మా మల్లిక

మా మల్లిక రాసిన హైకూల సంపుటి ఈ రోజు సాయంకాలం ఆవిష్కరణ. జూమ్‌లో. మిత్రులంతా ఈ వేడుకలో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నాను.

ఎంతోకాలంగా కవులు కవిత్వం చెప్తూ ఉన్నారు, మరెంతో కాలం పాటు కవిత్వం చెప్తూనే ఉంటారు. అయినా కూడా ఈ కవిత్వభాండాగారం తాళం తీసిన వాళ్ళులేరు, ఆ సంపదని ముట్టుకున్నవాళ్లు లేరు అన్నాడొక ప్రాకృత కవి చాలా కాలం కిందట. ఆ మాట నిజమేకదా అనిపిస్తుంది, కాని కొన్నిసార్లు నిజం కాదేమో కూడా అనిపిస్తుంది. ఎంతో మంది మహావీరులు తాకనైనా తాకలేని శివధనువుని చిన్నారి సీత ఆటలాడుకుంటూ సునాయాసంగా పక్కకు జరిపేసిందని విన్నాం కదా. అలానే కవిత్వకోశాగారం తలుపులు సునాయాసంగా నెట్టగలిగిన ఒక చిన్నారిని మీరీ పుటల్లో చూడబోతున్నారు.

2

మల్లిక మా చిట్టిచెల్లెలు హేమ కూతురు. మా తల్లిదండ్రుల సంతానం ఎనిమిదిమందిలోనూ హేమ కడగొట్టుది. అందరికన్నా చిన్నపిల్ల గారాబంగా పెరగాలిగాని, మా హేమ బాల్యం నాటికి మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఒడిదుడుకుల్లో ఉండేవి. ఆమె చాలా ప్రతిభావంతురాలైన విద్యార్థి. ఆమె పై చదువులకు వచ్చేటప్పటికి నేను హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ ఉన్నాను. ఆమె లా చదవడానికి హైదరాబాదు వచ్చింది. కానీ తన చదువు నాకు భారమవుతుందనుకుంది. తొందరగా పెళ్ళి చేసుకుని వెళ్లిపోతే నా బరువు తగ్గుతుందనుకుంది. మా ఆర్థిక పరిస్థితి బాగుండి ఉంటే, హేమ సివిల్‌ సర్వీసులోనో, లా ప్రాక్టీసులోనో తల మునకలుగా ఉండిఉండేది. కాని మనిషి వ్యక్తిత్వవికాసానికి కెరీరొక్కటే దారి కాదు. హేమ జీవితంలో సాధించకుండా ఉండిపోయినవాటిని మల్లిక సాధిస్తూ ఉంది, అంశుమంతుడు కిందకి తేలేని గంగని భగీరథుడు భూమికి దింపినట్టు.

3

మల్లిక వికాసం నిజంగానే మల్లెపువ్వు వికసించినట్టే ఉంటోంది. మా కళ్ళముందే ఈ చిన్నారి బాలిక ఒక కవిగా, చిత్రకారిణిగా, ఒక భావుకురాలిగా, ఒక ప్రేమికురాలిగా ఎదుగుతుండమే కాదు, అన్నిటికన్నా ముఖ్యం ఆమె నడకలో, నడతలో అపూర్వమైన సంస్కారం, ఆత్మక్రమశిక్షణ వెల్లివిరుస్తుండటం నన్నెప్పుడూ సంతోషవిభ్రమానికి గురిచేస్తుంటుంది.

4

మల్లికది చిట్టిప్రపంచం. చిన్ని చిన్ని నవ్వులు, చిన్ని చిన్ని పువ్వులు, సీతాకోకచిలుకలు, తూనీగలు, మబ్బుతునకలు, మెరుపుబాలలు-వేటిని చూడటానికి ప్రపంచానికి తీరికలేదో మల్లిక వాటితోటే కలిసిమెలిసి జీవిస్తున్నది. ‘ఈశ్వర సామ్రాజ్యం ఇలాంటి చిన్నారులది’ అని యేసు అన్నది మల్లిక లాంటి వాళ్ల గురించే. ‘మీరు కూడా ఇలాంటి చిన్నారులుగా మారకపోతే భగవంతుడి రాజ్యంలోకి ప్రవేశించలేరు’ అని దైవకుమారుడు చెప్పాడని మల్లికకి తెలియదుగానీ, మల్లిక తాను ఆ దివ్యలోకంలో జీవిస్తూ ఉండటమే కాదు, మనల్ని కూడా ఆ లోకంలోకి చేయి పట్టుకుని తీసుకుపోడానికి ఆత్రుతపడుతున్నది, దయకురిపిస్తున్నది. ప్రతిభలోనే కాదు, ప్రేమలో కూడా మల్లికకి మా హేమ వారసత్వం పూర్తిగా లభించింది.

5

హైకూ చిత్రమైన ప్రక్రియ. మూడుపాదాల ఆ చిట్టి ఛందస్సు మొత్తం ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంది. మరీ ముఖ్యంగా ఆధునిక పాశ్చాత్యప్రపంచాన్ని. కానీ, నేను చదివిన పాశ్చాత్యకవులెవరూ హైకూ సీమలో అడుగుపెట్టలేకపోయారనే అనిపిస్తుంది, చివరికి జార్జి సెఫెరిస్‌, తోమాస్‌ ట్రాన్స్‌ ట్రోమర్‌ లాంటి మహాకవులు కూడా. జపాన్‌కి బయట హైకూ స్ఫూర్తికి దరిదాపుల్లోకి రాగలినవాళ్ళు చాలా అరుదు, ఎక్కడో ఒక టాగోర్‌, ఒక జిబ్రాన్‌ లాంటివాళ్ళు ఒకరిద్దరు తప్ప. ఎందుకంటే, హైకూ అన్నిటికన్నా ముందు కవిత్వాన్ని కాదు, ఒక దర్శనాన్ని మనకు చేరవేసే వాహిక. అయితే నువ్వొక జెన్‌ సాధువులాగా లోకానికి దూరంగా జరిగిపోయన్నా ఉండాలి లేదా సమస్త సృష్టినీ ఒక జెన్‌ కళాకారుడిలాగా పట్టలేనంత ప్రీతితో హత్తుకుంటూనైనా ఉండాలి, అప్పుడు మటుకే నీ మాట ఒక హైకుగా మారుతుంది. ఈ పుస్తకంలో పద్యాలు హైకూలుగా మారాయంటే అందుకు కారణం మల్లిక ముందు ఒక పువ్వుకో, పిట్టకో దగ్గరగా జరిగి, ఆ తర్వాత తన సంతోషాన్ని మనతో పంచుకోకుండా ఉండబట్టలేకపోతున్నందువల్లనే.

6

‘మీదే మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్యవిధాతలు! మీ హాసంలో మెరుగులు తీరును వచ్చేనాడుల విభాప్రభాతములు ‘అని అన్నాడు మహాకవి చిన్నారి శిశవులనుద్దేశిస్తో. ఎన్నో యుగాలకు పూర్వం ఒక మానవుడి శోకం శ్లోకంగా మారడంతో మన కవిత్వసంప్రదాయం మొదలయ్యింది. ‘మానిషాద గీతం నుంచి శ్రీనివాసరావుదాకా’ అదే సతత అవిచ్ఛిన్న అశ్రుధార. ఇన్నాళ్ళకి ఒక హాసం నుంచి కవిత్వం జనిస్తున్నది. తన తల్లి నవ్వినప్పటి ఆ ‘సరదా నవ్వు’ ని మళ్ళీ మళ్ళీ చూడటానికి తానీ కవిత్వం రాసుకున్నానని మల్లిక రాసింది చదివినప్పుడు నాకు భవిష్యప్రపంచం పట్ల ఎంత నమ్మకం కలిగిందో మాటల్లో చెప్పలేను.

9-7-2024

14 Replies to “మా మల్లిక”

  1. Congratulations to then Child Prodigy and today’s Celebrity! మల్లికా….
    Zoom Link పంపరూ…

  2. మీ పరిచయవాక్యాలు మల్లిక కవితలకు గీటురాళ్లు.
    మల్లిక పరిచయం లా కనిపించే ఈ వ్యాసం నవకవనానికి నాందీవాక్యం. యువకవకవనానికి
    స్ఫూర్తి గీతం. ఒక జెన్ హైకూకి సరళ నిర్వచనం.
    నిర్మలహృదయాంతరంగ భావభాండాగారానికి
    తాళంచెవి. ఒక పోస్టు చదవగానే మనసు ఉప్పొంగి స్పందించకుండా ఉండలేని విధంగా రాయగల్గటంలోనే మీ రచనా సంవిధాన సంపుష్టి
    తెలుస్తుంది. మీ మేనకోడలిగా పుట్టిన మల్లిక ధన్యురాలు.అభినందనలు.

  3. అంశుమంతుడు కిందకి తేలేని గంగని భగీరథుడు భూమికి దింపినట్టు..
    ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబికి వచ్చాయి.
    ఆనంద, బాధల మేలు కలయిక అది.
    ఇది చదివి నాకేం మాట్లాడాలో తెలియడం లేదు. మాట్లాడకుండా ఉండనూ లేను.
    మీ ఒక్కొక్క మాట ముత్యాల మూట.
    హేమ గారి మనసు అర్థం అయి ఏమి మాట్లాడలేని తనం.
    మీ మల్లికా పాలపిట్ట కి బోలెడన్ని ఎన్నటికీ వాడిపోని సిరి మల్లెలు.
    మీ భావాల్ని విని మీకు నమస్కరించడం.మినహా. మాటలు లెక్కడివి?

  4. చాలా సంతోషం. చి.మల్లికకు అభినందనలు! తనూ మీలా, వీరలక్ష్మీ దేవి గారి లా మంచి పేరు తెచ్చుకోవాలి అని ఆశీర్వదిస్తున్నాను.

  5. చాలా సంతోషం. మల్లికకు స్వాగతం. ఎదగాలని కోరుకుంటున్నాను

  6. స్వతహాగా ప్రతిభావంతురాలు చిరంజీవి
    మల్లిక వీరలక్ష్మీదేవిగారు,
    చినవీరభద్రుడుగారు, వసుధారాణిగారి వంటి సాహితీమూర్తుల ఆశీస్సులతో
    ఉన్నత శిఖరాలు తప్పకుండా అందుకుంటుంది.
    విజయీభవ.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading