
సాహిత్య ప్రపంచంలో నేనెక్కువ గౌరవించేది అధ్యయనాన్ని. సృజనాత్మక రచయితలు కూడా అధ్యయనశీలురైతేనే గొప్ప రచయితలుగా రాణించగలుగుతారు. లోకాన్నీ, మనిషి అంతరంగాన్నీ, పుస్తకాల్నీ ఎంత లోతుగా, ఎంత నిరంతరాయంగా అధ్యయనం చేస్తూ ఉంటే అంతగా వాళ్ళ అంతర్దృష్టి పదునెక్కుతుంది. అప్పుడు మాత్రమే తమకీ, మనకీ కూడా పనికొచ్చే చిత్రణలో, సూత్రీకరణలో వాళ్ళు చెయ్యగలుగుతారు.
సమకాలిక తెలుగు సాహిత్యంలో డా.కాత్యాయని విద్మహే అటువంటి అధ్యయనశీలి. పండితకుటుంబంలో పుట్టి పెరిగి, కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పనిచేసిన డా.కాత్యాయని పరిశీలన, పరిశోధన నానాటికీ మరింత విస్తృతమవుతూ, మరింత లోతుల్ని సంతరించుకుంటూనే ఉన్నాయి. ఒకవైపు ప్రాచీన అలంకారశాస్త్రాలు మొదలుకుని, ఇటువైపు ఆధునిక, ఆధునిక-అనంతర సాహిత్య వివేచనాధోరణులదాకా ఆమె అధ్యయనం కొనసాగుతూనేఉంది. ఆ అధ్యయనం కేవలం సాహిత్య సంతోషాన్ని తాను అనుభవించి నలుగురితో పంచుకోవడంతో ఆగిపోయేది కాకపోవడం గమనించాలి. కావ్యానందాన్ని సామాజిక అవగాహనతో సమన్వయించుకోవడంలో ఆమెది గురజాడ అప్పారావు, శ్రీ శ్రీ, కొడవటిగంటి కుటుంబరావు ల దారి.
ఆమె అవగాహనకు మూలకందాలుగా ఉండే విలువల్ని మనం స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. భావాలు అభ్యుదయకరంగా ఉండటం, సమాజంలో అత్యధిక సంఖ్యాకులైన అణగారిన వర్గాల అభ్యున్నతిని కోరుకునేవిగా ఉండటం, తన భావాల్ని పంచుకోవడంలో ప్రజాస్వామిక వైఖరి అవలంబించడం, ఏది రాసినా, ఏది ప్రతిపాదించినా నిర్దిష్టతనీ, తార్కికతని, శాస్త్రీయతనీ ప్రమాణాలుగా పెట్టుకోవడం, తనలాంటి అభిప్రాయాలు కలిగినవారితోనూ, తన లాంటి సామాజిక దృక్పథం కలిగినవారితోనూ కలిసి సమష్టి, సామూహిక అధ్యయనానికి పూనుకోవడం మొదలైనవి ఆమె సాహిత్యవ్యాసంగాన్ని తీర్చిదిద్దుతున్న విలువలు.
ఈ క్రమంలో ఆమె ఒక మార్క్సిస్టుగా, స్త్రీవాదిగా తన రాజకీయ దృక్పథాన్ని తీర్చిదిద్దుకున్నారని మనం స్పష్టంగా గుర్తుపట్టవచ్చు. కాని అదే సమయంలో తన భావాలతో, ప్రతిపాదనలతో ఏకీభావం లేనివారిని కూడా ఒప్పించగలిగేలా, ఆలోచింపచేసేలా రాయగలగడం ఆమె ప్రత్యేకత. ఆలోచిస్తే ఆమెలోని ఈ బలానికి కారణం ఆమె అధ్యయనమే అనిపిస్తుంది.
ఇటువంటి వాళ్ళనే మన పూర్వులు తపస్స్వాధ్యాయనిరతులు అన్నారు. తన నిరంతరమైన తపస్సుకీ, స్వాధ్యాయానికి ఫలాలుగా ఆమె ఇప్పటిదాకా మూడువందలకు పైగా వ్యాసాలు, పాతిక పైగా పుస్తకాలు వెలువరించడమే కాక, మరొక ముప్ఫై పుస్తకాలకు పైగా సంపాదకులుగా కూడా ఉన్నారు. తెలుగు నాట అభ్యుదయ సాహిత్యానికీ, ప్రగతి వాద సాహిత్యానికీ సంబంధించిన చర్చల్లో, పరిశీలనల్లో డా. కాత్యాయనీ విద్మహే పేరు వినబడకుండా గత నాలుగు దశాబ్దాల్లో ఒక్క ఏడు కూడా గడిచింది లేదు.
కాత్యాయనిగారిలో నాకు నచ్చిన మరొక అంశం ఆమె తనలోని ఈ అధ్యయనశీలత్వాన్ని కొత్త తరం రచయితలకూ, రచయిత్రులకూ కూడా అలవర్చే ప్రయత్నం చేస్తూండటం. ఇటువంటి సమష్టి అధ్యయనాల్ని ప్రోత్సహించడంకోసం ఆమె ఇటీవలికాలంలో ఇంటర్నెట్ నీ, జూమ్‌నీ కూడా విస్తారంగా ఉపయోగించుకుంటూ ఉండటం నేను చూసాను. అటువంటి ఒక సమావేశంలో నేను పాల్గొన్నాను, ఆ చర్చలు ఎంత క్రమశిక్షణతో జరుగుతున్నాయో స్వయంగా చూసాను కూడా.
అటువంటి ఒక అధ్యయనశీలి ఏ విషయాన్నైనా ఎంచుకుని లోతుగా పరిశీలించడం మొదలుపెడితే ఎటువంటి సూత్రీకరణలు, సత్యాలు బయటపడగలవో ఇప్పుడు మన చేతుల్లో ఉన్న పుస్తకమే ఒక నిరూపణ.
ఇది నిజంగా ఒక ఆశ్చర్యకరమైన అధ్యయనం.
2
ఇరవయ్యవ శతాబ్దపు పూర్వార్థంలో 1910 నుంచి 1950 ల దాకా తెలుగు సాహిత్యంలో నవలా ప్రక్రియలో రచయిత్రులు చేసిన కృషిని పరిశీలించడం ఈ అధ్యయనం. సాధారణంగా ప్రక్రియాపరంగా ఇటువంటి పరిశీలన చేసేవాళ్ళు మనకి బాగా తెలిసిన, సుప్రసిద్ధమైన కొన్ని నవలల్ని ఎంచుకుని వాటిద్వారా రచయిత్రుల అవగాహనలోనూ, వారు చిత్రిస్తున్న సామాజిక గమనంలోనూ వచ్చిన పరిణామాల్ని అర్థం చేసుకోవడం మీద దృష్టిపెడతారు. అటువంటి పరిశోధనలో గొప్ప సౌలభ్యం కూడా ఉంటుంది. ఆ నవలలు అప్పటికే విస్తృత పాఠకవర్గానికి పరిచమై ఉంటాయి కాబట్టి పరిశోధకులు తాను కనుగొంటున్న విషయాల్ని పాఠకులతో పంచుకోవడం, వారిని ఒప్పించడం సులభంగా ఉంటుంది.
లేదా కొన్ని సార్లు పరిశోధకులు, విమర్శకులు తాము పరిశీలిస్తున్న విషయాలు అంతదాకా తెలుగు సాహిత్యవిమర్శకు పరిచయం కాని అంశాలు అనుకోండి. ఉదాహరణకి ఆర్.ఎస్. సుదర్శనంగారు ‘సాహిత్యంలో దృక్పథాలు‘ పేరిట కొంతమంది నవలారచయితల దృక్పథాల్నీ, వారి తాత్త్వికతనీ పరిచయం చేసే వ్యాసాలు రాసారు. అటువంటి పరిశీలన అప్పటికి తెలుగు సాహిత్యానికి చాలా కొత్త. కాని ఆ నవలలు, ఒక ‘వేయిపడగలు’ గాని, ఒక ‘చివరకుమిగిలేది’, ఒక ‘మైదానం’, ఒక ‘మెరుపుల మరకలు’ తెలుగు వాళ్ళకి బాగా తెలిసినవే. కాబట్టి తాము చదివిన, తమకు నచ్చిన, తమకు బాగా తెలిసిన నవలల్లో తమకు తెలియని కొత్త కోణాల్ని విమర్శకుడు వెలికి తీసిచూపించినప్పుడు తెలుగు పాఠకలోకం ఆ విమర్శను ఎంతో సంతోషంగా స్వాగతించింది. అలానే తెలంగాణా నవలల్లో తెలంగాణా సాయుధపోరాటం గురించో, లేదా తెలుగు నవల్లో మనోవైజ్ఞానిక చిత్రణ గురించో, లేదా తెలుగు నవలలో ప్రాంతీయ, అస్తిత్వ చైతన్యాల గురించో రాయడంలో ఆ పరిశోధకులకీ, వారి పాఠకులకీ కూడా కొంత సౌలభ్యం ఉంటుంది.
కాని ఈ పరిశీలన అటువంటిది కాదు. ఇందులో పరిశోధకురాలు సమకాలిక తెలుగు పాఠకలోకానికి అంతగా తెలియని రచయిత్రుల్నీ, వారి రచనల్నీ ఎన్నుకుని వాటిద్వారా తెలుగు సమాజంలోనూ, సాహిత్యంలోనూ విస్తృతమవుతూ వచ్చిన అవగాహనని అర్థం చేసుకునే ప్రయత్నం చేసారు. అసలు ముందు ఇటువంటి ఒక అంశాన్ని ఎన్నుకోవడమే ఒక సవాలు.
అటువంటి నవలలు వచ్చాయనిగాని, అటువంటి రచయిత్రులు ఉన్నారనిగాని తెలియని సాహిత్యప్రపంచానికి అసలు ముందు ఆ రచయిత్రుల పేర్లూ, వాళ్ళు రాసిన నవలల పేర్లూ జాబితా రాసిచ్చినా కూడా అదే గొప్ప పరిశోధనగా మనం చెప్పుకోవచ్చు. కాని డా.కాత్యాయని ఆ నవలల్ని ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లోంచి సంపాదించి, చదివి, వాటి ఇతివృత్తాల్ని సంగ్రహంగా పరిచయం చేసి, తద్వారా, ఆ రచయిత్రులు తమ సమకాలిక సామాజిక-రాజకీయ చైతన్యాన్ని ఏ మేరకు అందుకోగలిగారో వివరించారంటే అది చిన్న విషయం కాదు. పరిశోధన అంటే ఇదీ నిజంగా. పరిశీలన అంటే ఇటువంటిది నిజంగా.
ఈ అధ్యయనంలో ఆమె మొత్తం 29 మంది రచయిత్రుల నవలల్ని పరిచయం చేసారు. తెలుగు సాహిత్యంతో ఎంతో ఘనిష్ట పరిచయం ఉందనుకున్న నాకే ఇందులో పదిమంది పేర్లు తప్ప తక్కిన వారి పేర్లు తెలియవు. మొత్తం 29 మందిలోనూ అయిదారుగురి రచనలు తప్ప తక్కినవారివేవీ పుస్తకాలు కూడా నేను చూడలేదు. కాబట్టే, ఈ అధ్యయనంలో పేజీ వెనక పేజీ తిప్పుకుంటూ, ఒక్కొక్క రచయిత్రి గురించీ చదువుకుంటూ పోతుంటే నాకు తెలియని ఒక విస్మృత ప్రపంచం అత్యంత సజీవంగా, ఆశ్చర్యకరంగా నా కళ్ళముందు ఆవిష్కారమవుతూ ఉండిరది. ఇప్పుడు మీక్కూడా అటువంటి ఆశ్చర్యానందాలే అనుభవానికొస్తాయని నాకు నమ్మకంగా ఉంది.
అంతేకాదు తొలి తెలుగు నవలా రచయిత్రి దేవమణి సత్యనాథన్ నుంచి వి.ఎస్.రమాదేవిదాకా తెలుగు రచయిత్రుల ప్రపంచం ఎంత విస్తృతమవుతూ వచ్చిందో కూడా మనం గమనిస్తాం. ఇరవయ్యవ శతాబ్ద ప్రారంభంలో నవలా రచన మొదలుపెట్టినప్పటికీ, తొలి తెలుగు రచయిత్రులనవలల్లో అప్పటి జాతీయోద్యం ప్రభావం కన్నా, అప్పటికి దాదాపు నలభై, యాభై ఏళ్ళకిందటి వీరేశలింగం సంస్కరణోద్యమ ప్రభావమే ప్రధానంగా ఉండేదని గుర్తుపెట్టుకుంటే, యాభైల చివరికి వచ్చేటప్పటికి ఒక రంగనాయకమ్మలాగా తన సమకాలిక తెలుగు చైతన్యాన్ని ఎంతో బలంగా ప్రభావితం చేయగలిగే స్థాయికి తెలుగు రచయిత్రి చేరడం మనం ఈ కథనంలో గమనిస్తాం. ఒక వి.ఎస్.రమాదేవి దగ్గరకు వచ్చేటప్పటికి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పాలన, ప్రభుత్వనిర్వహణ, యంత్రాంగనియంత్రణ వంటి అంశాల్లో తెలుగు రచయిత్రి ఎంత ప్రగాఢపరిజ్ఞానాన్ని సముపార్జించగలిగిందో కూడా మనకి ఈ పుస్తకంలో కనిపిస్తుంది. కనకనే ఈ పుస్తకం ఒక సాహిత్య విమర్శ గ్రంథం మాత్రమే కాదు, అంతకన్నా కూడా తెలుగు స్త్రీ సామాజిక సాధికారికతా జయగాథ కూడా. ఈ రచన నిజంగానే తెలుగు నారి సారించిన నారీ గాథ.
నవీన మహిళ చరిత్రను తిరిగి రాస్తుందని రాసుకున్నాడు గురజాడ తన డైరీల్లో ఒకచోట. చదువుకున్న మహిళ తన చైతన్యంతో చరిత్రను తిరిగి రాస్తే ఎలా ఉంటుందో ఈ పుస్తకం చదివాక నాకు బాగా అర్థమయింది. 1908 లో దేవమణి సత్యనాథన్ రాసిన ‘లలిత’ నవలనుంచి 2006 లో వి.ఎస్.రమాదేవి రాసిన ‘సంసారసాగరాలు’ నవల దాకా ఒక శతాబ్దకాలంలో తెలుగు రచయిత్రి తన ఇతివృత్తాల్లో, పరిశీలనల్లో, సామాజిక చిత్రణలో ఎటువంటి లోతుల్నీ, ఎటువంటి విస్తృతినీ సాధించిందో చూస్తుంటే నిజంగానే ఈ నవలారచయిత్రులు తెలుగు సామాజిక చరిత్రను తిరిగిరాసారన్నది నిశ్చయమవుతుంది. మరొకవైపు ఆ రచయిత్రుల చరిత్రను ఈ విమర్శకురాలు కూడా ఎలా తిరిగి రాసిందో చూస్తే ఆమె పరిశోధనను మనం ఆరాధించకుండా ఉందలేమనిపిస్తుంది.
ఇంకా చెప్పాలంటే తెలుగు నవలా రచయిత్రుల చరిత్రను వెలికి తియ్యడంలో గత యాభై ఏళ్ళ పరిశోధనను ఈమె ఈ ఒక్క పుస్తకంతో వందేళ్ళు ముందుకు జరిపిందని చెప్పవచ్చు. ఆమె చెప్పిన వివరాల్ని బట్టి చూస్తే 1971 నుంది 1990 దాకా తెలుగు నవలా రచయిత్రుల మీద వచ్చిన పరిశోధనల్లో ‘1950 కి పూర్వం స్త్రీల నవలా సాహిత్యం దాదాపుగా విస్మృత చరిత్రే’. 1909-59 మధ్య యాభై ఏళ్ళ కాలంలో ఇప్పటిదాకా ‘ఇతిహాసపు చీకటి కోణం అట్టడుగున పడి కనిపించని’ కథకుల్ని ఇప్పుడీ రచయిత్రి వెలుగులోకి తీసుకు వస్తున్నది. మొత్తం 29 మంది స్త్రీల రచనల్లో లభ్యంగా ఉన్నవాటిని వెతికి పట్టుకుని వాటిని దశాబ్దాల వారీగా పరిచయం చేయడం ద్వారా, ఈ నవీన మహిళ నిజంగానే తన పూర్వనవీనమహిళల చరిత్రని తిరిగి రాస్తున్నది.
సాధారణంగా ఇటువంటి పరిశీలనలకు ఎదురయ్యే మొదటి పరిమితి ఏమంటే ఇవి చాలావరకు డాక్యుమెంటేషన్ స్థాయిని దాటలేకపోవడం. ఎందుకంటే మనకు తెలియని చరిత్రనీ, సాహిత్యకృషినీ, తేదీలతో, దస్తావేజులతో మనముందు ఉంచుతున్నప్పుడు ముందు ఆ పరిజ్ఞానం మనతో పంచుకోవడమే చాలా ఎక్కువ అనిపిస్తుంది. కాని డా.కాత్యాయని ఈ అధ్యయనాన్ని అలా పరిమితం కాకుండా చూసుకున్నారు. మనకు తెలియని వివరాల్ని మనకు తెలియచేస్తూనే, వాటితో పాటు ఆయా రచనలు చదువుతున్నప్పుడు, ఆ రచయిత్రుల చైతన్యంలో, దృక్పథంలో వచ్చిన పరిణామాన్ని స్థూలంగానే అయినా సమగ్రంగా మనముందుంచడంలో ఆమె అసాధారణమైన ప్రతిభ చూపించారు.
ఇరవయ్యవశతాబ్దపు పూర్వార్థంలోని అయిదు దశకాల కాలంలో వచ్చిన నవలల్ని పరిచయం చేస్తున్నప్పుడు ప్రతి దశకంలోనూ సంభవించిన చారిత్రిక-సామాజిక పరిణామాల్ని స్థూలంగా పరిచయం చేస్తూ, ఆ కాలంలో నవలలు రాసిన రచయిత్రులు ఆ పరిణామాల్ని ఏమేరకు తమ సాహిత్యంలో ప్రతిబింబించగలిగారో, ఏ మేరకు పట్టించుకోలేకపోయారో, రెండూ కూడా మన ముందుంచారు. ఈ అయిదు అధ్యాయాలూ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, తిరిగి మళ్ళా ఒక్కొక్క అధ్యాయం మీద ఒక్కొక్క పరిశోధకురాలు మరింత వివరంగా, మరింత లోతుగా పరిశోధన చెయ్యవచ్చునని. అలా తన పరిశోధనను ముందుకు తీసుకుపోడానికి కొత్త పరిశోధకుల్ని ప్రేరేపించగల శక్తి ఈ పుస్తకానికి పుష్కలంగా ఉంది.
అలాగే రచయిత్రుల నవలల ఆధారంగా వారి దృక్పథాల్నీ, వారి సామాజిక-రాజకీయ అవగాహననీ, కొన్ని సార్లు ఆ అవగాహనలోని పరిమితుల్నీ కూడా ఈ పరిశోధకురాలు చాలా సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా 1950 తర్వాతి రచయిత్రులు మల్లాది వసుంధర, లత, మాలతీ చందూర్, వట్టికొండ విశాలాక్షి, డా.శ్రీదేవి, రంగనాయకమ్మ, రమాదేవిల పైన ఆమె చేసిన పరిశీలన ఈ మొత్తం పుస్తకంలో ఒక ప్రత్యేక అధ్యాయం అని చెప్పవచ్చు. రేపటిరోజున కొత్త పరిశోధకులు ఈ రచయిత్రులు ఒక్కొక్కరిమీదా డా.కాత్యాయని పరిశీలనలు ప్రాతిపదికగా మళ్ళా మరింత లోతైన పరిశోధనకు పూనుకోవచ్చు. చైతన్యం విస్తరించే క్రమం ఇది.
1950 తర్వాతి రచయిత్రుల సాహిత్యాన్ని డా.కాత్యాయని మూల్యాంకనం చేసినప్పుడు అందులో మళ్ళా డా.లత, రంగనాయకమ్మ, రమాదేవిల పైన ఆమె చేసిన సూత్రీకరణలు, ప్రతిపాదనలు ఎంతో కొత్తగానూ, ఆలోచనాత్మకం గానూ ఉన్నాయి. ఈ పరిశోధనతో తెన్నేటి హేమలతకి రచయిత్రిగా పునర్జన్మ లభించిందని అన్నా ఆశ్చర్యం లేదు. నలభయ్యేళ్ళకింద సాహిత్యచర్చల్లో ప్రముఖంగా వినిపించిన లత పేరు ఈనాడు చర్చల్లో, వ్యాసాల్లో దాదాపుగా కనిపించకుండా పోయిందని మనకి తెలుసు. కాని ఇందులో లత రచనల్ని డా.కాత్యాయని పరిచయం చేసిన తీరు చూసినప్పుడు చాలా అంశాల్లో లతకి సమకాలిక ప్రాసంగికత ఉందనీ, కొన్ని అంశాల్లో ఆమె తన కాలం కన్నా ముందున్న రచయిత్రి అనీ మనం గుర్తుపట్టగలుగుతాం.
ఉదాహరణకి లత రాసిన ‘గాలిపడగలూ-నీటిబుడగలూ’ నవల్లో చిత్రించబడ్డ జీవితం లాంటిదాన్ని ఒక ‘రత్తాలు-రాంబాబు’ నవల్లో చిత్రించడానికి ఒక రావిశాస్త్రి వంటివాడికి మరొక ఇరవయ్యేళ్ళు ఆగవలసి వచ్చిందన్న పరిశీలన చిన్న పాటి మెలకువ కాదు. రంగనాయకమ్మ సాహిత్యం గురించిన చర్చలో కూడా పరిశోధకురాలు కొత్త సూత్రీకరణల్ని మనముందుచడం ఆమె అధ్యయనశీలత్వంలోని నైశిత్యానికి గుర్తు. కాని వి.ఎస్.రమాదేవి గురించిన చర్చ మొత్తం నాకైతే పెద్ద కనువిప్పు. మనం మనకు తెలియకుండానే ఎందరో విలువైన రచయితల్నీ, రచయిత్రుల్నీ చదవకపోవడం ద్వారా వారిని మన చర్చల్లోంచి చేజార్చుకుంటాం అనిపించింది ఆ చర్చ మొత్తం చదివాక.
ఇక మొత్తం గ్రంథంలో ఇద్దరు రచయిత్రుల గురించిన వివరణలు నా అజ్ఞానాన్ని ఛళ్ళున చరిచి మేల్కొల్పాయని ఒప్పుకోక తప్పదు. వారిలో ఒకరు, హవాయీ కావేరీ బాయి. ఆమె రాసిన ‘పరిణామము’ (1940) నవల గురించి నేనిప్పటిదాకా వినలేదు. డా.కాత్యాయని ఆ నవలను మాలపల్లితో పోల్చారు. ‘తెలుగు నవలా సాహిత్య చరిత్రలో మాలపల్లి నవల ఎలాగైతే వికాసయుగానికి ప్రారంభమో, స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో వికాస యుగానికి ‘పరిణామము’ఆ రకంగా గొప్ప ప్రారంభం’ అని రాసారు ఆమె. అంతేకాక ‘స్త్రీ వాద సాహిత్య చరిత్రలో గైనోక్రిటిసిజం కు ప్రారంభం కావేరీబాయి పరోక్షంగా ఈ నవలలో చేసిందని’ కూడా చెప్పారు. ఆమె ఇంకా ఇలా రాసారు:
పరిణామము నవలకు ఒక ప్రత్యేకత ఉంది. భిన్న అస్తిత్వ చైతన్యాల మధ్య సంఘర్షణ, సంవాదం, సంభాషణ నడుస్తున్న వర్తమాన చారిత్రిక సందర్భంలో భిన్న అస్తిత్వాలకు చెందిన స్త్రీల మధ్య స్నేహం అభివృద్ధి కావడానికి, భుజం భుజం కలిపి విముక్తికై సాగటానికి దాటవలసిన అగడతెన్నో అర్థం చేసుకొనటానికి ఈ నవల చక్కగా ఉపయోగపడుతుంది.
ఏ పరిశోధనలోనైనా ఇటువంటి రచనలూ, రచయిత్రులూ వెల్లడి కావడం ఒక సరికొత్త హిమాలయశిఖరాన్ని కనుగొన్నట్టుగానో, మహాసముద్రమధ్యంలో ఒక సుందరద్వీపానికి చేరుకున్నట్టుగానో ఉంటుంది. ఎనభయ్యేళ్ళకిందట తన కాలం కన్నా ముందుండి రాసిన ఇటువంటి ఒక నవల వచ్చిందని మనకు ఇంతదాకా తెలియకపోవడం మనసుకు కలిగించే కష్టంకన్నా, కనీసం ఇప్పుడేనా తెలుసుకున్నమన్నా సంతోషమే అధికంగా ఉండే సందర్భం ఇది.
ఇక రెండవ రచయిత్రి, వట్టికొండ విశాలాక్షి. 1943 నాటికే అభ్యుదయ రచయితల మొదటి సంఘకార్యవర్గంలో సభ్యురాలుగా పనిచేసిన విశాలాక్షి జీవితప్రయాణాన్ని, తన అభిప్రాయాల్ని ప్రకటించడంకోసం, బలపరుచుకోవడం కోసం ఆమె చేసిన పోరాటాన్నీ, ఆమె రాజకీయ చైతన్యాన్నీ డా.కాత్యాయని వివరించిన తీరు ఆ రచయిత్రికి ఘననివాళి అని చెప్పవచ్చు. తెలుగు నవలలో అప్పటిదాకా కనిపించని వామపక్ష రాజకీయాల్నీ, ఆ పోరాటాల్నీ ఎంతో దగ్గరగా చూసి చిత్రించిన ఆమె నవల ఖైదీ గురించి రాస్తూ కాత్యాయని ఇలా అంటున్నారు:
స్త్రీ పురుష లైంగిక సంబంధాల విషయంలో కూడా ఒక స్త్రీ అనుభవకోణం నుండి సంప్రదాయ ఉక్కుచట్రంపై విమర్శను, నిరసనను నమోదు చేసిన తొలినవలగా కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది.
ఆ నవల గురించి ఆమె ఇంకా ఇలా రాసారు:
జీవితాన్ని, అందులోని ప్రతి సందర్భాన్ని జెండర్ కోణం నుండి చూడవచ్చని, చూడాలని స్త్రీవాద ఉద్యమం తెలియచెప్పింది. తెలుగులో ఈ చైతన్యం 1990 వ దశకంలో గాని ఊపు అందుకోలేదు. ఇది ఇచ్చిన విమర్శనాత్మక దృక్పథం, చర్చలోకి తెచ్చిన భావనలు నాలుగు దశాబ్దాలకు ముందే విశాలాక్షి వ్రాసిన ఖైదీ నవలలో అంకురదశలో కనబడతాయి. ఖైదీ అంతరంగ సంవేదనలు, ఆలోచనల పనితీరు,నూతన భావజాల నిర్మాణ ప్రచారాలు ప్రాధాన్యం వహించిన రచన కనుక దీనిని ఆలోచనల నవల (Novel of Ideas) అనవచ్చు.
అలాగే విశాలాక్షి రాసిన నిష్కామయోగి నవల గురించి రాస్తూ ‘తమ కాలపు రాజకీయాలపై స్త్రీలకోణం అనేది ఒకటి ఉంటుందని చూపిన ఒక సాధికార డాక్యుమెంట్ ఈ నవల’ అని అంటారు. ఇంకా ఇలా కూడా అంటున్నారు:
ఆ చారిత్రిక రాజకీయార్థిక సంఘర్షణల సంబంధం మానవసంబంధాలను లోపలినుండి, బయటినుండి కూడా ఎట్లా ప్రభావితం చేసి ఏ దిక్కుకు నడిపించిందో, వ్యక్తిత్వాలను ఎట్లా మలిచిందో చూపటం వల్ల ఇది గొప్ప నవల అయింది. అందునా స్త్రీల అనుభవకోణం, ఆలోచనాకోణం ప్రదహానంగా నవలలో కథను నడపటం దానికి మరింత విలువను పెంచింది.
ఒక పరిశోధనని ground breaking అని ఎప్పుడు అనగలమంటే, ఇదిగో, ఇటువంటి సత్యాల్ని వెలికి తీసినప్పుడు.
మనకి గుమ్మడిదల దుర్గాబాయమ్మ ఒక జాతీయోద్యమ నాయకురాలిగా, సంస్కర్తగా, విద్యావేత్తగా తెలుసు. అటువంటి సుసంపన్నమైన జీవితానుభవం కలిగిన రచయిత్రి ఒక నవల రాస్తే ఆ నవల్లో కూడా ఆ సంఘర్షణ, ఆకాలం నాటి వైరుధ్యాలు, పోరాటాలు ప్రతిబింబిస్తాయని ఆశిస్తాం. కాని 1930-39 మధ్య కాలంలో దుర్గాబాయమ్మ నవలతో సహా ఈ దశకపు మరే నవలలోనూ సమకాలీన జాతీయోద్యమ రాజకీయాలు, దళిత అస్తిత్వ చైతన్యం, పేదల సమస్యల ప్రస్తావన కూడా లేదంటారు కాత్యాయని. మరోవైపు తెలుగు సమాజానికి, సాహిత్యలోకానికి అంతగా పరిచయం కాని వట్టికొండ విశాలాక్షి నవలల్లో రాజకీయసంఘర్షణ ఎంతో ప్రతిభావంతంగా చిత్రితమైందని ఆమె చెప్తే తప్ప మనకు తెలియలేదు.
అలాగే తెలుగు రచయిత్రుల్లో విషయపరిజ్ఞానంలోగాని, ప్రపంచ సాహిత్య పరిచయంలోగాని ఎంతో అగ్రగణ్యురాలిగా చెప్పదగ్గ మాలతీచందూర్ స్త్రీ వాద చైతన్యం దగ్గరకు వచ్చేటప్పటికి చూపించిన పరిమితులు కూడా డా.కాత్యాయని నిస్సంకోచంగా నమోదు చేసారు. తన కాలంకన్నా ముందున్న రచయిత్రిగా నేటికీ ప్రస్తుతి పొందుతున్న కనుపర్తి వరలక్ష్మమ్మ చైతన్యపు పరిమితుల గురించిన కాత్యాయని పరిశీలనలు కూడా నిస్సందేహంగా ఒప్పుకోదగ్గవి.
అలాగే ఇది డా.కాత్యాయని పరిశోధక ప్రయాణగాథ కూడా. చిన్నప్పుడు మీనా నవల పాఠకురాలిగా, పెద్దయ్యాక చివరకు మిగిలేది నవలపైన డాక్టరల్ పరిశోధన చేసిన పండితురాలిగా, ఇప్పుడు ఒక అర్థశతాబ్దం పాటు నవలా రచయిత్రుల కృషిని వెలుగులోకి తెచ్చేదాకా కాత్యాయని చేసిన ప్రయాణం కూడా ఆశ్చర్యకరమైన పరిణామమే.
3
ఇప్పుడు మన చుట్టూ విస్తారంగా సాహిత్యం ప్రభవిస్తోంది. కొత్త రచయిత్రులు, కొత్త అనుభవాలతో, మనం ఇంతదాకా విని ఉండని అనుభవకథనాలతో మనముందుకు వస్తున్నారు. కాని అదే సమయంలో మన పఠనానుభవం పూర్వంకన్నా మరింత కుంచించుకుపోతూ ఉంది. పుస్తకాలు సాకల్యంగా చదవకుండానే వాటి గురించి మాట్లాడేవాళ్లూ, ఆ పుస్తకాల్లో ఏముందన్నది చూడకుండా, తమ ముందస్తు అభిప్రాయాలకు ఆ రచనలో మద్దతు దొరుకుందా లేదా అని చూసేవాళ్ళూ, ఒక రచనని ఆమూలాగ్రంచదివి, నిష్కర్షగా మూల్యాంకనం చెయ్యడానికి బదులు ఆ రచయిత కులం, గోత్రం, ప్రాంతాల గురించిన చర్చ చేపట్టేవాళ్ళూ సాహిత్యరంగంలో నానాటికీ పెరుగుతున్నారు.
ఒకవైపు సృజనపరంగా గొప్ప వికాసం మరొకవైపు పఠనపరంగా తీవ్రనిరుత్సాహం పక్కపక్కనే కనిపిస్తున్న ఈ వైరుధ్యకాలంలో ఇటువంటి పరిశోధన గ్రంథం రావడం నిజంగా ఎండిన నేలమీద తొలివానచినుకు పడ్డట్టుగా ఉంది. మన పూర్వకాలంలో రచనలు చేసీ, తమ కాలం కన్నా ముందుకు చూడగలిగీ, విస్మృతికిలోనైన రచయిత్రుల గురించి తెలుసుకుని, వారి రచనలు వెతికిపట్టుకుని, చదివి, వాటినిలా పరిచయం చేసినందుకు డా.కాత్యాయనీ విద్మహేగారికి నాతో సహా తెలుగు సాహిత్యలోకం ఎంతో ఋణపడి ఉంటుంది.
సులభంగానూ, సరళంగానూ ఉండే శైలి, ఆసక్తికలిగించే కథనం, సంస్కారవంతమైన భాష, ఎక్కడా ఎవరి మీదా తీర్పులు తీర్చడానికి సిద్ధపడకపోవడం ఈ పుస్తకాన్ని విలువైన రచనగా తీర్చిదిద్దాయి. పుస్తకం ముగించేటప్పటికి డా.కాత్యాయనీ విద్మహేలోని పరిశోధకురాలిగా నేను పూర్తి అభిమానిగా మారాను.
ఇక ఇప్పుడు మీ వంతు. మొదలుపెట్టండి.
29-1-2024


చాలా గొప్ప వ్యాసం సర్ ఇది. 🙏
దేశవిదేశాల్లో గొప్ప నవలలు, కవితల్ని తెలుగు చేసి మాకు పంచిన…
మీకే తెలియని రచయిత్రులు నవలల్ని పరిచయం చేశారంటే… డాక్టర్ కాత్యాయని విద్మహే గారి కృషి… పరిశోధన అనితరసాధ్యం.
సాహిత్య లోకం ఆవిడకు రుణపడి ఉంది అన్న మీమాట నిజం సర్.
కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు మేడం గారిని వరించడం… ఆ అవార్డు కే గౌరవం పెరిగింది🙏🌹❤️
ధన్యవాదాలు రామ్మోహన్!
మంచి పుస్తకం విశ్లేషణ గా అందించారు.
Thank you so much sir
ఎంతో గొప్ప పుస్తకం… రచయితలు అందరూ తప్పకుండ చదవాల్సిన పుస్తకం అనిపించింది…
ధన్యవాదాలు మేడం
రెండోసారి చదవడం.
మనసు నిండిపోయుంది.
కాత్యాయని గారి గురించి ఎవరయినా ఇంత ప్రేమగా, నిశితంగా, సారవంతంగా రాయడం నేను చూడలేదు. ఈ కృషీవలురాలికి తెలుగు సాహ్విత్య విమర్శ చాలాకాలంగా బాకీ పడి ఉంది. తీర్చడానికి మీరు పాదులు తీసారు. థాంక్యూ భద్రుడు గారు.
ధన్యవాదాలు మేడం
కాత్యాయనీ విద్మహే గారి పరిశోధనా వజ్రాన్ని విలవగట్టగలిగిన నిపుణులైన రత్న పరీక్షకులు మీరు.అధ్యయనం లేని సృజన ఫలవంతం కాదని చెబుతూ ఉత్తమ రచయితలు విలువలు కలిగిన అనుసరించవలసిన విషయాలు చాలా చక్కగా వివరించారు. గురజాడ, శ్రీశ్రీ , కొడవటిగంటి మార్గము అని చెప్పటం కవి సామాజిక బాధ్యతను
చెబుతూ అధియనావశ్యకతను వివరించడం బాగుంది. మిమ్మల్నే అబ్బుర పరచిన విషయం కూడా వినయంగా చెప్పటం ఒంటబట్టించు కోవలసిన ఆదర్శం. చదవగానే విశేషంగా స్పందించాలనే కోరిక కలిగించే రచన నిర్వివాదంగా ఉత్తమ రచన. కాత్యాయని విద్మహే గారిది మీకైనట్లు , మీది మాకైనట్లు.నమస్సులు.
మీ సహృదయ స్పందనకు మరో మారు వినయపూర్వక నమస్కారాలు.
సారవంతమైన విశ్లేషణ చేశారు..వెంటనే పుస్తకం తెప్పించుకుని చదవాలనివుంది సర్..అద్భుతం..
డా పెరుగు రామకృష్ణ
ధన్యవాదాలు సార్!
మరుగున పడిన ఆనాటి రచయిత్రుల వివరాలు..వారి రచనల విశ్లేషణలు చాలా బాగా చేసారు. మీ వ్యాసరచన ద్వారా 1935-’40 కాలం రచయిత్రుల గురించి తెలుసుకున్నాము. కాత్యాయనీ గారు ,మీరు చేస్తున్న ఈ సాహిత్య సేవ నిజంగా ప్రశంసనీయం!.👌😊💐🙏🙏