కోమలనిషాదం

ఈ 42 కవితల్నీ ఇలా 'కోమలనిషాదం, మరికొన్ని కవితలు' పేరిట ఒక సంపుటంగా కూర్చి సంక్రాంతి కానుకగా మీతో పంచుకుంటున్నాను. ఇది నా 54 వ పుస్తకం. ఈ పూలగుత్తిని పెద్దలు నాగరాజు రామస్వామిగారికి కానుక చేస్తున్నాను.

ఇన్విక్టస్ మరికొన్ని సినిమాలు

ఆయన మాటలు విన్నాక ఈ పదేళ్ళుగా చలనచిత్రాలమీద నేనేం రాసానా అని చూస్తే 34 సమీక్షలు కనబడ్డాయి. వాటితో పాటు ఎడిటింగ్ మీద వచ్చిన ఒక పుస్తకం మీద రాసుకున్న సమీక్ష కూడా కనిపించింది. దాంతో ఆ 35 వ్యాసాలూ ఇలా గుదిగుచ్చి 'ఇన్విక్టస్ మరికొన్ని సినిమాలు' పేరిట ఇలా ఈ బుక్ గా అందిస్తున్నాను. ఇది నా 53 వ పుస్తకం. ఇది మీకు నా కొత్త సంవత్సరం కానుక. మీరు కూడా మీ మిత్రులతో ఈ కానుకని పంచుకుంటారని ఆశిస్తున్నాను.

ఆ వెలుగుల కోసమే

ఈలోగా గత పుష్కరకాలంగా నేను అప్పుడూ అప్పుడూ మిత్రుల్తో పంచుకుంటూ వస్తున్న నా విద్యానుభవాల్ని ఒక సంపుటంగా వెలువరించాలనుకున్నాను. ముఖ్యంగా మా దేవమ్మ డా.నన్నపనేని మంగాదేవిగారికి ఆ పుస్తకం కానుక చెయ్యాలన్న ఉత్సాహం కూడా ఒక కారణం. నిన్న శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్ వారి లలితకళా ఉత్సవంలో ఈ పుస్తకాన్ని మా అక్క ఆవిష్కరించి నా తరపున ఆమెకు సమర్పించింది. ఇది నా 51 వ పుస్తకం. దీన్నిక్కడ ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. 45 వ్యాసాలు. 216 పేజీలు. దీన్ని మీ మిత్రుల్తో, మీ సంస్థల్లో, మీ ఉద్యమాల్లో మీతో కలిసి పనిచేస్తున్న కార్యకర్తల్తో, ఉపాధ్యాయుల్తో పంచుకుంటారని ఆశిస్తున్నాను.