
పండగ వస్తోందంటే
అన్నిటికన్నా ముందు
మా అమ్మ
ఇల్లు బూజు దులిపేది.
మట్టి అరుగులు చెక్కుతీసేది
గోడలు మెత్తడానికి
ఎర్ర మన్ను కలిపిపెట్టుకునేది.
ఇల్లంతా దులిపి తుడిచి
గోడలు మెత్తి
ఒద్దిగ్గా సరిదిద్దుకున్నాక
దాకరాయి గ్రామం నుంచి
ఇద్దరు ముసలమ్మలొచ్చేవారు
గోడలకి వెల్లవేయడానికి
చేతుల్లో చీపుళ్ళూ
సున్నం బకెట్లతో.
తెల్లటి రెక్కలు చాపి
వాళ్ళ వెనగ్గా
వాలేదప్పుడు పండగ.
నెల్లాళ్ళుగా చూస్తున్నాను
బూజు దులుపుకుంటున్న చెట్లని.
వాటి బోలుకొమ్మలచుట్టూ
గాలిపెట్టే గిలిగింత.
దూరదిగంతపు నునువెచ్చని
పలకరింపుకి
వాటిలోపల్లోపల ఒక పులకింత.
నేను కూడా ఇన్నాళ్ళుగా
కూడబెట్టుకున్న పదాల్ని రాల్చేస్తున్నాను.
నా మనసునిండా కిక్కిరిసిన
సామాను ఖాళీచేసేస్తున్నాను.
నామదేవుడితో కలిసి
పాండురంగడు
తుకారాముడికలలోకొచ్చినట్టుగా
ఇంకిప్పుడా
ముసలమ్మలిద్దరూ
మా ఇంటికెప్పుడొస్తారా అని
ఎదురుచూస్తున్నాను.
11-2-2025


ఋతువేదయినా ముఖపుస్తకంలో విరిసే సాహితీ సుమ సందోహంతో మీ కుటీరం చుట్టూ ఎల్లప్పుడూ వసంతమే. గోడలపై మీరద్దే కవితల రంగవల్లులతో ఎపుడూ పండుగే.
ధన్యవాదాలు సోదరీ!
ఇన్నాళ్ళుగా కూడబెట్టుకున్న పదాల్ని రాల్చేసి కొత్త “చివుళ్ళ” కు ఆహ్వానంపలుకుతూ, సరికొత్త వసంతోత్సవ శోభకు తెరతీశారు.
ధన్యవాదాలు జీవన్!
అభినందనలు …
ధన్యవాదాలు
“నేను కూడా ఇన్నాళ్ళుగా
కూడబెట్టుకున్న పదాల్ని రాల్చేస్తున్నాను.
నా మనసునిండా కిక్కిరిసిన
సామాను ఖాళీచేసేస్తున్నాను”
Beautiful expression, sir!!
ధన్యవాదాలు మాధవీ!