The Second Horizon

పునర్యానం నా మూడవ కవితా సంపుటి. 5000 పంక్తులకన్నా మించిన సుదీర్ఘ కావ్యం. ఆ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ వచన కవిత పురస్కారం కూడా అందించారు. ఆ పుస్తకం మొత్తాన్ని ఇంగ్లిషులోకి అనువదించడం అంత సులభం కాదు. అందుకని 60 కవితలు తీసుకుని మూడేళ్ళ కిందట ఇంగ్లిషులోకి అనువదించి ఇక్కడ మీతో పంచుకున్నాను. అప్పణ్ణుంచీ ఆ అనువాదాల్ని చిత్రికపడుతూనే ఉన్నాను. ఎట్టకేలకు, ఇలా The Second Horizon పేరిట bilingual edition ని ఇలా విడుదల చేస్తున్నాను. ఈ సాఫ్టు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పునర్యానం కావ్యాన్ని మా విజ్జికి కానుక చేసాను. ఇప్పుడు ఈ ఇంగ్లిషు అనువాదాన్ని ఆమె తండ్రి స్వర్గీయ పోరుమామిళ్ళ నారాయణరావుగారి స్మృతికి అంకితమిస్తున్నాను. ఇది నా 76 వ పుస్తకం.

నన్ను వెన్నాడే కథలు

నలభయ్యేళ్ళ కిందట నేను చదివిన కొన్ని కథలు, ప్రపంచ సాహిత్యంలోవీ, భారతీయ భాషల్లోవీ, ఇరవై కథలు, నన్ను వెన్నాడే కథలు గా, గత ఆరునెలలుగా మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ కథలన్నిటినీ ఒక్కచోట ఇలా పుస్తకరూపంగా మీకు అందిస్తున్నాను. ఈ పుస్తకం ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తక ప్రేమికుల పెన్నిధి బంగారు రామాచారికి ఈ పుస్తకం కానుక చేస్తున్నాను. ఇది నా 75 వ పుస్తకం.

నిజంగా ఉదారచరితులు!

ఉదారచరితులు పుస్తకం మీద మిత్రులు కల్లూరి భాస్కరంగారు రాసిన సహృదయ స్పందన. వారికి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నా పుస్తకాల్లో ఇంత సమగ్రమైన సమీక్ష ఇదే మొదటిసారి నేను చదవడం!