అవధూత గీత-5

అవధూత గీత పధ్నాలుగు- పదిహేను శతాబ్దాల మధ్యకాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో వెలువడ్డ ఒక సంస్కృత సంవాదం. ఎనిమిది అధ్యాయాలుగా (ఎనిమిదో అధ్యాయం ప్రక్షిప్తమని అందరి అభిప్రాయం), మొత్తం 289 శ్లోకాల్లో, ఒక దివ్యావేశంలో పలికిన రచన. ఆ గీతాకారుడెవరో మనకి తెలియదు. కాని వివేకానందులు అన్నట్లుగా-

ఈ గీతాన్ని రాసినవారెవరోగాని అటువంటివారే మతానుష్టానాన్ని సజీవంగా నిలపగలిగేవాళ్ళు. వారు నిజమైన సాక్షాత్కారం పొందినవాళ్ళు.దేనికీ చలించనివాళ్ళు. తమ దేహానికి ఏమైనా పట్టించుకోనివాళ్ళు. చలి, వేడి, విపత్తు దేన్నీ లెక్కపెట్టనివాళ్ళు. ఆత్మానందాన్ని అనుభవిస్తూ నిశ్చలంగా ఉండిపోయేవాళ్ళు. కణకణలాడుతున్న నిప్పులు తమ దేహాన్ని దహిస్తున్నా కూడా కించిత్తైనా చలించనివాళ్ళు.

అయితే ఈ గీతాన్ని సాక్షాత్తూ దత్తాత్రేయులే ఉపదేశించారని ఒక విశ్వాసం ఉంది. ఈ గీతం తాలూకు ఒక తాళపత్ర ప్రతి తనకి ట్రివేండ్రంలో దొరికిందనీ, అందులో దత్తాత్రేయులు ఈ గీతాన్ని గోరక్షనాథుడికి ఉపదేశించిన సందర్భాన్ని వివరించే అధ్యాయం మొదటి అధ్యాయంగా ఉందని మోకాషి-పుణేకర్ రాసాడు. రాయడమేకాక, ఆ మొదటి అధ్యాయం, ఇంతదాకా అముద్రితంగా ఉన్నదాన్ని ప్రచురించాడు కూడా. అందులో దత్తాత్రేయులు తాను తెలుసుకున్న స్వస్వరూప జ్ఞానాన్ని, మాటల్లో పెట్టలేని ఆ జ్ఞానాన్ని ఉపదేశించడానికి తగిన శిష్యుడెవరున్నారా అని వెతుక్కుంటూ గోరక్షానాధుణ్ణి చూసి, అతనికి తన ఉపదేశాన్ని ఈ గీతం రూపంలో బోధించారని రాసి ఉంది. ఇలా ఒక గురువు తనే శిష్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చినట్టు చెప్పడంలో జైన ప్రభావం ఉందని పుణేకర్ అన్నాడు. అయితే బుద్ధుడి జీవితంలో కూడా ఇదే కనిపిస్తుంది కదా. ఆయనకు జ్ఞానోదయం కాగానే తనని వదిలిపెట్టిన శిష్యులతో తన జ్ఞానాన్ని పంచుకోవడం కోసం గయనుంచి సారనాథ్ దాకా నడుచుకుంటూ వచ్చేసాడు!

ఈ గీతంలో సంస్కృత భాష చూపిస్తున్న అంతర్గత సాక్ష్యాల్ని బట్టి ఇది పదకొండో శతాబ్దం నాటి రచన కావొచ్చని పుణేకర్ అభిప్రాయపడ్డాడు. కాని గోపీనాథ్ కవిరాజు వంటివారు దీన్ని మరీ ఇటీవలికాలపు రచనగా అంటే పదిహేడు-పద్ధెనిమిది శతాబ్దాల నాటి రచనగా భావించారు. కాని తనకి దొరికిన సమాచారమంతటినీ బేరీజు వేసుకుని రిగోపోలస్ ఈ రచన పధ్నాలుగు-పదిహేను శతాబ్దాల మధ్య కాలానికి చెందిందిగా ప్రతిపాదించాడు. ఈ గీతంలో ద్వైతమత విమర్శ కూడా ఉన్నందువల్ల ఇది ఏ విధంగా చూసినా 14 వ శతాబ్దానికి ముందు రాగల అవకాశం లేదని మాత్రం మనం చెప్పుకోవచ్చు.

ఈ గీతంలోని సంస్కృతం మరీ కావ్యసంస్కృతమో, అత్యున్నత దార్శనిక గ్రంథాల సంస్కృతమో కానందువల్ల దీన్ని భగవద్గీత, అష్టావక్రగీత లాంటి సంవాదాల సరసన చేర్చలేమని పండితలోకంలో ఒక అభిప్రాయం ఉంది. కాని పుణేకర్ ఆ అభిప్రాయాన్ని సహేతుకంగా ఖండించాడు. సాధారణంగా హిందీ భక్తి కవుల గురించి మాట్లాడేటప్పుడు సాధుక్కడి గురించి ప్రస్తావిస్తారు. సాధువులందరికీ వారి యోగానుభవానికీ, వారి దర్శనానికీ సంబంధించిన ఒక ఉమ్మడిభాష ఉంటుందనీ, దాన్నే సాధుక్కడీ అనీ అంటారు. పుణేకర్ చెప్పేదేమంటే, ఇటువంటి సాధుక్కడి నిజానికి సంస్కృతంలోనే మొదలయ్యిందని. విస్తృతభారతదేశంలో వివిధ ప్రాంతాలకూ, భాషలకూ, సంప్రదాయాలకూ చెందిన సాధువులు, యోగులు తమ అనుభవాల్ని పంచుకోడానికి ఒక వ్యావహారిక సంస్కృతాన్ని రూపొందించుకున్నారనీ, దానికి వ్యాకరణం గాని, కావ్యాలంకారాలు గానీ ముఖ్యం కానేకాదనీ, అవధూత గీత కూడా అటువంటి సంస్కృతంలో రాసిన గీతమనీ చెప్తాడు. ఇందులో పైకి కనిపించే వ్యాకరణదోషాల్ని నిజానికి ఆ సంవాదం తాలూకు మౌఖిక రూపానికి చెందిన సౌలభ్యాలుగా పరిగణించాలంటాడు. అంతేకాదు, ఇది చాలా సరళ సంస్కృతం, గ్రామీణులు, నిరక్షరాస్యులు విన్నాకూడా చాలావరకూ తేలిగ్గా అర్ధమైపోగల సంస్కృతం, అని కూడా చెప్తాడు.

అవధూత గీతని అద్వైత సంప్రదాయానికి చెందిన ఒక ప్రకరణవిశేషంగా పేర్కోవడం పరిపాటి. అందులో శంకరాచార్యులు ప్రతిపాదించిన అద్వైతం గురించే ప్రశస్తి ఉందని అద్వైతుల అభిప్రాయం. అందుకనే రామకృష్ణమిషన్ వారు అవధూత గీత ఇంగ్లిషు అనువాదాన్ని 1946 లోనే ప్రచురించారు. కాని పురోహిత్ స్వామి చేసిన అనువాదానికి రాసిన సుదీర్ఘమైన ముందుమాటలో శంకర్ మోకాషి-పుణేకర్ ఈ అభిప్రాయాన్ని పరాస్తం చేయడానికి ప్రయత్నించాడు. అవధూత గీత అద్వైత సంప్రదాయానికి చెందిన గ్రంథంలాగా కనిపిస్తుందిగానీ, అది నాథ-యోగుల సంప్రదాయంలో వికసించిన రచన అని ఆయన ఎంతో వివరంగా చెప్పుకొస్తాడు. ఆయనిలా అంటున్నాడు:

తన ముందు వికసించిన ఎన్నో దార్శనిక వ్యవస్థలు, అద్వైతం, ద్వైతం, పతంజలి యోగం, న్యాయం, సాంఖ్యం, మరికొన్ని రకాల తంత్రాలమీద తీవ్రమైన వ్యంగ్యంతో ఎక్కుపెట్టిన అసమ్మతిగళంలాగా అవధూత గీత వినిపిస్తుంది. అది ఒక దివ్యానంద పారవశ్యంలో పలికిన గీతం. ‘నేను కేవలుణ్ణి’ అని చెప్పే ప్రకటన.

ఈ ప్రతిపాదనని మరింత వివరిస్తూ పుణేకర్ చెప్పేదేమంటే, అద్వైతంలో ప్రపంచం సత్యం కాదు. జగత్తు మిథ్య.  శంకరాచార్యుల అద్వైతంలో జగత్తు అనే యథార్థానికి తావులేకపోవడంతో, ఆయన ప్రతిపాదిస్తున్న బ్రహ్మన్ నీ, జగత్తునీ సమన్వయిస్తూ విశిష్టాద్వైతం, కాశ్మీరు శివాద్వైతం, తమిళ శైవాద్వైతం ప్రభవించాయి. వాటి దృష్టిలో జగత్తు మాయ కాదు. అది శక్తి విలాసం. శివ-శక్తి లీల. మరొకవైపు ద్వైత తత్త్వంలో జగత్తు, నారాయణుడూ వేరువేరు. కానీ అవధూత గీత ఈ రెండింటినీ దాటిన స్థితి గురించి మాట్లాడుతుంది. కాబట్టే, అది నాథ సంప్రదాయంలో వికసించిన గీతం అని పుణేకర్ ప్రతిపాదన.

నాథ పంథీయులకి పారాయణ గ్రంథమైన గోరక్ష సిద్ధాంత సంగ్రహం మొదటి శ్లోకంలోనే ఇలా అంటున్నది:

అద్వైతం కేచిదిచ్ఛన్తి ద్వైతమిచ్ఛన్తి చాపరే
సమం తత్త్వం న విన్దన్తి ద్వైతాద్వైత లక్షణమ్

(కొందరు అద్వైతాన్ని కోరుకుంటారు. కొందరు ద్వైతాన్ని కోరుకుంటారు. ద్వైతం కన్నా, అద్వైతం కన్నా విలక్షణమైన, సమమైన తత్వాన్ని గ్రహించలేకపోతున్నారు.)

ఆ వెంటనే రెండవ శ్లోకంలో ఇలా అంటున్నది:

యది సర్వగతో దేవః స్థిరః పూర్ణో నిరన్తరః
అహో మాయా మహామోహో ద్వైతాద్వైత వికల్పనా.

(సర్వగతుడైన దేవుడు స్థిరుడు, పూర్ణుడు, నిరంతరుడు అయినప్పుడు ద్వైతం, అద్వైతం అనే కల్పన ఎంత మాయ! ఎంత మోహం!)

అలానే గోరక్షనాథుడు ప్రవచించాడని చెప్పే సిద్ధ సిద్ధాంతపద్ధతి కూడా ఇలా అంటున్నది:

తర్క శబ్ద విజ్ఞాన్నాచారాద్వేద పాఠనాత్
వేదాంత శ్రవణాన్నైవ తత్త్వమస్యాదిబోధనాత్ (5.31)

(తర్కించడం వల్లా, ఆచారాలు పాటించడం వల్లా, వేదాలు చదవడం వల్లా, వేదాంతం వినడం వల్లా, తత్త్వమసి లాంటి మహావాక్యాలు వినడం వల్లా ఇది సమకూడదు)

న హంసోచ్చారణా జ్జీవ బ్రహ్మణోరైక భావనాత్
న ధ్యాన్న లయాల్లీనః సర్వజ్ఞః సిద్ధిపారగః (5.32)

(హంస మత్ర జపం చేతగానీ, జీవ బ్రహ్మాలు ఒకటే అని భావించడం వల్లగానీ ఇది రాదు. ధ్యానంతోనూ రాదు, లయంతోనూ రాదు.)

మరి దేనివల్ల వస్తుంది?

అకర్తృత్త్వైవ యోగీ నిత్యతృప్తో నిర్వికల్పః
సదా నిరుత్థానత్వేన తిష్ఠతి (5.29)

(ఏ కర్తృత్వానికీ లోనవకుండా, నిత్యతృప్తితో, నిర్వికల్పుడిగా, నిశ్చల స్థితిలో నిలిచి ఉండటమే అద్వైతం.)

ఎవరో జెన్ సాధువు మాటల్ని సంస్కృతంలో చదువుతున్నట్టుగా వినిపించే ఈ వాక్యాల తరువాత గోరక్షానాథుడు ఇలా అంటున్నాడు:

సహజం, స్వాత్మసంవిత్తిః సంయమః స్వాత్మనిగ్రహః
సోపాయః స్వస్య విశ్రాంతిరర్ద్వైతం పరమం పదం
తజ్ఞేయం సద్గురోర్వక్త్రాత్ నాన్యథా శాస్త్రకోటిభిః (5.30)

(సహజత్వమే, ఆత్మజ్ఞానం, సంయమం, ఆత్మనిగ్రహం, తనలో తను నిశలుడిగా ఉండే సోపాయమే అద్వైతం. అదే పరమపదం. అది సద్గురువు ముఖతా తెలుసుకోవలసింది. కోటి శాస్త్రాలు చదివినా దొరకనిది)

దాదాపుగా అవధూత గీత ఈ విషయాన్నే తన మాటల్లో చెప్తుంది. కానీ అద్వైతుల్ని నాథయోగులు విమర్శించినట్టే తాను నాథయోగుల్ని కూడా విమర్శిస్తుంది. అంటే యోగులు పాటించే ఆ కొన్ని నియమాలతో కూడా తనకి పనిలేదని అవధూతాకారుడంటాడు.

అందుకనే రామకృష్ణ మిషన్ వారు అవధూతగీత ఇంగ్లిషు అనువాదానికి Song of the Free అని పేరుపెట్టారు. బహుశా, బాహ్యశాసనాలనుంచీ, నియమనిబంధనలనుంచీ మాత్రమే కాక, అంతరంగపు ఆరాటాలనుంచీ, సూక్ష్మ, అతిసూక్ష్మ ప్రలోభాలనుంచీ బయటపడినవాడు మాత్రమే అవధూత గీతలాంటి గీతాన్ని పలకగలుగుతాడు.

యోగులు చాలా ముఖ్యంగా భావించే ఆసనాలు, ప్రాణాయామం, నాథయోగులు ఎంతో విలువైందిగా భావించే హఠయోగం దేన్నీ విమర్శించకుండా వదిలిపెట్టలేదు అవధూత గీత. అలానే గోరక్షానాథుడు సద్గురువు గురించి మాట్లాడేడు. గురువు ఉంటే కోటిశాస్త్రాలతో పనిలేదన్నాడు. కాని అవధూత గీతకి గురువు కూడా ముఖ్యం కాదు. శంకర్ మోకాషి పుణేకర్ ఇలా రాస్తున్నాడు:

అవధూత గీత ఆద్యంతం అన్నిరకాల ఈశ్వరశాస్త్రాల్నీ ధిక్కరిస్తూ, ఒక సమత్వం, సమరసాల గురించే పదేపదే మాట్లాడుతుంది. అటువంటి సహజానందాన్ని మాత్రమే బ్రహ్మన్ తాలూకు విశుద్ధస్థితిగా చెప్పవచ్చు అంటుంది. అవధూత గీత అన్ని రకాల తరగతుల్నీ, చివరికి నాథ సంప్రదాయానికి మాతృక అని చెప్పదగ్గ శక్తి-విశిష్టాద్వైత భావనల్ని కూడా తిరస్కరిస్తుంది. సనాతన వైదిక, యాజ్ఞిక, ఇష్టాపూర్తపూర్వక కార్యకలాపాన్నే కాక, ప్రాణాయామం చేసేవాళ్ళనీ, చివరకు యోగుల్నీ, నాథుల్నీ కూడా పక్కనపెడుతుంది. అక్కడితో ఆగక ఇంకా ముందుకు వెళ్తుంది. అది చివరికి వ్యాకరణాన్ని కూడా తిరస్కరిస్తుంది. నేను, నువ్వు, అతడు లాంటి సర్వనామాల్ని త్యజించి ‘నేను’ అనే సర్వనామం ఒక్కటే చాలనిచెప్తుంది. ఉపనిషత్తులకి కనీసం ‘నువ్వు’ అనే సర్వనామం కావాలి (ఎందుకంటే గురువు శిష్యుడికి ఉపదేశించాలంటే నువ్వు అనే సర్వనామం తప్పనిసరి.) అలానే ప్రపంచంలోని అన్ని ఈశ్వరప్రార్థనలకీ కూడా ‘నువ్వు’ కావాలి. కాని అవధూత గీత అన్నిరకాల వాగ్వ్యవహారాన్నీ, చివరకు ప్రార్థనల్ని కూడా పక్కన పెడుతుందంటే, ఇక ప్రాణాయామం, ధ్యానాలు ఎక్కడ? అఖండ, నిర్వికల్ప, స్వయంసమర్థ ‘నేను’ తప్ప మరే తరగతికీ అక్కడ చోటు లేదు.

అదాటున చదువుకుంటూపోతున్నప్పుడు అవధూత గీత భగవద్గీతలాగా వినిపిస్తుంది. కానీ అవధూత గీత అన్నిటికన్నా ముందు తిరస్కరించింది భగవద్గీతనే. ఎందుకంటే గీతలో దేవయాన, పితృయానాలూ, ధూమమార్గ, దీప్తి మార్గాలూ ఉన్నాయి. అవధూత గీతకి అటువంటివేవీ లేవు. అసలు రెండనేవి లేనేలేవు. కర్మలు చెయ్యవలసిన పనిలేదు, అలాగని కర్మల్ని పరిత్యజించవలసిన కర్తవ్యం కూడా లేదు. లలితా సహస్రనామాలు అభిలషించినట్టుగా అది నిజమైన ‘హేయోపాదేయ వర్జిత’ మనఃస్థితి.

‘సిద్ధ సిద్ధాంత పద్ధతి’లో ఆరవ అధ్యాయం అవధూత లక్షణాల్ని వివరించే భాగం. అందులో చెప్పిన లక్షణాల్ని అవధూతగీత చాలావరకూ అంగీకరిస్తుంది. ముఖ్యంగా:

నిజస్ఫార విభూతిర్యో యోగీ స్వాంగే విభూషితః
ఆధారే యస్య వారూఢః సోవధూతో అభిదీయతే (6.4)

(ఒక యోగిగా అతడు తన వెలుగు అనే విభూతిని తన ఒళ్ళంతా పూసుకుంటాడు. ఆధారాన్ని ఎవరు ఆశ్రయించుకుని ఉంటారో అతడే అవధూత.)

లోకమధ్యే స్థిరాసీనః సమస్తకలనోజ్ఝితః
కౌపీనం ఖర్పరోదైన్యం సోవధూతోభిధీయతే (6.5)

(ప్రపంచం మధ్యలో ఉండికూడా సమస్త కల్లోలాల్నీ జయించినవాడు. కౌపీనం ధరించి, భిక్షాపాత్ర చేపట్టినా కూడా దీనత్వం అంటనివాడు, అతడే అవధూత.)

ఆవర్తయతి యః సంయక్ స్వస్వమధ్యే స్వయం సదా
సమత్వేన జగద్వేత్తి సోవధూతోభిధీయతే (6.15)

(ఆత్మ మధ్యంలో స్థిరంగా ఉన్న ఎవరిని ఆవరించి జగత్తు మొత్తం సమస్థితిలో ఉంటుందో అతడే అవధూత.)

క్వచిద్భోగీ, క్వచిత్త్యాగీ క్వచిన్నగ్న పిశాచవత్
క్వచిద్రాజా క్వచాచారీ సోవధూతోభిధీయతే.

(కొన్ని సార్లు యోగిగా, కొన్ని సార్లు భోగిగా, కొన్నిసార్లు నగ్నంగా, కొన్ని సార్లు పిశాచంలాగా, కొన్నిసార్లు రాజు లాగా, కొన్ని సార్లు ఆచారాలు పాటించేవాడిగా ఎవరు కనిపిస్తాడో అతడే అవధూత.)

అంత్యాశ్రమీ చ యోగీ చ జ్ఞానీ సిద్ధశ్చ సువ్రతః
ఈశ్వరశ్చ తథా స్వామీ ధన్యః శ్రీ సాధురేవ చ (6-21)
జితేంద్రియశ్చ భగవాన్ స సుధీః కోవిదో బుధః
చారాకశ్చార్హ తశ్చేతి తథా బౌద్ధ ప్రకాశవిత్ (6-22)
తార్కికశ్చేతి సాంఖ్యశ్చ తథా మీమాంసకో విదుః
దేవదేవత్యాది విద్వద్భిః కీర్తితః శాస్త్రకోటిభిః (6-23)

(అతడే అంత్యాశ్రమి అంటే సన్యాసి. యోగి, జ్ఞాని, సిద్ధుడు, సువ్రతుడు, ఈశ్వరుడు, స్వామి, ధన్యుడు, సాధువు, జితేంద్రియుడు, భగవంతుడు, ధీశాలి. చార్వాకులు, అర్హతులు, బౌద్ధులు, ప్రకాశవాదులు, తార్కికులు, సాంఖ్యులు, మీమాంసకులు, దేవతలు, విద్వాంసులు, చివరికి సమస్త శాస్త్రాలూ కూడా అతణ్ణే కీర్తిస్తున్నాయి.)

సిద్ధ సిద్ధాంత పద్ధతి ఇంత వివరంగా చెప్పినతరువాత అవధూత గీత అవసరమేముంది అనే ప్రశ్న కలగవచ్చు. భగవద్గీత స్థితప్రజ్ఞుడని వర్ణించింది ఇతణ్ణే కదా అనుకోవచ్చు. బౌద్ధులు నిర్వాణమని చెప్పింది ఈ మనఃస్థితి గురించే కదా అనవచ్చు.

కానీ అవన్నీ అతడి ‘గురించిన’ వివరణలు, వర్ణనలు. కానీ అవధూత గీత అతడే ‘స్వయంగా’ తన గురించి తాను చెప్పుకున్న ప్రకటన. అంతేకాదు, వాటన్నిటిలోనూ లేని ఒక దివ్యావేశం, చరమసౌందర్యసీమను చేరుకున్న ఒక మహాపారవశ్యం మనకు అవధూత గీతలో కనిపిస్తుంది. ‘సమత్వం యోగముచ్యతే’ అని గీత కూడా అంది, నిజమే, కాని అవధూతగీత ఆ సమత్వాన్ని ఒక నిస్సార, నిర్లిప్త స్థితిగా చూడకుండా, దాన్ని ‘సమరసం’ అంది. ఆ సామరస్యస్థితిలో సత్యం, శివం, సుందరం అన్నీ ఒక్కటైపోయాయని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ గీతాన్ని ఎవరు పలికినా వారిని దత్తాత్రేయులు ఆవహించకుండా ఆ గీతం పలకడం అసాధ్యం. కాబట్టి ఆ గీతాన్ని దత్తాత్రేయులు పలికారని భావించడమే సముచితం.


Featured image: Sahyadri, pc: wikimedia commons

26-10-2024

5 Replies to “అవధూత గీత-5”

  1. ఎన్ని గొప్ప విషయాలు చెప్పారో…
    ధన్యులం మేము. నమస్సులు 🙏🙏❤️

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading