పార్థివత్వం, అపార్థివత్వం

అంతిమంగా ఏ కళాకారుడైనా రాయవలసిందీ, చిత్రించవలసిందీ, మతానికీ, ప్రాంతానికీ, భాషలకీ, సరిహద్దులకీ అతీతంగా మనిషికీ, మనిషికీ మధ్య వికసించవలసిన స్నేహమే అని తెలియడం అది. ఒక నరుడికీ, ఒక వానరుడికీ మధ్య తటస్థించిన స్నేహాన్ని ఆదికవి ఎందుకంత ఐతిహాసికంగా గానం చేసాడో మనకి బోధపడక తప్పని సమయమది.

ద సీగల్

ఆదివారం ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్లో Seeds of Modern Drama ( Dell, 1963) దొరికితే తెచ్చుకుని అందులో చెకోవ్ 'ద సీగల్ ' చదివాను. దాదాపు పాతికేళ్ళ తర్వాత మళ్ళా చదివానన్న మాట. మొదటిసారి చదివినప్పుడు బహుశా కథకోసం చదివిఉంటాను. ఇతివృత్తమేమిటో అర్థం చేసుకోవాలని ప్రయత్నించిఉంటాను. కాని ఇప్పుడు?