష్కామ కర్మ కి ఇది మరో రూపమేమో.
నా అజ్ఞానాన్ని క్షమించగలరు.
ధన్యవాదాలు సార్!
మీరు కొత్త కొత్త విషయాలు చెప్పినంత కొత్తగా మిమ్మల్ని అభినందించడం చేతకాని పని. ఇంతకు ముందే రాసిన కవితను ఫేస్బుక్ లో ఎందుకు పెట్టావు, పత్రికకు పంపిస్తే బాగుండునని. నేను రాయటమే ఫేస్బుక్లో రాస్తాను. మనసు నిలువనీయనప్పుడల్లా . ఎవరు చదువుతున్నారనేది కాదు నా మనసు విప్పుకోవడం ముఖ్యమని . అది పోస్టు చేయగానే ఇది కనిపించింది. 🙏
ధన్యవాదాలు సార్!
Excellent sir. 💐
Thank you