ఈశ్వర స్తుతిగీతాలు-4

కీర్తనల్లో మొదటి రెండువంతులు విలాపాలనీ, తర్వాతివి విజయగీతాలూ, ధన్యవాద సమర్పణలనీ చెప్పుకున్నాం. కీర్తనల్లో అధికభాగం యూదులు బేబిలోను ప్రవాసానికి పోకపూర్వపు కాలానికి చెందినవనీ, వాటిలో విలాపగీతాలు అధికంగా ఉన్నాయనీ, ప్రవాసం తర్వాతి గీతాల్లో విజయగీతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనీ కూడా అనుకున్నాం. ప్రవాసానికి పోకముందు అంటే క్రీ.పూ 597 కన్నా ముందు, ప్రవాసం తర్వాత అంటే క్రీ.పూ.538 నుంచి దాదాపు క్రీస్తుకాలం దాకా కీర్తనల కాలం అనుకుంటే అవి దాదాపుగా యూదుచరిత్రలోనూ, అనేకమంది దేవతల్లో ఒకడిగా మొదలై తర్వాత రోజుల్లో ఏకేశ్వరుడిగా, సర్వేశ్వరుడిగా, రాజాధిరాజుగా యెహోవా పరిణామం చెందిన చరిత్రలోనూ అంతర్భాగాలుగా ఇమిడిపోయాయని చెప్పవచ్చు.

క్రీ.పూ రెండవ సహస్రాబ్దిలో మొదలైన ఇస్రాయేలు చరిత్రలో ఇస్రాయేలు తన అద్వితీయను సాధించుకునే క్రమానికీ, యెహోవా ఒక దేవత స్థానం నుంచి ఏకేశ్వరుడిగా పరిణామం చెందడానికీ మధ్య అవినాభావ సంబంధం ఉంది. నిజానికి యెహోవా పట్ల నమ్మకం వల్లనే ఇస్రాయేలు ఇస్రాయేలుగా, యూదులు యూదులుగా, చివరికి, క్రీస్తు ఒక మెస్సయ్యాగా మారగలిగారని కూడా మనం చెప్పవచ్చు. ఈ భావపరిణామమంతా కీర్తనల్లో కనిపిస్తుంది. ఆ పుటలన్నీ అయితే రక్తంతో తడిసాయి, లేదా కన్నీళ్ళతో తడిసిపోయాయి.

ఎక్కడో కొన్ని గ్రామాల్లో వందల సంఖ్యలో మొదలైన ఇస్రాయేలీలు ఇస్రాయేలుగా రూపొందడం ఒక్కరోజులో జరగలేదు. వారి చుట్టూ వారికన్నా అనేక రెట్లు మహాపరిమాణం కలిగిన, మహాశక్తిశాలురైన ఈజిప్షియన్, అసీరియన్, బేబిలోనియన్, పర్షియన్ మాహాసామ్రాజ్యాల మధ్య వారు తమ ఉనికిని కాపాడుకుంటూ, తమ గుర్తింపునీ, తమ అస్తిత్వముద్రనీ నిలబెట్టుకోవడం వెనక, తాము దేవుడు ఎన్నుకున్న ఒక ప్రత్యేక సమూహం అనే నమ్మకమే చాలా బలంగా పనిచేస్తూ వచ్చింది. తాము ఆ chosen few అని నమ్మడం, నమ్మలేకపోవడం, కానీ నమ్మలేకుండా ఉండటం- అవిశ్వాస, విశ్వాసాల మధ్య ఆ జాతి పడ్డ ఊగిసలాట, నలుగులాట మొత్తం మనకి పాతనిబంధనలో వచన రూపంలో కనిపిస్తే, కీర్తనల్లో గీతరూపంలో వినిపిస్తుంది.

బేబిలోనియన్ల చేతిలో అవమానకరంగా ఓడిపోయి బేబిలోను ప్రవాసానికి పోకముందు యూదులకి కనీసం నలుగురైదుగురు దేవతలు ఉన్నారు. వారిలో యెహోవా, రాజవంశపు దేవత. కానీ రాజభవనానికి బయట పల్లెల్లో యూదులు స్థానిక దేవతల్ని కొలుస్తూనే ఉండేవారు. తమ చుట్టూ తమ పూర్వకాలం నుంచీ కూడా తక్కిన మెసొపొటేమియన్ జాతులు జరుపుకునే పండగలే వాళ్ళూ జరుపుకునేవారు. అయితే ఆ దేవతలూ, ఆ పండగలూ వారికి నేరుగా దొరికినవి కావు. వాళ్ళు వాటిని కాననైట్లనుండి స్వీకరించారు. కానీ ప్రాచీన మెసొపొటేమియన్ దేవతలూ, ఆ పండగలూ ప్రధానంగా వ్యావసాయిక ఉత్సవాలు. నేనింతకుందు చెప్పినట్టు అప్పుడు ఆ దేవతలకు చేసే పూజలు తొలిధాన్యాల్ని భూదేవతకీ, సూర్యదేవతకీ సమర్పించే నవాగ్రాయణ క్రతువులు మాత్రమే. కానీ ఆ పండగల్ని యెహోవా తనకీ, తాను ఎంచుకున్న జాతికీ మధ్య ఒప్పందపు పండగలుగా మార్చేసాడు.

Covenant festivals గా చెప్పే ఈ పండగలు ప్రధానంగా ఏడు పండగలు. వీటిని ఎలా జరుపుకోవాలో, ఎప్పుడు జరుపుకోవాలో యెహోవా మోషేకి విశదంగా వెల్లడించాడు. లెవిక్టస్ 23 వ అధ్యాయంలో పేర్కొన్న ఆ ఏడు పండగల- విశ్రాంతిదినం (sabbat), పస్కా పండగ (Passover), పొంగని రొట్టెల పండగ (Unleavened Bread), ప్రథమఫలాలు (First Fruits), వారాలు, వారాల తరువాత పెంతెకోస్తు (Weeks and Pentecost), శృంగవాద్యాల పండగ (Trumpets), ప్రాయశ్చిత్తదినం (Atonement), పర్ణశాలల పండగ (Tabernacles)- ద్వారా యెహోవా తాను ఎంచుకున్న జాతినుంచి ఏమి ఆశించాడో ఊహించడం కష్టం కాదు. ఆ పండగల ద్వారా మనుషులు కుటుంబాలుగా, ఒక జాతిగా సంఘటితపడాలనీ, ఆ సందర్భంగా పాటించవలసిన నియమనిబంధనల ద్వారా వారు ఒక జాతీయ స్వభావాన్ని సంతరించుకోవాలనీ, తమ చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితుల్తోగాని, రాజకీయ వాతావరణంతోగాని నిమిత్తం లేకుండా వారు తమ పూర్తివిధేయతను తన పట్లనే కనపర్చాలనీ యెహోవా కోరుకున్నాడు. అంతేకాదు, ప్రతి ఒక్క యూదు కూడా ఏడాదికి మూడు సార్లు యెరుషలేం యాత్ర చెయ్యాలన్నది కూడా ఆ ఒప్పందంలో భాగం. ఆ విధంగా ఆయన తక్కిన దేవీదేవతల్ని పక్కకు నెట్టి తానే ఏకేశ్వరుడిగా, యూదుల రాజాధిరాజుగా సుప్రతిష్ఠితుడయ్యాడు.

కీర్తనల్లో విజయగీతాలుగా, ధన్యవాద సమర్పణలుగా ప్రభవించిన గీతాలు ఈ పండగల్లో, యెరుషలేం యాత్రల్లో తలెత్తినవే. అందుకనే తొలిగీతాల్లో దేవుడిగా కనిపించే యెహోవా, ఈ మలిగీతాల్లో ప్రభువుగా కనిపించడం మొదలుపెట్టాడు. ఈ గీతాలు ఒక జాతి ఆయనకు సమర్పించుకున్న కృతజ్ఞతా గీతాంజలి. వాటిల్లో యెహోవాని రెండు విధాలుగా కీర్తించారు. మొదటిది, ఆయన తమ తమ వ్యక్తిగత జీవితాల్లో చూపించిన మహిమలు. ఆయన తమ మొరాలకించి, తమని కష్టాలనుంచీ, విపత్తులనుంచీ బయటపడేసినందుకు చెల్లించిన స్తుతులు. రెండోది, ఆయన ఇస్రాయేలు చరిత్రలో నిర్వహించిన పాత్ర. ఆయన వట్టి దేవుడు మాత్రమే కాదు, తమ రాజు కూడా. తమ రాజు మాత్రమే కాదు, ఏకేశ్వరుడు కూడా. ఆయన తప్ప మరొక దేవుడు లేడు. మరొకర్ని కొలవడాన్ని ఆయన సహించడు. కొలవలసిన అగత్యం కూడా లేదు. ఎందుకంటే తాము మొరపెట్టుకున్న ప్రతిసారీ ఆయన తమని వ్యక్తిగత కష్టాల నుంచి మాత్రమే కాదు, రాజకీయపరమైన విపత్తులనుంచి కూడా బయటపడేస్తున్నాడు.

ఒక దేవుడు ఏకేశ్వరుడిగా మారడంలో ఆధ్యాత్మికంగా ఎంత సౌలభ్యం ఉన్నప్పటికీ రాజకీయంగా అది నియంతృత్వంగా, లేదా సామ్రాజ్యవాదంగా పరిణమించకుండా ఉండటం సాధ్యం కాదు. అలానే ఏకేశ్వరోపాసన నీడలో రాజ్యాలు బలపడేకొద్దీ, అవి నైతికంగా పతనం కావడం కూడా అసంభవం కాదు. అందుకని యెహోవా తాను సర్వేశ్వరుడిగా మారుతున్న క్రమంలో తన నైతికశాసనం అనుల్లంఘనీయమని కూడా ఇస్రాయేలీల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. యూదులు బేబిలోను చేతుల్లో ఓడిపోడానికి ముందు వారి బహుదేవతారాధన వల్ల వారి పతనం సంభవించిందని ప్రవక్తల్తో చెప్పిస్తూ వచ్చాడు. ప్రవాసం తరువాత ఇస్రాయేలు కూలిపోయి యూదియా బలపడటం మొదలయ్యాక, బహుదేవతారాధన అంతరించిన తర్వాత, ప్రజల్లో నైతిక నిష్ఠ సన్నగిల్లుతూ ఉందని మళ్ళా ప్రవక్తల్తో చెప్పిస్తూ వచ్చాడు. ఆత్మవంచన, దివాలాకోరుతనం, సంఘజీవితంలోనూ, దేవుడి ఎదటా కపటవర్తనా మొదలైనవాటిపట్ల యెహోవా తన ఆగ్రహం దాచుకోకపోవడం ప్రవాసానికి ముందునుంచే కనిపిస్తూ వచ్చింది. ముఖ్యంగా జెరిమియా, మొదటి ఇషయ్యాలలో ఈ ఆక్రోశం చాలా స్పష్టంగా వినిపిస్తుంది. నిజానికి యూదులు ఒక జాతిగా తమ నైతికతకు దూరమయ్యాకనే వారు బేబిలోను చేతుల్లో ఓడిపోయి బందీలయ్యారని రెండవ ఇషయ్యా ఎలుగెత్తి మరీ ప్రకటిస్తో వచ్చాడు.

తన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నవారి పట్ల ఆగ్రహాన్ని ప్రకటించే దేవుడిగా కనిపిచే యెహోవా నెమ్మదిగా తన కరుణని కూడా చాటుకోవడం మొదలుపెట్టాడు. ప్రవాసం తరువాతి యూదియా కాలపు ప్రవక్తలు హగ్గయి, జకరయ్యా, మలాచి, జోయెల్ వంటి వారి మాటల్లో రానున్న కాలం మరింత ప్రేమాన్విత కాలం కాబోతున్నదనే సూచనలు కనిపించడం మొదలుపెట్టాయి. కేవలం నైతికత దగ్గరే ఆగిపోకుండా తాను కరుణామయుణ్ణి కూడా అని ప్రకటించడం ద్వారా యెహోవా తన జాతిని కాపాడుకోడం మొదలుపెట్టాడు.

బహుదేవతలు ఏకేశ్వరుడిగా పరిణామం చెందే క్రమంలో మొదట ఒక నైతిక శాసనంగా ఆ తరువాత ఒక కరుణామయ మూర్తిగా మారిన ఈ పరిణామాన్ని మనం వేదకాలంతోనూ, బుద్ధుడి ఆవిర్భావంతోనూ పోల్చవచ్చు. ఋగ్వేద ఋషులు ఈ ప్రపంచాన్ని ఒక నైతిక శాసనం పాలిస్తూ ఉన్నదనీ, దాన్ని ఋతం అనీ అన్నారు. ఉపనిషత్తులు, ఆ నైతికశాసనమే పరమసత్యం అని భావిస్తూ దాన్ని బ్రహ్మన్ అని అన్నాయి. అక్కడితో ఆగకుండా ‘అది నువ్వే’ అని కూడా అన్నాయి. కాని అటువంటి ఎరుక కలిగిన తర్వాత కూడా మనిషి తాను జీవించే జీవితాన్ని ఎల్లవేళలా పరిశుద్ధంగా ఉంచుకునే మార్గమెట్లా? ఆ విద్య, ఉపనిషత్తుల భాషలో ఆ పరావిద్య, దాన్నెలా పొందగలం? మనశ్శరీరాల్ని నియంత్రించుకోవడం ద్వారా, శీల, సమాధి, ప్రజ్ఞల ద్వారా అది సాధ్యపడుతుందని బుద్ధుడు చెప్పాడు. అయితే ప్రతి మనిషీ ఆ ప్రజ్ఞని సాధించుకుని తన తామసప్రవృత్తినుంచి బయటపడేదాకా తాను తిరిగితిరిగి బోధిసత్త్వుడిగా జన్మిస్తూనే ఉంటానని బుద్ధుడు చెప్పడం ఒక కరుణామయ వాగ్దానం.

తిరిగి మళ్ళా తొమ్మిది పది శతాబ్దాల్లో శంకరాచార్యుడు అంతిమ సత్యం బ్రహ్మన్ అని మాత్రమే నిర్ధారించినతరువాత, ఆ బ్రహ్మన్ ఈశ్వరుడు కాడనీ, ఆ నైతికసూత్రం వ్యక్తిగత రాగద్వేషాలకి అతీతమనీ చెప్పిన తరువాత మళ్ళా ఒక దయామయుడైన ఈశ్వరుడి అవసరం తలెత్తింది. ద్వైత, విశిష్టాద్వైత, కాశ్మీరు శక్తి-శివాద్వైతాలు ఆ అవసరాన్ని తీర్చడం, ప్రతి ఒక్క జీవికీ భగవదనుగ్రహం లభిస్తుందని చెప్పడం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో మరొక కొత్త యుగానికి తలుపులు తెరిచింది.

యూదుల చరిత్రలో క్రీస్తు ఆగమనం అటువంటి కొత్త కాలం. ఆ ఆగమనాన్ని కీర్తనలు ముందే సూచిస్తున్నాయని సువార్తీకులు గుర్తుపట్టారు. పాతనిబంధననుంచి సువార్తల్లో ఎత్తి రాసుకున్న వాక్యాల్లో మూడు వంతులదాకా కీర్తనల్లో వాక్యాలే కావడం గమనించాలి. మత్తయి సువార్తలో పది సార్లు, యోహాను సువార్తలో తొమ్మిది సార్లు, మార్కు సువార్తలో నాలుగు సార్లు, లూకా సువార్తలో అయిదు సార్లు కీర్తనల ప్రస్తావనలు కనిపిస్తాయి. నేను ముందే చెప్పినట్లుగా యేసు శిలువపైన పలికిన చివరిమాటలు కూడా 22 వ కీర్తనలోని మొదటి మాటలే. దాదాపుగా ఈ ప్రస్తావనలన్నీ అయితే royal psalms లేదా messianic psalms. అయితే రాజాధిరాజుగా మారిన యెహోవా తన ప్రజలకు వాగ్దానం చేసిన రాజ్యం, ఆ వాగ్దత్త వసుంధర ‘అక్కడుందనీ, ఇక్కడుందనీ అనకండి, అది మీలోనే ఉంది'(లూకా, 17:21) అని క్రీస్తు చెప్పడం కీర్తనలు కలగన్న సత్యానికి పతాకస్థాయి.

కాబట్టి కీర్తనల్లోని ధన్యవాద సమర్పణ గీతాలు, ప్రపంచ భక్తిసాహిత్యంలోనే ఒక సర్వోత్కృష్ట అధ్యాయం. అవి గొప్ప ఓదార్పు, ఒక బాసట, నిస్పృహ చెందిన మనుషులకి, కుటుంబాలకీ, జాతులకీ ఒక స్వస్థత, ఒక నిరుపమాన ధన్యత.

విలాప గీతాలన్నిటికీ ఒక నిర్మాణ నమూనా ఉందని చెప్పలేము గానీ, కృతజ్ఞతా సమర్పణ గీతాలకు మాత్రం ఒక నమూనాను మనం ఊహించవచ్చు. ఈ గీతాలన్నిటిలోకీ అతి చిన్న గీతమైన 117 వ కీర్తనని చూస్తే మనకి ఈ నిర్మాణం సులభంగా బోధపడుతుంది. చూడండి:

సమస్త జనులారా, ప్రభువుని స్తుతించండి. సకలలోకప్రజలారా, ప్రభుమహిమ ఉగ్గడించండి.
మనపట్ల ఆయన అనుగ్రహం చెక్కుచెదరనిది. మనపట్ల ఆయన నమ్మకం ఎన్నటికీ తరగనిది.
స్తుతించండి ప్రభువుని నోరారా!

ఇందులో మొదటి భాగం ఒక పిలుపు. ప్రభువుని స్తుతించడానికి ఒక ఆహ్వానం. రెండవభాగం అలా ప్రభువుని ఎందుకు స్తుతించాలో కారణాలు వివరించడం. మూడో భాగం మళ్ళా మొదటి అహ్వానాన్ని మరోమారు ఉగ్గడించడం.

అంటే ఇది ఒక స్తుతి. స్తోత్రం. కేవలం మాటలు మాత్రమే కాదు, సంగీతవాద్యాలతో, మొత్తం సామూహికంగా పలికే ఒక ధన్యవాద తీర్మానం. అలా ఒక సమూహంగా యెహోవా పట్ల తమ కృతజ్ఞతని చాటుకోవడం ద్వారా వారంతా ఒక theophany కి, ఒక ఈశ్వర భావోద్వేగానికి, ఒక దివ్యపారవశ్యానికి లోనవుతున్నారు. అంటే దేవుడు మరెక్కడో లేడు, ఆ క్షణాన, ఆ సామూహిక హృదయసమర్పణలో, ఆ ఈశ్వరస్తుతిగీతాలాపనలోనే ఆయన ప్రత్యక్షమవుతున్నాడన్నమాట. యెహోవా ఒక జాతిని ఇస్రాయేలుగా తీర్చిదిద్దాడంటే, ఇదుగో, ఇలానే.

కీర్తనల్లో 8,19, 29, 33, 46-48, 65, 66, 68, 76, 84, 87, 93, 95-100, 103-104, 111, 113-14, 117, 122, 134-36, 145-50 ధన్యవాద గీతాలు, ఇవి కాక స్తోత్రాలుగానూ, ఆత్మవిశ్వాసాన్ని ప్రోదిచేసే గీతాలుగానూ లెక్కించినవాటిని కూడా మనం ధన్యవాద గీతాలుగానే లెక్కపెట్టుకోవచ్చు.

ఏ ధన్యవాదమైనా అంతిమంగా ఒక స్తోత్రం. లలితా సహస్రనామాల్లో ఒక నామం ‘స్తోత్రప్రియా’ అనేది. సర్వేశ్వరుణ్ణి మనం ఇది కావాలనో లేదా నన్ను కాపాడు అనో అభ్యర్థించకూడదు, నీకేం కావాలో ఆయనకు తెలుసు, నువ్వు చెయ్యవలసిందల్లా, ఆయనకి అనుక్షణం, అడుగడుగునా ధన్యవాదాలు సమర్పించుకోవడమే అని పెద్దలు చెప్తారు. కీర్తనకారులకి ఈ సంగతి తెలుసు. అందుకనే కీర్తనల్లో చివరికి వచ్చేటప్పటికి, స్తోత్రములు, స్తోత్రములు అనే మాటలు తప్ప మరో మాట వినిపించదు, ఇదుగో, ఈ 148 వ కీర్తనలో లాగా.


స్తుతించండి ప్రభువుని

స్తుతించండి ప్రభువుని, స్వర్గం నుంచి స్తుతించండి, శిఖరాల మీంచి స్తుతించండి.
స్తుతించండి ఆయన్ని, ఆయన సమస్త దేవదూతల్ని, స్తుతించండి ఆయన్నీ, ఆయన పరివారమంతటినీ.

స్తుతించండి ఆయన్ని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, స్తుతించండి ఆయన్నీ, ప్రకాశభరితమైన తారకలన్నింటినీ.

స్తుతించండి ఆయన్ని, స్వర్గసీమకే స్వర్గమైన మిమ్మల్ని, స్వర్గాలకు పైన ప్రవహిస్తున్న జలాల్ని,

అవన్నీ ప్రభునామాన్ని స్తుతించునుగాక! ఎందుకంటే ఆయన శాసనం వల్లనే అవి సృష్టించబడ్డాయి.

ఆయన వాటిని శాశ్వతంగా ప్రతిష్టించాడు, ఎన్నటికీ వీగిపోని శాసనాన్ని ప్రవర్తింపచేసాడు ఆయన.

భూమ్మీంచి ఆయన్ని స్తుతించండి, ఓ మహాసముద్రప్రాణులారా, అగాధమైన లోతుల్లోంచి ఆయన్ని స్తుతించండి.

అగ్ని, వడగళ్ళు, మంచు, మేఘాలు, ప్రచండ ఝంఝూమారుతాలు ఆయన వాక్కుని పరిపూర్ణమొనరుస్తున్నాయి.

పర్వతాలు, అన్ని కొండలూ, ఫలభరితాలైన వృక్షాలు, దేవదారు తరువులు

వన్యమృగాలు, పశుగణాలు, నేలమీద పాకేవి, ఎగిరే పక్షులు

భూమ్మీది రాజులు, సమస్త జనులు, రాకుమారులు, పృథ్విని పాలించే న్యాయాధీశులు,యువతీయువకులూ, వృద్ధులూ, పసిపాపలూ

వారంతా ప్రభు నామం స్తుతించెదరు గాక! ఆ నామమొక్కటే సర్వోన్నతం, ఆయన వైభవం భూదిగంతాలను మించినది.

తన ప్రజానీకపు తూర్యరావాన్ని , సమస్త సాధుజనుల స్తుతిని, ఇస్రాయేలు బిడ్డల ప్రార్థనల్ని, తన సమీపవర్తులైన జనుల స్తోత్రాల్ని ఆయన శోభిల్లపరిచాడు! స్తుతించండి ప్రభువుని!

10-10-2024

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading