జార్జి మోసెస్‌ హోర్టాన్‌

జార్జి మోసెస్‌ హోర్టాన్‌ పుట్టడమే 1797 ప్రాంతంలో నార్త్‌ కరోలినా రాష్ట్రంలో విలియం హోర్టాన్‌ అనే ప్లాంటేషన్‌ మేనేజరు బంధువర్గానికి బానిసగా పుట్టాడు. నార్త్‌ కరోలినా అమెరికా సంయుక్త రాష్ట్రాలకి ఆగ్నేయదిశలో ఉన్న దక్షిణాది రాష్ట్రం. 1797 ప్రాంతంలో విలియం హోర్టాన్‌ తన బానిసల్లో కొంతమందిని తన బంధువు జేమ్స్‌ హోర్టాన్‌కి అప్పగించడంతో జేమ్స్‌ హోర్టాన్‌ తోటల్లో జార్జి హోర్టాన్‌ బానిసగా పుట్టిపెరిగాడు.

ఫిల్లిస్‌ వీట్లీ పుట్టిపెరిగిన బోస్టన్‌కీ నార్త్‌ కరోలినాకీ సముద్రమంత వ్యత్యాసముంది. అమెరికాలో బానిస దురాచారాన్ని మొదణ్ణుంచీ ప్రోత్సహించి, చివరకు దాన్ని చట్టబద్ధం చేసిన దక్షిణాది రాష్ట్రాల్లో పుట్టిపెరిగినవాడిగా హోర్టాన్‌ బానిసత్వమంటే ఎలా ఉంటుందో పూర్తిగా చవిచూసాడు. ఫిల్లిస్‌కి చదువు, అది కూడా ఎంతో ఉన్నతస్థాయి, సంస్కార వంతమైన సాహిత్యవిద్య అదృష్టవశాత్తూ లభ్యమయ్యింది. కానీ అదే చదువుకోసం హోర్టాన్‌ నిరంతరం పోరాటం చేస్తూనే ఉండవలసి వచ్చింది.

మొదట్లో అతడు బైబిలు వినడం ద్వారా, చర్చి ప్రార్థనా గీతాలు ఆలకించడం ద్వారా వినడం నేర్చుకున్నాడు. శ్రవణం మననానికి దారితీసింది. ఇక కావలసింది పఠనం. అందుకోసం అతడు ఎలానో ఇంగ్లిషు అక్షరమాల నేర్చుకోగలిగాడు. ఈ ప్రయాణమంతా అతడు 1845 లో ప్రచురించిన తన కవితాసంపుటికి సుదీర్ఘమైన ముందుమాటగా రాసుకున్నాడు. ఆ గాథ ఎంత హృదయవిదారకమో అంత ఉత్తేజకరం కూడా. అణచివేతకి గురయినవాళ్ళకి సంకెళ్ళు తెంచుకునే దారి చదువు ద్వారానే గోచరిస్తుందని చెప్పే కథనం అది.

అక్షరమాల నేర్చుకున్నక, కింగ్‌ జేమ్స్‌ బైబిలు నుంచి పొందిన స్ఫూర్తి వల్ల అతడు కవితలు కూర్చడం నేర్చుకున్నాడు. కాని వాటిని రాయలేడు. కవితలు కూర్చి వినిపించ గలడన్నమాట. ఆ రోజుల్లో అంటే అతడు తన యజమాని తోటల్లో పండిన పండ్లు, కాయగూరలు సంతకి పట్టుకుపోయి అమ్మి తిరిగి రాడానికి రోజూ పదిమైళ్ళపాటు నడిచి పోవలసి ఉండేది. ఆ దారిలోనే నార్త్‌ కరొలినా యూనివెర్సిటీ ఉండటంతో ఆ విద్యార్థులకి అతణ్ణి చూస్తే ఆశ్చర్యంగా ఉండేది. ఎక్కడా, ఏ పాఠశాలలోనూ చదువుకోని ఒక బానిస పిల్లవాడు ఇంగ్లిషులో కవిత్వం చెప్తుంటే విని వాళ్ళు ముగ్ధులయ్యేవారు.

నెమ్మదిగా వారు అతడి పద్యాలు కొనుక్కోడం మొదలుపెట్టారు. ఒక్కో కవితనీ పాతికసెంట్లకి అమ్మేవాడు. ఆ డబ్బుతో పుస్తకాలు కొనుక్కునేవాడు. కొన్ని పుస్తకాలు విద్యార్థులే ఉచితంగా ఇచ్చేవారు కూడా. అలా అతడికి ముర్రే ఇంగ్లిషు గ్రామరు, జాన్సన్‌, షెరిడన్‌, చాకర్‌ లాంటి వారు కూర్చిన  డిక్షనరీలు దొరికాయి. వాళ్ళ ద్వారా అతడికి మిల్టన్‌ పారడైజ్‌ లాస్ట్‌, హొమర్‌ ఇలియడ్‌, ఒడెస్సీ కొన్ని భాగాలు, షేక్స్పియర్‌, బైరన్‌ల నుంచి ఏరి కూర్చిన చిన్నపాటి సంకలనాలు, ప్లుటార్క్‌ జాగ్రఫీ కొంత భాగం కూడా దొరికాయి. అమెరికన్‌ విప్లవం గురించిన ఒక పుస్తకం కూడా దొరికింది. కాని వాటిని సాకల్యంగా చదువుకోగలిగే సమయం మాత్రం అతడికి చిక్కేది కాదు.

1836 దాకా కూడా నార్త్‌ కరోలినా రాష్ట్రంలో బానిసలకి చదువు నిషేధం కాదు. దాంతో కరొలిన్‌ లీ హంజ్‌ అనే ఒక రచయిత్రి, నాటకకర్తకి  హోర్టాన్‌ చదువుపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం చిక్కింది. ఆమె వల్ల అతడు తన కవిత్వానికి పదును పెట్టుకునే అవకాశం దొరకడమే కాక, ప్రచురించుకునే అవకాశం కూడా దొరికింది. అలా మొదటిసారిగా 1828 లో లంకాస్టర్‌ గెజెట్‌ అనే పత్రికలో అతడివి మూడు కవితలు అచ్చయ్యాయి. ఆ కవితలతో మరికొన్ని కవితలు కలిపి అతడు 1829 లోThe Hope of Liberty అనే కవితాసంపుటి అచ్చువేసుకున్నాడు. అమెరికన్‌ చరిత్రలో బానిసగా జీవిస్తూ అమెరికన్‌ గడ్డమీద మొదటిసారిగా కవిత్వాన్ని అచ్చువేసుకోడం ద్వారా అతడు చరిత్ర సృష్టించాడు.

1830లో అతడు తోటిబానిస వనితను ఒకామెను పెళ్ళి చేసుకున్నాడు. కాని బానిసలకు పెళ్ళిళ్ళు చట్టరీత్యానిషేధం. వాళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారుగాని, ఆ కుటుంబం గురించిన తక్కిన వివరాలేవీ మనకు తెలియవు.

అతడు కవిత్వం రాసుకోడం మొదలుపెట్టి, అచ్చువేసుకున్నాక, అతడి స్వాతంత్య్ర కాంక్ష మరింత తీవ్రతరం అయ్యింది. తనని బానిసత్వం నుంచి విడిపించమని, ప్రసిద్ధ అబాలషనిస్టు విలియం లాయడ్‌ గారిసన్‌కి 1844 లో ఒక ఉత్తరం రాసాడు. 1852 లో న్యూయార్క్‌ హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌కి ఒక ఉత్తరం కూడా రాసాడు.

ఈలోగా తన కవిత్వం అమ్ముకుని ఆ వచ్చిన డబ్బుతో తన స్వాతంత్య్రాన్ని కొనుక్కోవచ్చనే ఆశ కూడా అతడికి కలిగింది. దాంతో 1829 లో ఒక ప్రచురణ కర్త అతడి అప్పుడే The Hope of Liberty పేరిట ప్రచురించుకున్న పుస్తకంలోని కవితలు కొన్నింటిని Poems by a Slave అనే పేరిట ప్రచురించి, దాంతో పాటు ఒక విజ్ఞాపన కూడా చేసాడు. ఆ పుస్తకంలో అతడి కవితలు కొన్ని మాత్రమే నమూనాగా పొందు పరిచామనీ, అతడిని బానిసత్వం నుంచి విడిపించాలనుకున్నవాళ్ళు, ఆ పుస్తకం కొనడం ద్వారా అతడికి ఆర్థిక సహాయం అందించినట్టవుతుందనీ ఒక పౌర విజ్ఞాపన చేసాడు. 

1837 లో ఆ కవితల్ని రెండవ సారి ముద్రిస్తూ L.C.G అనే ఆయన ఆ మొదటి ముద్రణ ఎన్ని కాపీలు అమ్ముడయ్యాయో దానివల్ల హోర్టాన్‌కి ఎంత వరకూ మేలు జరిగిందో, హోర్టాన్‌కి తగిన సొమ్ము లభించి బానిసత్వం నుంచి విడుదల కాగలిగాడో లేదో తెలియడం లేదని రాసాడు. కానీ ఆ రెండవ ముద్రణ వెలువడిన వెంటనే అదే ఏడాది ఆ ప్రచురణకర్తకి ఒకాయన లేఖ రాసాడు. అందులో మొదటిముద్రణవల్ల హోర్టాన్‌ కి ఆశించినంత సహాయం అందలేదనీ, అందువల్ల అప్పటికీ, అంటే 1837 నాటికి కూడా, హోర్టాన్‌ ఇంకా బానిసగానే బతుకుతున్నాడనీ రాసాడు! ఆ తర్వాత మరొక ముప్ఫైఏళ్ళకి, అంటే 1863 లో బానిసత్వ నిషేధచట్టం వచ్చి, 1865 లో యూనియన్‌ దళాలు బానిసల నందరినీ విడుదల చేసేదాకా హోర్టాన్‌ బానిసగానే జీవిస్తూ ఉన్నాడు!

అతడి జీవితంలో నిజంగా దుర్భరమైన అధ్యాయం అంటే ఇదే. అతడు తన తొలి కవిత్వం 1829 లో అచ్చువేసుకుంటే, ఆ తర్వాత ముప్ఫై ఏళ్ళకు పైగా అతడిరకా బానిసగానే జీవించవలసి రావడం. తాను బానిసగా జీవిస్తున్నాడు అనే చైతన్యం లేకపోయి ఉంటే, ఆ నరకం వేరు. కాని తాను బానిసగా జీవించవలసి వస్తూండటాన్ని తన మనసూ, బుద్ధీ కూడా అంగీకరించడం లేదని తెలిసాక కూడా ఆ జీవితమే జీవించవలసి రావడంలోని నరకం మన ఊహకి కూడా అందేది కాదు.

బానిసత్వం నుంచి విడుదలయ్యాక అతడు ఫిలడెల్ఫియాలో కొన్నాళ్ళున్నాడు.  కథలూ, కవితలూ రాసి పత్రికలకు పంపేవాడు. కాని బానిసత్వం నుంచి బయటపడ్డ సంతోషం అతడికి ఎక్కువరోజులు మిగల్లేదు. ఇప్పుడు బానిసత్వం స్థానంలో వర్ణవివక్ష వచ్చిచేరింది. తమ విమోచన రాజకీయవిముక్తినే తప్ప సామాజిక విమోచన కాదని అతడికి అర్థమయ్యింది. తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల నిస్పృహ చెంది అతడు తాను విడుదలైన మరుసటి ఏడాదే పశ్చిమ ఆఫ్రికాలోని లైబీరియాకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడి సంగతులేవీ తెలియదు.

ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్య చరిత్రలో చాలా విధాలుగా హోర్టాన్‌ మొదటివాడనే స్థానం సంపాదించాడు. అతడికన్నా ముందు ఫిల్లిస్‌ వీట్లి కవిత్వం అచ్చువేసుకున్నప్పటికీ ఆ పుస్తకం ఇంగ్లాండులో ముద్రించినందువల్ల, అమెరికన్‌ నేల మీద తొలిసారిగా తన రచనను అచ్చువేసుకున్న ఘనత హోర్టాన్‌కే సొంతమయ్యింది. అలాగే ఫిల్లిస్‌ పుట్టడం ఒక స్వతంత్రపౌరురాలిగా ఆఫ్రికాలో పుట్టి బానిస వ్యాపారుల చేతుల్లో అపహరణకు గురై అమెరికాలో బానిసగా మారింది. కాని హోర్టాన్‌ పుట్టడమే బానిసగా పుట్టి కవిగా మారి కవిత్వం ప్రచురించుకున్నాడు.

అలాగే తాను అక్షరాస్యుడు కాకపోయినప్పటికీ కవిత్వం చెప్పడమే కాక, ఆ కవిత్వాన్ని పుస్తకరూపంగా తీసుకురాగలిగిన ఖ్యాతి కూడా హోర్టాన్‌దే. మరొక ఘనత కూడా అతడు సొంతం చేసుకున్నాడు. తాను బానిసత్వంలో మగ్గుతూ ఒకటి కాదు, ఏకంగా రెండు సంపుటాలు వెలువరించిన మొదటి కవి కూడా అతడే.

అంతేకాదు, ఫిల్లిస్‌ కవిత్వంలో బానిసత్వం గురించిన ప్రస్తావనలుగానీ, తన జాతి అనుభవిస్తున్న వివక్ష గురించి అసమ్మతిగాని లేకపోడం చూసాం. కాని  బానిసత్వం పట్ల ఆవేదన, అసమ్మతి ప్రకటించిన మొదటికవిగా హోర్టాన్‌ నిలబడిపోతాడు. బానిస తన బానిసత్వాన్ని ద్వేషిస్తే తప్ప బానిసత్వం నుంచి బయటపడటం మొదలైనట్టు కాదు. కాబట్టి ఆఫ్రికన్‌-అమెరికన్‌ స్వాతంత్య్ర కాంక్ష హోర్టాన్‌తోనే మొదలయ్యిందని చెప్పవచ్చు. అతడి మొదటి కవితాసంపుటి వెలువడినప్పటికి డగ్లస్‌ ఇంకా బానిసత్వంలోనే మగ్గుతున్నాడు. కాని డగ్లస్‌ సాహసించి తన బానిసత్వపు చెరనుంచి ఎలానో తప్పించు కోగలిగాడు. తప్పించుకున్నాక తన జీవితం మొత్తం తోటి బానిసల విముక్తికే అంకితం చేసాడు. ఆ విశేషాలన్నీ మనం తరువాతి అధ్యాయంలో ఎలానూ చూడబోతున్నాం.

కాని గమనించవలసిందేమంటే, హోర్టాన్‌ స్వాతంత్య్రకాంక్ష అతడి విముక్తి చుట్టూతానే పరిభ్రమించింది. ఒకసారి విముక్తులయ్యాక బానిసల కష్టాలు తీరిపోవనీ, వారు బానిసత్వం అనే పెనం మీంచి జాతివివక్ష అనే పొయ్యిలో పడతారనీ అతడు ముందే గ్రహించాడు. ఇక్కడ పొందుపరచిన రెండు అనువాదాలూ ఆ రెండు పరిస్థితులకీ అద్దం పట్టేవే.

మొదటి కవిత, ఒక బానిసగా జీవించవలసి వచ్చిన తన దురవస్థని చిత్రిస్తున్న కవిత. ఆ రకంగా అతడు racial subjectivity ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. తన ఉద్వేగాన్ని తనలాంటి బానిసల హృదయాల్లోకి ప్రసరింపచేయగలిగాడు. రెండో కవిత, అతడు స్వతంత్ర పౌరుడయ్యాక ఫిలడెల్ఫియాలో ఉంటున్నప్పుడు అక్కడి రోడ్లమీద అతణ్ణి  వాహనాలు ఎక్కించుకోకపోడం చూసి అసమ్మతి ప్రకటిస్తూ రాసిన కవిత. ఇక్కడికి వచ్చేటప్పటికి అతడు మొదటిసారిగా పౌరహక్కుల గురించిన స్పృహకూడా ప్రకటించి నట్లయింది. మొత్తం ఆఫ్రికన్‌-అమెరికన్‌ ప్రజానీకమంతా ఈ అసమ్మతిని ప్రకటించడానికి మరొక వందేళ్ళు ఆగవలసి వచ్చింది.

కాబట్టి కవిగా హోర్టాన్‌ మొదటివాడుగా మాత్రమే కాకుండా ఆఫ్రికన్‌-అమెరికన్‌ చైతన్యంలో కాలంకన్నా ముందున్నవాడు అని చెప్పవలసి ఉంటుంది. కాని అతడి కవిత్వ శైలి, ఛందస్సులు, శిల్పం ప్రధానంగా పందొమ్మిదో శతాబ్ది ఇంగ్లిషు, అమెరికన్‌ కవుల పద్ధతిలోనే నడవడం వల్ల మాత్రమే అతణ్ణి మనం ఆదికవి అని అనలేకపోతున్నాం. నీగ్రో యాసలోనే కవిత్వం చెప్పవచ్చునని అతడికి స్ఫురించిందో లేదో మనకి తెలియదుగాని, ఆ యాసలో అతడు కవిత్వం రాసి ఉంటే సమకాలిక సమాజం అతణ్ణి కవిగా గుర్తించేది కాదని మాత్రం చెప్పగలం.

కాబట్టి విప్లవాత్మకమైన ఆ ప్రయోగం చేపట్టే కవి కోసం మనం పాల్‌ లారెన్స్‌ డన్‌ బార్‌ వచ్చే దాకా వేచి ఉండక తప్పలేదు. తెలుగులో గురజాడ అప్పారావులాగా ఆఫ్రికన్‌-అమెరికన్‌ కవిత్వాన్ని నీగ్రో యాసలో కూడా రాయగలిగినందువల్ల మాత్రమే డన్‌బార్‌ని ఆదికవిగా వ్యవహరిస్తున్నారు గాని లేకపోతే ఆ గౌరవానికి హోర్టాన్‌ అన్నివిధాలా అర్హుడే అని ఒప్పుకోక తప్పదు.


నేను, జార్జి మోజెస్‌ హోర్టాన్‌ని

నా హృదయం పైకెగరాలనుకుంటున్నది
నా శూన్యమానసమొక సంతోషంతో
ప్రపంచమంతా తిరుగాడాలని ఉంది
ప్రాచీనగీతాలకు పులకించాలని ఉంది.

నిజమే, వయసుమీద పడిరది
గడిచిపోయిన రోజులు తిరిగి చేతికందవు
రానున్నకాలంలోనైనా అద్భుతమేదో
సంభవించాలని ఆశ కలుగుతున్నది.

నన్ను నేను నిరూపించుకోవాలనిపిస్తున్నది
భూమ్మీంచి స్వర్గారోహణచెయ్యాలనే
పిలుపు పదేపదే వినిపిస్తున్నది, స్వర్గం
ఏమి చెయ్యగలదో చూపాలనిపిస్తున్నది.

నా బాల్య నవయవ్వన దినాలందున
ఒక ప్రజ్ఞ నాలో రెక్కవిప్పకపోలేదు
కాని అది నావరకే పరిమితం కాకున్నది
ఎగిరే కోరికతో సతమతమవుతూనే ఉన్నది

ఆ ఉద్వేగంతో ఆమె తన రెక్కలు చాపనీ
తన శక్తులు సాకల్యంగా విప్పారనీ
ఎలుగెత్తి గానం చెయ్యనీ, ఆ పాటలు
లోకం నుంచి లోకానికి వినిపించనీ.

ఒక బానిస ఆవేదన

దురదృష్టపు హెచ్చుతగ్గుల కెరటాలమీంచి
విషాదభరితంగా నన్ను కిందకు తోసేసారా?
ఈ లోకం నన్ను చూసి వెక్కిరిస్తూనే ఉంటుందా
ఎప్పటికీ?

దాస్యపు చీకటిలో నేనిట్లా మగ్గుతూనే ఉండాలా
కనుచూపుమేరలోంచి సమస్త సుఖసంతోషాలూ
కనిపించకుండా కనుమరుగవుతూనే ఉండాలా
ఎప్పటికీ?

దౌర్భాగ్యాల్లోకెల్లా దౌర్భాగ్యం ఆశ క్షీణించడం
తన ఉల్లాసకిరణలేశాన్ని పక్కకు తప్పించడం
నాకు మిగిలేవింక నిద్రపోడమూ, కలలుకనడమేనా
ఎప్పటికీ!

అయినా నా హృదయమేదో పరికిస్తూనే ఉన్నది
దిక్కుతోచని చిక్కుముడుల మధ్య గాలిస్తూనే ఉన్నది
అది ఆశనా? అదట్లా రగులుతూనే ఉంటుందా
ఎప్పటికీ!

నన్నొక పనికిమాలినవాడిగా మిగిలిపోనివ్వకండి
కుంటివాడిగా, గుడ్డివాడిగా చిక్కిపోనివ్వకండి
చెప్పలేనంత నిరాశలో నన్ను మగ్గిపోనివ్వకండి
ఎప్పటికీ!

దైవమా? నేనెవరికి మొరపెట్టుకునేది
ప్రతి ఒక్కరికీ నువ్వే కదా దిక్కుగా నిలబడేది
ఈ అభాగ్యుడికి దారిచూపే దీపానివి కారాదా
ఎప్పటికీ!

ఈ క్షణభంగుర జీవితానికి తెరపడ్డప్పుడు
ఓహ్! ఏదో ఒక శాశ్వత స్నేహహస్తం
నన్ను వెలుగులోకి నడిపించుకుపోరాదా
ఎప్పటికీ!

17-4-2025

3 Replies to “జార్జి మోసెస్‌ హోర్టాన్‌”

  1. Dear Sir,

    Your experience and wisdom is marvelous please share with us success principals which will help us in day to day life to succeed in overall life now a days we youth suffering with distractions, procrastination.

    Thanks sir 🙏

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading