
బుద్ధుడి అసలైన బోధనలేవో తెలుసుకోవడంకోసం హ్యూయెన్ త్సాన్ చైనానుంచి సుదీర్ఘమైన యాత్రచేసి భారతదేశానికి వచ్చివెళ్ళాడని మనకు తెలుసు. అటువంటి యాత్ర జపాన్ నుంచి చైనాకి చేపట్టిన మరొక బౌద్ధ జిజ్ఞాసి గురించి ఎక్కువమందికి తెలీదు.
డొజెన్ కైగెన్ (1200-1253) జపాన్ కి చెందిన బౌద్దుడు. జెన్ బౌద్ధంలో ప్రసిద్ధి చెందిన సొటో శాఖని స్థాపించినవాడు. ఆయన చిన్నప్పుడే పదమూడో ఏట సన్న్యాసదీక్ష స్వీకరించాడు. అప్పటికి ప్రచలితంగా ఉన్న తెండై శాఖలో అధ్యయనం, సాధన మొదలుపెట్టాడు. ఒకరోజు తెండై శాఖకి చెందిన ఒక గురువుని అసలైన బౌద్ధ గ్రంథాలు ఎక్కడ దొరుకుతాయి అనడిగితే ఆయన చైనాలో దొరుకుతాయని చెప్పాడు. ఆ మాటలు విని డోజెన్ నిలవలేకపోయాడు. అత్యంత సాహసంతో, ప్రాణాలకు లెక్కచేయకుండా తూర్పు చైనా సముద్రానికి ఎదురీది చైనా చేరుకున్నాడు. అక్కడ పదేళ్ళ పాటు వివిధ గురువుల దగ్గర అధ్యయనం చేసాక, 1225 లో తియాన్ డోంగ్ పర్వతం మీద తపసు చేసుకుంటున్న రూజింగ్ అనే గురువు దగ్గరకు చేరుకున్నాడు. చాన్ బౌద్ధానికి చెందిన ఆ గురువు ని కలుసుకోగానే అతడికి గురువునుంచి అందవలసిన బోధన ముఖాముఖి తనలోకి ప్రసరించిన అనుభూతి కలిగింది. దేహాన్నీ, మనసునీ కూడా విదుల్చుకుంటేనే సాక్షాత్కారం సాధ్యమని అర్థమయింది. అసలు సాక్షాత్కారమనీ, సాధన అనీ రెండు వేరువేరుగా ఉండవనీ, సాధనమొదలుపెట్టడమే సాక్షాత్కారమని కూడా అర్థమయింది.
ఆ ఎరుకతతో ఆయన తిరిగి జపాన్ వచ్చాడు. జజెన్ అనే జెన్ సంప్రదాయాన్ని ప్రారంభించాడు. జజెన్ సంస్కృత ధ్యానపదానికి వికృతి. కేవలం ధ్యానంలో కూచోగలిగితే చాలు, దానికదే సాధన. అదే సాక్షాత్కారం అని ప్రబోధించాడు.
చీనాభాషలో చదువుకున్న బౌద్ధ గ్రంథాలనుంచి తానేమి నేర్చుకున్నదీ జపనీయ భాషలో రాసాడు. ఆ విధంగా జపనీయ భాషలో ధార్మిక గ్రంథాలు రచించిన మొదటి గురువు కూడా అయ్యాడు.
తన మిగిలిన జీవితమంతా క్యోటో కి దగ్గరలో ఒక చిన్న ధ్యానమందిరంలో శిష్యులతో సంభాషిస్తో, వారికి ప్రవచచనాలిస్తో గడిపాడు. అవనీ దాదాపుగా ఇప్పుడు ఇంగ్లీషులో లభ్యమవుతున్నాయి. దోజెన్ కవి కూడా. ప్రాచీన జపనీయ ఛందస్సు వకాలో అతడు రాసిన కవితలు కూడా మనకి లభ్యమవుతున్నాయి.
ప్రపంచ గురువుల్లో అగ్రశ్రేణిలో నిలబడే ఈ జెన్ గురువు గురించిన చక్కటి సినిమా ఒకటి నిన్న నాకు దొరికింది. చూస్తే మీరు కూడా సంతోషిస్తారని అనుకుంటున్నాను. చూడండి.
13-12-2020
