సాహిత్యం గొప్ప ఆశ్రయం

పోయిన సెప్టెంబరులో నెల్లూరునుంచి మిత్రులు పెరుగు రామకృష్ణ, టేకుమళ్ళ వెంకటప్పయ్య నాకో ప్రశ్నపత్రం పంపించారు. ఆ ప్రశ్నల్నీ, సమాధానాల్నీ ఈ మార్చి-ఏప్రిల్ సాహిత్య ప్రస్థానంలో ప్రచురించారు. మిత్రులకి ఆసక్తికరంగా ఉండవచ్చునని ఇక్కడ పంచుకుంటున్నాను.


ప్రశ్న: మీ బాల్యం, విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి.

మాది శ్రీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక గిరిజన గ్రామం. మా నాన్నగారు అక్కడ గ్రామకరణంగా పనిచేసారు. నాకు పదేళ్ళు వయసువచ్చేదాకా ఆ ఊళ్ళోనే గడిపాను. మా ఊరు చుట్టూ ఉండే అడవులూ, కొండలూ, ఏరూ, గాలీ, ఏడాది పొడుగునా వచ్చిపోయే ఋతువులు, పండగలు నా బాల్యాన్ని వెలిగించాయి. అయిదో తరగతిదాకా మా ఊళ్ళో పంచాయతీ సమితి ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను. ఆ తర్వాత తాడికొండ గురుకుల పాఠశాలలో పదో తరగతిదాకానూ, నాగార్జున సాగర్ లో ఉన్న గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియేటు దాకా చదువుకున్నాను. ఆ తర్వాత బి.ఏ లో చేరి మొదటి ఏడు పెద్దాపురంలో మహారాణీ కాలేజిలోనూ, రెండో ఏడు కాకినాడలో ఎం.ఎస్.ఎన్.డిగ్రీ కాలేజీలోనూ చదివాను. ఆ తర్వాత చదువు మధ్యలో ఆపేసి రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంటులో ఆఫీసు అసిస్టెంటుగా చేరాను. అక్కడే ప్రైవేటుగా బి ఏ పూర్తి చేసి, తత్త్వశాస్త్రంలో ఎమ్మే కూడా చేసాను.

మీకు సాహిత్యం మీద ఏ వయసులో ఆసక్తి కల్గింది. దానికి కారణాలు?

మా నాన్నగారికి పుస్తకాలంటే చాలా ఇష్టం, గౌరవం. ఆ పల్లెటూళ్ళో, ఆ రోజుల్లోనే మా ఇంట్లో ఒక పుస్తకాల రాక్ ఉండేది. ఆ రాక్ లోనే మొదటిసారి నేను చలంగారి ‘స్త్రీ ‘చూసాను. ఆయన ప్రభావం మా అక్క మీదా, మా అన్నయ్య మీదా పడింది. మా అన్నయ్య రాజవొమ్మంగి హైస్కూల్లో చదువుకునేవాడు. రోజూ బ్రాంచి లైబ్రరీ నుంచి నాకోసం ఏదో ఒక పుస్తకం తెచ్చేవాడు. మా అక్క రాజమండ్రిలో ఆంధ్రయువతీ సంస్కృత కళాశాలలో చదువుకునేది. ఆమె సెలవులకు వచ్చినప్పుడు కవిత్వ గ్రంథాలు తెచ్చుకునేది. మా బామ్మగారికి పోతన భాగవతంలో ముఖ్యమైన ఘట్టాలన్నీ కంఠోపాఠంగా ఉండేవి. దాంతో ఆమె మా చిన్నప్పుడు మాకు గజేంద్రమోక్షం, రుక్మిణీ కల్యాణం లాంటి ఘట్టాల్ని మాతో కూడా కంఠస్థం చేయించేవారు. నేను తాడికొండ వెళ్ళినప్పుడు, ఆ స్కూల్లో చాలా చక్కని గ్రంథాలయం ఉండేది. నేషనల్ బుక్ ట్రస్ట్ ఆదాన్-ప్రదాన్ సిరీస్ నవలలు నేను అక్కడే చదివాను. చిన్న కుగ్రామం నుంచి వచ్చి, మరే వ్యాపకాలకీ డబ్బులు పెట్టలేని నాలాంటి విద్యార్థికి సాహిత్యంకన్నా గొప్ప ఆశ్రయం మరేముంటుంది?

మీరు ప్రభుత్వ సర్వీసులో అంత ఉన్నత పదవుల్లో పనిచేస్తూనే సాహిత్య రంగంలో కృషి కొనసాగించడం ఎలా సాధ్యమయింది?

నేను రాజమండ్రిలో అయిదేళ్ళు ఉన్నాను. అక్కడ టెలిఫోన్స్ డిపార్ట్ మెంటు ఉద్యోగం నాకు చదువుకోడానికి చాలా వెసులుబాటు ఇచ్చింది. గౌతమీ గ్రంథాలయం ఒక విశ్వవిద్యాలయంలాగా నన్ను చేరదీసింది. కాని ఆ తర్వాత గిరిజనసంక్షేమశాఖలో చేరినప్పుడు మొదట్లో పది పన్నెండేళ్ళు నాకు చదవడానికీ, రాయడానికీ కూడా సమయం చిక్కలేదు. తిరిగి 2000 లో హైదరాబాదులో గిరిజన సంక్షేమ శాఖ కేంద్రకార్యాలయానికి వచ్చినప్పుడు నాకు మళ్ళా సమయం చిక్కింది. చిక్కింది అంటే వెంటనే చిక్కిందని కాదు. చాలా కాలం పాటు కాలం నా వేళ్లసందుల్లోంచి జారిపోతోనే ఉండింది. ఏం చెయ్యాలా అని తపన పడుతున్నప్పుడు నాకు నెమ్మదిగా అర్థమయింది: నా రోజువారీ జీవితంలో పొద్దుటిపూటలు పూర్తిగా నావేనని. అప్పటినుంచీ ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మొదలుపెట్టాను. 2010 తర్వాత నేను రాసిన రచనలన్నీ దాదాపుగా పొద్దుటివేళల్లో రాసినవే. రాయడం సరే, అధ్యయనానికి సమయం ఎలా చిక్కింది అని కూడా కొందరు అడుగుతారు. నాకు సోషల్ లైఫ్ దాదాపుగా లేదు. ఆఫీసు, ఇల్లు. ఇంటికొచ్చాక చదువుకోవడం. అంతేకాదు, ఉద్యోగ జీవితంలో కూడా చాలా సమయం వెయింటింగ్ లోనే గడుస్తుంది. ఆ సమయంలో నేను ఏదో ఒకటి చదువుకుంటూ ఉండేవాణ్ణి. ఉదాహరణకి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ప్రభుత్వానికి అవసరమైన సమాచారాన్ని అందించడానికి మేము అక్కడకు వెళ్ళవలసి ఉంటుంది. అసెంబ్లీ పూర్తయ్యేదాకా అక్కడే ఉండవలసి ఉంటుంది. ఆ సమయాన్నిపుస్తకాలు చదవడంలో గడిపాను. ఎన్నో సార్లు అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ జరుగుతున్నప్పుడు, మా శాఖకి చెందిన ప్రశ్న వచ్చేదాకా వెయిట్ చేసే సమయంలో కూడా నేను పుస్తకాలు చదువుకునేవాణ్ణి. చెప్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది, ఆ వేళప్పుడే కాళిదాసు కుమారసంభవం పూర్తిగా చదవడానికి నాకు సమయం చిక్కింది.

మీకు కథలు నవలల పట్ల మక్కువ కలగడానికి ప్రేరణ కలిగించిన రచయితలెవరు?

చాలామంది ఉన్నారు. చిన్నప్పుడు మా అన్నయ్య నాకు చరిత్రనవలలమీద మక్కువ కలిగించాడు. తెన్నెటి సూరి ‘చెంఘిజ్ ఖాన్’, నోరి నరసింహశాస్త్రి ‘మల్లారెడ్డి’ , అడవి బాపిరాజు ‘హిమబిందు’, చిలకమర్తి ‘రాజస్థాన కథావళి’, బంకింబాబు ‘ఆనందమఠం’ నా చిన్నప్పటి ఆరాధ్య గ్రంథాలు. తర్వాత రోజుల్లో ఇంతకు ముందు చెప్పినట్టు నేషనల్ బుక్ ట్రస్ట్ పుస్తకాలు పరిచయమయ్యాక, తారాశంకర్ బందోపాధ్యాయ, మాస్తి వెంకటేశ అయ్యంగార్ వంటి రచయితలు పరిచయమయ్యారు. ఆ తర్వాత విభూతి భూషణ్, గోపీనాథ్ మొహంతీ. ఇక ఇంటర్ కి వచ్చేటప్పటికి శరత్ నా జీవితాన్ని పూర్తిగా ఆక్రమించాడు. టాగోర్, ప్రేమ్ చంద్ లతో పాటు తెలుగు నవలారచయితలు కూడా. ఒక్కమాటలో చెప్పాలంటే, నేను రాజమండ్రి వెళ్ళేటప్పటికి, అంటే ఇరవయ్యేళ్ళు నిండకుండానే, తెలుగులో వచ్చిన ప్రశస్తమైన ప్రతి ఒక్క నవలా, ప్రతి ఒక్క అనువాదం చదివి ఉన్నాను. అలానే కథలు కూడా. మాకు భమిడిపాటి జగన్నాథరావుగారు 1974 లో పరిచయం. ఆయనవల్ల తెలుగు కథ, కథకులూ పరిచయమయ్యారు.

మీరు నీటిరంగుల చిత్రాలు అద్భుతంగా వేసేవారట. ప్రస్తుతం ఆ రంగంలో మీ కృషి?

చిన్నప్పుడు తాడికొండలో వారణాసి రామ్మూర్తిగారనే ఆర్ట్ మాష్టారు ఉండేవారు. కారణమేమీ లేకుండానే ఆయన నన్ను తన సొంతకొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించారు. బహుశా ఆయనవల్లనే నాకు చిత్రలేఖనం పట్ల గాఢమైన ఇష్టం కలిగిందని చెప్పవచ్చు. కానీ నిజమైన సాధన మాత్రం నా నలభైవ ఏడు తర్వాతనే మొదలుపెట్టాను. దాదాపుగా గత పదిహేనుళ్ళుగా చిత్రలేఖనం గురించి విస్తృతంగా చదువుతో వచ్చాను, తెలుసుకుంటున్నాను. రిటైరయ్యాక పూర్తి సమయం నీటిరంగులకు కేటాయించడానికి వీలు చిక్కింది. తెలుగువాళ్ళల్లో నీటిరంగుల చిత్రకారుల తరం ఒకటి ఉండేది. అది జాతీయోద్యమ కాలంలో వికసించింది. ఒకవైపు బెంగాల్ స్కూల్ తరహాలోనూ, మరొక వైపు అజంతా చిత్రలేఖనాల పద్ధతిలోనూ ఎందరో చిత్రకారులు ఒక వారసత్వాన్ని మనకు వదిలిపెట్టి వెళ్లిపోయారు. దాన్ని కొనసాగించవలసిన బాధ్యత మనమీదని ఉందని నమ్ముతాను.

మీరు కథలు, నవలలు, కవిత్వం, అనువాదాలు, బాలసాహిత్యం, ఆధ్యాత్మికం ఇలా పలు రంగాల్లో కృషి కొనసాగించడం వలన దేనిలోనూ ఒక ప్రత్యేక ముద్ర లేదన్న చింత మీకు లేదా?

ఇటువంటి ప్రశ్న ఇప్పటిదాకా  నాకెప్పుడూ స్ఫురించలేదు.

మీరు ఆధునిక సాహిత్యంలోనే కాక ప్రాచీన సాహిత్యంలో కూడా గొప్ప కృషి చేశారు. ఇదెలా సాధ్యమైంది?

‘ఉదారచరితానాం తు వసుధైక కుటుంబకం’ అంది పంచతంత్రం. నాకు లభించిన గురువులు అటువంటి ఉదారచరితులు. వారు తాము జీవితకాలం సంపాదించుకున్న సాహిత్య రసజ్ఞతని నాకు ఉదారంగా ధారపోసారు. తాడికొండలో మా హీరాలాల్ మాష్టారు కావడానికి హిందీ మాష్టారే అయినప్పటికీ, తెలుగు, సంస్కృతం, ఇంగ్లిషుల్లో కూడా గొప్ప పండితులు. ఆయనవల్లనే నాకు కవిత్వవిద్యలో ప్రవేశం లభించింది. రాజమండ్రిలో మల్లంపల్లి శరభయ్యగారి అంతేవాసిత్వం నా భాగ్యం. ఆయన ప్రసంగాలు వినడం ద్వారా ప్రాచీన సంస్కృతాంధ్ర సాహిత్యాల ఘనిష్ట పరిచయం నాకు దొరికింది. ఆ రోజుల్లోనే రాజమండ్రిలో ఆర్.ఎస్. సుదర్శనం గారు కూడా ఉండేవారు. ఆయనవల్ల పాశ్చాత్యసాహిత్యం, తత్త్వశాస్త్రం, ఆధునిక ధోరణులు మాకు పరిచయమయ్యాయి. అటువంటి గురుపరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగుతూనే ఉంది. వారిలో ముందు తలుచుకోవలసిన వ్యక్తి సి.వి.కృష్ణారావుగారు. ఆయన ‘నెలనెలా వెన్నెల’ పేరిట నిర్వహిస్తూ వచ్చిన సమావేశాలు, ఆయన దార్శనికత, ఉద్యోగ జీవితంలో ఆయన చూపించిన నిబద్ధత ఆయన్ని నాకొక రోల్ మోడల్ ని చేసాయి. నిన్నమొన్న ఫేస్ బుక్ మాధ్యమం ద్వారా పరిచయమైన సూరపరాజు రాధాకృష్ణమూర్తి ఒక అద్వితీయ భావుకుడు. ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యాల పట్ల ఆయనకున్న అవగాహన నిరుపమానం. ఇక ఇన్నాళ్ళుగా నాకు లభించిన సాహితీమిత్రులు కూడా తమ సాంగత్యం వల్ల నన్ను విద్యావంతుణ్ణి చేస్తూనే ఉన్నారు.

కథలు/నవలల గురించిన విశ్లేషణలో ఎవరికీ లేని ప్రత్యేక ముద్ర సాధించడం ఎలా సాధ్యమైంది?

నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు సాహితీవేదిక అనే ఒక సాహిత్య బృందం ఉండేది. వాళ్ళు ప్రతి నెలా ‘సమాలోచన’ పేరిట ఒక పుస్తకం మీద చర్చకు కూచునేవారు. అయితే, ఎవరైనా సరే,  చర్చలో పాల్గోవాలంటే, వ్యాసం రాసుకుని రావాలి. అప్పటికప్పుడు మాట్లాడటాన్ని అనుమతించేవారు కాదు. ఆర్.ఎస్.సుదర్శనంగారి లాంటి మహాసమీక్షకుడు కూడా ఆ చర్చలో పాల్గోడానికి వ్యాసం రాసుకుని వచ్చేవారు. ఆ క్రమశిక్షణ, ఆ విశ్లేషణ ఒక శిక్షణగా నాకు ఉపకరించాయి.

మరో మాట కూడా చెప్పాలి. నాకు సాహిత్యం గురించి చెప్పిన గురువులు ఒక పుస్తకం మీద మాట్లాడమన్నప్పుడు, ప్రధానంగా ఆ పుస్తకం ఏం మాట్లాడుతోందో వినమని చెప్పేవారు. ముందు పుస్తకం చెప్పేది వినకుండా, తక్కిన అంశాల్ని పట్టుకుని, ఆ పుస్తకం గురించీ, రచయిత గురించీ మాట్లాడేవాళ్ళని వారు అంగీకరించేవారు కాదు. కాబట్టి నాక్కూడా ఆ లక్షణాలే అలవడ్డాయి.

మీరు తెలుగు నవల ఇంకా అంత పరిపక్వత చెందలేదని, విక్టోరియా కాలంలోనే ఆగిపోయిందని ఒక సమీక్షలో వ్రాశారు. దాన్ని కొంచెం వివరంగా చెప్తారా?

తెలుగు నవల ప్రధానంగా ఇంగ్లిషు నవల ప్రభావంలో పుట్టిపెరిగింది. అదీకాక, ఏదో ఒక మాలపల్లి లాంటి నవల తప్ప, దాదాపుగా తెలుగునవలలు బహుమతులకోసం రాస్తూ వచ్చిన నవలలే. చిలకమర్తి, బాపిరాజు, విశ్వనాథమొదలుకుని నేటి నవలలదాకా కూడా బహుమతి తెలుగు నవలకి ఒక ప్రధాన ప్రోత్సాహకంగా ఉంటున్న మాట కాదనలేనిది. కాని గొప్ప నవలారచయితలు, పందొమ్మిదో శతాబ్ది రష్యన్ రచయితలుగానీ లేదా ప్రపంచయుద్ధాల మధ్యలో రచనలు చేసిన యూరపియన్ రచయితలుగానీ లేదా ఇరవయ్యవశతాబ్దం ఉత్తరార్థంలో ప్రపంచాన్ని చకితుల్ని చేసిన లాటిన్ అమెరికన్ రచయితలుగానీ నవలను సమీపించిన తీరు వేరు. తెలుగు నవలాకారులు సమీపించిన తీరు వేరు. పోనీ భారతీయ రచయితల్నే తీసుకున్నా కూడా ఒక ఖాండేకర్, ఒక గోపీనాథ మొహంతి, ఒక తకళి శివశంకరపిళ్ళై, ఒక భైరప్ప, ఒక గీతాంజలి శ్రీ వంటి నవలారచయితలు తెలుగులో మనకి కనిపించరు. తెలుగులో నవలలుగా పేరుపొందినవి చాలావరకు పెద్ద కథలు మాత్రమే. నవల అంటే  ఒక వార్ అండ్ పీస్, ఒక జీన్ క్రిస్థోఫ్, ఒక రిమంబరెన్స్ ఆఫ్ థింగ్స్ పాస్ట్ లాంటి రచనలు. అటువంటివి తెలుగులో ఉన్నాయా? నవలా రచయిత తన గురించీ, తన జాతి గురించీ ఒక సత్యాన్ని వెతుక్కోడానికి నవల రాయాలి తప్ప, బహుమతికోసం కాదు. అటువంటి నవల అంటూ వస్తే బహుమతులు వాటికవే వస్తాయి. ఉదాహరణకి నోబెల్ బహుమతి పొందిన చీనా నవల The Soul Mountain చూడండి.  అటువంటి నవల ఒక తెలుగు రచయిత మరొక యాభై ఏళ్ళకు రాయగలిగినా సంతోషమే.

నవలలో వాడే ‘నరేటివ్ ట్రెండ్’ గురించి క్లుప్తంగా చెప్పండి. అలాగే అది  కథా శిల్పంలో వాడితే తలెత్తే ఇబ్బందులేమిటి?

ఒక వ్యక్తికో లేదా ఒక కుటుంబానికో సంబంధించి ఒక సంఘటనకో లేదా ఒక అనుభూతికో  మాత్రమే పరిమితమై ఉండేది కథ. దానిలో ఎడ్గార్ అలన్ పో చెప్పినట్టుగా single most effect ముఖ్యం. అలాకాక సమాంతరంగా కనీసం రెండు కథలు కలిసి నడుస్తూ ఉంటే అది నవల అవుతుంది. ఆ రెండు కథనాలూ సమాజంలోని రెండు విరుద్ధ పార్శ్వాలకు చెందినవైతే, ఆ నవలాకథనం మరింత నాటకీయంగా ఉంటుంది. అక్కడ నవలాకారుడు భిన్న జీవితదర్శనాల్ని ఎదురెదురుగా పెట్టి మనముందొక జీవనరూపకాన్ని ప్రత్యక్షం చేయిస్తాడు. అటువంటి నవలలేవైనా మీరు గత యాభై ఏళ్ళల్లో తెలుగులో చదివారా? బృహత్ ప్రమాణాలతో ఉండే నవలలు రాస్తే, చదివేవాళ్ళు లేరంటాడు తెలుగు రచయిత. కాని మనకన్నా ఎన్నో రెట్లు వేగవంతమైన పాశ్చాత్య సమాజంలో ఎంత పెద్ద పెద్ద నవలలు వస్తున్నాయో మనం చూడటం లేదా? ఉదాహరణకి 2018 లో నోబెల్ బహుమానం పొందిన ఓల్గా తోకార్చుక్ నవల The Books of Jacob (2014) ఇంగ్లిషు అనువాదం దాదాపు తొమ్మిదివందల పేజీల పుస్తకం. ఈ శతాబ్దపు అమెరికన్ నవలాకారుల్లో అగ్రశ్రేణి రచయితగా చెప్పే జొనాథన్ ఫ్రాంజెన్ రాసిన నవలలేవీ అయిదారువందల పేజీలకు తక్కువుండవు. అంతదాకా ఎందుకు? మనవాళ్ళు ఆసక్తిగా చదివే ఇంగ్లిష్ పల్ప్ ఫిక్షన్ నవలలేవీ కూడా నాలుగైదువందలపేజీల్లోపు పుస్తకాలు కానే కావు. కాబట్టి చదివే పాఠకులు లేరనో, చదవడానికి సమయం లేదనో లేదా జీవితం వేగవంతమైపోయిందనో చెప్పే మాటలు సాకులు మాత్రమే. అసలు సమస్య ఏమిటంటే, మన రచయితలకి అనుభవం తక్కువ, అధ్యయనం తక్కువ, అంతరావలోకనం తక్కువ.

ఇప్పటివరకూ ఎన్ని అన్ని ప్రక్రియల్లో, ఎన్ని గ్రంధాలు వెలువరించారు?

ఇప్పటిదాకా మొత్తం 44 గ్రంథాలు వెలువరించాను. వాటివివరాలు:

స్వీయ రచనలు మొత్తం 24.

కవితాసంపుటాలు ఏడు. నిర్వికల్ప సంగీతం (1986), ఒంటరిచేల మధ్య ఒక్కత్తే మన అమ్మ (1995), పునర్యానం(2004), కోకిల ప్రవేశించే కాలం (2009), నీటిరంగుల చిత్రం (2014), కొండమీద అతిథి (2019), కొండకింద పల్లె (2021).

కథాసంపుటాలు రెండు. ప్రశ్నభూమి (1990), వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1981-2023 (2023),

నవల ఒకటి, అరణ్యం (1987),

సాహిత్య ప్రశంస సంపుటాలు అయిదు, సహృదయునికి ప్రేమలేఖ (2001), సాహిత్యమంటే ఏమిటి (2009), సాహిత్య సంస్కారం (2017), దశార్ణదేశపు హంసలు (2019), ఎల్లలోకము ఒక్క ఇల్లై, ప్రపంచ కవిత్వంతో పదేళ్ళు (2022),

యాత్రాకథనాలు రెండు, నేను తిరిగిన దారులు (2011), పాటలు పుట్టిన తావులు (2020),

విద్యకి సంబంధించి నా అనుభవాలు, కొన్ని కలలు, కొన్ని మెలకువలు (2005),

బాలసాహిత్యం మూడు పుస్తకాలు, మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి (2005), మీరు బడినుంచి ఏమి నేర్చుకోవాలి (2005), మీరు సమాజం నుంచి ఏమి నేర్చుకోవాలి (2005).

సామాజిక చింతన కు సంబంధించి, సోమయ్యకు నచ్చిన వ్యాసాలు (2011),

ఆధ్యాత్మికం ఒకటి, పరమయోగి శ్రీ వై. హనుమంతరావు (2006)

వ్యాఖ్యాన గ్రంథం ఒకటి, నీ శిల్పివి నువ్వే (2022) మార్కస్ అరీలియస్ మెడిటేషన్స్ కి వ్యాఖ్యానం.

తెలుగు సంకలనాలు రెండు:

వందేళ్ళ తెలుగుకథ, ఇరవయ్యవశతాబ్ది ప్రతినిథి కథల సంకలనం (2001), మనసున మనసై, భారతీయ కవులూ, వారి హృదయేశ్వరులూ (2014)

సంకలనం చేసి అనువదించిన పుస్తకాలు అయిదు.

ప్రత్యూష పవనాలు (1996), సత్యాన్వేషణ, 2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుండి ఎంపిక చేసిన రచనలు, (2003), ఇమాన్యువల్ కాంట్ రచనలు(2008), హైకూ యాత్ర, మత్సువొ బషొ యాత్రానుభవాలు (2010), నాది దుఃఖం లేని దేశం, కబీరు కవిత్వం (2017)

అనువాదాలు మొత్తం పదమూడు.

ఒక విజేత ఆత్మకథ, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ కు అనువాదం (2002), నా దేశ యువజనులారా, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ కు అనువాదం (2002) ఈ రచనకు కేంద్ర సాహిత్య అకాదెమీ వారినుండి ఉత్తమ అనువాదపురస్కారం లభించింది. ఈ మొగ్గలు వికసిస్తాయి, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం, ‘యు ఆర్ బార్న్ టు బ్లోసం’ (2009) ఎవరికీ తలవంచకు, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ‘ఇండామిటబుల్ స్పిరిట్’ కు అనువాదం(2009), ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం, డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం, ఆచార్య మహాప్రజ్ఞ ‘ద ఫామిలీ అండ్ ద నేషన్’ కు అనువాదం (2015), డా.కలాం యు ఆర్ యునిక్ రచనకు అనువాదం ‘యు ఆర్ యునీక్’ (2022),

గాంధీ వెళ్ళిపోయాడు, మనకు దిక్కెవరు, డా.గోపాలకృష్ణ గాంధి, ‘గాంధి ఈజ్ గాన్, హు విల్ గైడ్ అజ్’ కు అనువాదం (2010), ‘సత్యమొక్కటే, దర్శనాలు వేరు, గాంధీ టాగోర్ లేఖలు’ (2016),  ‘మహాత్ముడి పెద్దకొడుకు, హరిలాల్ గాంధి జీవితం’, చందుభాయి భాగుభాయి దలాల్ గుజరాతీ రచనకు తృదీప్ సుహృద్ ఇంగ్లిషు అనువాదానికి తెలుగు (2016),

వేదార్థ మీమాంస, ఆచార్య కొత్త సచ్చిదానందమూర్తి ‘వేదిక్ హెర్మన్యూటిక్స్’ (2011), వారిలా కలగనండి, వారిలా సాధించండి, రశ్మి బన్సాల్,’ స్టే హంగ్రీ, స్టే ఫూలిష్’ (2010), ఒకాకురొ కకుజొ రచన ‘ద బుక్ ఆఫ్ టీ’ కి అనువాదం తేనీటి పుస్తకం (2022), కన్ ఫ్యూషియస్, జీవితం, దర్శనం (2023)

మీరు పాశ్చాత్య సాహిత్యం గురించిన విశేషాలు కూడా అలవోకగా చెప్తుంటారు. దీని వెనుక ఉన్న కృషి?

ప్రస్తుతం తెలుగువాళ్ళల్లో ఉన్న కొందరు పాఠకుల్తో పోలిస్తే, నేను పాశ్చాత్య సాహిత్యంలో చదివింది చాలా తక్కువే. కాని దాదాపుగా అన్ని ప్రక్రియల్లోనూ క్లాసిక్స్ అని చెప్పేవాటిని చదువుకుంటూ వచ్చాను. The Western Canon గా బోర్హెస్, హెరాల్డ్ బ్లూమ్ లాంటి వాళ్ళు ఏ రచయితల గురించి మాట్లాడేరో వాళ్ళందరివీ కనీసం ఒక పుస్తకమేనా చదవాలని ఒక ప్రణాళిక లాగా చదువుతూ వచ్చాను. 2010 తర్వాత ప్రపంచ కవిత్వం చాలా చదువుతో వచ్చాను. నేను చదువుతూ వచ్చిన కవుల మీదా, కవిత్వం మీదా గత పదేళ్ళుగా ఎప్పటికప్పుడు రాస్తూ వచ్చిన వ్యాసాల్ని ‘ఎల్లలోకము ఒక్క ఇల్లై, ప్రపంచ కవిత్వంతో పదేళ్ళు’ అని పుస్తకంగా కూడా వెలువరించాను. పాశ్చాత్య సాహిత్యంతో పాటు నాకు దూరప్రాచ్య సాహిత్యాలు, చీనా, జపాన్, కొరియా, వియత్నాం వంటి దేశాల సాహిత్యం పట్ల కూడా చాలా మక్కువ. కాబట్టి, నా ప్రసంగాల్లో ఆ రచయితలూ, ఆ రచనావిశేషాలూ దొర్లుతూ ఉండటం సహజమే కదా.

మీ సోదరి వీరలక్ష్మిగారు కూడా సాహిత్యంలో చాలా కృషి చేస్తున్నారు? మీ మధ్య సాహిత్య చర్చలు చోటుచేసుకుంటూ ఉంటాయా?

నన్ను చిన్నప్పణ్ణుంచీ సాహిత్యం వేపుగా నడిపించిన గురువుల్లో మా అక్క కూడా ఉంది. మేమిద్దరం మాట్లాడుకునేమాటలు దాదాపుగా సాహిత్యం గురించే ఉంటాయి. మా కుటుంబాల గురించీ, స్నేహాల గురించీ, బంధుత్వాల గురించీ మాట్లాడుకునేది దాదాపుగా తక్కువే.

మీ అద్భుత వక్తృత్వ పటిమ వెనుక ఉన్న రహస్యం ఏమిటి?

మీ ప్రశ్నలో ఉన్న ప్రశంసకు నా కైమోడ్పు. నన్ను నేను ఒక trained speaker గా చెప్పుకుంటాను. అందుకు నా తాడికొండ గురువులకి ప్రణామాలు. హైస్కూలు రోజుల్లో వారు నన్ను వక్తృత్వపోటీలకోసం ఎప్పుడూ సంసిద్ధపరుస్తూ ఉండేవారు. 1977 లో బాలల అకాడెమీ నిర్వహించిన వక్తృత్వ పోటీల్లో నాకు రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇక జిల్లా స్థాయిలో వచ్చిన బహుమతులకు లెక్కలేదు. ఏ విషయం మీద మాట్లాడమన్నా కేవలం అయిదు నిమిషాల ప్రిపరేషన్ తో మాట్లాడాలి, మూడు నిమిషాల వ్యవధి మాత్రమే ఉంటుంది, మొదటి బహుమతి తెచ్చుకోవాలి-అదీ వాళ్ళు నాకిచ్చిన శిక్షణ. ఈ సందర్భంగా నాకో సంఘటన గుర్తొస్తోంది. ఒకసారి మద్యపాన నిషేధం మీద వక్తృత్వపోటీ. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలో ఉన్నాను. గుంటూరులో జిల్లాస్థాయి పోటీ. మా మాష్టారు మద్యపాన నిషేధం ఎందుకు మంచిదో చెప్పి అందుకు తగ్గట్టుగా మాట్లాడటానికి సిద్ధం చేసారు. తీరాచేసి అయిదునిమిషాల ముందు నా చేతిలో పెట్టిన టాపిక్ లో ‘మద్యపాన నిషేధం మంచిది కాదు’ అని రాసి ఉంది! మా మాష్టారిని అడగడానికి లేదు. అప్పటికి వాళ్ళని మా నుంచి దూరంగా పంపేసారు. ఏమో! ఆ అయిదు నిముషాల్లో ఏమి స్ఫురించిందో, ఏమి మాట్లాడానో, ఆ పోటీలో నాకే ప్రథమ బహుమతి వచ్చింది.  అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ గారి చేతులమీదుగా ఆ బహుమానం అందుకున్నాను.

కాని ఏళ్ళ మీదట, సోక్రటీస్ నీ, ప్లేటోనీ చదివాక, శ్రోతల్ని రంజింపచెయ్యడంకన్నా, శ్రోతలు మెచ్చకపోయినా సత్యం మాట్లాడటమే నిజమైన వక్తకి ముఖ్యం కావాలని తెలుసుకున్నాను.

మీ 1986/87లో వచ్చిన నిర్వికల్ప సంగీతంలో మిమ్మల్ని మీరు  వెతుక్కునే ప్రయత్నములో మీరు ఒక వేదాంతో  లేక విప్లవకారుడో అవాలని అనుకున్నారట. ఆ గ్రంధం ఇప్పుడు చదివితే కలిగే అనుభూతి?

అవును. ఆ రోజుల్లో విప్లవోద్యమం చాలా బలంగా ఉండేది. నేను గిరిజన ప్రాంతం నుంచి వచ్చినవాణ్ణి కాబట్టి అక్కడి అసమానతలూ, అన్యాయాలూ నన్ను కలవరపరిచేవి. అప్పటికే చదువు సగంలో ఆపేసాను. కాని మాది పెద్ద కుటుంబం. మా తల్లిదండ్రులకి తోడుగా నిలబడి ఉండాలన్న బాధ్యత నన్ను ముందుకుపోనివ్వలేదు. భగవంతుడు నా మనసు గ్రహించినట్టున్నాడు, దాదాపు ముప్ఫై మూడేళ్ళు గిరిజన సంక్షేమశాఖలో పనిచేసే అవకాశం ఇచ్చాడు. పదవీవిరమణ చేసేముందు గిరిజన సంక్షేమ శాఖ డైరక్టరుగా పనిచెయ్యడం కూడా భగవంతుడి అనుగ్రహమనే అనుకుంటాను. నిర్వికల్ప సంగీతం కవితలు గుర్తొస్తే ఆ రోజులన్నీ గుర్తొస్తాయి.

తెలుగులో ఎన్నో కవిత్వోద్యమాలు పుట్టి గిట్టాయి. కొన్ని ఇంకా పిల్ల కాలువలై ప్రవహిస్తున్నాయి. నిజంగా సాహిత్యం సమాజంలో మార్పు తెస్తుందని మీరు విశ్వసిస్తున్నారా?  

సాహిత్య ప్రయోజనం గురించి ఇద్దరు రచయితలు చెప్పిన మాటలు నాకు చాలా అంగీకరించదగ్గవిగా అనిపిస్తాయి. ఒకటి కుటుంబరావు, ఆయన సాహిత్యం మనిషిని సంస్కరిస్తుందని చెప్పాడు. చట్టం చెయ్యలేని పని సంస్కారం చేస్తుందని చెప్పాడు. రెండవది బుచ్చిబాబు. సాహిత్యం జీవితాన్ని జీవించదగ్గదిగా మారుస్తుందని అన్నాడు. నా దృష్టిలో సాహిత్యం పాఠకుడి సెన్సిబులిటీస్ ని సూక్ష్మతరం చేస్తుంది. అతడికి జీవితాన్ని నిండుగా జీవించిన అనుభూతిని మిగులుస్తుంది.

నోబెల్ ప్రైజుకు అర్హులైన వారు మనదేశంలో ఠాగూర్ తర్వాత ఎవరూ లేరంటారా?

ఎందరో ఉన్నారు. నోబెల్ పురస్కారం పొందిన ఎన్నో నవలల కన్నా గోపీనాథ్ మొహంతీ రాసిన ‘అమృత సంతానం’ ఎన్నో రెట్లు గొప్ప నవల. శరత్ ‘శేష ప్రశ్న’ కి నోబెల్ బహుమతి ఇచ్చి ఉండవలసిందని ఎం.ఎన్.రాయ్ అంతటివాడే అన్నాడు. సాహిత్యంలో నోబెల్ పురస్కారం 1901 లో మొదలయ్యింది. కాబట్టి అందరికన్నా ముందు గురజాడ ఆ పురస్కారానికి అర్హుడు. మన సమకాలికుల్లో గద్దర్.

సాహిత్యం పరమావధి  ఏమిటంటారు?

మనిషిని సంస్కరించడం. ఎన్ని సార్లు చెప్పినా తిరిగి తిరిగి అదే తప్పులు చేసే మనిషికి, మళ్ళా ఓపిగ్గా,  మరో మారు మంచిదారి చూపించడం.

‘ప్రపంచ సాహిత్యం’లో ‘తెలుగు సాహిత్య స్థానం’ చెప్పడానికి మీరే సరైన సామర్ధ్యం ఉన్నవారు. మన స్థానం ఏమిటంటారు?

ప్రపంచ సాహిత్యంలో తెలుగు పద్యం అపురూపమైన ఛందో విశేషం. అంత గాఢమైన, ప్రౌఢమైన, వైవిధ్యవంతమైన ఛందోరూపం మరో భాషలో లేదు. మన నన్నయ డాంటేకి సమకాలికుడు, మన తిక్కన రూమీకి సమకాలికుడు. మన కృష్ణదేవరాయలు, పెద్దన షేక్స్పియర్ కన్నా ఒక తరం మాత్రమే ముందుకవులు. మన కవులెవరూ నేను చెప్పిన కవులకి తక్కువ కారు. ఉదాహరణకి, ఒకప్పుడు వడలి మందేశ్వరరావుగారు ఇటాలియన్ భాషలో డాంటే చేసిన కృషీ, తెలుగు భాషలో నన్నయ చేసిన కృషీ ఒక్కలాంటివే అని అన్నారు. కాని మన కవుల గురించి ప్రపంచమంతా వినేట్టుగా చెప్పుకోడానికి తగిన సామర్థ్యమే మనకింకా ఒనగూడటం లేదు.

పదవీ విరమణ చేశాక మీ పూర్తి కాలం సాహిత్యానికే కేటాయించారా?

అవును.

మీ భవిష్యత్ ప్రణాలికలేమిటి?

చాలా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతి రోజూ నా బ్లాగులో http://www.chinaveerabhadrudu.in లో ఏదో ఒక అంశం గురించి రాస్తోనే ఉన్నాను.

ఈనాటి యువ కవులు, రచయితలకు మీ సందేశం ఏమిటి?

అధ్యయనం చెయ్యడం, సాహిత్యాన్నీ, సమాజాన్నీ రెండింటినీ కూడా. కఠోరశ్రమ అవసరం, చదవడానికీ, రాయడానికీ కూడా.

27-9-2023

16 Replies to “సాహిత్యం గొప్ప ఆశ్రయం”

  1. చాలా బాగున్నాయండి మీ సమాధానాలు.
    ప్రత్యూష పవనాలు గురించి బ్లాగ్ లో మునుపు ఎప్పుడన్నా రాశారా?

    దాని గురించి చెప్పగలరా, ప్లీజ్.

    1. అది చాలా చిన్న అనువాద వ్యాస సంకలనం. 1995లో ఎమ్మెస్కో సంస్థ ఉగాది కానుకగా వెలువరించింది. దురదృష్టవశాత్తూ ఒక్క కాపీ కూడా భద్రపరచుకోలేకపోయాం.

  2. రామనవమి రమ్యమైన సాహిత్యోదయంతో ప్రారంభమైంది. మీకు శుభాకాంక్షలు.

  3. చాలా బాగుందండీ ఈ ఇంటర్వ్యూ.. ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం దొరికింది.. తెలుగు సాహిత్య రంగంలో ప్రవేశమున్నవారు.. ప్రవేశించాలనుకునే వారు.. ఔత్సాహిక రచయితలు, కవులు తప్పనిసరిగా ఈ ప్రశ్నలు, సమాధానాలు చదివితీరాలని నా అభిప్రాయం..

  4. రాష్ట్రస్థాయిలో ప్రథమ శ్రేణి ఉతీర్ణుడయిన విద్యార్థి ‘solved paper’ ఇది.. చదువుకునేవారికి చదువుకున్నంత.

  5. అద్భుతమైన సాహితీ వేత్త. ఈనాటి మాద్యమాలను దాటి కూడా అయన పోస్ట్ కోసం ఎదురు చూస్తున్నమంటే. .అయన గొప్పతనం తెలుస్తుంది. A living Legend in Literature
    ఇంటర్వ్యూ లో అన్నీ పార్సవాలను తాకిన తెలుగు నవల గత 50 ఏళ్ళు గ రాలేదన్నారు. . అనుక్షణికం ( వడ్డెర చండీదాస్ ) వచ్చింది కదా?

    1. ధన్యవాదాలు సార్!

      అనుక్షణికం గొప్పనవలనే, సందేహం లేదు. కానీ సమగ్రంగా వికసించిన నవల అని చెప్పలేం. దానికి శిల్పపరమైన సమస్యలు చాలా ఉన్నాయి.

  6. సాహిత్య పరమావధి మనిషిని సంస్కరించడం.నమోనమః.
    శ్రోతలు మెచ్చినా , మెచ్చక పోయినా సత్యం మాత్రమే పలకడం నిజమైన వక్తకి ముఖ్యం. చదవడం పూర్తి అయిన వెంటనే ఈ సాయంత్రం మా బాల్కనీ లోకి విస్తరించి ఉన్న మామిడి చెట్టు మీద కోయిల కూస్తూనే ఉంది.
    సాహిత్యాన్ని, సమాజాన్ని రెండింటినీ అధ్యయనం చేయడం , కఠోర శ్రమ రచయితలకు అవసరమనే మీ పలుకులు అత్యున్నతమైనవి. మీ కుటీ రం లోకి అడుగు పెట్టడం అదృష్టం.
    నమోనమః

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading