తిరుమలలో పొంగిపొర్లే సముద్రం

చాలా రాయాలి. ఈ సంపుటంలోని ఎన్నో కీర్తనల్లో కనిపిస్తున్న భాషా వైభవంతో పాటు భావవైభవం గురించి కూడా రాసుకోవాలి. 'అతిశయుండను వేంకటాద్రీశుడను మహాహితుణ్ణి' తన చిత్తమంతా నింపుకుని అన్నమయ్య మాలగా గుచ్చిన ప్రతి ఒక్క పాట గురించీ మాట్లాడుకోవాలి. 'తిరువేంకట గిరిపతి యగు దేవశిఖామణి పాదము శరణని బ్రదుకుటతప్ప' మరొక 'సన్మార్గం' లేదని పరిపూర్ణంగా నమ్మి పాటలతో పూజించిన పాటకారుడి గురించి బహుశా ఒక జీవితకాలం పాటు మాట్లాడుకుంటూనే ఉండాలి.

తాళ్ళపాక

సాహిత్యం అందించగల అత్యుత్తమ రసానుభూతి మన హృదయాల్లో సాత్త్వికోదయం కలిగించడమే అయితే ఇంతకుమించిన గొప్ప సాహిత్యం మరొకటిలేదు. అప్పుడే రేకులు విప్పిన ఎర్రతామరపూవులోని లాలిత్యంలో, ఊపిరిసోకితేనే కందిపోతుందేమోననేటంత సౌకుమార్యంలో ముంచి తీసిన గీతమిది.

కోనేటిరాయుడు

కామించి కోరితే కరుణ కురిపించిన కరుణాసముద్రుడు కాబట్టే ఆయన్ని అన్నమయ్య కోనేటి రాయుడని పిలిచి ఉంటాడు. అదీకాక కొండలరాయడు అనడం స్వభావోక్తి. కొండలలో నెలకొన్న కోనేటిరాయడం అనడంలోనే కదా కవిత్వముంది!