
పదహారు నుంచి పందొమ్మిది శతాబ్దాల మధ్యకాలంలో కోటిమందికి పైగా ఆఫ్రికన్ తెగల వారిని ఉత్తర అమెరికా ఖండానికి, కరీబియన్ దీవులకీ తరలించి బానిసలుగా అమ్మేసారు. ఆ ఆఫ్రికన్ తెగలవారూ, వారి సంతతీ ఆఫ్రికన్-అమెరికన్ సమాజంగా రూపొందారు. 1863 లో బానిసత్వాన్ని నిషేధించకముందూ, నిషేధించిన తరువాతా ఆఫ్రికన్-అమెరికన్ సమాజం వారు మొదట్లో స్వాతంత్య్రం కోసం, తరువాత సమానత్వం కోసం, ఒక సౌభ్రాతృత్వంగా సాగిస్తూ వచ్చిన అన్వేషణ, చేస్తూ వచ్చిన ఆక్రందన, చేపడుతూ వచ్చిన నిరసన ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యంగా రూపు దిద్దుకున్నాయి.
ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నెలపొడుగునా అమెరికాలో, కెనడాలో జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని 2018 లో ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం పైన కొన్ని పరిచయ వ్యాసాలు రాసాను. వాటిని ఆ ఏడాది ఫిబ్రవరిలో ఫేస్‌బుక్ మాధ్యమంలో మిత్రుల్తో పంచుకున్నాను. వాటిలో డగ్లస్, డన్‌బార్, లాంగ్‌స్టన్ హ్యూస్, పాల్ రోబ్సన్ మీద వ్యాసాల్ని ఇప్పుడు కొద్దిగా విస్తరించాను. వారితో పాటు డెరెక్ వాల్కాటు మీద గతంలో రాసిన వ్యాసానికి అదనంగా ఫిల్లిస్ వీట్లి, జార్జి మోజెస్ హోర్టాన్, రిచర్డ్ రైట్‌ల మీద కొత్తగా రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చేర్చాను.
ఇప్పుడు ఈ పదిహేను వ్యాసాల్నీ ‘వికసించిన విద్యుత్తేజం’ పేరిట ఈ ఫిబ్రవరి నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఇలా విడుదల చేస్తున్నాను.
ఇది నా 55 వ పుస్తకం.
ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్యం వైపు నా దృష్టి మళ్ళించిన నా ఆత్మీయుడు కన్నెగంటి రామారావుకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే. అందుకని ఈ పుస్తకాన్ని అతనికి ప్రేమతో కానుక చేస్తున్నాను.
28-1-2025


అయాచితంగా అందిన ఇంత బహుమతి ని ప్రేమ పూర్వకంగా అందుకుంటూ — నీ మిత్రుడు రామారావు.
ఈ అనువాదాలు నాకు ఎంత నచ్చాయంటే, కొన్ని సార్లు తిరిగి ఇంగ్లీషులోకి అనువాదం చేసి అందరితో పంచుకోవాలనిపించేటంత!
నువ్వు ఈ కానుక స్వీకరించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
నువ్వు హైదరాబాద్ వచ్చిన తర్వాత నువ్వూ, వేణూ, నేనూ ఒక సాయంకాలం గడుపుదాం.
అయితే ఈ గంగను దివి నుండి భూవికి తేవడంలో మీ పాత్ర ఉన్నందుకు 🙏
చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే మేమే.. పని కట్టుకొని మీ రచనలు చదువుతున్నప్పటికీ.. ఎప్పటికీ పూర్తి చేస్తామో తెలియడం లేదు.. అలాంటిది మీరు అత్యున్నత ఉద్యోగంలో ఉండి కూడా ఇటువంటి అమృత భాండాగారాలను సృష్టిస్తున్న మీ రుణం కూడా ఎన్నటికీ తీర్చలేము.. ఇది మాత్రం సత్యం 🛐
ఇప్పుడు విశ్రాంత అధికారిని కదా. సమయం ఉంది. మీరు పనిలో ఉన్నారు కాబట్టి సమయం దొరకడం కష్టం. సమయం ఉన్నప్పుడే నెమ్మదిగా చదువుకోవచ్చు.
మీరు పరిచయం కాకపోయి ఉంటే.. ఇంత ప్రపంచం ఉందా! అని మాకు తెలిసేది కాదు 🙏
ధన్యవాదాలు