కాని ప్రాచీన ప్రాకృత కవిత్వం చేతుల్లోకి రాగానే ఆ వానాకాలపు నేరేడు చెట్ల అడివి నా కిటికీ దగ్గరకు వచ్చినట్టనిపించింది. అంతదాకా నా జీవితంలో చదువుకుంటూ వచ్చిన ఆధునిక విమర్శ ఆ రసరమ్య ప్రాచీన ప్రపంచాన్ని నాకు తెలియకుండా దాచి ఉంచిందనీ, అప్పటికే నేనెంతో పోగొట్టుకున్నాననీ అనిపించింది.
ఆషాఢ మేఘం-2
మేఘాన్ని చూడగానే భారతీయ కవికి ఏకకాలంలో ప్రేమా, దుఃఖమూ రెండూ కలుగుతాయి. వసంతాన్ని చూసినప్పుడు కలిగే భావనలు ప్రణయోద్దీపభావనలే తప్ప వాటిలో విషాదఛాయలుండవు. కానీ ఆషాఢమేఘం ఏకకాలంలో కవికి ఈ ప్రపంచం పట్ల అలవిమాలిన ప్రేమా, దీన్నుంచి తొలగిపోతున్నాననో, తొలగిపోవాలనో ఏదో ఒక గాఢనిర్వేదమూ, ఒక్కసారే ఆవహిస్తాయి.
నా కవిత్వ ప్రయాణం
కరోనా కాలంలో మిత్రులు కొంతమంది నన్ను ఒక జూమ్ సమావేశానికి పిలిచి కవిత్వం గురించి మాట్లాడించారు. 22-10-2020 న జరిగిన ఆ సమావేశం యూట్యూబ్ లింక్ ఈ మధ్య డా.సుంకర్ గోపాల్ నాకు పంపించారు. ఇవాళ ఆ లింకు తెరిచి విన్నాను. ఆసక్తికరంగానే అనిపించింది.
