జీవన వ్రత కథ

(మధునాపంతుల సత్యనారాయణ మూర్తి ఫేస్ బుక్ లో చాలామందికి మిత్రుడు. ఆయన ఝాన్సీ మజిలీ కథల పేరిట ఫేస్ బుక్ లో రాస్తూ వచ్చిన అనుభవాలను పుస్తక రూపంగా తీసుకువచ్చినప్పుడు నేను రాసిన ముందుమాట ఇది. పుస్తకం కావలసినవారు మధునాపంతులను ఫేస్ బుక్ లో సంప్రదించవచ్చు. పై ఫోటోలో సత్యనారాయణ తో పాటు మహాకవి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారినీ, వారి తమ్ముడు సూరయ్య శాస్త్రి గారినీ చూడవచ్చు.)


మీ చేతుల్లో ఉన్న పుస్తకం కొత్త పుస్తకం, గొప్ప పుస్తకం కూడానూ. దీన్ని ఇప్పటివరకూ మనకు తెలిసిన ఏ సాహిత్యప్రక్రియల్లోనూ చేర్చలేం. ఇది యాత్రాచరిత్రనా లేక జ్ఞాపకాల కథనమా లేక ఒక కుటుంబగాథా చిత్రమా? ఎవరికి వారు చదివి తేల్చుకోవాలి. కాని పుస్తకం మొత్తం చదివాక ఇది ఏ సాహిత్య ప్రక్రియ అని అడగడం మీరు మర్చిపోతారు. మీ కళ్ళు చెమరుస్తాయి. మీరెక్కడో దూరదేశంలో ఉండగా ఎవరో మీ ఊరి మనిషి మిమ్మల్ని మీ స్వగ్రామపు యాసలో పలకరిస్తే మీకు ప్రాణం లేచి వస్తుందే అలా అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో ఏముందో నేనిక్కడే చెప్పేస్తే మీకై మీరు పొందబోయే సర్ప్రైజ్ నీ, సంతోషాన్నీ నేను కొంత లాగేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇందులో ఏముందో మాట మాత్రంగా కూడా మీకు చెప్పను. ఎందుకంటే ఈ చిన్న పుస్తకంలో ప్రతి ఒక్క లైనూ, ప్రతి ఒక్క పదప్రయోగం, ప్రతి ఒక్క సంఘటనా విలువైనదే. ఏది ముందు చెప్పేసినా ఆ సన్నివేశం నుండి దాన్ని బయటకి తీసినట్టే అవుతుంది. మధునాపంతులకీ మోరోపంత్ కీ ఏమి సంబంధం ఉందో మనకు తెలియదు గాని, ఇది ఉత్తరదక్షిణభారతదేశాల మధ్య అల్లుకున్న ఒక ఇంద్రచాపానికి చెందిన కథ.

మధునాపంతుల గోదావరి నదీ ప్రాంతానికి చెందిన పల్లిపాలెం గ్రామానికి చెందిన ఒక పండితుడు. కవి, పండితుల కుటుంబంలో పుట్టినవాడు. పల్లిపాలెంలో, ఆయన పుట్టి పెరిగిన తావుల్లో చెట్లు కూడా కవిత్వం చెప్తాయి. ఒకప్పుడు తిరుపతి వెంకట కవులు తమ సాహిత్యచర్చలకీ, స్పర్థలకీ, సమాధానాలకీ అన్నిటికీ ఆ ఊరు ఒక సాక్షి అని చెప్పుకున్నారు. సత్యనారాయణగారి పెద్దనాన్నగారు మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ఆంధ్రుల చరిత్రను కావ్యంగా రాసిన మహాకవి. సత్యనారాయణ తండ్రిగారు సూరయ్యశాస్త్రిగారు కవి, భావుకుడు, భిషగ్వరుడూను.

ఆంధ్రీ కుటీరం, పల్లిపాలెం

సత్యనారాయణ కూడా ఇప్పటిదాకా మూడు వచనకవితా సంపుటాలు కూడా వెలువరించాడు.

కాని ఈ రచనలో ఆ లెర్నింగ్ ఏమీ కనిపించదు. నిజానికి ఇది అన్ లెర్నింగ్ కి సంబంధించిన పుస్తకం. మనిషి ఎన్ని శాస్త్రాలైనా చదవవచ్చుగాక, ఎన్ని విద్యలైనా నేర్వవచ్చుగాక. కాని అంతదాకా తనకు పరిచయం లేని ప్రదేశంలో అడుగుపెట్టవలసివచ్చినప్పుడు ఆ విద్యలేవీ ఉపకరించవు. అక్కడ అతడు నెగ్గుకురావడానికి రెండు అంశాలు మాత్రమే ఉపకరిస్తాయి, ఒకటి, అతడిలోని అచ్చపు మనిషితనం, రెండోది, అతణ్ణి పెంచిపెద్దచేసిన కుటుంబసంస్కారం. కాబట్టి ఇది ఒక మనిషి సంస్కారానికీ, ఒక కుటుంబసంస్కారానికీ సంబంధించిన కథ.

ఒకరకంగా ఇది పెద్దవాళ్ళ Alice in Wonderland. పెద్దవాళ్ల పంచతంత్రం. (ఇంతకీ ఇందులోనూ అయిదుభాగాలున్నాయి, కాని మొత్తం పుస్తకమంతా మిత్రలాభమే. మిత్రభేదం అన్న మాటే లేదు). పెద్దవాళ్ళ నీతికథల పుస్తకం. దాదాపుగా అన్ని అధ్యాయాల చివరా ఏదో ఒక నీతి ఉంది, కాని పుస్తకం చివర కూడా ఒక నీతి వాక్యం ఉంది. కాని అది పుస్తకమంతా చదివేక చదువుకోవలసిన నీతివాక్యం. కాని ఈ గ్రంథం చదవడం పూర్తిచేసాక, ఆ వాక్యాన్ని కూడా మనం ఒక నీతి వాక్యంగా లెక్కేసుకుంటాం.

‘మీరూ అందరి దగ్గరికీ వెళ్ళండి, వారిని ఆహ్వానించండి. ఆనందించండి. పెద్దగా ఖర్చుకాదు. ఒక మాల్ లో గంట గడిపితే అయే ఖర్చుతో మనవారితో రెండు రోజులు గడపవచ్చు’

ఇది వ్రత కథ కూడా. జీవనవ్రత కథ. దీనికి ఒక ఫలశ్రుతి కూడా ఉంది. పుస్తకం ముగించేక మీరు చెయ్యవలసింది నలుగురికి భోజనం పెట్టడం, నలుగురితో కలిసి విందు ఆరగించడం.

ఈ రచన అందరూ చెయ్యగలిగేది కాదు. మా రెండో అన్నయ్య వీరభద్రుడు, వాణ్ణి మేం భద్రం అంటాం. వాడు ఆ మధ్య ఒకసారి ఫోన్ చేసి ‘ఆ సత్యనారాయణ రాస్తున్నాడు చూడు, అలా రాయడం నేర్చుకో, నువ్వూ రాస్తావు ఏదేదో, రాయడమంటే ఎలా ఉండాలో సత్యనారాయణని చూసి నేర్చుకో’ అన్నాడు. ఈ రచన ఆసాంతం చదివేక నాకు ఏమి అర్థమయిందంటే, సత్యనారాయణలాగా జీవిస్తే తప్ప సత్యనారాయణలాగ రాయలేమని.

23-7-2022

11 Replies to “జీవన వ్రత కథ”

  1. సత్యనారాయణలాగా జీవిస్తే తప్ప సత్యనారాయణలాగ రాయలేమని…

    ఇదీ వ్రతఫలం!

    తప్పకుండా…సర్.

  2. జీవితానుభవాలను ఉన్నదున్నట్టుగా అక్షరీకరించడం అంత సులభం కాకపోవచ్చు. కానీ ఆమాధుర్యం పుట్టతేనెవంటిది.మధునాపంతుల మధువ్రతుడు. మధురజీవిత వ్రతుడు. మధుమధుసంపన్నం అన్నట్లు ఫేస్బుక్ లో కనిపించినవి అక్కడక్కడా చదివాను. పుస్తకంలో క్రమంగా ఉంటాయి గనుక ఇంకా కమ్మగా ఉంటాయి. స్పందనావిస్తరణ భయంతో చెప్పలేకపోతున్నాను గానీ చిన్నతనమంతా పెద్దవాళ్ల కబుర్లతో కడుపు నిండిందే. చందమామ కథలు చదవటం, మురళయ్యమామ కథనాలు వినటం ఎంతఇష్టమో చెప్పలేను.అక్షరాస్యత అంతగా లేని మా ఇంటెదురు వల్లంపట్ల మురళయ్య మామ, మా మేనత్త భర్త మోహన్ రావు మామ కబుర్లు రసవత్తరంగా ఉండేవి . ఇప్పటి వరకు వారిలాగా జీవితానుభవాలను కథనీయ కమనీయంగా చెప్పేవాళ్లు కనిపించలేదు. గంటలతరబడి విన్నా విసుగు రాకుండా చెప్పగల దక్షులువాళ్లు. ఇదిగో మళ్లీ మధునాపంతుల వారు చాన్నాళ్లకు కనుపించారు.కాకపోతే వీరు పండితులు. వారపండితులు.

  3. గొప్పగా రాసారు సర్.
    తప్పక చదివి తీరవలసిన పుస్తకం.

    ధన్యవాదాలు 🙏

  4. ‘మీరూ అందరి దగ్గరికీ వెళ్ళండి, వారిని ఆహ్వానించండి. ఆనందించండి. పెద్దగా ఖర్చుకాదు. ఒక మాల్ లో గంట గడిపితే అయే ఖర్చుతో మనవారితో రెండు రోజులు గడపవచ్చు’

    మాల్స్ కి వెళ్ళను కానీ ఎంతో బిడియం, ఆ తరువాత మొబైల్ ఫోన్ కారణంగా నేనూ కావలసినంతగా కలవటం లేదు మనుషుల్తో. ఈ నీతివాక్యాన్ని నేనూ స్వీకరించాల్సిందే.

  5. సత్యనారాయణ గారి రచనల గురించి తెలియని నాకు “వారిలాగా రాయడం నేర్చుకోమన్న” మీ అన్నగారి మాట, అదిరాసిన మీ వినమ్రత నన్ను వారి ఈ రచన చదివాల్సిందిగా ప్రోత్సహించాయి.
    ఫేస్ బుక్ లో వారిని సంప్రదిస్తాను పుస్తకం గురించి.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading