స్పష్టంగా ఉంది కదా. దేవుళ్ళతో కలిసి జీవించు. తెల్లవారుజామునే ఎందుకు నిద్రలేవాలంటే దేవుళ్ళతో కలిసి జీవించడం ఎలా ఉంటుందో ఆ వేళల్లో నీకు మరింత బాగా అర్థమవుతుంది కాబట్టి.
మెడిటేషన్స్-6
ఒకడు నిన్ను ఏదో అంటాడు, లేనిపోని ఆరోపణలు చేస్తాడు, అభాండాలు వేస్తాడు. వాడు అవి చెయ్యకుండా నువ్వు ఆపలేవు. కాని వాటికి ప్రతిస్పందించకుండా ఉండటం మాత్రం పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది. అంటే మనసులో బాధపడి పైకి వ్యక్తం చెయ్యకుండా ఉండటం కాదు. అసలు మనసులోనే కించిత్ క్లేశానికి కూడా తావీయకపోవడం అన్నమాట.
మెడిటేషన్స్-5
ఎప్పుడు ఏ అత్యవసర చికిత్స చెయ్యవలసి వస్తుందో అని సర్జను తన పరికరాల్ని సిద్ధంగా పెట్టుకున్నట్టు మనం దైవత్వాన్ని గుర్తుపట్టడానికి సదా సంసిద్ధంగా ఉండాలట. ఆ అనుబంధాన్ని గుర్తుతెచ్చే చిన్నపాటి అవకాశాన్ని కూడా వదులుకోకూడట.
