ప్రతి వాక్యం ఒక వివేక చూడామణి

ట్విట్టర్ లో 280 అక్షరాల నిడివి లోనే మన సినిమాతారలూ, రాజకీయనాయకులూ, క్రికెటర్లూ తమ ఫాలోయర్లని లాక్కుపోతున్నారు. కానీ ఆ చిన్నపాటి స్థలంలోనే సంస్కృతికీ, సాహిత్యానికీ కూడా చోటిస్తున్నవాళ్ళు లేకపోలేదు. African Proverbs అనే ఒక హేండిల్ గురించి నేనింతకుముందే రాసాను. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన పుస్తకం చూసాను. My Grandmother’s Tweets: Stories Inspired by Avvaiyar’s Wisdom (2018) ట్విట్టర్ శకంలో ప్రాచీన తమిళ కవయిత్రి అవయ్యార్ ఎంత ప్రాసంగికమో హఠాత్తుగా గుర్తుచేసింది.

అవ్వయారు గొప్ప వివేకానికీ, సూక్ష్మదృష్టికీ పేరు పొందిన కవయిత్రి. ప్రాచీన తమిళ సాహిత్యంలో కనీసం ఇద్దరు ముగ్గురు అవ్వయ్యారులు ఉన్నారు. వారిలో ఒకామె పేరిట చిన్న చిన్న నీతివాక్యాలు శతాబ్దాలుగా తమిళ జనస్మృతిలో కొనసాగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు స్త్రీలకి విద్యావకాశాలు లేనిరోజుల్లో ఆ చిన్ని చిన్ని వాక్యాలే వాళ్ళు తమ జీవితాన్ని నడుపుకోడానికి అవసరమైన విద్యనీ, విజ్ఞతనీ అందించాయనీ, తరతరాలుగా అమ్మలూ, అమ్మమ్మలూ తమ పిల్లలకీ,మనమరాళ్ళకీ అందిస్తూ వచ్చిన ఆస్తిపాస్తులవే అనీ అంటుంది ఆ పుస్తక రచయిత్రి గీతా గోపాల కృష్ణన్.

అకారాదిగా అక్షరమాలని పరిచయం చేసే ఆ చిన్న చిన్న వాక్యాలు సరిగ్గా ట్విట్టర్ కి సరిపోయేవే.

‘అరం సెయ్య విరుంబు’

‘ఆరువదు సినమ్’

‘ఇయల్ వదు కరవేల్’

‘ఈవదు విలక్కేల్’

‘ఉడయదు విలంబేల్’

‘ఊకమదు కైవిడేళ్’

కవిత్వంలోనూ, జీవితంలోనూ కూడా చలంగారు కోరుకున్న economy of words ఆయనకన్నా వెయ్యేళ్ళముందు జీవించిన తమిళ విదుషి సుసాధ్యం చేసింది. ఆమె చెప్పిన ప్రతి వాక్యం ఒక వివేక చూడామణి.

‘ఆత్తిచూడి’ గా ప్రసిద్ధి పొందిన ఆ మాటలవిందు మొత్తం 109 వాక్యాలు. వాటిని తీసుకుని ప్రతి ఒక్క వాక్యానికీ సమకాలిక జీవితం నుంచో, లేదా చరిత్ర, పురాణాల నుంచో ఒకటి రెండు ఉదాహరణలతో రచయిత్రి, అవ్వయ్యార్ వివేకం 21 వ శతాబ్దానికి ఎంత ప్రాసంగికమో వివరించింది. అసలు అన్నిటికన్నా ముందు ఆ ఆలోచనే నాకెంతో నచ్చింది. ఉదాహరణకి, మొదటి సుభాషితం ‘అరం సెయ్య విరుంబు’ అన్నదే తీసుకోండి. చద్దన్నం మూట లాంటి ఆ మాటకి అర్థం ‘మంచిగా చెయ్యాలని కోరుకో’ అని అట. Desire to Do Good అనే ఆ ప్రవచనానికి ఆమె ఇచ్చిన ఉదాహరణ చూడండి:

*

ఏది ఇస్తామో, అది వెనక్కి వస్తుంది

1892 లో స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులకి చదువుకోడానికి డబ్బు సరిపోలేదు. వాళ్ళు అప్పట్లో ప్రఖ్యాత పియానిస్టు ఇగ్నసీ జాన్ పడెరెవిస్కీ దగ్గరకు వెళ్ళారు. 2000 డాలర్ల మేరకు టికెట్ల అమ్ముతామనీ, తమకోసం ఒక కచేరీ చెయ్యమనీ అడిగారు. అందులో ఆయనకివ్వాల్సిన పారితోషికం పోను మిగిలిన సొమ్ముతో తమ ఫీజులు కట్టుకుంటామని చెప్పారు. కాని వాళ్ళనుకున్నట్టుగా ఆ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోలేదు. ఆ ప్రదర్శనకి పూర్తిస్థాయి ఆదాయం వచ్చేట్టు కనబడలేదు. వాళ్ళ ఇబ్బంది తెలుసుకున్న పడెరవిస్కీ తన పారితోషికం వదులుకోడానికి సిద్ధపడ్డాడు. కచేరీకి అయ్యే ఇతర ఖర్చులు చెల్లిస్తే చాలనీ, మిగిలిన సొమ్ముతో ఆ విద్యార్థులు తమ కాలేజీ ఫీజులు కట్టుకోవచ్చనీ చెప్పాడు.

పదిహేనేళ్ళ తర్వాత, పడెరవిస్కీ పోలాండ్ ప్రధానమంత్రి అయ్యాడు. కాని ఆ రోజుల్లోనే పోలాండ్ తీవ్ర దుర్భిక్షానికి లోనయ్యింది. అతడు తన దేశాన్ని ఆదుకొమ్మని అమెరికా సంయుక్త రాష్ట్రాల పౌరసరఫరా విభాగాన్ని వేడుకున్నాడు. తక్షణమే టన్నులకోద్దీ ఆహారధాన్యాలు పోలాండ్ రేవుపట్టణాలకు చేరుకున్నాయి.

తన దేశాన్ని సకాలంలో ఆదుకున్నందుకు, ధన్యవాదాలు చెప్పడానికి, సంయుక్త రాష్ట్రాల పౌరసరఫరా, పునారావాస విభాగం అధిపతి హెర్బెర్ట్ హూవర్ ని పడెరవిస్కీ పోయి కలుసుకున్నాడు. పదిహేనేళ్ళ కిందట పడెరవిస్కీ సాయం చేసిన ఇద్దరు విద్యార్థుల్లో తానొకణ్ణని హూవర్ చెప్పాడాయనకి!

20-12-2018

ఈ అంశం మీద ఫేస్ బుక్ లో చర్చ కోసం ఇక్కడ చూడండి

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading