
మత్తిభానుమూర్తి రాసిన ‘జాయసేనాపతి’ నవల మొదటిభాగం మీ చేతుల్లో ఉంది. ఇది చారిత్రిక కాల్పనిక నవల.
కవిత్వం గురించి చెప్తూ అరిస్టాటిల్ హెరొడటస్ రచనలన్నిటినీ పద్యాల్లో తిరిగి రాసినా కూడా వాటిని చరిత్ర అనే అంటాం తప్ప సాహిత్యం అని అనం అన్నాడు. ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ నిర్దిష్ట చారిత్రిక సత్యాల్ని నమోదు చేసుకుంటూపోతుంది, కాని సాహిత్యం సత్యాన్ని సార్వత్రికంగా దర్శిస్తుంది అని అన్నాడు. మరో మాట కూడా అన్నాడు. చరిత్ర ఇలా జరిగింది అని మాత్రమే చెప్తుంది. కవిత్వం ఇలా జరిగి ఉండొచ్చు లేదా ఇలా జరిగి ఉంటే బాగుణ్ణు అని చెప్తుంది అన్నాడు.
చారిత్రక కల్పన, ఇంగ్లిషులో historical fiction రెండు కారణాల వల్ల వస్తుంది. మొదటిది, చరిత్రలో ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియనప్పుడు, ముఖ్యంగా ఆనాటి సామాజిక, రాజకీయ వివరాలు పూర్తిగా లభ్యం కానప్పుడు, కవి వాటిని ఎంతో కొంత ఊహాగానంతో నింపడానికి ప్రయత్నించడం. ఈ అర్థంలో అసలు మొత్తం చరిత్ర రచనకే ఒక కాల్పనిక స్వభావం తప్పదని చెప్పాలి. వివరాలు పూర్తిగా తెలిసినా కూడా రచయిత ఏమి చెప్పినా తన దృక్కోణం నుంచే చెప్పగలుగుతాడు కాబట్టి, ప్రతి చరిత్రరచనా అంతిమంగా ఒక కథనే.
కాని ఒక రచయిత చారిత్రిక రచనకు పూనుకోడంలోని రెండో కారణం చాలా విలువైంది. అదేమంటే, రచయిత తనముందున్న కొన్ని చారిత్రిక పాత్రల్నో, ఘట్టాల్నో, సంఘటనల్నో ఆధారంగా తీసుకుని, తాను ఆ చారిత్రిక స్ఫూర్తితో మమేకమై, గడిచిపోయిన ఆ జీవితాన్ని మరలా మరొకసారి తన మనసులో అనుభవించి మనతో పంచుకోడం కోసం చారిత్రిక నవలా రచనకు పూనుకుంటాడు. నా దృష్టిలో ఇది చాలా విలువైన ప్రయత్నం. నిజమైన సాహిత్య ప్రయత్నం. జాయసేనాపతి ఇటువంటి రచన.
నా చిన్నప్పుడు నన్ను సాహిత్యప్రపంచంలోకి ఆహ్వానించినవి చారిత్రిక నవలలే. నోరినరసింహశాస్త్రిగారి ‘మల్లారెడ్డి’, అడవి బాపిరాజు ‘హిమబిందు’, తెన్నేటిసూరి ‘ ఛెంఘిజ్ ఖాన్ ’, శ్రీనివాస సోదరుల ‘విజయనగర రాజ్య పతనం’ వంటి నవలలు చదువుతున్నంతసేపూ నేను ఆయాకాలాల్లో మోటుపల్లి రేవుదగ్గరో, విజయపురి వీథుల్లోనో, గోబీ ఎడారుల్లోనో, లేదా హంపీ విరూపాక్ష దేవాలయసన్నిధిలోనో బఉన్నట్లుగా ఊహించుకునేవాణ్ణి. సామంఘిక జీవితాన్ని చిత్రించే నవలలు చదివినప్పుడు కూడా మనకి ఇటువంటి అనుభూతి, అంటే, మనం కూడా ఆ సన్నివేశాల్లో ఉన్నట్టు అనిపించే అనుభూతి కలుగుతూనే ఉంటుందిగాని, చారిత్రిక రచనలు చదివినప్పటి అనుభూతి అంతకన్నా ప్రత్యేకమైంది.
మామూలు నవలలు చదువుతున్నప్పుడు మనం వ్యక్తుల సుఖదుఃఖాల్తోనూ, ఆ వ్యక్తులు తమ జీవితాల్లో ఏ విలువలకోసం నిలబడ్డారో ఆ విలువలతోనూ మమేకమవుతాం. కాని చారిత్రిక నవలలు చదువుతున్నప్పుడు మనమొక జాతి సుఖదుఃఖాల్తో, ఆ జాతి ఏ ఆదర్శాలకోసం నిలబడిరదో ఆ ఆదర్శాలతో తాదాత్మ్యం చెందుతాం. ఎవరేనా పాఠకుడు తన చిన్నవయసులోనే చారిత్రిక నవలలో, కవిత్వమో చదివిఉంటే, అవి అతడి శీలనిర్మాణం మీద చూపించే ప్రభావం ఇంతా అంతా కాదు.
కాని మరోవైపు చారిత్రిక కాల్పనిక సాహిత్యం ఋణాత్మకంగా కూడా ప్రభావం చూపిస్తుంది. అది మనుషుల్నీ, జాతుల్నీ టైపులుగా మారుస్తుంది. తన ప్రాంతం, తన మతం, తన దేశం గొప్పవనీ, వేరే ప్రాంతానికీ, మతానికీ, దేశాలకీ చెందిన వాళ్ళు శత్రువులనీ తెలియకుండానే నూరిపోస్తుంది. తన చిన్నప్పుడు చారిత్రిక కల్పనలు చదివినవాడు, పెద్దయ్యాక ఆ పరిమితుల నుంచి తనంతట తానుగా బయటపడగలిగితే అది అదృష్టమనే చెప్పాలి. నా చిన్నప్పుడు నోరి నరసింహశాస్త్రి రాసిన ‘రుద్రమదేవి’ చదివినప్పుడు కాకతీయులు నా వాళ్ళనీ, యాదగిరి యాదవులు నాకు శత్రువులనీ అనుకునేవాణ్ణి. కానీ వాళ్ళిద్దరూ కూడా భారతీయులే అనే మెలకువ వచ్చాక ఆ రచనను చిన్నప్పటిలాగా చదివి ఆనందించడం కష్టమని అర్థమయింది.
అలాగే 1857 లో ఇంగ్లిషు వాళ్ళమీద సిపాయిల తిరుగుబాటుని వర్ణించే ‘వీరభారతం’ నాకు చాలాకాలం పాటు ఆరాధ్యగ్రంథంగా ఉండేది. కానీ గాంధీని చదివినతర్వాత, శత్రువుని ద్వేషించకుండానే శత్రుత్వాన్ని ద్వేషించవచ్చని తెలిసిన తరువాత, ఆ రచన తన సమ్మోహకత్వాన్ని చాలావరకూ పోగొట్టుకుంది.
ఇదే మాట ఒక భాషాశైశవానికీ, జాతి శైశవానికీ కూడా వర్తిస్తుంది. కాబట్టే పాఠకులు ఒకప్పుడు చారిత్రిక రచనల్ని చదివి ఆనందించినట్టుగా తర్వాతిరోజుల్లో ఆనందించడం మానేసారు.
తెలుగులో మన కాలంలో చారిత్రిక కాల్పనిక రచనలు రావాలని అనుకుంటున్నప్పుడు, రచయితలు జాగ్రత్త పడవలసిన ముఖ్యమైన విషయం ఇది. అంటే నువ్వు ఎవరి వైపు నిలబడి కథ చెప్తున్నావో, వాళ్ళ జీవితాల్లో, ఆశయాల్లో నువ్వు చూస్తున్న నిర్దిష్టతను వీలైనంత సార్వత్రికంగా మార్చగలగాలి. అది ఎవరు చదివినా, వారు కూడా ఆమోదంగా తల పంకించగల కథగా మారాలి.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న జాయసేనాపతి నవలలో రచయిత ఇటువంటి మెలకువ అడుగడుగునా చూపించాడని చెప్పవచ్చు. ఇది పైకి చూడటానికి రెండు రాజ్యాల మధ్య యుద్ధంగా, ఒక ఒడబడిక కుదిరిన రెండు రాజ్యాల్ని మరొక మూడవ రాజ్యం యుద్ధం వైపుగా నడిపించిన కథగా కనిపిస్తుంది. కానీ నవల్లో కథవేగం పుంజుకుంటున్న కొద్దీ, అది ఒక కుటుంబకథగా, అక్కాతమ్ముళ్ళ అనుబంధంగా కనిపించడం మొదలవుతుంది. తమని అలా ప్రేమించగల తమ్ముడొకడుంటే బాగుణ్ణని ప్రతి అక్కా కోరుకునే కథగా మారిపోతుంది. ఒక సారి మనకు ఆ మెలకువ కలిగాక, ఈ రచనలో కూడా యుద్ధం ఉంటుందిగాని, అది ఇద్దరు శత్రువుల మధ్య యుద్ధంగానే కనిపిస్తుంది గాని, రెండు ప్రాంతాల మధ్య యుద్ధంగా కనిపించదు. ఒక రాజు మరణిస్తాడు, అతడి శిరసుతో కందుకక్రీడ ఆడుకుంటారు, కానీ, ఆ రాజు తన కుటిలత్వంవల్లా, ఔద్ధత్యంవల్లా ఆ గతి తెచ్చుకున్నాడనే మనకి అనిపిస్తుందిగానీ, ఆ రాజు ఓటమిని ఒక ప్రాంతం ఓటమిగా మనం భావించం.
చరిత్రను సాహిత్యంగా మలిచినప్పుడు ఈ జాగ్రత్త తీసుకుంటే చారిత్రిక కల్పన మామూలు కల్పనకన్నా మరింతగా ప్రజాదరణ పొందగలదనడంలో సందేహం లేదు.
2
తెలుగు వారి చరిత్రను సాహిత్యంగా మార్చాలనీ, అందుకు రచయితలకు అవసరమైన స్ఫూర్తినీ, సమాచారాన్నీ అందించాలనీ సాయి పాపినేనిగారు, ఈమని శివనాగిరెడ్డిగారు ‘కాలయంత్రం’ వర్క్ షాపులు నిర్వహించారు. ఆ రెండు శిబిరాల్లో భానుమూర్తిగారూ, నేనూ కూడా పాల్గొన్నాం. తెలుగు వాళ్ల చరిత్రని, కనీసం వందేళ్ళ కిందటి చరిత్రని సాహిత్యంగా మార్చాలంటే, మనకు లభిస్తున్న చారిత్రిక ఆధారాలు ఎంత పరిమితమైనవో ఆ శిబిరాల్లో ప్రతి ఒక్కరికీ అర్థమయింది. మనం రాద్దామనుకున్న కథ చరిత్రలొ ఎంత వెనక్కి వెళ్తే మనకి దొరికే ఆధారాలు అంతగా సన్నగిల్లిపోతున్నాయని అర్థమైంది.
ఉదాహరణకి, 1509 లో విజయనగరంలో కృష్ణదేవరాయల ఇంట్లో ఆయన ఒక రాత్రిపూట భోజనం చేస్తున్నాడు అనే సన్నివేశం రాయాలనుకున్నాం అనుకోండి. వంద ప్రశ్నలు తలెత్తుతాయి. ఆయన కింద కూచుని తిన్నాడా? బల్లమీద కూచున్నాడా? తల్పం మీద కూచున్నాడా? అరటాకులో తిన్నాడా? వెండిపళ్ళెమా? బంగారు పళ్ళెమా? వంట వంటవాళ్ళే వండారని రాయొచ్చుగానీ, వడ్డించినప్పుడు రాణులు వడ్డించారా లేక సేవకులు వడ్డించారా? ముందు ఏ ఆధరువు వడ్డించారు? చివరిలో ఏమి వడ్డించారు? వాళ్ళు ఏ వెలుతురులో భోజనం చేసారు? ఆ దీపాలు ఆముదం దీపాలా నేతిదీపాలా? అసలు కృష్ణదేవరాయలు రాత్రిపూట భోజనం చేసేవాడా లేక సూర్యాస్తమయానికి ముందే భోజనం ముగించేవాడా? ఇలాంటివే ఎన్నో ప్రశ్నలు. ఒక సాధారణ రాత్రిభోజనాన్ని చిత్రించడానికే ఇన్ని ప్రశ్నలు తలెత్తితే, ఒక కొలువుకూటమినో, లేదా రాచనగరులో ఒక పండగనో లేదా ఒక యుద్ధాన్నో వర్ణించాలంటే, ఎంత కష్టమో ఊహించండి.
ఈ సమస్యని అధిగమించాలంటే రచయితకి ప్రాచీన సాహిత్యపరిజ్ఞానంతో పాటు పురావస్తు వాజ్ఞ్మయంతో పాటు ఆనాటి జీవితాన్ని తెలిపే విదేశీ యాత్రీకుల రచనల్లాంటివి కూడా చదివి ఉండాలి. కాని ఎంత చదివినా, మనకి ఆ జీవితస్వరూపం పూర్తిగా కళ్లకి కట్టదు. లేదా పాల్కురికి సోమన పండితారాధ్య చరిత్రలోలాగా ఎవరేనా కవి ఆనాటి జీవితవిశేషాలు వందలాదిగా పేర్కొన్నా, వాటిగురించి నేడు వివరించి చెప్పేవాళ్ళు దొరకరు. కాబట్టి అంతిమంగా, రచయిత ఊహాశాలీనత ఒక్కటే ఆ లోటుని పూరించగలుగుతుంది. రచయిత తాను విన్నదాన్నీ, చదివినదాన్నీ తన ఊహాగానంతో పూరించుకోవలసి ఉంటుంది. అలా పూరించుకుని అతడొక చిత్రకారుడిగా ఒక దృశ్యాన్ని వర్ణిస్తున్నప్పుడు, ఆ చిత్రం మనకి నమ్మదగ్గదిగా కనిపించవలసి ఉంటుంది. జాయసేనాపతి నవలలో భానుమూర్తి ఇటువంటి విశ్వసనీయతను కలిగించడంలో చాలావరకూ సఫలురయ్యారనే అనిపించింది. బబఉదాహరణకు, ఈ వర్ణనలు చూడండి.
అనుమకొండలో జాయప దినచర్య ఎలా ఉందో చెప్తున్నాడు:
ఉదయం ఆసనాలు, ధ్యానం తర్వాత యుద్ధవిద్యల సాధన, మధ్యాహ్నం చదువు, సాయంత్రపు నీరెండవేళ ప్రతిభావంతులైన మిత్రులతో వాహ్యాళి. సమాజ అధ్యయనం. రాత్రి వీధిలో ఆటలు, నాట్యాలు, మొత్తంగా ప్రగల్భిస్తూ అతనిలో నిబిడీకృతమైన మహత్తర శక్తులను ద్విగుణీకృతం చేస్తూ పూర్ణపురుషత్వానికి అతనొక రూపంగా ఆకారం కల్పిస్తున్నాయి.’
ఒక రాయవాచకమో, న్యూనిజ్ విజయనగరం గురించి రాసిన యాత్రావర్ణననో చదివినంతమాత్రాన ఈ చిత్రం సాధ్యంకాదు. తాను చదివిన పరిమిత ఆధారాల్ని బట్టి, మనకు ఏ మాత్రం తెలియని ఒక దృశ్యాన్ని నమ్మదగ్గదిగా చెప్పడం మామూలు విషయం కాదు.
అలాగే లక్ష్మణ ఒజ్జ కూటి ఇంట్లో దొరికే భోజనాన్ని ఎలా వర్ణిస్తున్నాడో చూడండి:
అక్కడ ఒక్క రూకకు భోజనం. ఆయన వడ్డించిన కప్పురభోగి రకం సన్నబియ్యపు అన్నం, ఘుఘుమలాడుతున్న గోధుమపిండి అప్పాలు, పెసరపప్పు, దానిలో బాగా కాచిన నెయ్యి, నాలుగైదు రకాల కూరలు, పక్కన వడ్డించిన పంచదార, మట్టిలప్పల్లో మీగడ పెరుగు, చెట్టుకు పండిన అరటిపండ్లతో పొట్టబిర్రుగా తిని బ్రేవున త్రేంచి కర్పూర విడెము నోటపెట్టుకుని బయటపడ్డారు మిత్రులు..
ఈ దృశ్యాన్ని ఊహించడానికి క్రీడాభిరామం ఒక్కటీ చదివితే సరిపోదు అనిపిస్తుంది.
చరిత్రను సాహిత్యంగా మార్చే రచయితలు కొన్నిసార్లు తమకి తెలీకుండానే అద్భుతమైన చారిత్రిక సత్యాల్ని అలవోకగా చెప్పగలరు. షేక్స్పియర్ ‘పెరికిల్స్, ప్రిన్స్ ఆఫ్ టైర్’ లో ఒక తార్పుడుగాడు కనిపిస్తాడు. తాను పూర్వజీవితంలో ఒక సైనికుడనీ, యుద్ధంలో కాలుపోగొట్టుకున్నాడనీ, దాంతో తనకి యుద్ధాల్లో పాల్గొనే అవకాశం పోయిందనీ, వికలాంగుడయ్యాడు కాబట్టి భుక్తిలేకపోయిందనీ, మరేమి చెయ్యాలో తెలీక ఈ వృత్తిని ఎంచుకున్నాడనీ చెప్తాడు. అదే అతడు యుద్ధంలో చనిపోయి ఉంటే, అది కూడా కాకతీయుల కాలంలో జరిగి ఉంటే ఆ దృశ్యం ఎలా ఉండేది? ఇదుగో చూడండి:
భైరవ తండ్రి గోపయ యుద్ధవీరుడిగా మరణించడంతో అతనికి వీరగల్లు నిర్మించారు. అతని స్వగ్రామమైన అయన్నవోలులో ప్రభుత్వం నాలుగు నివర్తనాల వ్యవసాయ భూమి ఇచ్చింది. అది సాగుచేసుకుంటూ తండ్రికి గుడి నిర్మించాడు భైరవ. అతను గ్రామీణ నాట్యకళాకారుడు. మైలారభటుడు. అయన్నవోలులో కొండయ అనే నాట్యకారుడు నిర్వహిస్తున్న నాట్యబృందంలో నటుడుగా శైవకళారూపాలను గ్రామలలోనూ, అనుమకొండ శైవాలయాల వద్ద ప్రదర్శించడం అతని ప్రధానవ్యాపకం.
ఈ వర్ణన లేదా వివరణ లేకపోయినా ప్రధాన కథకి ఇబ్బంది ఏమీ లేదు. కాని రచయిత ఈ అయిదారువాక్యాలు రాయడంతో, ఆనాటి రాజకీయ- సామాజిక-ధార్మిక స్వరూపాన్ని ఎంత ప్రతిభావంతంగా మనకళ్ళముందుంచాడు!
అలాగే గణపతిదేవుడు ఎలా ఉండి ఉండేవాడు? అది కూడా ఆయన యవ్వనంలో? మనదగ్గర శిల్పాలులేవు, చిత్రాలు లేవు. సాహిత్య ఆధారాలు కూడా దాదాపుగా లేవు. కాని ఆ మహామండలేశ్వరుణ్ణి రచయిత ఎలా చిత్రించాడో చూడండి
తిరుచూర్ణపి అంచున్న వెండిరంగు పట్టుపంచె కట్టి, పైన బంగారు, ఎరుపు కలనేత కంచుకం ధరించి, వజ్రవైడూర్యాలు పొదిగిన హారం, పొడుగైన ముత్యాల దండ ఎదపై కదలాడుతుండగా, నడుముకు ఉత్తరీయం చుట్టి దానిలో వజ్రాలపిడిగల చురకత్తిదోపాడు. ముఖాన విభూతిరేఖలపై నిలువు ఎర్రెర్రని బొట్టు. తలపై బంగారు రంగు తలపాగా. నిండైన కోరమీసం.
పరిజ్ఞానమూ, ఊహాశాలీనతా కలగలిసిన ఈ ప్రతిభ పుస్తకంలో అడుగడుగునా కనిపిస్తుంది. యుద్ధవర్ణనల్లో మరీను. కాని ఇప్పటికైతే, దేవాలయ నిర్మాణానికి సంబంధించిన ఒక వర్ణనను చూపించాలనుకుంటున్నాను.
శ.సం. 1085 స్వభాను సంవత్సరంలో ప్రారంభమైన ఈ దేవాలయం ఇప్పటికి పూర్తి ఆకృతి సంతరించుకుంది. గర్భాలయం, అర్ధమండపం, రంగమండపం, నందిమండపాలకు రూపం వచ్చింది. అధిష్టానం కింద ఉపపీఠం, ప్రదక్షిణకోసమన్నట్టు విశాలంగా ఉంది, ఆధారశిల, ఉపానం, పద్మం, పట్టిక, కుముదం, అధోపద్మం, లాంటి ఉపపీఠం వరుసలపై అలంకార శిల్పం నిర్మితం కావాల్సి ఉంది. అధిష్టానానికి ఉపానం, కుముదం, కపోతం దానిపై గజధారను శిలావద్దకులు తదేకంగా చెక్కుతున్నారు.
అలాగే రచనలో అక్కడక్కడ ఉదాహరించిన భర్తృహరి శ్లోకాలు, శిల్పశాస్త్రంలోని శ్లోకాలు రచనకి గాంభీర్యాన్ని తీసుకొచ్చాయి. మరీముఖ్యంగా జాయప మొదటిసారి కాకతిని చూసినప్పుడు హాలుడి గాథాసప్తశతిలోంచి గుర్తు చేసుకున్న కవిత, దానికదే గొప్ప కవిత, ఆ సందర్భంలో గుర్తుకురావడం మరింత శోభించింది.
3
కాని ఒక నవల విజ్ఞానసర్వస్వం కాదు. అందులో పాత్రల మధ్య సంబంధాలు రసమయంగా చిత్రించబడ్డప్పుడే పాఠకుడి హృదయాన్ని తట్టగలుగుతుంది. ఈ రచనలో అటువంటి రసమయఘట్టాలు అడుగడుగునా ఉన్నాయి. అందువల్లనే ఒకసారి చేతుల్లోకి తీసుకున్నాక, ఈ రచనని పాఠకుడు పక్కన పెట్టడం కష్టం.
గణపతిదేవుడి ముందు నీలాంబ బృందం నాట్యప్రదర్శనలు, కంటకదొర జాయప ప్రాణాలు కాపాడిన సన్నివేశం, జాయప నాట్యప్రదర్శన చూడటానికి వచ్చిన తన అక్కల్ని చూసిన సన్నివేశం, నీలాంబ జాయపను తీసుకుని గణపతిదేవుడి దగ్గరకు వెళ్ళినప్పుడు చక్రవర్తి ఆగ్రహించిన సన్నివేశం, మొత్తం యుద్ధసన్నివేశాలు వంటివన్నీ రచయిత కాల్పనిక ప్రతిభకి అద్దం పడుతున్నాయి.
జాయసేనాపతి అనగానే మనకు ‘నృత్తరత్నావళి’ గుర్తొస్తుంది. కాని ఆయన పేరులో సేనాపతి అనే మాట ఉందని మర్చిపోతాం. జాయప ముందు సేనాపతి ఎందుకయ్యాడో ఈ మొదటిభాగంలో కథ. ఆయన నృత్తరత్నావళి ఎందుకు రాసాడో, ఎలా రాసాడో బహుశా రెండో భాగంలో రచయిత రాస్తాడనుకుంటాను. ఈ మొదటి భాగం చదివాక నాలాగే మీక్కూడా ఆ రెండోభాగం త్వరగా వచ్చేస్తే బాగుణ్ణనిపిస్తుంది.
(ఈ పుస్తకం త్వరలో విడుదల కాబోతున్నది)
5-2-2024


మీ ఆత్మీయమైన పరిచయం చాలా ఆహ్లాదంగా ఉన్నది
Dr PBDVPRASAD
ధన్యవాదాలు సార్
చక్కటి పరిచయం. ఊహలకు రెక్సలనిచ్చే చారిత్రాత్మక రచనలు ఎవరికైనా ఉత్సాహాన్ని ఇస్తాయి.
ధన్యవాదాలు మేడం
Thank you sir. నా సామాజిక చారిత్రక రచనకు మీరు బంగారు అట్ట వేశారు. మధురం.. ఈ నవల మొదటి భాగం పుస్తకాన్ని ముల్కనూరు సాహితీ పీఠం వారు స్పాన్సర్ చేశారు. ఈ సందర్భంగా చరిత్ర చదవడంపై తెలుగు యువతను ఉత్తేజ పరచడానికి రెండు రాష్ట్రాలలో చరిత్ర ఆవశ్యకతపై సదస్సులు నిర్వహించాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
శుభమస్తు.
నా సామాజిక చారిత్రక రచనకు మీరు బంగారు అట్ట వేశారు,,, well said sir ;; true
Thank you so much