ఆధార శిల

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాతో కలిసి పని చేసిన ఒక పూర్వ సహోద్యోగి ఈ మధ్య నాకొక డాక్యుమెంట్ షేర్ చేశారు. అది యెర్లీ ఛైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడుకేషన్ మీద భారతప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ డాక్యుమెంట్. భారత ప్రభుత్వం ఆ విధాన పత్రానికి ‘ఆధార శిల’ అని పేరుపెట్టింది.

ఆధార శిల అనే ఆ పేరు చూడగానే నా పెదాల పైన ఒక చిరునవ్వు ఉదయించందని నాకు తెలుస్తోనే ఉంది. ఆ చిరునవ్వు వెనక ఒక సంతోషం, కించిత్ గర్వం, ఒక నిస్పృహ కూడా ఉన్నాయి. వాటన్నిటినీ వివరించాలంటే ఏకంగా ఒక పుస్తకమే రాయవలసి ఉంటుంది.

బ్రిటిష్ పాలనా కాలంలో ఒక నానుడి ఉండేది. బెంగాల్ నేడు ఏమి ఆలోచిస్తే తక్కిన భారతదేశం మర్నాడు అదే ఆలోచిస్తుంది అని. విద్యకి సంబంధించినంతవరకూ ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్) గిరిజనసంక్షేమ శాఖ ఏమి ఆలోచిస్తే, ఏ ప్రయోగాలు చేపడితే, తర్వాత రోజుల్లో, దేశమంతా విద్యాశాఖ దాదాపుగా ఆ భావనల్నే మరింత మెరుగుపెడుతూ, విస్తరిస్తూ వచ్చిందనేది కాదనలేని సత్యం. కాకపోతే, ఈ వాస్తవాన్ని ఓపిగ్గా డాక్యుమెంట్ చేసే తీరిక గిరిజనసంక్షేమశాఖకి లేకపోయింది.

ఇప్పుడు ఆధారశిల అనే ఈ విధాన పత్రం చూడగానే ముందు నాకు ఆ సంగతే గుర్తొచ్చింది. ఇప్పటికి పుష్కరకాలం నాటి ఒక విశిష్ట ప్రయోగం. 2011 లో మాకు సోమేష్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ గా వచ్చారు. ఆయన తన సర్వీసు ప్రారంభంలో పాడేరు ఐటిడిఏ కు ప్రాజెక్టు అధికారిగా పనిచేసి ఆ ప్రాంతంలో గొప్ప అభివృద్ధికి బాటలు వేసారు. ఆ తర్వాత రోజుల్లో మరిన్ని రంగాల్లో పనిచేసి సమకూర్చుకున్న అనుభవంతో ఆయన కమిషనర్ గా రాగానే తన మొదటి ప్రాధాన్యత విద్య అని చెప్పారు. కాని విద్య అంటే  అన్నిటికన్నా ముందు, పాఠశాలల్లో ఉన్న పిల్లలందరికీ, అన్ని వయసులవారికీ కనీస అభ్యసన సామర్థ్యాలు ఒనగూడటం ముఖ్యమని చెప్పారు. స్కూళ్ళల్లో పిల్లలు అయిదో తరగతిలో ఉన్న, పదో తరగతికి చేరుకున్నా కూడా వాళ్ళల్లో చాలామందికి కనీసం చదవడం, రాయడం, మామూలు లెక్కలు చెయ్యడం కూడా రాదనే కఠిన వాస్తవాన్ని ఆయన చూసీ చూడనట్టు పోదలుచుకోలేదు. ముందు పిల్లలందరికీ ఒక క్రాష్ కోర్సులాగా కనీస సామర్థ్యాలు ఒనగూడేలా చూసినతర్వాతనే తక్కిన విద్యాకార్యక్రమాన్ని కొనసాగించాలన్నది ఆయన ఆలోచన.

2012 ఫిబ్రవరిలో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేసినప్పుడు, దానికి ఒక పేరు పెడితే, అది ఒక ఉద్యమంగా ప్రజల్లోకి పోతుందనీ కాబట్టి దానికి తగిన పేరు సూచించమనీ నన్ను అడిగారాయన. ‘మీరు తెలుగులో పండితులు కదా, మంచి పేరు పెట్టండి’ అనడిగారు. కాని సరిగ్గా అట్లాంటి సమయాల్లో నా పాండిత్యం మూగబోడం నాకెన్నో సార్లు అనుభవంలోకి వచ్చిన విషయమే కాబట్టి, నేను ఆ మధ్యాహ్నం నా సహోద్యోగుల్ని పిలిచి నా ఛాంబర్ లో ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ మొదలుపెట్టాను. మేమంతా ఆ తుపానులో తలమునకలుగా ఉండగా, కవితాప్రసాద్ ఆ గదిలో అడుగుపెట్టాడు. ఏమిటి సంగతన్నాడు. మేము చెప్పింది విన్నాక, ‘దీనికి ఇంత చర్చ ఎందుకు? పునాది అంటే సరిపోదా?’ అన్నాడు.

ఆయన నిజంగా సరస్వతీ పుత్రుడు. ఏ క్షణాన అలా నామకరణం చేసాడోగాని, పునాది నిజంగానే గిరిజన విద్యాచరిత్రలో ఒక మైలురాయిగా నిలబడిపోయింది. అదొక గొప్ప ప్రయోగం.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమపాఠశాలన్నిటిలోనూ చదువుతున్న పిల్లలందరికీ మొదట ఒక బేస్ లైన్ పరీక్ష పెట్టాం. వాళ్ళు సాధించిన సామర్థ్యాల్ని ఆన్ లైన్ లో నమోదు చేసాం. అప్పుడు మూడు నెలలపాటు ఒక ప్రత్యేక కార్యక్రమం అమలు చేసాం. అప్పట్లో ఎస్.సి.ఇ.ఆర్.టిలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఉపేందర్ రెడ్డిగారు, ఆయన బృందం ఆ కోర్సుకి కావలసిన కరదీపికలు రూపొందించారు. అందుకు తగ్గట్టుగా ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమం, పర్యవేక్షణ, కళాజాతాలు-మొత్తమంతా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాల నమూనాలో చేపట్టాం. రాష్ట్రమంతటా గిరిజన ప్రాంతాల్లో గొప్ప వెలుగు ప్రత్యక్షమయింది. పిల్లలకి కనీస సామర్థ్యాలు ఒనగూడేక, వాళ్ళ చదువులో క్వాలిటీ మీద దృష్టి పెట్టాలని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్ టిస్ ( క్వెస్ట్) అనే కార్యక్రమం మొదలుపెట్టాం. 2012-13 విద్యాసంవత్సరం క్వాలిటికీ అంకితం చేయాలనుకున్నాం. ఈలోగా రాష్ట్ర విభజన పర్వం మొదలయ్యింది. ఇక ఆ ఉద్యమం మీద దృష్టి సారించే అవకాశం ఎవరికీ లేకపోయింది.

భారతదేశంలో పాఠశాల విద్య ప్రధానంగా రెండు యాజమాన్యాల చేతుల్లో నడుస్తున్నది. ఒకటి ప్రభుత్వం, రెండోది ప్రైవేటు సెక్టర్. తల్లిదండ్రులు- అధిక ఆదాయవర్గాలనుంచి అల్ప ఆదాయవర్గాల దాకా- ప్రతి ఒక్కరూ కూడా తమ పిల్లల్ని మంచి ప్రైవేటు బడుల్లో చదివించాలనే అనుకుంటారు. విద్యాప్రమాణాలు ప్రైవేటు బడుల్లో బాగా ఉంటాయనుకోవడం దానికి కారణం. కానీ విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే పిల్లలకి  ప్రి-ప్రైమరీ విద్య తప్పనిసరిగా ఉండాలని చాలామందికి తెలియదు.

ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని మూడేళ్ల వయసులోనే, (ఇప్పుడు చాలా చోట్ల రెండున్నరేళ్ళ వయసుకే) నర్సరీలో చేరుస్తారు. ఆ తర్వాత ఒక ఏడాది ప్రి-ప్రైమరీ 1, రెండో ఏడాది ప్రీ ప్రైమరీ 2 చదివాక పిల్లల్ని మొదటి తరగతిలో ప్రవేశపెడతారు.అంటే ఒక బిడ్డ ప్రైవేటు పాఠశాలలో ఒకటవతరగతిలోకి చేరేటప్పటికే, అంటే అయిదేళ్ళ వయసు పూర్తయ్యేటప్పటికే, అతడికి చదవడం, రాయడం, అంకెలు గుర్తుపట్టడం, కనీస చతుర్విధగణిత సామర్థ్యాల పాటుతో అన్నిటికన్నా ముఖ్యంగా, బడి వాతావరణానికి పూర్తిగా అలవాటుపడిపోయి ఉంటాడు. అదే ప్రభుత్వపాఠశాల విషయానికి వస్తే, పిల్లలు అయిదేళ్ళు వయసు నిండాక మొదటిసారిగా బడిలో అది కూడా ఒకటవ తరగతిలో నేరుగా అడుగుపెడతారు. వారికి ఎటువంటి కనీస అభ్యసన సామర్థ్యాలూ ఒనగూడి ఉండవు. అత్యధికసంఖ్యాకులైన పిల్లలు వెనకబడిన తరగతులనుంచీ, దళిత, గిరిజన, మైనారిటీ సమూహాలనుంచీ వస్తారుకాబట్టి వాళ్ళకి తమ ఇళ్ళల్లో అటువంటి సామర్థ్యాల్ని పెంచిపోషించే అవకాశం ఉండదు. వాళ్ళల్లో మళ్ళా వలసకూలీల పిల్లలూ, దివ్యాంగులైన పిల్లల పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.

అధిక ఆదాయ వర్గానికి చెందిన ఒక పిల్లవాడూ, నిరుపేద కుటుంబాలనుంచి వచ్చిన ఒక బాలికా ఇలా, వాళ్ళు ఒకటవతరగతిలోకి చేరేటప్పటికే ఎన్నటికీ పూడ్చలేనంత అసమానతలో అడుగుపెడతారు. దురదృష్టవశాతూ వాళ్ళిద్దరూ కూడా పదవతరగతిలో ఒకే పరీక్ష రాయవలసి ఉంటుంది. అటువంటి అసమాన, అసమతల వ్యవస్థలో ఎవరు ఎక్కువ మార్కులు సంపాదించుకుంటారో చెప్పడం కష్టమేమీ కాదు. ఇక ఆ అసమానత వాళ్ళని జీవితమంతా వెన్నాడుతుంది. మరొక అయిదేళ్ళకో, పదేళ్ళకో ఆ అధిక ఆదాయవర్గానికి చెందిన పిల్లవాడు ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అయిందకెల జీతగాడిగా మారగానే, పాలమూరుకి చెందిన ఆ నిరుపేద దళిత బాలిక అతడి ఇంట్లో పనిమనిషిగా కుదురుకుంటుంది.

విద్యాపరంగానూ, ఉద్యోగపరంగానూ, తదనంతరం సామాజిక-రాజకీయ అవకాశాల పరంగానూ మన దేశంలో వర్ధిల్లుతున్న అసమానతలకు వెనక ఉన్న అనేక కారణాల్లో ప్రభుత్వపాఠశాలల పిల్లలకు ప్రి-ప్రైమరీ విద్య లేకపోవడం కూడా ఒక బలమైన కారణం అని మనం గుర్తించాలి.

ఈ ఎరుక ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో కలిగింది. ఉదాహరణకి, హెక్ మన్ కర్వ్ గా ప్రసిద్ధి చెందిన ఈ గ్రాఫ్ చూడండి.

ఇందులో హెక్ మన్ అనే ప్రొఫెసరు ఏం చెప్తున్నాడంటే, ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా, ఎర్లీ ఛైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ మీద పెట్టే పెట్టుబడికి అధికమొత్తంలో రాబడి ఉంటుందని. అంటే ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తన పిల్లల ప్రి-ప్రైమరీ, ఎర్లీ ఛైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ మీద తలకొక్కరికి ఒక డాలరు ఖర్చుపెట్టిందనుకుందాం. దీర్ఘకాలంలో ఆ డాలరు మీద నాలుగునుంచి పదిడాలర్ల దాకా ప్రతిఫలం ఆ జాతికి లభిస్తుందని ఆ పరిశీలన సారాంశం. ఆ ప్రతిఫలాలు రానురానూ, అంటే, పిల్లల విశ్వవిద్యాలయ విద్యకి వచ్చేటప్పటికి తగ్గుతుండటం కూడా మనం గ్రాఫులో చూడవచ్చు. ప్రపంచంలో కొన్ని దేశాలు అభివృద్ధి చెందాయంటే, ఆ దేశాల్లో ఆర్థిక అసమానతలు తక్కువగా ఉన్నాయంటే, అందుకు ఒక ముఖ్యకారణం ఆ దేశాలు పిల్లల తొలిశైశవ విద్యమీద ఎక్కువ వ్యయానికి వెనకాడకపోవడమే. ఈ విషయంలో కుటుంబాలకు ఏది వర్తిస్తుందో, దేశాలకు కూడా అదే వర్తిస్తుంది.

మనిషి పుట్టిన తర్వాత అతనికి వనగుడే బుద్ధి వికాసంలో 85% మొదటి ఆరేళ్లకే పూర్తయిపోతుందని పరిశోధనలు చెపుతున్నాయి. అంటే బిడ్డకి ఆరేళ్ల వయసు వచ్చే లోపలనే ఆమెకు జ్ఞానాభ్యసనానికి సంబంధించిన కనీస శిక్షణ మనం ఇవ్వగలిగితే ఆ తర్వాత ఆమెకు చదువు సులభంగా పట్టుపడుతుంది. దీన్నే విద్యావేత్తలు చాలా సరళంగా ఇలా చెప్తున్నారు: మొదటి మూడేళ్ళూ learn to read, ఆ తర్వాత జీవితకాలం పాటు read to learn అని.

భారతదేశానికి కూడా ఈ మెలకువ లేకపోలేదు.అయితే ఇక్కడ పిల్లల శైశవంలో విద్యకన్నా ముందు పోషణకీ, ఆరోగ్యానికీ ప్రాధాన్యతనివ్వవలసిన పరిస్థితి ఉంది. మన పాఠశాలలూ, మన ఉపాధ్యాయ శిక్షణా పిల్లలకు చదువుచెప్పడానికి రూపొందినవి తప్ప, సంరక్షణతో కూడుకున్న చదువుని అందించడానికి తగినవి కావు. కాబట్టి  అయిదేళ్ళ లోపు పిల్లలకోసం పోషణనీ ఆరోగ్యాన్నీ చదువునీ ఒక్క చోటే అందించాలన్న ఉద్దేశంతో  1975 లో మొదటిసారిగా అంగన్ వాడీ కేంద్రాల్ని ఏర్పాటు చేసారు. అంతకుముందు అరకొరగా నడుస్తున్న బాలవాడీ వ్యవస్థను మరింత సమగ్రపరిచి చేపట్టిన వ్యవస్థ ఇది. అంగన్వాడీలు గొప్ప ఆశను రేకెత్తించడంతో అనతికాలంలోనే దేశమంతా వాటిని సార్వత్రీకరించారు.

దాంతో 1975 లో 4891 మాత్రమే ఉన్న అంగన్ వాడీలు 2009 నాటికి 7.44 లక్షల కేంద్రాలకి విస్తరించాయి. 2014 నాటికి దేశమంతటా 13.9 లక్షల అంగన్ వాడీ కేంద్రాల్లో సుమారు ఎనిమిది కోట్ల మంది పిల్లలు ప్రవేశం పొందారు. ఇది చిన్న విషయం కాదు. భారతదేశం అణ్వాయుధాలు రూపొందించుకోవడంకన్నా, చంద్రుడిమీద అడుగుపెట్టడంకన్నా గొప్ప విజయం ఇది.

అంగన్ వాడీల ఉద్దేశ్యం ప్రకారం అక్కడ పిల్లలకి పోషణతో పాటు ఆటపాటల విద్య కూడా నడవాలి. దాన్ని ప్రి-స్కూలింగ్ అన్నారు. కాని కాలక్రమంలో అంగన్ వాడీలు పోషణా కేంద్రాలుగా ఎదిగినట్టుగా విద్యాకేంద్రాలుగా మారలేకపోయాయి. అలాగని అంగన్ వాడీ టీచర్లు పనిచెయ్యరని కాదు. నా ఉద్యోగ జీవితంలో రాష్ట్రమంతటా ఎక్కడికి వెళ్ళినా ఆయా గ్రామాల్లో ఉపాధ్యాయుడితో సహా మరే గ్రామస్థాయి ఉద్యోగీ నివాసం ఉన్నా ఉండకపోయినా అంగన్ వాడీ కార్యకర్తలు మాత్రం తప్పనిసరిగా నివాసముండటం చూసాను. కాని వాళ్ల పని భారం మరీ పెద్దది. ఒక అంగన్ వాడీ కార్యకర్త ప్రతిరోజూ చేపట్టవలసిన బాధ్యతలు చేపట్టి వాటిని ఎప్పటికప్పుడు యాప్ లో అప్ లోడ్ చేసేటప్పటికి ఆమెకి ప్రి-స్కూల్ బాధ్యతలు నిర్వహించే తీరికా, ఓపికా రెండూ మిగలవు. నేనొక రోజు ఒక అంగన్ వాడీ కేంద్రాన్ని చూసినప్పుడు ఆమె యాప్ లో  అప్లోడ్ చేయవలసిన  24 బాధ్యతల్లో ప్రి-స్కూల్ లేనేలేదు!

2019 లో జాతీయ విద్యావిధాన రూపకల్పనకు కూచున్నప్పుడు భారతప్రభుత్వానికి ఇది పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలంటే క్వాలిటీ ప్రి-ప్రైమరీ ఎడ్యుకేషన్ ని అందించడం తప్పనిసరి. కానీ అంగన్ వాడీలు ఉండగా, వాటిని పక్కనపెట్టి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రి-ప్రైమరీ క్లాసులు తెరవడం సాధ్యం కాదు. అటువంటి పని చాలా వ్యయంతో కూడుకున్నది కావడమే కాక ఆచరణ సాధ్యం కాదు కూడా. ఎందుకంటే, ప్రి-ప్రైమరీ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మనకి దాదాపుగా లేరు (ప్రసిద్ధి చెందిన ప్రైవేటు, కార్పొరేట్, ఇంటర్నేషనల్ స్కూళ్ళు కూడా ఇందుకు మినహాయింపు కాదు). అసలు అటువంటి శిక్షణా సంస్థలు కూడా చాలా తక్కువ. కాబట్టి ప్రభుత్వపాఠశాలల్లో ప్రి-స్కూళ్ళు తెరవాలంటే వేల సంఖ్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు అవసరమవుతారు. ఇప్పటికిప్పుడు శిక్షణా సంస్థలు తెరిచినా మనకి అవసరమైన సంఖ్యలో ఉపాధ్యాయులు సమకూరడానికి కనీసం పదేళ్ళు పడుతుంది. పర్వాలేదు, మొదలుపెడదామనుకున్నా, ఇప్పటికే ఈ బాధ్యత నిర్వహించడంకోసం నియమించిన అంగన్ వాడీ కార్యకర్తల పరిస్థితి ఏమిటి?

2020 నాటికి పరిష్కరించబడ్డ జాతీయ విద్యావిధానం ఈ సమస్యకు ఏదో ఒక్క పరిష్కారాన్ని చూపలేకపోయింది. అందుకని నాలుగు రకాల పరిష్కారాలు చూపించింది. మొదటిది, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే ప్రి-ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్లయితే వాటిని బలోపేతం చెయ్యడం. రెండవది, చాలాచోట్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, అంగన్ వాడీలూ ఒకే చోట నడుస్తున్నాయి. అటువంటి కొ-లొకేటెడ్ అంగన్ వాడీల్ని ప్రభుత్వపాఠశాలలకి అనుసంధానం చెయ్యడం, మూడవది, ప్రభుత్వపాఠశాలకి దూరంగా ఉన్న అంగన్ వాడీల్లో ప్రి-ప్రైమరీ విద్యను బలోపేతం చెయ్యడం, నాలుగవది, పూర్తి స్థాయి ప్రి ప్రిమరీ స్కూళ్ళను అలానే కొనసాగించడం.

కాని దేశంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రధానంగా స్టాండ్-ఎలోన్ అంగన్ వాడీలే అత్యధిక సంఖ్యలో ఉంటాయి. అవి కూడ నిరుపేద, దళిత, గిరిజన ప్రాంతాల్లోనే ఉంటాయి. కాబట్టి నిరుపేద బాలబాలికలకు గుణాత్మకమైన ప్రి-ప్రైమరీ విద్యని అందించాలంటే అంగన్ వాడీల్లోని ప్రి-స్కూలు విద్యను బలోపేతం చెయ్యడం ఒక్కటే మార్గం.

2010 లో ఈ సమస్యను గుర్తించినప్పటినుంచీ భారతప్రభుత్వం దీన్ని ఎలా పరిష్కరించాలా అని తలమునకలవుతూనే ఉంది. 3-8 సంవత్సరాల మధ్య వయసులో చేపట్టవలసిన ఈ విద్యను జాతీయ విద్యావిధానం ఫౌండేషనల్ దశ అంది. (కవితాప్రసాద్ వింటున్నావా! పునాది!). అయితే ఈ అయిదేళ్ళ కాలవ్యవధిని తరగతులా ఎలా విభజించాలి అన్నదానిమీద భారతప్రభుత్వం కుస్తీ పడుతూనే ఉంది. ప్రైవేటు పాఠశాలలకి ఈ సమస్య లేదు. వాళ్ళు రెండున్నరేళ్లకే పిల్లల్ని నర్సరీలో చేర్పించేయగలరు! కానీ నర్సరీ అశాస్త్రీయమే కాదు, అనైతికం కూడా. కాబట్టి భారతప్రభుత్వం మొదటి సంవత్సరంలో నర్సరీ క్లాసు పెట్టమని చెప్పలేదు. అదీకాక పేదపిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో మొదటితరగతిలో నేరుగా చేరుతున్నప్పుడు వాళ్ళకి కనీస సామర్థ్యాలు కొరవడుతున్నాయి కాబట్టి, ఒకటవతరగతికన్నా ముందు ఒక ఏడాది పాటు ఒక ప్రత్యేక తరగతి నడిపితే బాగుంటుంది అనుకున్నారు. దానికి బాలవాటిక అని పేరుపెట్టారు. కాని దేశవ్యాప్తంగా అన్ని ప్రాథమిక పాఠశాలల్లోనూ బాలవాటిక మొదలుపెట్టడం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావడమేకాక, ఆచరణ సాధ్యంగా కూడా కనిపించలేదు. దాంతో పిల్లలు ఒకటవ తరగతిలో చేరినప్పుడే, మొదటి మూడు నెలల్లోనే వాళ్ళకి కనీస సామర్థ్యాలు సమకూరేలా (మేం చేపట్టిన పునాది లాగా) ఒక ప్రత్యేక కార్యక్రమం నడిపితే చాలని భావించారు. దాన్ని ‘విద్యాప్రవేశ్’ అని అన్నారు.

భారతప్రభుత్వాన్ని ఈ ఆలోచనలు తీవ్రంగా కలవరపరుస్తున్న సమయంలో నేను ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్య సంచాలకుడిగా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ సమస్యకు పరిష్కారాలు వెతకలేమా అని మా ముందొక సవాలు లేవనెత్తారు. ఆ తర్వాత ఆయన మాతో ఈ సమస్యకు ఆచరణసాధ్యంగా వెతగ్గల రకరకాల ప్రత్యామ్నాయాల మీద వారాల తరబడి చర్చించారు.

మేము ఆ సమస్య మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాక ఒక ముఖ్య విషయం గమనించాం. అంగన్ వాడీల్ని 1975 లోనే ప్రారంభించినప్పటికీ, ఆ తర్వాత 1986 లో నూతన విద్యావిధానం, 1989 లో పిల్లల హక్కుల మీద అవగాహన, 2005 లో శిశువిధాన పత్రం, 2009 లో విద్యాహక్కు చట్టం, 2013 లో ఎర్లీ ఛైల్డ్ హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఒక జాతీయ విధానం రూపొందాక కూడా, ప్రి-స్కూల్లో ఏమి బోధించాలో అటువంటి సిలబీగానీ, పాఠ్యపుస్తకాలుగానీ, బోధన సామగ్రిగానీ ప్రభుత్వాలు రూపొందించనేలేదని! అంటే అంగన్ వాడీలు ప్రీ-స్కూలు నడపాలని చెప్తూనే వచ్చారు తప్ప ఆ స్కూలు ఎలా నడపాలో ఎవరూ ఆలోచించనే లేదు. పైగా పదో తరగతి స్థాయిలో ఉద్యోగంలో చేరే అంగన్ వాడీ టీచర్ తనకై తానే ఆ విధివిధానాల్ని చూసుకుంటుందని విధాననిర్ణేతలు గత యాభై ఏళ్లుగా నమ్ముతూ వచ్చారు!

కాబట్టి అన్నిటికన్నా ముందు చేపట్టవలసిన పని ప్రి-ప్రైమరీ-1, 2 లకు బోధన-అభ్యసన సామగ్రి రూపొందించడం అని తెలుసుకున్నాం. తీరా ఆ సామగ్రిని రూపొందించడానికి మా ముందు సరైన నమూనాలేవీ లేవు. భారతప్రభుత్వంలో ఇ.సి.సి.యి జాతీయ విధానం స్త్రీ శిశు సంక్షేమ శాఖ చూస్తుంది. కాని అందుకు తగ్గ నైపుణ్యాలు విద్యాశాఖలో ఉంటాయి. కాబట్టి రెండు శాఖలూ కూడా ఈ పని తమదికాదంటే తమది కాదనుకున్నాయి. సరే, ప్రైవేటు పాఠశాలల్లో ఏమి చేస్తున్నారో చూద్దామని దాదాపు ముప్ఫై రకాల స్కూళ్ళనుంచి సామగ్రి తెప్పించాం. వాటిల్లో వీథిబడుల్లాంటి కాన్వెంటులనుంచి, మిషనరీ స్కూళ్ళు మొదలుకుని,  ఐబి దాకా ప్రస్తుతం అమల్లో ఉన్న రకరకాల బోధన సామాగ్రిని పరిశీలించాం. మీరు నమ్మరు! అంతకన్నా నాసిరకం బోధనా సామగ్రి మరెక్కడా మనకి కనిపించదు. నర్సరీ పిల్లలకోసం మార్కెట్లో ఉన్న ఇంగ్లిషు నర్సరీ రైముల్లో పిల్లలకి నేర్పుతున్నంత అధ్వాన్నమైన పాటలు మరే భాషలోనూ మనకి కనిపించవు. అంతకన్నా మన ప్రభుత్వపాఠశాలల్లో పిల్లలు పాడుకునే ‘చిట్టీ చిలకమ్మా’ లాంటి పాటలు వందరెట్లు ఆరోగ్యప్రదమైనవి.

ఏదైనా ఒక తరగతికి బోధన, అభ్యసన సామగ్రి రూపొందించడం దానికదే ఒక శాస్త్రం. అందులో గొప్ప ప్రయోగాలు చేపట్టినవాళ్ళు మనమధ్యనే చాలామంది ఉన్నారు. గుంటూరులో డా.మంగాదేవి, విజయవాడ గుణదలలో అభ్యాస విద్యాలయం నడుపుతున్న కృష్ణ, చాలాకాలంగా చీపురుపల్లిలో బాలబడి అనే ప్రయోగాన్ని అద్భుతంగా నడుపుతున్న శోధన సంస్థ కామేశ్వరరావుగారు, ఆంధ్రమహిళాసభ కు చెందిన లక్ష్మిగార్లతో పాటు గత ముప్ఫై ఏళ్ళకు పైగా జాతీయ స్థాయిలో ఈ అంశం గురించి విధాననిర్ణేతల్ని ప్రభావితం చేస్తూ ఉన్న వినీత కౌల్ వంటి వారున్నారు. వీరందరితో సమావేశాలు నిర్వహించాం. వారు రూపొందించిన సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించాం. వీటితో పాటు రాజస్థాన్ ప్రభుత్వం రూపొందించిన సామగ్రిని కూడా పరిశీలించని లతా మీనన్ గారు నాకు సూచించారు. ఈ వనరుల సేకరణలో, ఈ విద్యావేత్తలతో చర్చలు ఏర్పాటు చెయ్యడంలో యునిసెఫ్ కి చెందిన స్వాతిదేవ్ చూపించిన శ్రద్ధ నేనెప్పటికీ మరవలేనిది.

ఇలా ప్రభుత్వాలు, విద్యావేత్తలు, ప్రైవేటు పాఠశాలలు రూపొందించి అమలు చేస్తున్న వివిధ పుస్తకాల్ని, సామగ్రిని పరిశీలించాక మేము అంగన్ వాడిల్లో పిల్లలకోసం ప్రి-ప్రైమరీ ఒకటి, రెండు తరగతులకు పాఠ్యపుస్తకాలు రూపొందించాం. వాటిల్లో అక్షరమాల ఆధారంగా రూపొందించిన తెలుగు, ఇంగ్లిషు పుస్తకాలతో పాటు, ఒక పాటల పుస్తకం, ఒక బొమ్మల పుస్తకం, ఒక ఆటల పుస్తకం కూడా ఉన్నాయి. ఈ మొత్తం సామగ్రి 2021 నాటికల్లా సిద్ధమైంది.  ఒక రాష్ట్రప్రభుత్వం ఇటువంటి సమగ్ర బోధనాసామగ్రి  రూపొందించడం  మొత్తం దేశంలోనే ఇదే ప్రథమం. వీటితోపాటు ఒకటో తరగతికి రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో మొదటి మూడు నెలలు పాఠశాల సంసిద్ధత కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాం. అప్పటికి భారత ప్రభుత్వానికి విద్యా ప్రవేశ్ అనే భావన తలెత్తెనే లేదు.  ఈ అపూర్వమైన కృషికి అప్పటి పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రాజశేఖర్ గారి మార్గదర్శకత్వంతో పాటు, అప్పట్లో సమగ్ర శిక్ష ప్రాజెక్టు అధికారిగా ఉన్న వెట్రిసెల్వి గారి అంకితభావం ముఖ్యకారణాలు.

గమనించవలసిందేమంటే, అప్పటికింకా భారతప్రభుత్వం వారి ఫౌండేషన్ స్టేజి కరికులం ఫ్రేమ్ వర్క్ రూపొందనే లేదు! కాని భారతప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసిన విధానపత్రంలో తాము పరిశీలించామని రాసుకున్న పదహారు రాష్ట్రప్రభుత్వాల సామగ్రిలోనూ ఆంధ్ర ప్రదేశ్ పేరు లేదు! చివరికి వాళ్ళు గమనించామంటూ పేర్కొన్న బెస్ట్ ప్రాక్టీసెస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ ఊసే లేదు!

టి ఎల్ ఎమ్ రూపొందించడంతో పాటు ఎన్నో విధానపరమైన సంస్కరణలు కూడా చేపట్టవలసి ఉంటుందని మేము ముఖ్యమంత్రిగారికి సూచించాం. అర్హత కలిగిన అంగన్ వాడీ వర్కర్లకి టీచర్లుగా పదోన్నతి, అంగన్ వాడీ వర్కర్లకు ప్రి-ప్రైమరీ బోధనకు అవసరమైన శిక్షణతో పాటు సర్టిఫికెటు ఇవ్వడం, కొ-లొకేటెడ్ అంగన్ వాడిల్లో విద్యాబోధనని పాఠశాలలకు అనుసంధానించడం, కిలోమీటరు లోపు ఉన్నతపాఠశాల ఉంటే, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని 3-5 తరగతుల పిల్లని ఉన్నతపాఠశాలలకు పంపి, ప్రాథమిక పాఠశాలని 1-2 తరగతులకు పరిమితం చెయ్యడం వంటివి మా సూచనలు.

వీటిల్లో ప్రాథమిక పాఠశాల్లోని 3-5 తరగతుల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తూ ఇచ్చిన జి.ఓ 117 మీదనే ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం ఓడిపోడానికి అది కూడా ఒక కారణం అని చెప్తున్నారు. కాని ఇటువంటి సంస్కరణల్నీ, నిర్ణయాల్నీ రాజకీయాల్తో కలిపి చూడకూడదు. ప్రభుత్వ పాఠశాలల్లోని నిరుపేద బాలబాలికలు క్వాలిటీ ఫౌండేషన్ ఎడ్యుకేషన్ లభించాలంటే, ప్రాథమిక పాఠశాలల్ని ప్రీ ప్రైమరీ -1, 2, విద్యాప్రవేశ్, ఒకటి రెండు తరగతులకు మాత్రమే పరిమితం చెయ్యాలని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. పాఠశాలల నిర్మాణం ఎలా ఉండాలనేది పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకోవలసిన నిర్ణయం కాబట్టి ఈ అంశం మీద   తల్లిదండ్రుల్లోనూ,  ప్రజల్లోనూ కూడా మరింత విస్తృతమైన చర్చ జరగాలి.

పాఠశాల విద్యాశాఖలో నా బాధ్యతలు 2011 లోనే ముగిసిపోయి నేను గిరిజన సంక్షేమ శాఖకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఈ పని ఆపలేదు. గిరిజనప్రాంతాల్లో పిల్లలు వాళ్ళ మాతృభాషల్లోనే ఇంకా మాట్లాడుతుంటారు కాబట్టి, అంగన్ వాడీల కోసం తెలుగులో రూపొందించిన సామగ్రిని ఆరు గిరిజనభాషల్లో తిరిగి రూపొందించే ప్రయత్నం మొదలుపెట్టాను.  నేను పదవీ విరమణ చేసే లోపే ఎస్.సి.ఇ.ఆర్.టి, గిరిజన సాంస్కృతిక పరిశోధనా మిషన్, సమగ్ర శిక్ష ప్రాజెక్టు సంయుక్తంగా, సవర, కుయి, కొండ, కోయ, సుగాలి, ఆదివాసి ఒరియా భాషల్లో గిరిజనభాష-ఇంగ్లిషు బైలింగువల్ టి ఎల్ ఎమ్ ని రూపొందించే పని మొదలుపెట్టాయి.

2022 లో పూణెలో జి-20 దేశాల ప్రతినిధులు విద్యపైన ఒక సదస్సు నిర్వహించారు. అప్పటికి నేను పదవీ విరమణ చేసి ఉన్నాను. కాని గిరిజన సంక్షేమశాఖ అంగన్ వాడీలకు రూపొందించిన ఈ పుస్తకాలు ఆ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనీ, భారతప్రభుత్వ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరి ద్వారానో విని స్వయంగా వచ్చి ఆ పుస్తకాల్ని చూసి వాటి గురించి అడిగి తెలుసుకున్నాడనీ విన్నాను. ఈ ఘనత ఎప్పటిలానే గిరిజన సంక్షేమశాఖకి చెందుతుంది. అలానే ఆ పుస్తకాల రూపకల్పన ఒక తపస్సు లాగా భావించిన ఎస్.సి.ఇ.ఆర్.టి ప్రొఫెసరు రమామణి కి కూడా.

ఇప్పటికి అంటే, 2024 నాటికి భారతప్రభుత్వానికి ఫౌండేషనల్ స్టేజిలో 3-6 తరగతుల విద్య ఎలా ఉండాలో ఆ కరికులం పట్ల ఒక స్పష్టత ఒనగూడింది. ఆ స్పష్టతతో ఇటీవలి చేసిన విధాన పత్రమే ఆధార శిల. అంటే ఇన్నేళ్లకి భారతీయ విద్యాసౌధం తన పునాది మీద దృష్టి సారించిందన్నమాట!

30-6-2024

8 Replies to “ఆధార శిల”

  1. ఒక పుస్తక సమీక్షగా కంటే విద్యా వ్యవస్థ సమీక్ష గా సాగిన మీ మనసు నుడి ఎంతో విలువైనది. నా ఉపాధ్యాయ పర్వంలో నేను ఏనాడూ సిలబస్ పూరితి చేయలేక పోవడానికి ప్రధాన కారణం , ఒక తరగతి నామమాత్రంగా చేరుకున్న విద్యార్థి , ఆ తరగతి కనీస స్థాయిలో కూడా లేక పోవడం. విద్యా వ్యవస్థ ఒక మంచి దిశవైపు తిరగడానికి ఆధారశిల (మన పునాదిరాయి) బాగా తోడ్పడుతుందని ఆశించాలి. మీ నుంచి విద్యా విషయకమైన మరిన్ని వ్యాసాలు రావాలని కోరుకుంటున్నాను.

  2. మీ కష్టం యొక్క నేపధ్యం మీరు చెపితేనే మాకు తెలుస్తూ ఉంటుంది అన్న. మేము తెర ముందు వాస్తవంగా మీ లక్ష్యాన్ని అమలుపరుచవలసిన వాళ్ళం.మరియు పేరెంట్స్.వీళ్ళ అభిప్రాయాన్ని మీరు తెలుసుకోలేదు.
    ముగ్గురు టీచర్లతో నడిచే ప్రైమరీ స్కూల్స్ అప్పర్ ప్రైమరీ వలన కొంత టీచర్స్ సామర్ధ్యం వచ్చింది.లేకుంటే
    ముగ్గురిలో ఒకరు డిప్యుటేషన్ మీద వెళుతుంటే ఇంకో ఇద్దరిలో ఒకరు ఫొటోస్ అప్ లోడ్ చేస్తుంటే,ఇంకొకరు బజారు నుండి ఎగ్స్,ఎం.ఈ.ఓ ఆఫీస్ నుండి బుక్స్ తీసుకొని రావడం లో ఉండేవాళ్ళు.ప్రైమరీ స్కూల్ అనేది తల్లి తండ్రులు ఒక ఎమోషనల్ బాండ్.ఇది మా స్కూల్ మా పిల్లలు ఇక్కడ 10 దాకా చదివేలా చూడాలి,స్కూల్ ఎక్కడికీ పోకూడదు అని గ్రామస్తులు చాలా గట్టిగా అనుకుంటారు.టీచర్ వాళ్ళ మధ్య,మీ మధ్య చాలా నలిగిపోయారు.ఇంకా వారికి చెడ్డ పేరు,పనిష్మెంట్ అందరినీ రెచ్చగొట్టారు అని.ఒక సాధారణ టీచర్ ఎంత నలిగిపోయాడో మీరు ఊహించలేరు.మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలీదు.మీరు చేసిన మెటీరియల్ చాలా బాగుంది.కానీ దానిని ఉపయోగొంచడం లో టీచర్స్ కాక తల్లి తండ్రులు శ్రమ కావాలి.అది మనకు ఎప్పుడూ కొరతే. ఒక్క చేతితో విద్య దీపం ఆరకుండా కష్టపడే ఉపాధ్యాయుడే చివరికి అందరి నిందలు పడాల్సివస్తుంది.మీ కృషి మాకు ఎప్పుడూ గౌరవనీయమైనది.కానీ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా సిబ్బంది లేరు.

  3. this cat belling problem has now again come to limelight with this neet issue(as per newspapers).

  4. సర్. నేను నా అభిప్రాయాన్నీ కామెంట్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు వెళ్లడం లేదో తెలియడం లేదు. మీ ఈ పోస్ట్ ఎంతో బాగుంది సర్.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading