రెండు మేరుశిఖరాలు

ఒకప్పుడు శ్రీ శ్రీ గురజాడ గురించి రాయడానికి ఉపక్రమిస్తూ మళ్ళా కొత్తగా ఏమి రాస్తాను అనుకున్నాడటగానీ, రాయడానికి మొదలుపెట్టగానే ఎన్నో తలపులు తనని ముప్పిరిగొన్నాయని రాసాడు. గిడుగు గురించి కూడా ఈ మాట చెప్పుకోవచ్చును. ఆయన గురించి ఎన్ని సార్లు తలుచుకున్నా, ఆ మహనీయుడి జీవితానికీ, వ్యక్తిత్వానికీ సంబంధించిన కొత్త పార్శ్వాలు, మనం ఇప్పటిదాకా తలచుకోకుండా ఉండిపోయినవెన్నో మన ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటాయి. నిజానికి ఆ సమగ్ర వ్యక్తిత్వాన్ని ఇప్పటిదాకా సంపూర్ణంగా ప్రతిబింబించే జీవితచరిత్రగాని, సమగ్రమూల్యాంకనం గానీ ఇప్పటిదాకా రాలేదనే చెప్పాలి.

ఎందుకంటే తెలుగు సాహిత్యచరిత్రకారులకి ఆయన ప్రధానంగా వ్యావహారిక భాష కోసం ఉద్యమస్థాయిలో పోరాడినవాడిగానే తెలుసు. కాని యాంత్రొపాలజి అనే మాట భారతదేశానికి ఇంకా పరిచయం కాకముందే ఆయన ప్రపంచంలోని అత్యున్నత మానవశాస్త్రజ్ఞులతో సమానంగా గిరిజన జీవితాన్నీ, భాషనీ, సంస్కృతినీ అధ్యయనం చేసినవాడని చెప్పుకోకపోతే ఎలా? అంతేనా? మహాత్మా జోతిరావు ఫూలే శూద్రులకీ, అతిశూద్రులకీ విద్య గురించి మాట్లాడగా, ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌ స్త్రీ విద్య గురించి ప్రయత్నాలు చెయ్యగా, స్వామి వివేకానంద సార్వత్రిక విద్య గురించి ఘోషిస్తూ ఉండగా, గిడుగు వారందరికన్నా ఎన్నో అడుగులు ముందుకు నడిచి గిరిజనవిద్య గురించీ, అది కూడా గిరిజన భాషలోనే గిరిజనుల్ని విద్యావంతుల్ని చెయ్యడం గురించీ పోరాటం చేసాడని మనం గుర్తుపెట్టుకోకపోతే ఎలా?

అంతేనా? గిడుగు గురించి స్మరించుకోవలసిన పార్శ్వాలు మరెన్నో ఉన్నాయి. ఆయన శాసనపరిశోధకుడు. ధ్వనిశాస్త్రవేత్త. నిఘంటునిర్మాణకారుడు. మరుగున పడ్డ స్థానిక చరిత్రల్ని వెలుగులోకి తెచ్చిన అపూర్వ చరిత్రకారుడు. అన్నిటికన్నా ముఖ్యం తెలుగుప్రేమికుడు. తెలుగు వారికోసం తన సౌకర్యవంతమైన జీవితాన్ని వదులుకోడానికి సిద్ధపడ్డవాడూనూ.

గత ఇరవయ్యేళ్ళుగా గిడుగు గురించి ఎక్కడ ఎవరు ఏమి రాసినా చదువుతూ వస్తున్నాను. కాని ఏ పుస్తకం చదివినా ఆయన గురించి ఇంకా తెలుసుకోవలసింది ఎంతో మిగిలే ఉందనే అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా, సాహిత్యకారులు, బయటివాళ్ళూ రాయడం కాదు, ఆయన బంధువర్గం, ఆయన వంశానికి చెందినవాళ్ళు ఆయన గురించి మనకు తెలియని జ్ఞాపకాలు, విశేషాలు రాస్తే బాగుణ్ణు కదా అని అనుకుంటూ ఉన్నాను.

చాలా కాలాం కిందట గిడుగు రాజేశ్వరరావుగారు రాసిన ‘ఉదాత్త చరితుడు గిడుగు’ ఆ నా ఆరాటాన్ని చాలా వరకూ తీర్చింది. ఆ తర్వాత రాజేశ్వరరావుగారి పరిచయభాగ్యం కూడా లభించింది. ఋషి లాంటి ఆ మహనీయుడు రాసిన ఒక పుస్తకానికి ముందుమాట రాసే అదృష్టం కూడా నాకు దక్కింది.
ఇన్నాళ్ళకు అటువవంటి మరొక మణిపూస, ఇదుగో, గిడుగు వేంకట రామకృష్ణారావు గారు రాసిన ‘మా తాతల ముచ్చట్లు’ రూపంలో మనముందుకొచ్చింది. రామకృష్ణారావుగారు గిడుగు రామ్మూర్తిగారి మునిమనమడు. గిడుగు సీతాపతిగారి మనమడు. అలా ఆ ఇద్దరిగురించి సాధికారికంగా మాట్లాడటానికి అన్ని విధాలా అర్హుడు. ఆయన తమ కుటుంబాల్లో పిల్లలకి తమ తాతల గురించి చెప్తున్నట్లుగా ఈ పుస్తకం రాసినప్పటికీ ఇది తెలుగు పిల్లలందరికోసం రాసినట్టే. ఒక్క పిల్లలేమిటి? తెలుగు వాళ్ళందరికోసం రాసినట్టే.

2

ఈ పుస్తకంలోకి మీరెలానూ ప్రవేశించబోతున్నారు. ఇందులో రాసిన ముచ్చట్లు ముందే ప్రస్తావించి మీ కుతూహలానికి ఇక్కడే అడ్డుపడాలనుకోవటం లేదు. కాని ఈ పుస్తకంలోని ఒకటి రెండు అద్వితీయతల్ని మీకు ముందే పరిచయం చేస్తే ఈ రచనని మీరు మరింత ఆస్వాదిస్తారని నమ్మకంగా ఉంది.
మొదటిది, ఇది రామ్మూర్తిగారి గురించి మాత్రమే కాదు, సీతాపతిగారిగురించి కూడా రాసిన పుస్తకం. రచయితకి ఒకరు ముత్తాత, మరొకరు తాత. కాని ఆ ఇద్దర్నీ రచయిత ‘మా తాతలు’ అనే అన్నాడు.

ఎందుకని? ఎందుకో ఈ పుస్తకం ఆసాంతం చదివితే అర్థమవుతుంది. కావడానికి సీతాపతిగారు రామ్మూర్తిగారికి కొడుకే అయినప్పటికీ, ఆయనకు తమ్ముడిలా, సహచరుడిలా, రామ్మూర్తి గారి జీవితకాలపు కృషికి పూర్తిగా చేదోడు, వాదోడుగా నిలబడ్డవాడు. రచయిత చాలాచోట్ల వాళ్ళిద్దర్నీ ‘జంటకవులు’ అని అంటూ వచ్చాడు. నాకు తెలిసి, ఇలా ఏక మనస్కులుగా, ధ్యేjైుక్యంగా కలిసి పనిచేసిన తండ్రీకొడుకులు మరొకరు తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సమాజంలోనూ కూడా కనరారు. అందువల్ల ఇది ఆదర్శమూర్తులైన తండ్రీకొడుకుల కథ కూడా. ఒక తండ్రికి ఒక కొడుకు స్నేహితుడిగా మారిన కథ కూడా. మామూలుగా పురాణాలు ఒక మేరుపర్వతం గురించే మాట్లాడాయి. కాని ఈ పుస్తకం రెండు మేరుశిఖరాల గురించి మాట్లాడుతున్నది.

రెండవది, మనం సాధారణంగా రామ్మూర్తిగారి కృషి గురించి మాట్లాడుకునేటప్పుడు ఆ కృషికి సంబంధించిన ప్రశంస మొత్తం ఆయన జాబితాలోనే వేస్తుంటాం. కాని అందులో సీతాపతిగారికి దక్కవలసిన వాటా కూడా తక్కువేమీ కాదని ఈ పుస్తకం మనకు సున్నితంగా గుర్తుచేస్తున్నది. సవరభాష నేర్చుకోడానికి రామ్మూర్తిగారికి ఏళ్ళు పడితే సీతాపతిగారికి కొన్ని నెలలు మాత్రమే సరిపోయిందనేది మనకి ఎవరూ చెప్పరు. రామ్మూర్తిగారు సవరపాటల్నీ, సామెతల్నీ, కథల్నీ సేకరించారని మనకి తెలుసుగానీ, సీతాపతిగారు సువార్తల్ని సవరభాషలోకి అనువదించారని నాకు ఈ పుస్తకం చదివేదాకా తెలియదు. అలా చూసినప్పుడు బయటి సాహిత్యాన్ని గిరిజన భాషల్లోకి అనువదించిన మొదటి తరం అనువాదకుల్లో సీతాపతిగారు కూడా ఒకరని మనం గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది.

మూడవది, రామ్మూర్తిగారి గురించిన విశేషాలకి లభించిన ప్రాచుర్యం సీతాపతిగారి జీవితవిశేషాలకు లభించలేదు. నిజానికి ఇంతవరకూ ఆ ఇద్దరి గురించి రాసినవారంతా ఆ ఇద్దరివీ వేర్వేరు జీవితాలన్నట్టూ, వారి వారి జీవితరంగాలు వేరు వేరన్నట్టే రాసుకుంటూ వచ్చారు. కాని మొదటిసారిగా ఈ పుస్తకం ఆ అపోహని పక్కకు నెట్టేసింది. సవరభాషకి సంబంధించిన కృషిలోగాని, వ్యావహారిక భాషా ఉద్యమంలోగాని, పర్లాకిమిడిలోని తెలుగు ప్రాంతాల్ని ఆంధ్రరాష్ట్రంలో కలపడంలోగాని, పర్లాకిమిడి జమీందారుతో పోరాటంలోగాని ఆ తండ్రీ కొడుకులిద్దరూ ఏకధ్యేయంతో పనిచేసారని ఈ పుస్తకం చదివాక మనం మర్చిపోడం కష్టం.

ఇవికాక, రామ్మూర్తిగారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఈ రచనలో నేను మొదటిసారి తెలుసుకున్నాను. వాటిని అన్నిటినీ ప్రస్తావించాలని ఉందిగాని, ఒకటి మాత్రం చెప్పకుండా ఉండలేను. బంకుపల్లి మల్లయ్యశాస్త్రిగారు తమ కుమార్తెకు పునర్వివాహం చేసారనీ, ఆమెను గౌతమీకోకిల వేదుల సత్యనారాయణశాస్త్రి వివాహమాడారనీ మనకు తెలుసు. కానీ తన కుమార్తె పునర్వివాహానికి మల్లయ్యశాస్త్రిని ఒప్పించిందీ, ఆ పెళ్ళిలో పీటల మీద కూర్చుని కన్యాదానం చేసిందీ రామ్మూర్తిగారన్నది నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇది చిన్న విషయం కాదు. వీరేశలింగం, గురజాడల తో సమానంగా రామ్ముర్తిగారు కూడా లెక్కించదగ్గ సంస్కర్త అనేది ఈ పుస్తకం చాలా స్పష్టంగా నొక్కి చెప్తున్నది. ఇక ఒక స్నేహితుడిగా గిడుగు వ్యక్తిత్వం ఎంత సమున్నతమైందో ఈ పుస్తకంలోని పద్ధెనిమిదవ అధ్యాయం మొత్తం సాక్ష్యమిస్తున్నది. అలాగే ఆయనలోని నిస్వార్థం, నిర్భయం, శిష్యవాత్సల్యం వంటి గుణగుణాల్ని ఉదాహరణల్తో వివరించిన భాగాల్లో ఉన్నవి కూడా మామూలు విషయాలు కావు.

రామ్మూర్తిగారి గురించి రాస్తూ ‘సత్యమన్న వస్తువు ఎంతటి మలినంలో కూరుకుపోయినా దానిని తీసి ప్రక్షాళన చేసి ఆరాధించే ఒక్క గుణం వీరి జీవితాన్ని చివరి ఊపిరి వరకూ శాసించింది’ అని రాసిన మాటల్ని మరవడం కష్టం.

సీతాపతి గారి గురించి రాసిన ఎన్నో విశేషాలు తెలుగుపాఠకులకి సరికొత్తవి. సీతాపతిగారు తెలుగు భాషకు, సవరభాషకు చేసిన సేవ గురించిన విశేషాలు సరే, అంతగా ప్రసిద్ధంగాని మరెన్నో విశేషాలు కూడా ఈ పుస్తకం ద్వారా సీతాపతిగారిమీద కొత్త వెలుతురు ప్రసరింపచేస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సవర సంగీత వాద్యాల గురించి మొదటగా రాసింది సీతాపతిగారే అన్నది. నాకు తెలిసి భారతీయ మానవశాస్త్ర రచయితల్లోనే, ఈ అంశంలో సీతాపతిగారు మొదటి రచయిత అని చెప్పుకోవలసి ఉంటుంది. అలాగే తాను పనిచేస్తున్న పాఠశాలలో ఒక గ్రంథాలయం ఏర్పాటు గురించి యువరాజును అభ్యర్థించారన్న సంగతి కూడా. ఇటువంటివి చిన్న ముచ్చట్లు కావు.

అలాగే ఆయన భారతి పత్రికకు సంపాదకుడిగా ఉన్నప్పుడు ఆ పత్రికలో నెలకు రెండుపేజీలు బాలసాహిత్యానికి కేటాయించారన్న సంగతి కూడా. నిజానికి తెలుగులో మొదటిబాలగేయం రాసింది గిడుగుసీతాపతినే. తెలుగులో గురజాడ మొదటి ఆధునిక గేయం, మొదటి కథానిక రాయడానికన్నా ముందే సీతాపతిగారు ‘చిలుకమ్మ పెండ్లి’ అనే మొదటి బాలగేయం రాసారని రెడ్డి రాఘవయ్యగారు చెప్తేనే నాకు తెలిసింది. ఆయన భారతిలో బాలసాహిత్యంకోసం రెండు పేజీలు కేటాయించారనీ, 1958-61 మధ్యకాలంలో బాలసాహిత్య రచయితలకు మూడు వర్క్‌ షాపులు నిర్వహించారనీ, ఈ పుస్తకం చెప్తేనే మనకు తెలుస్తున్నది. తెలుగులో బాలసాహిత్యం కోసం ఒక ఉద్యమ స్థాయిలో కృషి చేసిన మొదటి వ్యక్తి సీతాపతిగారని చెప్పుకోడానికి ఇంతకన్నా ఏమి కావాలి?

3

నాలుగైదేళ్ళ కిందట నేను తమిళనాడులో తిరువావుడురై ఆధీనానికి వెళ్ళడం తటస్థించింది. తమిళభాషా పితామహుడిగా సుప్రసిద్ధుడైన యు.వి. సామినాథ అయ్యర్‌ ఆ మఠంలో చదువుకున్నారు. నేను ఆ మఠం నుంచి తిరిగివస్తూ ఇలా ఒక తమిళభాషావేత్త గురించి ఒక తెలుగువాడు వెతుక్కుంటూ వెళ్ళినట్టుగా, ఎవరేనా తమిళుడు తెలుగు భాషావేత్తల గురించి వెతుక్కుంటూ వెళ్ళాలంటే ఎవరితో మొదలుపెట్టాలి అని అనుకున్నాను.

నాకు వెంటనే రామ్మూర్తిగారే మదిలో మెదిలారు. వెంటనే పర్వతాల పేట కూడా మదిలో మెదిలింది. వెంటనే ఆ ఊరెక్కడుందో వెతుక్కుంటూ వెళ్ళాను. కాని ఆ చిన్న గ్రామంలో గిడుగును గుర్తుచేసే ఇల్లుగాని, స్మారక చిహ్నంగానీ ఏదీ కనిపించలేదు నాకు. కనీసం ఒక విగ్రహమేనా అక్కడ ప్రతిష్ఠిస్తే బాగుణ్ణనిపించింది. వెంటనే ఆముదాలవలస శాసనసభ్యులు, శాసనసభ అధ్యక్షులు తమ్మినేని సీతారాం గారితో మాట్లాడేను. ఆయన సాదరంగా స్పందించి ఆ ఊరి పెద్దల్తో మాట్లాడి పర్వతాల పేటలో గిడుగు విగ్రహాన్ని నెలకొల్పారు. రాష్ట్ర గ్రంథాలయ శాఖ సంచాలకులు అక్కడొక ఉప గ్రంథాలయాన్ని కూడా మంజూరు చేసారు.

కాని నాకు తృప్తి కలిగిందని చెప్పలేను. శ్రీకాకుళం జిల్లాకి గిడుగు పేరు పెట్టాలి. విజయనగరంలో ఏర్పాటు చేసిన గిరిజన విశ్వవిద్యాలయానికి గిడుగుపేరు పెట్టాలి. విగ్రహాలు నెలకొల్పటం ద్వారా, పేర్లు పెట్టడం ద్వారా మహనీయుల్ని తలచుకోవడం గొప్ప పద్ధతి కాకపోవచ్చు. కాని అలా పేరు పెట్టడం వల్ల ఆ పేరు మళ్ళా మనుషుల నోళ్ళల్లో నానుతుంది. ఎప్పుడో ఎవరో ఒక పిల్లవాడు ఆ పేరుగల మనిషి ఎవరు, ఆయన ఎటువంటి జీవితం జీవించాడు, ఏమి చేసాడు అని ఆలోచిస్తాడు.

విగ్రహాలు నెలకొల్పలేకపోయినా, జిల్లాలకూ, విశ్వవిద్యాలయాలకూ పేర్లు పెట్టలేకపోయినా, ఇటువంటి పుస్తకం ఒకటి రాసినా చాలు. ఆ మనిషి జీవితమంతా దేనికోసం నిలబడ్డాడో, దేనికోసం పోరాడేడో ఇటువంటి పుస్తకాలు తెలియచెప్తాయి. స్ఫూర్తిదాయకంగా నిలబడతాయి.

రామకృష్ణారావు గారు ధన్యులు. అటువంటి మహనీయులకు వారసులైనందుకు మాత్రమే కాదు, ఆ వారసత్వాన్నిలా మనతో పంచుకున్నందుకు కూడా.

23-4-2023

8 Replies to “రెండు మేరుశిఖరాలు”

  1. ఇరువురు మేరునగధీరుల గరించి సమీక్ష చదువుతుంటేనే ఒకప్పటి ఆదర్శ జీవనాసక్తి
    ఎలా ఉండేది? సమాజ చైతన్యం కోసం ఆ తరం వారి తపన ఎలా ఉండేది? అని స్ఫూర్తి కలిగించేదిగా ఉంది.

  2. చాలా ఆసక్తికరంగా, విశ్లేషణ చేస్తూ, ఇద్దరు మేరు శిఖరాల భాషాపరిశోధన, కృషికి చిత్రిక పట్టారు. అభినందనలు సార్…….
    ……ఆచార్య కె. రామకృష్ణ

  3. Your brief reviews are pithy and eminently readable for their scholarly balance , approach and style. I especially remember the one you wrote on KNY Patanjali, whom Telugu people lost unfortunately.It is an excellent summary of the essence Patanjali the writer. Congratulations Sir.
    Parvathi.

  4. బాబాయి గారు వివిధ రంగాలలో వివిధ అంశాలలో మీరు అందించే వ్యాసాలు నన్ను ఎంతో ఆలోచింప చేస్తున్నాయి జీవితపు పరుగులో జీతపు నడకలో మూసలో పోతున్న జీవితానికి మీ వ్యాసాలు ఒక సేద ఒక అంశానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక అంశాలు పరిచయం చేయడం వల్ల మా ఆలోచనలు కూడా పలు రకాలుగా సాగుతున్నాయి కరొన లో మీ కథలు ఎలా పుట్టాయి నుంచి మిమ్మల్ని అనుసరిస్తున్నాను ఒక్కోసారి అన్నీ వదిలేసి మీ వెనకాలే పోదాం అనిపిస్తుంది కానీ ఏమి చేస్తాం జీవితం బాధ్యతలు .. ఏమి కోరుకోగలను ఆ భగవంతుడు మీకు 100 కాదు 200 ఏళ్లు జీవితం ఇచ్చి మమ్మల్ని నిరంతరం ఆలోచిపచేసి మా బుర్రలో బూజు వదిలించాలని కోరోకోవడం తప్ప

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading