ఆకాశాన్ని కానుకచేసే ఋతువు

నా ఉద్యోగ జీవితంలో భాగంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు, ఆ గ్రామాల్లో బోరువెల్ ఉంటే, ఆ బోరుపంపు ఆడించి చూస్తే అందులోంచి నీళ్ళొస్తే, అక్కడ ప్రభుత్వం ఉనికిలో ఉంది అని చెప్పుకునేవాణ్ణి. ఇవాళ పొద్దున్న మృగశిర కార్తె మొదలవగానే ఆకాశం మీద నలుపు నీడ తిరిగిన పలచని బూడిదరంగు మేఘాలు  ప్రవాహంలాగా పయనిస్తూ కనిపించినప్పుడు, ఫర్వాలేదు, కాలమింకా గతి తప్పలేదనుకున్నాను. ప్రపంచవ్యాప్తంగా దేశాలూ, నగరాలూ, నాగరికతా ఆకాశంలోకీ, నదుల్లోకీ, సముద్రాల్లోకీ, భూగర్భంలోకీ ఎంతలేసి కాలుష్యాల్ని వదుల్తున్నా కూడా, మహాసముద్రాలు వేడెక్కి ఆ తాపాన్ని తట్టుకోలేక వేడినిట్టూర్పులు వదులుతున్నా కూడా, ఇంకా ఋతుపవన మేఘాలు ఈ నగరాకాశం మీద వేళ తప్పకుండా ప్రయాణించడం చూస్తూ ఉంటే ఇంకా దేవుడి ఉనికిని మనిషి పూర్తిగా రద్దుచేయలేకపోయాడనే అనిపిస్తున్నది.

ఆహా! ఇంకా చాతకం బతికే ఉన్నది, నిప్పులు కక్కిన వేసవి మొత్తం ఆ ఉగ్రమధ్యాహ్నాల్ని అదెట్లా సహించిందోగాని, ఒక్క వానచినుకుకోసం, ఒక్క తేమగాలి తుంపర కోసం అదెట్లా ప్రాణాలు గొంతులో కుక్కుకుని ఇన్నాళ్ళూ గడిపిందోగాని, వానకోయిలకీ, కారుమబ్బుకీ ఉన్న ఈ అనుబంధం ఇన్ని యుగాలైనా ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం నాకు ధైర్యానిస్తున్నది.

నలిగిపోయాను నేను కూడా, లుంగలు చుట్టుకుపోయాను, నాలోనేనే రగిలిపోయాను, మాడిపోయాను, ఎండ చూస్తే చాలు, భయం పుట్టేది, ఎక్కడో బతుకు మీద లేశమాత్రం కూడా మిగలకుండా ప్రేమ శోషించిపోతుందా అనిపించేది. తెలుస్తున్నది, నేను కూడా ఈ వానపిట్టలాగా ఒక్క మబ్బు ఆకాశం మీద కదలాడే రోజు కోసం కొట్టుమిట్టాడేనని. కానీ నేనా పిట్టకెన్నటికీ సాటిరాను. అది కేవలం ఎదురుచూడటం మాత్రమే కాదు, ఋతుపవనం వస్తున్నదని పసిగట్టగానే ప్రపంచమంతా వినేటట్టుగా ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రతి కొమ్మనీ, ప్రతి రెమ్మనీ, ప్రతి గూడునీ, ప్రతి పల్లెనీ తట్టిలేపుతో పరుగులు పెడుతున్నది. ఏదీ! వర్షాగమనాన్ని నేను కూడా అలా గానం చెయ్యగలిగినప్పుడు, ఏ ఒక్కరినీ స్తిమితంగా ఉండనివ్వనట్టుగా ఒకటే తొందరపెడుతో వానరాకడని చాటింపు వెయ్యగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే నేను కూడా ఒక చాతకసమానుణ్ణి కాగలిగానని చెప్పుకోగలుగుతాను.

ఈ దేశంలో అనాదినుంచీ ఎందరో కవులు, గాయకులు, చిత్రకారులు ఋతుపవన ప్రవేశాన్ని పండగ చేసుకుంటో వచ్చారు. వాళ్ళకి చాతకం ఒక ఆదర్శం, పురి విప్పిన నెమలి ఒక ఆదర్శం, వానలు రాబోతున్నాయని ముందే పసిగట్టి తమ తమ చిన్న చిన్న వీపుల మీద ఆహారపదార్థాలు మోసుకుంటో సురక్షితక్షేత్రాలకి బారులు కట్టే చీమలదండు ఆదర్శం, చిరుకప్పలు ఆదర్శం, పొలాల్లో వైడూర్యాల వాన కురిసినట్టు ప్రత్యక్షమయ్యే ఇంద్రగోప సమూహం ఆదర్శం. ఆ స్ఫూర్తితో వాళ్ళు పాటలు కట్టారు, పద్యాలు రాసారు, కథలు చెప్పారు, కావ్యాలు నిర్మించేరు.

అలాంటి రచనల్ని కొన్నింటిని ఏరి జూహీ సిన్హా అనే ఆమె When Peacocks Dance (2013) అని ఒక పుస్తకంగా వెలువరించిందని తెలిసి కిందటేడాదే తెప్పించుకున్నాను. ఈసారి ఆకాశంలో తొలిమబ్బులు కనిపించగానే ముందు ఆ పుస్తకమే తీసాను. ఒక పెళ్ళిపందిట్లో సన్నాయిమేళంలాగా ఆ పుస్తకంలో ఎందరో కవులు, ఎన్నో కవితలు.

జూహీ సిన్హా తన సంకలనంలో భారతీయ సాహిత్యంలోంచి ఏరి తెచ్చిన రచనల్ని, దక్షిణం, పశ్చిమం, ఉత్తరం, తూర్పు దిక్కుల కింద విభజించి మరీ సంకలనం చేసింది. సంకలనానికి నాందీ వాక్యంలా ఋగ్వేదం అయిదవ మండలంలోని వరుణసూక్తాన్ని పొందుపరించింది. ఇక ఆ తర్వాత పుటల్లో రామాయణంలో వర్షర్తు వర్ణన, మేఘదూతం, టాగోర్ గీతాలు, కులీ కుతుబ్ షా గజల్ తో పాటు సుగతకుమారి, బుద్ధదేవ బోస్, మమంగ్ దాయ్ లాంటి ఆధునిక కవుల కవితలూ, పాలగుమ్మి పద్మరాజు గాలివానతో పాటు మనోజ్ దాస్, రస్కిన్ బాండ్, కుష్వంత్ సింగ్ వంటి వారి రచనలు కూడా ఉన్నాయి.

వాటితో పాటు హిందూస్తానీ సంగీతంలో వర్షర్తువుని గుర్తుచేసే మేఘమలహర్, కజరి లాంటి రాగాల గురించీ బేగం అక్తర్, గౌహర్ జాన్ లాంటి గాయికల గురించి కూడా తలపోతలున్నాయి.

మరో విశేషం, పందొమ్మిది, ఇరవయ్యవ శతాబ్దాల్లో భారతీయ ఋతుపవనం గురించి బ్రిటిషు ఉద్యోగులు, పర్యాటకులు రాసుకున్న డైరీల్లోంచి, యాత్రాకథనాల నుంచి కూడా కొన్ని భాగాలు ఈ సంకలనంలో చోటు చేసుకోవడం.

కాని సాధారణంగా ఏ సంకలనకర్తకీ రాని ఆలోచన ఈ సంపాదకురాలికి వచ్చింది. భారతీయ ఆకాశం మీద ఋతుపవన సంతోషాన్ని ప్రతిబింబించే ఈ సంకలనంలో ఆమె కేవలం కొన్ని సాహిత్యరచనలు పొందుపరచడంతో ఆగిపోలేదు. వానాకాలం రాగానే భారతదేశమంతటా మనుషులు ఇష్టపడే కొన్ని వంటలగురించీ, పిండివంటల గురించీ కూడా రాసింది. అవెలా చేసుకోవాలో ఆ రెసిపీస్ కూడ ఇచ్చింది. వాటితో పాటు వానాకాలంలో వచ్చే పండగలు- ఓనం, రథయాత్ర, గణేశ్ చతుర్ధి, తీజ్ లాంటి సంబరాల గురించి కూడా రాసింది. మాన్ సూన్ మొదలయ్యేవేళల్లో చిరుజల్లులు పడుతున్నప్పుడు ఒక వారాంతం గడపడానికి మనం పోదగ్గ కొన్ని ప్రదేశాలు, ఉదయపూర్, మాండు లాంటి వాటిని కూడా ప్రస్తావించింది.

నాకు మరీ సంతోషాన్నిచ్చే అంశం, పట్టుమని రెండువందల పేజీలకు మించిలేని ఈ సంకలనంలో వేదాలు, రామాయణం, కాళిదాసు, టాగోర్ లతో పాటు ఒక భిల్లు గీతానికి కూడా చోటు దక్కడం.

ఇదిగో, ఇక్కడ కిటికీ పక్కన కూచుని ఈ వాక్యాలు టైపు చేస్తుంటే నాకూ లోకానికీ అడ్డంగా ఉన్న పరదాని కోయిల ఊరికే పక్కకు లాగేస్తున్నది. ఉండీ ఉండీ వినిపించే ఆ కోకిల కూత నన్ను చెప్పలేనంత అస్తిమితానికి గురిచేస్తున్నది. నేను ఉండవలసింది ఇలా ఈ ఇంట్లో, ఈ గదిలో, ఇలా ఒక బందీగా కాదనీ, ఋతుపవన మేఘాల వెంబడి భారతీయ ఆకాశం కింద హిమాలయాల దాకా పయనిస్తోపోతుండాలని పదే పదే గీపెడుతున్నది.

పొద్దున్న అక్క బదరీవనం నుంచి ఒక వాయిస్ మెసేజి పంపించింది: ‘తెల్లవారుజామున ఈ హిమాలయ సానువుల్లో ప్రయాణిస్తున్నంతసేపూ నాకు నువ్వే గుర్తొస్తున్నావు. ఇక్కడ నరుడూ, నారాయణుడూ ఇంకా తపస్సు చేస్తున్నట్టే ఉంది. ఆ కొండలు, ఆ గంగ, ఆ మేఘాలు, మేము ముందుకు పోతున్నకొద్దీ ఆకాశానికి మరింత దగ్గరగా పోతున్నాం’ అని.

అదృష్టవంతురాలు. అలాగని నేను దురదృష్టవంతుణ్ణని అనుకోలేను. ఇదుగో, ఈ పుస్తకాన్ని మరోసారి చేతుల్లోకి తీసుకోగలను. ఆ పుస్తకం వెనకనే ఓణం పండగ నాటి రంగురంగుల నావలూ, రథయాత్రనాటి జనసందోహం, వినాయకనిమజ్జనం ఊరేగింపులు, మేఘాల్ని కూడా కరిగించగల హిందూస్తానీ రాగాలూ నన్ను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు నేను రాసుకున్న కవితలోని ఈ వాక్యాలు పదే పదే గుర్తొస్తున్నాయి:

ఈ విచిత్రమైన ఋతువు ప్రతి ఒక్కరికీ ఒక
పిలుపు పట్టుకొస్తుంది. తూనీగలకు పచ్చిక,
రైతుకి పొలం, పిల్లలకి బడి, ఒక్క కవిని మాత్రమే
సోమరిగా కూచోబెట్టి ఆకాశాన్ని కానుక చేస్తుంది.

8-6-2024

13 Replies to “ఆకాశాన్ని కానుకచేసే ఋతువు”

  1. ఉద్వేగ భరితంగా సాగిన సమీక్ష తెలియకుండానే కవితాత్మకమైంది.తొలకరి పులకరింతలను చాతకం జాతకంతో వెలువరించి .ఋతుపవనాగమనాన్ని , అలనాటి కాళిదాసు మేఘసందేశం వలె ఆకాశ సందేశం పంపి ‘ పొండయ్యా! బయటికి వెళ్లి ఆ కమ్మిన మేఘాలను చూడండి,నీటిపూలు చల్లుతున్న ఆకసం చూడండి. నింగి దెసకు ముక్కు తెరచి చినుకు ముత్యాలకై ఎదురు చూస్తున్న చాతకాన్ని చూడండి , పురి విప్ప ఆడుతున్న నెమలి నృత్యాన్ని చూడండి, జుట్టు విరబోసుకుని వర్షాభ్యంగనం చేస్తున్న వనవాటికల్ని చూడండి,కవుల కలాల వెంబడి జారిన వర్షాభ్ర వర్ణనలను వీక్షించండి అని గెదిమినట్టుగా ఉంది.
    ఆ జూహీ సిన్హా ఎవరో గాని అదృష్టవంతురాలు.
    ఒక రసజ్ఞుని చేతి లోకి వచ్చిన పుస్తకం చదివి ఆ ఆనందాన్ని అక్షరపతంగం చేసి ఆకసంలోకి
    తొలకరి ని ఆహ్వానించడానికి పంపించారు.
    జయహో. మృగశిర. జయహో నైఋతీఋతుకాంత.

  2. “వైడూర్యాల వాన” గురించి ఎంత చక్కగా చెప్పారు!! ప్రతిరోజూ అమ్మ, నాన్నలను చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా చల్లని జల్లులు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు “ఇక వెళ్లులే” అన్నట్లు దారిచ్చే ఈ నైరుతి ఋతు పవనాల దీవెనలను ఎంతని పొగిడి మురిసిపోనూ….💦🌧️💦

  3. అద్భుతం. పుస్తకం ఎలా తెచ్చుకోవాలో చెబుతారా ?

  4. ఆహా! ఇంకా చాతకం బతికే ఉన్నది, నిప్పులు కక్కిన వేసవి మొత్తం ఆ ఉగ్రమధ్యాహ్నాల్ని అదెట్లా సహించిందోగాని, ఒక్క వానచినుకుకోసం, ఒక్క తేమగాలి తుంపర కోసం అదెట్లా ప్రాణాలు గొంతులో కుక్కుకుని ఇన్నాళ్ళూ గడిపిందోగాని, వానకోయిలకీ, కారుమబ్బుకీ ఉన్న ఈ అనుబంధం ఇన్ని యుగాలైనా ఇంకా చెక్కుచెదరకుండా ఉండటం నాకు ధైర్యానిస్తున్నది.

    ధన్యవాదాలు

  5. ఇంద్రాగోప సమూహం అంటే ఆరుద్ర పురుగులా? ఎరుపు రంగులో ఉంటాయి ముట్టుకోగానే ముడుచుకుపోయి ఆగిపోతాయి.. తెలపండి..

  6. ఒక అమృత ధార కురవడం మీరెప్పుడైనా అనుభవించారా?
    బాగా చీకటి పడిన మనుషులు అక్కడక్కడా సంచరించే. ఒక నిశ్శబ్దలో బెదురు కలిగించే హాస్పిటల్ లో డాక్టర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్న నేను ఎంతో హాయిగా ఈ రోజు మీ పోస్ట్ చదివాను. అన్నీ మరచి…ఇదుగో …ఇక్కడ మూలగా ఒక షోకైన కుర్చీలో కూర్చుని సన్నగా .. ఒక్కటొక్కటీ కురుస్తున్న సువర్ణాక్షరాల్ని చూస్తున్నాను.
    వాటిలో ఎన్నెన్ని రాగాలు అలవోకగా వినిపిస్తున్నాయో ఎలా చెప్పను?
    నాకు తెలిసినది మృదుమధుర సంగీత ఆలాపన. మీ మాటల్ని అన్ని రాగాల్లోనూ పొందుపరచి ఆహా… అనుకుంటాను.
    కొన్నాళ్ళ క్రితమే నెమళ్ళు ఎగిరేగిరి పోవడం చూస్తూనే గడిపిన రోజులు … విశాలమైన నల్లని కాటుక ఆమర్చినట్లున్న లేడి పిల్లల పరుగులు చూస్తూ గడిపిన రోజులు కాకతాళీయంగా గడిపేసినా ఇప్పుడు ఈ అక్షరాల్లో వాటి మధురిమలు చూసాను.
    నేను తిరిగి వెళ్ళగలనో ,లేదో ఆలోచించలేదు. డాక్టర్ నన్నింకా పిలవలేదు.
    కానీ చిరునవ్వులు వచ్చి చేరుతున్నాయి.
    ఇటు మరొక్కసారి చూడండి

    నేను కూడా ఈ వానపిట్టలాగా ఒక్క మబ్బు ఆకాశం మీద కదలాడే రోజు కోసం కొట్టుమిట్టాడేనని. కానీ నేనా పిట్టకెన్నటికీ సాటిరాను. అది కేవలం ఎదురుచూడటం మాత్రమే కాదు, ఋతుపవనం వస్తున్నదని పసిగట్టగానే ప్రపంచమంతా వినేటట్టుగా ప్రకటించడం మొదలుపెట్టింది. ప్రతి కొమ్మనీ, ప్రతి రెమ్మనీ, ప్రతి గూడునీ, ప్రతి పల్లెనీ తట్టిలేపుతో పరుగులు పెడుతున్నది. ఏదీ! వర్షాగమనాన్ని నేను కూడా అలా గానం చెయ్యగలిగినప్పుడు, ఏ ఒక్కరినీ స్తిమితంగా ఉండనివ్వనట్టుగా ఒకటే తొందరపెడుతో వానరాకడని చాటింపు వెయ్యగలిగినప్పుడు, అప్పుడు మాత్రమే నేను కూడా ఒక చాతకసమానుణ్ణి కాగలిగానని చెప్పుకోగలుగుతాను.

    ఈ వాక్యాలు అక్షరాలా? కావు.
    మీ లోపలి భావనలా? కావు.

    వైడూర్యాల వాన.
    నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading