
వారం రోజుల కిందట మూలా సుబ్రహ్మణ్యం మా ఇంటికొచ్చాడు. ఆయన వస్తున్నాడని తెలిసి నందకిశోర్ కూడా వచ్చాడు. నందూ వచ్చాక పాటలు రాకుండా ఎలా ఉంటాయి? నేను గాయకుణ్ణి కాను కాబట్టి నా వంతుగా యూట్యూబ్ తెరిచి కొందరు గాయకుల గీతాలు వినిపించాను. యేసుదాసు ఆలపించిన నారాయణ తీర్థ తరంగాలు, రఘునాథ పాణిగ్రాహి ‘ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ’, జుబిన్ గర్గ్ ‘ఓ జాదొబ్, ఓ వనమాలీ’- ఆశ్చర్యం అన్నీ నందకిశోరుడి గీతాలే!
మేమట్లా గోపబాలకుడి గీతాలు వింటూ ఉండగా నందూ బాలబాలికల గీతమొకటి వినిపించాడు. తెలంగాణా విద్యా శాఖకోసం తాను రాసిన గీతం. తానే ఆ గీతాన్ని ఒక లఘుచిత్రంగా తీసాడు కూడా. ఇంతకు ముందు కూడా వినిపించాడు. అప్పుడు కూడా ఆ గీతం నన్ను కదిలించిందిగాని ఈసారి కన్నీళ్ళే తెప్పించింది.
పిల్లవాడొక్కడూ బడికి పోవడంలో సంతోషం ఎంత ఉంటుందో నాకు తెలియదు గాని నలుగురైదుగురు పిల్లలు కలిసి బడికి పోయి మళ్ళా కలిసి ఇంటికి రావడంలో ఉన్న సంతోషం మాటల్లో చెప్పలేనిది. అది మన నగరాల్లో స్కూలు ఆటోల్లో కుక్కుకుని పోయి వచ్చినా కూడా ఆ కలిసి పోవడం, రావడం జీవితమంతా కలిసి వచ్చే మధుర జ్ఞాపకంగా మారిపోతాయి. అలాంటిది పల్లెల్లో పొలాలకి అడ్డం పడి, కొండ వార, ఏటి ఒడ్డున, పూల దారుల్లో సూర్యోదయ, అస్తమయ సంధ్య కాంతుల్లో అలా పిల్లలు కలిసి బడికి పోయి వస్తుండే ఆ దృశ్యాల్లో మన బాల్యం కూడా కనిపిస్తుంది కనుకనే నాకా కన్నీళ్ళు.
నందకిశోర్ నిజంగానే పసిబిడ్డ. అతడి తక్కిన గీతాల్లో యవ్వనగానం వింటున్నాం. కాని ఇందులో బాల్యం వినిపిస్తున్నది. వినండి.
రారాపోదాం
రారా పోదాం. రారా పోదాం.
స్కూలు పిలుస్తున్నది
ఆడుకుందాం. చదువుకుందాం
దోస్తు రమ్మంటున్నది
1
……ఆ ట ఆట
……ఊ డ ఊడ
.…..ABCD dancing time
….. EFGH hopping time
……IJKL learning time
……MNOP playing time
చుక్కలని కలుపుతం-మేం
అక్షరాలు పలుకుతం
అక్షరాలు కలుపుతం-మేం
పదం పదం చదువుతం
కథలు చదివి చెప్పుతం -మేం
ప్రశ్నలేస్తె విప్పుతం
పాటలల్లి పాడుతం – మేం
అభినయించి ఆడుతం
2
……ఏది పొడవు ఏది లావు
….,.ఏది ఎక్వ ఏది తక్వ
……ఎన్ని ఎన్ని మొత్తమెన్ని
…..ఏది ముందు ఏది వెనుక
ఆకారాలు పేర్చుతం -మేం
సంఖ్యలన్ని నేర్చుతం
కూడమంటె కూడుతం-మేం
పంచమంటె పంచుతం
తీసివేత చేస్తము-మేం
హెచ్చవేత చేస్తము
ఇంట బయట ఎక్కడైన
లెక్క అప్పజెప్తము
3.
…..ఒకటి ఒకటి రెండురా
…..నువ్వు నాకు ఫ్రెండురా
…. ఆడుకుంటు పాడుకుంటు
…..చదువుకోవచ్చురా
…..చదువుకుంటు ఒక్కో మెట్టు
……పైకి చేరవచ్చురా
….. చందమామను మీరూ
……అందుకోవచ్చురా
పువ్వులాగ నవ్వుతం – మేం
చెట్టులాగ ఎదుగుతం
ఉడతలాగ కదులుతం -మేం
పిట్టలాగ ఎగురుతం
మబ్బులాగ తిరుగుతం-మేం
చినుకులాగ జారుతం
వాగులాగ పారుతం -మేం
చేపలాగ తుళ్లుతాం
16-12-2024


గీతం చాలా బాగుంది. మా బడి యింటి నుండి దగ్గరే అయినా దోస్తులందరం ఇలానే కలది వెళ్ళే వాళ్ళం. బాల్యపు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి.. శోభోదయం.
ధన్యవాదాలు సార్
నందూ పాటలు అద్భుతం!
ధన్యవాదాలు సార్!
శుభోదయం సార్
శుభోదయం
నందు గీతం
బాలానందగీతం
బాల్యానందగీతం
ధన్యవాదాలు సార్
అలతి అలతి పదాల ఆనంద బాల్య రాగం👌👌
ధన్యవాదాలు సోదరీ
చెట్టులాగా ఎదుగుతాం అంటూ ఆ పాప చెట్టుని హత్తుకోవటం హృద్యంగా ఉంది.
అవును కదా!
సహజమైన భాషలో.. ప్రేమగా నిమురుతుంది.
ధన్యవాదాలు రామూ!
తమ్ముణ్ణి చేయి పట్టుకొని జాగ్రత్తగా రోడ్ దాటించి బడికి వెళ్ళి, రావడం. తరువాత చిన్న తమ్ముడూ మాతో కలిసి రావడం… మరువలేని బాల్యం. తరువాత స్నేహితురాళ్ళతో వెళ్ళిరావడం… ఇప్పటికీ మధుర జ్ఞాపకాలే 🤍📖🖋️
ధన్యవాదాలు ప్రసూనా!
Thank you, Sir for all the hospitality. It was a wonderful evening! నందు పాడితే ఇక చెప్పేదేముంది? అదొక ట్రాన్స్.
అవును మిత్రమా!
చాలా బాగుంది బాల్య గీతం.
👌👌💐💐
ధన్యవాదాలు సార్