తలుపులు బార్లా తెరుచుకుంటాయి

కార్తిక ప్రభాతాల్లో నదీస్నానంకోసం
కొందరు సంవత్సరమంతా
ప్రతీక్షించినట్టు
మాఘమాసపు సాయంకాలాల గాలులకోసం
నేను ఏడాదిపొడుగునా
ఎదురుచూస్తాను.

సంగీతం నీ వీనుల్లోంచి
ఒంట్లోకి ప్రవహించినట్టు
మాఘమాసపు నునువెచ్చనిగాలి
నీ దేహమ్మీంచి
హృదయాన్ని చేరుకుంటుంది.

ఇక్కడ ఈ కాలనీలో
ఈ వీథుల్లో నడుస్తుంటానా
ఎక్కడిదో ఎప్పటిదో కొండగాలి
నాకోసం వెతుక్కుంటూ వస్తుంది.

ఆకాశం జారవిడిచిన
ప్రేమలేఖల్లాగా
గాలిపటాలు
ప్రతి చెట్టుమీదా.

రంగువెలిసిపోయిన
ఆ అక్షరాలమీద
మసకమసగ్గా
మంచురాత్రుల బెంగ.

నిండుగా పూసినమామిడిచెట్టు
పాతపాటలు మళ్ళా
కొత్తగా పాడటం మొదలుపెడుతుంది.
అప్పుడు నేను పీల్చే ప్రతి ఊపిరిలోనూ
వీథి, నగరం, విశ్వమంతా
ఒక తీపిదనంగా నాలోకి ప్రసరిస్తాయి

నాలో ఎంత వేదన,
లోకంలో ఎంత వేదన-
కాని నాలోకి ప్రవహించిన లోకం
కొంతసంతోషం నాకిచ్చి
నాలోంచి కొంత మాధుర్యం
తోడుకుంటుంది.

ఈ ఇచ్చిపుచ్చుకోడాలు
ప్రతి ఏడాదీ జరుగుతాయి.
గాయకుడు గాల్లోంచి స్వరాలు ఏరి
రాగంగా కూర్చుకున్నట్టు
గాలి తన అంగుళుల్తో
నాలోంచి ఒక పాటని
నిద్రలేపుతుంది.

పోగుపడుతున్న ఎండుటాకులు
రిక్తమవుతున్న శాఖోపశాఖలు-
మాఘమాసపు చెట్లకింద
నడుస్తున్న ప్రతిసారీ
ఆకాశం మరింత వెల్లడైనట్టు
తలుపులు బార్లా తెరుచుకుంటాయి.

7-2-2025

8 Replies to “తలుపులు బార్లా తెరుచుకుంటాయి”

  1. రంగువెలిసిపోయిన
    ఆ అక్షరాలమీద
    మసకమసగ్గా
    మంచురాత్రుల బెంగ.

    Wah wah.. beautiful. ❤️❤️

  2. ఆకాశం జారవిడిచిన
    ప్రేమలేఖల్లాగా
    గాలిపటాలు
    ప్రతి చెట్టుమీదా.🙏

  3. ఎక్కడిదో ఎప్పటిదో కొండగాలి
    నాకోసం వెతుక్కుంటూ వస్తుంది

    SIR
    THE WORDS ‘far, far away’ HAD ALWAYS A STRANGE CHARM …

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading